అన్యాయాన్ని చూసి ఆగ్రహించడం తప్పు కాదు.. ఆ ఆగ్రహమే మార్పు కోసం పోరాడే శక్తిగా మారాలని అంటారు సామాజిక కార్యకర్త పల్లవి పారిఖ్. కార్యాలయాల్లో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, లింగ వివక్ష, అసమానతలపై దాదాపు రెండు దశాబ్దాలుగా ఆమె పోరాడుతున్నారు. మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించడంతోపాటు అవి సమర్థంగా అమలయ్యేలా కృషి చేస్తున్నారు. తొమ్మిది వేలకు పైగా కార్యాలయాల్లో మహిళల హక్కుల పరిరక్షణకు పనిచేసిన ఆమె, తన జీవితానుభవాలు, ఆలోచనలు, పోరాటం గురించి ఇలా చెబుతున్నారు...
‘‘నా పేరు పల్లవి పారిఖ్. రాజస్థాన్‌లోని భిల్వారాలో జన్మించాను. మా తల్లిదండ్రులకు నేను రెండో సంతానాన్ని. మా నాన్న వస్త్ర పరిశ్రమలో పనిచేసేవారు. మమ్మల్ని బాగా చదివించాలనే ఉద్దేశంతో ఆయన ఫిలిప్పీన్స్‌లోని ఓ వస్త్ర పరిశ్రమ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. దీంతో మేమంతా అక్కడికి వెళ్లాం. ఆ దేశంలో గడిపిన రోజులు నా ఆలోచనా విధానాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. భారత్‌లోని పితృస్వామ్య సమాజానికి, అక్కడ నేను చూసిన మాతృస్వామ్య సమాజానికి ఉన్న తేడా తెలిసింది. మహిళలకు లభించే ప్రాధాన్యాన్ని అక్కడ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అక్కడి నుంచే పితృస్వామ్య సమాజాన్ని ప్రశ్నించడం నేర్చుకున్నాను. నాలో వచ్చిన ఈ మార్పుకు మా తల్లిదండ్రులు కూడా మద్దతునిచ్చారు. అయితే నేను భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడి సమాజానికి సర్దుకుపోగలనా అని మా అమ్మ ఆందోళనపడింది. కానీ నేను ధైర్యంగానే నిలబడ్డాను.
రాజస్థాన్‌లోని మోడీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ చదివాను. ఆ తర్వాత 'చేంజ్ మేనేజ్‌మెంట్'లో మాస్టర్స్ డిగ్రీ చేశాను. చదువు పూర్తయ్యాక పలు కంపెనీల్లో పనిచేశాను. ఉద్యోగ జీవితంలో నాకు ఎదురైన అనుభవాలు పితృస్వామ్య భావజాలంపై మరింతగా ప్రశ్నలు సంధించేలా చేశాయి. ఎన్ని విద్యార్హతలు, ప్రతిభ ఉన్నా కంపెనీల్లో నన్ను బోర్డు సమావేశాలకు, కీలక నిర్ణయాలు తీసుకునే ప్రక్రియకు దూరంగా ఉంచేవారు. పురుషులతో సమానంగా.. ఇంకా చెప్పాలంటే వారికంటే ఎక్కువగా రాత్రింబవళ్లు కష్టపడుతున్నా కీలక విషయాల్లో ఎందుకు భాగస్వామిని చేయడం లేదని ఆలోచించేదాన్ని. అందుకు కారణం లింగ అసమానత్వమేనని అర్థమైంది.

కార్యాలయాల్లో మహిళలు ఎదుర్కొనే సమస్యలు ఉద్యోగ అవకాశాలకే పరిమితం కావు. మాటలతో, చూపులతోనూ వేధింపులకు గురిచేస్తుంటారు. ఇలాంటి అనుభవం నా జీవితంలోనూ ఎదురైంది. ఒకప్పుడు పనిచేసిన న్యూస్‌రూమ్ నాకు ఇప్పటికీ గుర్తుంది. అక్కడ నా సహోద్యోగి ఒకరు అశ్లీల కవితలను బిగ్గరగా చదువుతుంటే, అతని చుట్టూ ఉన్న పురుషులు నవ్వుతూ ప్రోత్సహించేవారు. ఆఫీసులో అలాంటి చర్యలేంటి అని ఎవరూ ప్రశ్నించలేదు. అప్పుడు మేము కూడా దాన్ని వేధింపులుగా భావించలేదు. ఉద్యోగంలో ఒక భాగంగానే అనుకున్నాం. 2013లో అమల్లోకి వచ్చిన పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం (POSH Act) మహిళల హక్కుల పరిరక్షణలో కీలకమైన అడుగు. ఈ చట్టం వల్ల మహిళలకు తమ అనుభవాలను తప్పని చెప్పడానికి ఒక భాష లభించింది. అంతకుముందు ఇలాంటి సంఘటనలను సరదా వ్యవహారాలుగానో, సహోద్యోగుల మధ్య జరిగే జోకులుగానో, అబ్బాయిల సహజ ప్రవర్తనగానో కొట్టిపారేసేవారు. అసౌకర్యంగా అనిపించినా చాలామంది మహిళలు నోరు మెదపకుండా తమ పనులు చేసుకుపోయేవారు. చట్టం వచ్చిన వెంటనే ప్రవర్తనలు మారకపోయినా.. కనీసం ఆ ప్రవర్తనకు పేరు పెట్టే అవకాశం వచ్చింది. 'ఇది వేధింపు. దీనిని భరించాల్సిన అవసరం నాకు లేదు' అని చెప్పే హక్కు మహిళలకు లభించింది.
