అమ్మాయిలు ఆటల్లో అదరగొడుతున్నారని సంబరపడుతున్నాం. పరుగు పందెం, షూటింగ్, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్.. ఆట ఏదైనా సరే.. తమ శక్తినంతా ధారపోసి పతకాలు సాధిస్తుంటే చూసి మురిసిపోతున్నాం. కానీ ఆ గెలుపు వెనుక వాళ్లు ఎదుర్కొనే మరో పోరాటం గురించి మాత్రం ఇప్పుడిప్పుడే బహిరంగంగా చర్చ మొదలైంది. రుతుక్రమ సమయంలో శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులు, పొత్తికడుపు నొప్పి, నడుము నొప్పి, అలసట, కడుపు ఉబ్బరం, నిద్రలో మార్పులు.. ఇవన్నీ సాధారణ జీవితాన్నే ప్రభావితం చేయగలవు. అలాంటప్పుడు ప్రతిరోజూ గంటల తరబడి శిక్షణ తీసుకుంటూ, పోటీల్లో అత్యున్నత ప్రదర్శన ఇవ్వాల్సిన క్రీడాకారిణుల పరిస్థితి ఎలా ఉంటుంది?
ప్రస్తుతం జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడలు–2026లో పతకాలు సాధిస్తున్న అమ్మాయిల విజయాలతో పాటు.. నెలసరి సమయంలో తాము ఎదుర్కొన్న అనుభవాలను కూడా బహిరంగంగా పంచుకుంటున్నారు. ఒకప్పుడు చెప్పుకోవడానికి సిగ్గుపడిన విషయంగా భావించిన రుతుక్రమం.. ఇప్పుడు క్రీడా ప్రపంచంలో చర్చించాల్సిన ఆరోగ్య అంశంగా మారుతోంది. వారి మాటలు కేవలం తమ అనుభవాలే కాదు. ప్రతి అమ్మాయికి తన శరీరాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి.
నిర్భయంగా మాట్లాడాలి
వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను ఈ విషయంపై తన అనుభవాన్ని బహిరంగంగా పంచుకున్నారు. క్రీడాకారిణులు తమ పీరియడ్స్ గురించి మాట్లాడటానికి సంకోచించకూడదని ఆమె సూచించారు. పారిస్ ఒలింపిక్స్ సమయంలో తను పీరియడ్స్‌లో ఉన్న విషయాన్ని చెప్పకపోవడం వల్ల శిక్షణను తన శరీర పరిస్థితికి అనుగుణంగా మార్చుకోలేకపోయానని, దాని ప్రభావం తన ప్రదర్శనపై పడిందని ఆమె గుర్తు చేసుకున్నారు. ఈసారి పోటీకి ముందు తనకు అదే సమస్య ఎదురైనప్పుడు ఎలాంటి సంకోచం లేకుండా కోచ్‌కు విషయం చెప్పానన్నారు. దాంతో తన శరీర పరిస్థితికి అనుగుణంగా వ్యాయామాలు, శిక్షణలో మార్పులు చేశారని, ఆ సన్నద్ధత పోటీలో తనకు ఉపయోగపడిందని ఆమె వివరించారు. పీరియడ్స్ సమయంలో పొత్తికడుపు నొప్పితో పాటు శరీరం నీరసించడం, నడుము నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయని.. వాటిని దాచిపెట్టడం కంటే వాటి గురించి కోచ్, మెడికల్ టీమ్‌తో మాట్లాడటం ముఖ్యమని మీరాబాయి అనుభవం చెబుతోంది.
క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు. నెలసరి అనేది చాలా సహజమైన శారీరక ప్రక్రియ అని.. తాము పీరియడ్స్‌లో ఉన్నామని చెప్పడం సిగ్గుపడాల్సిన విషయం కాదని ఆమె అన్నారు. ఆ సమయంలో శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులు, అలసట, నొప్పులను అర్థం చేసుకుని శిక్షణ తీవ్రతను అవసరమైనప్పుడు మార్చుకోవాలని చెప్పారు. పీరియడ్స్‌లో ఉండగా మైదానంలో ఆడటం కొన్ని సందర్భాల్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుందని, అయినా సరైన మానసిక సిద్ధతతో ఆ పరిస్థితిని ఎదుర్కోవచ్చని జెమీమా పేర్కొన్నారు.

క్రికెటర్ స్మృతి మంధానా అనుభవం మరో కోణాన్ని చూపిస్తుంది. కీలకమైన టెస్ట్ మ్యాచ్‌లో మైదానంలో ఉన్నప్పుడే తనకు పీరియడ్స్ ప్రారంభమయ్యాయని ఆమె చెప్పారు. టెస్ట్ క్రికెట్‌లో బ్యాటింగ్, బౌలింగ్ కోసం ఎక్కువ సమయం మైదానంలోనే గడపాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో తాను అనుభవించిన వేదన చాలా తీవ్రంగా ఉందని ఆమె చెప్పారు. ప్యాడ్ మార్చుకోవడానికి కూడా మైదానం నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి రావడం తనకు పెద్ద సవాల్‌గా మారిందని వివరించారు. ఆటలోని పరిస్థితులకు అనుగుణంగా ఆటగాళ్లకు సౌకర్యాలు కల్పించే విధానం మారాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
శరీరాన్ని అర్థం చేసుకుంటూ...
