ఉపాధి, ధరలపైనే ఆందోళన
ఆర్థిక పరిస్థితి దిగజారిందన్న 54 శాతం మంది
95 శాతం మందికి ధరల సెగ
భవిష్యత్తు పైనా బెంబేలు
ఆర్‌బిఐ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ : పట్టణ కుటుంబాలను ఆర్థిక భయాలు వెంటాడుతున్నాయి. దేశంలో ఉపాధి అవకాశాలపై ఆందోళన, నిత్యావసరాల ధరల పెరుగుదల పట్టణ ప్రజల వినియోగదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. భవిష్యత్తుపైనా భరోస లేదని ఆర్‌బిఐ స్వయంగా చేపట్టిన సర్వేలోనే ఈ ఆందోళనలు వెల్లడయ్యాయి. ఏడాది కాలంగా దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిందని 54.5 శాతం పట్టణ కుటుంబాలు తెలిపాయి. ఇది గతేడాది సెప్టెంబర్‌లో ఈ సంఖ్య 40.9 శాతంగా ఉండగా.. ఈ ఏడాది జులైలో 50.5 శాతానికి చేరింది. సెప్టెంబర్‌లో ఇది మరింత పెరగడం పట్టణ ప్రజల్లో ఆర్థిక భయాలు తీవ్రతను స్పష్టం చేస్తోంది. సెప్టెంబర్ 2026లో ఆర్‌బిఐ అర్బన్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే చేసింది. సెప్టెంబర్ 10 నుంచి 20 మధ్య దేశంలోని 19 ప్రధాన నగరాల్లో 6,054 మంది ప్రతినిధుల నుంచి వివరాలను సేకరించింది. ఈ నివేదిక ప్రకారం.. ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని సెప్టెంబర్‌లో కేవలం 25.3 శాతం మంది మాత్రమే పేర్కొన్నారు. జులైలో ఈ సంఖ్య 27.1 శాతంగా ఉంది. పట్టణ కుటుంబాల్లో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపై సానుకూలత కంటే ప్రతికూల అభిప్రాయాలే అధికంగా ఉన్నాయని సర్వే గణాంకాలు సూచిస్తున్నాయి.

మరింత దిగజారొచ్చు..
రానున్న 12 నెలల్లో ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతాయని ఆందోళన వ్యక్తం చేసిన పట్టణ కుటుంబాల సంఖ్య కూడా పెరిగింది. సెప్టెంబర్‌లో 38.3 శాతం మంది ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జులైలో ఇది 36.3 శాతంగా ఉంది. భవిష్యత్ అంచనాల సూచీ (ఎఫ్‌ఇఐ) కూడా 115.3 నుంచి 113.5కి పడిపోయింది. అయితే ఈ సూచీ 100 కంటే పైనే ఉండటంతో భవిష్యత్తుపై పట్టణ వినియోగదారుల సెంటిమెంట్ పూర్తిగా ప్రతికూలంగా మారలేదని ఆర్‌బిఐ సర్వే వెల్లడించింది.
ఉపాధిపై తీవ్ర ఆందోళన..
పట్టణ కుటుంబాల్లో ఉపాధి పరిస్థితులు ప్రధాన ఆందోళనల్లో ఒకటిగా నిలిచాయి. గతేడాది కాలంలో ఉద్యోగ పరిస్థితులు మరింత దిగజారాయని 49.5 శాతం మంది తెలిపారు. రాబోయే ఏడాదిలోనూ ఉద్యోగ మార్కెట్ పరిస్థితులు మెరుగుపడకపోవచ్చని 35.5 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగ అవకాశాలపై అనిశ్చితి పెరగడం, కుటుంబాల ఆర్థిక ఒత్తిడి అంశాలు పెద్ద మొత్తంలో చేసే కొనుగోళ్లు, పొదుపు ధోరణులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ధరల ఒత్తిడిలో 95 శాతం మంది..
పట్టణ ప్రజల్లో ధరల పెరుగుదలపై ఆందోళన మరింత స్పష్టంగా కనిపించింది. గతేడాదితో పోలిస్తే ధరలు భారీగా పెరిగాయని ఏకంగా 95 శాతం మంది తెలిపారు. జులైలో ఈ సంఖ్య 93.3 శాతంగా ఉంది. రానున్న రోజుల్లోనూ ధరలు మరింత పెరుగుతాయని 84.3 శాతం మంది అంచనా వేశారు. ద్రవ్యోల్బణం కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ కుటుంబాల రోజువారీ కొనుగోళ్లపై ధరల పెరుగుదల ప్రభావం ఇంకా బలంగానే ఉందని సర్వే రిపోర్ట్‌లు సూచిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే తమ ఖర్చులు పెరిగాయని 83.7 శాతం మంది తెలిపారు. జులైలో ఈ సంఖ్య 80 శాతంగా ఉంది. అయితే ఖర్చులు పెరగడాన్ని నేరుగా వినియోగ డిమాండ్ బలపడినట్లు భావించలేమని ఆర్‌బిఐ తెలిపింది. ధరలు పెరగడం వల్ల అదే స్థాయి వస్తువులు, సేవలకు కుటుంబాలు అధిక మొత్తాన్ని వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొని ఉండొచ్చని విశ్లేషించింది.

భవిష్యత్తు డిమాండ్‌పై ఒత్తిడి..!
ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు బుధవారం ఆర్‌బిఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చిన సమయంలో ఈ సర్వే ఫలితాలు వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు ధరల పెరుగుదలపై కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు ఉపాధిపై అనిశ్చితి కూడా కొనసాగుతోంది. దీంతో వడ్డీ రేట్ల పెంపు, ద్రవ్యోల్బణం, ఉపాధి పరిస్థితులు సంయుక్తంగా పట్టణ వినియోగ డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపొచ్చని స్పష్టమవుతోంది.







కామెంట్‌లు (0)