న్యాయం అంటే....
చట్టం ఉన్నంత మాత్రాన మహిళలకు న్యాయం జరిగినట్లు కాదు. చట్టం ద్వారా వారు నిజంగా న్యాయం పొందుతున్నారా? అన్నదే అసలు ప్రశ్న. మహిళకు చట్టం గురించి అవగాహన ఉండాలి. ఫిర్యాదు చేస్తే ఉద్యోగం పోతుందేమోనన్న భయం ఉండకూడదు. ఫిర్యాదు చేసినందుకు ఆమెపైనే నిందలు పడకూడదు. విచారణ ప్రక్రియలో ఒంటరిగా పోరాడాల్సిన పరిస్థితి రాకూడదు. ముఖ్యంగా న్యాయం కోరినందుకు ఆమె మరింత నష్టపోకూడదు. కానీ వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉంటున్నాయి. ఫిర్యాదు చేసిన మహిళలు తమ ఉద్యోగాలు, అవకాశాలు, వృత్తిపరమైన సంబంధాలను కోల్పోతున్న సందర్భాలున్నాయి. నా అనుభవంలో ఇలాంటి ఘటనలను ఎన్నో చూశాను. చట్టం ఉన్నా దాన్ని అమలు చేసే వ్యవస్థలు బలహీనంగా ఉంటే మహిళలకు రక్షణ ఎలా లభిస్తుంది? ఈ ప్రశ్న నన్ను నిరంతరం వెంటాడేది.
మహిళలు కోపాన్ని వ్యక్తం చేయడాన్ని సమాజం తరచూ ప్రతికూలంగా చూస్తుంది. కోపంగా మాట్లాడే మహిళను అతిగా స్పందిస్తోందని అంటారు. కానీ కోపం అంటే విధ్వంసం కాదు. అన్యాయాన్ని గుర్తించి ప్రశ్నించే శక్తి. మార్పు కోసం ఉద్యమాన్ని నిర్మించే శక్తి. ఎవరైనా మీ ఆహారం, దుస్తులు, పని, కలలను మీ లింగం కారణంగా నియంత్రించడానికి ప్రయత్నిస్తే.. దానిపై కోపం రావాలి. ఆ కోపం ఉన్నందుకు మనం అపరాధ భావనకు గురికావాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు కోపం నన్ను బలహీనురాలిని చేస్తుందని అనుకునేదాన్ని. ఇప్పుడు అదే నన్ను ముందుకు నడిపిస్తోందని తెలుసుకున్నాను. మహిళలు తమ కోపాన్ని అణచుకోకుండా అన్యాయంపై నిర్భయంగా మాట్లాడాలి. అప్పుడే మార్పు కోసం పోరాడే తమ సామర్థ్యాన్ని గుర్తించగలుగుతారు. ’’
అన్‌జెండర్ తో హక్కుల పోరాటం
కార్యాలయాల్లో మహిళలకు ఎదురవుతున్న లైంగిక వేధింపులు, లింగ వివక్షపై పోరాటాన్ని సంస్థాగతంగా ముందుకు తీసుకెళ్లేందుకు పల్లవి పారిఖ్ 'అన్‌జెండర్' సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించడంతోపాటు కార్యాలయాల్లో POSH చట్టం సమర్థంగా అమలయ్యేలా కృషి చేస్తున్నారు. వివిధ కంపెనీల్లోని మహిళా ఉద్యోగులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం, యాజమాన్యాలకు చట్టంలోని నిబంధనలను వివరించడం, అవసరమైనప్పుడు పోలీసులు, న్యాయవాదుల సహకారం తీసుకోవడం ఈ సంస్థ కార్యకలాపాల్లో భాగం. ఇప్పటివరకు 9 వేలకు పైగా కార్యాలయాల్లో POSH చట్టం అమలుకు కృషి చేసినట్లు సంస్థ పేర్కొంటోంది. చట్టం అమలులోని లోపాలను గుర్తించేందుకు పల్లవి, ఆమె బృందం 2017 నుంచి 2020 మధ్య ప్రభుత్వ విభాగాలకు వందలాది సమాచార హక్కు (RTI) దరఖాస్తులు సమర్పించింది. ఈ దరఖాస్తుల ద్వారా అనేక ప్రాంతాల్లో స్థానిక ఫిర్యాదుల కమిటీలు సక్రమంగా పనిచేయడం లేదన్న అంశం వెలుగులోకి వచ్చింది. దీనిపై అన్‌జెండర్ సంస్థ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వాలు, మంత్రిత్వశాఖలు, ప్రైవేటు సంస్థలు చట్టం అమలుపై దృష్టి సారించేలా చేసింది.







కామెంట్‌లు (0)