పీరియడ్స్ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడం అంటే నొప్పిని భరిస్తూ ఆట ఆడటమే కాదు. తమ శరీరాన్ని అర్థం చేసుకోవడం, అవసరమైనప్పుడు శిక్షణను సర్దుబాటు చేసుకోవడం, సరైన పోషకాహారం తీసుకోవడం, అవసరమైన వైద్య సహాయం పొందడం కూడా అందులో భాగమే. పీరియడ్స్ తేదీలు, నొప్పి, అలసట, నిద్ర, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలను క్రమం తప్పకుండా నమోదు చేసుకోవడం ద్వారా తమ శరీరంలో కనిపించే మార్పులను అథ్లెట్లు అర్థం చేసుకోవచ్చు. ఈ వివరాలను కోచ్‌లు, స్పోర్ట్స్ సైంటిస్టులు, వైద్యులతో పంచుకోవడం ద్వారా శిక్షణను కూడా మరింత శాస్త్రీయంగా సర్దుబాటు చేసుకోవచ్చు.
ప్రతి క్రీడాకారిణికి రుతుచక్రం ఒకేలా ఉండదు. అందువల్ల పీరియడ్ వచ్చిన ప్రతిసారీ అందరికీ ఒకే విధమైన శిక్షణ ఇవ్వడం కాకుండా.. వారి లక్షణాలు, శారీరక పరిస్థితిని బట్టి అవసరమైన మార్పులు చేయడం ముఖ్యం. నొప్పి, అలసట తీవ్రంగా ఉన్న రోజుల్లో కఠినమైన శిక్షణకు బదులుగా తేలికపాటి వ్యాయామాలు, స్ట్రెచింగ్, రికవరీ సెషన్లకు ప్రాధాన్యం ఇవ్వవచ్చు. అయితే పీరియడ్ మొదటి ఒకటి రెండు రోజుల్లో అందరూ తప్పనిసరిగా శిక్షణ తగ్గించాలనే నియమం లేదు. ఎవరి శరీరం ఎలా స్పందిస్తుందో దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి.
తగినంత ఆహారం, నీరు, నిద్ర కూడా క్రీడాకారిణుల శారీరక సామర్థ్యానికి ఎంతో అవసరం. ముఖ్యంగా తీవ్రమైన శిక్షణ తీసుకునే అథ్లెట్లు శరీరానికి అవసరమైన శక్తి, పోషకాలు అందేలా చూసుకోవాలి. అధిక శిక్షణ, శరీరానికి సరిపడా శక్తి అందకపోవడం వంటి కారణాలతో కొందరు క్రీడాకారిణుల్లో పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు. కొన్నిసార్లు పూర్తిగా ఆగిపోవచ్చు. దాన్ని క్రీడలో భాగంగానే భావించి నిర్లక్ష్యం చేయకూడదు. అలాంటి మార్పులు కనిపిస్తే అవసరమైన వైద్య సలహా తీసుకోవాలి.
తగు సదుపాయాలు ఉండాలి
ఒకప్పుడు క్రీడాకారిణి తన పీరియడ్స్ గురించి మాట్లాడితే అది వ్యక్తిగత విషయంగా భావించేవారు. ఇప్పుడు అదే విషయం శిక్షణలో భాగంగా, క్రీడాకారిణి ఆరోగ్యంలో భాగంగా చర్చకు వస్తోంది. ఇది చాలా అవసరమైన మార్పు. తనకు నొప్పిగా ఉందని, అలసటగా ఉందని, పీరియడ్స్‌లో ఉన్నానని కోచ్‌కు చెప్పగలిగినప్పుడే ఆమెకు తగిన సహాయం అందుతుంది. ప్యాడ్ మార్చుకునేందుకు ప్రైవసీ, శుభ్రమైన మరుగుదొడ్లు, నీరు, అవసరమైన విశ్రాంతి, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండటం వంటి కనీస సౌకర్యాలు ఉంటేనే మైదానంలో ఆమె ఎదుర్కొనే ఒత్తిడి తగ్గుతుంది. ఈ అంతర్జాతీయ క్రీడాకారిణులు పంచుకున్న అభిప్రాయాలు వ్యక్తిగతమైనవి మాత్రమే కావు. పాఠశాల స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే ప్రతి క్రీడాకారిణికి వర్తించే విషయాలు. మైదానంలో పతకం కోసం పోరాడుతున్న క్రీడాకారిణి, పీరియడ్ సమయంలో తమ శరీరంతో మరో పోరాటం చేస్తారని సమాజంలో అవగాహన రావాలి. ఏ స్థాయి క్రీడాకారిణి అయినా సౌకర్యంగా, స్వేచ్ఛగా ఆట ఆడే వాతావరణం కల్పించాలి. అప్పుడే అమ్మాయిలు క్రీడల్లో మరింతగా రాణిస్తారు.








కామెంట్‌లు (0)