పిల్లలు ఆడుకోవాలి.. పరుగులు తీయాలి.. స్నేహితులతో కలిసి గంతులు వేయాలి. కానీ నేటి పిల్లలు చాలామంది అలాంటి వాతావరణంలో పెరగడం లేదు. కాసేపు పరుగెత్తినా ఆయాసం.. రాత్రిపూట దగ్గు.. శ్వాస తీసుకునేటప్పుడు పిల్లికూతల లాంటి శబ్దం వాళ్లను వేధిస్తున్నాయి. ఈ ఆస్తమా లక్షణాలు పెద్దవారితో పాటు పిల్లల్లో చాలా కాలంగా కనిపిస్తున్నాయి. అయితే పిల్లల విషయంలో నిర్లక్ష్యం చేస్తే వారి ఎదుగుదల, శారీరక చురుకుదనంపై ప్రభావం పడే ప్రమాదం ఉంది.
పిల్లల ఊపిరితిత్తులు ఒక వయసు వచ్చేంత వరకు పూర్తిగా అభివృద్ధి చెందవు. ఈ దశలో ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఎదగాలంటే.. వాళ్ల చుట్టూ ఉన్న వాతావరణం స్వచ్ఛంగా ఉండాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండాపోయింది. కాలుష్య తీవ్రత ఊహించనంతగా పెరిగిపోయింది. మన దేశం పిల్లల్లో ఆస్తమాకు సంబంధించిన ప్రమాద కారకాలపై 2025లో లంగ్ ఇండియా జర్నల్‌లో ఒక ముఖ్యమైన అధ్యయనం ప్రచురితమైంది. గ్లోబల్ ఆస్తమా నెట్‌వర్క్ (జిఎఎన్) పరిశోధనలో భాగంగా దేశంలోని తొమ్మిది కేంద్రాల్లో సేకరించిన సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. 20,084 మంది పిల్లలు, 25,887 మంది కౌమారదశలో ఉన్నవారు సహా మొత్తం లక్ష మందికిపైగా వ్యక్తుల వివరాలను పరిశీలించారు.
ఇళ్లలో తేమ, బూజు, దోమల నివారణకు కాయిల్స్, అగరబత్తుల పొగ, పొగాకు పొగ వంటి అంశాలు శ్వాస సంబంధిత సమస్యలతో ముడిపడి ఉన్నట్లు పరిశోధన గుర్తించింది. చిన్నతనంలో న్యుమోనియా వంటి ఛాతీ ఇన్ఫెక్షన్లు వచ్చిన పిల్లల్లోనూ శ్వాసలో గురగుర శబ్దం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధన వెల్లడించింది. ముఖ్యంగా తల్లిదండ్రుల్లో అలర్జీ సమస్యలు ఉండటం, పిల్లల్లో హే ఫీవర్ (అలర్జీ కారణంగా వచ్చే తుమ్ములు, ముక్కు కారడం) ఉండటం వంటి అంశాలు కూడా ఆస్తమా లక్షణాలతో సంబంధం కలిగి ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. రవాణా వాహనాల నుంచి వెలువడే పొగ, పెంపుడు జంతువులకు సంబంధించిన అలర్జీ కారకాలు కూడా కొన్ని వయసుల పిల్లల్లో ప్రభావం చూపుతున్నాయి.
ఊపిరితిత్తులకు కాలుష్యం సవాలు
పిల్లల ఆరోగ్యానికి వాయు కాలుష్యం ఎంతటి ముప్పుగా మారుతోందో 2026లో ప్రచురితమైన పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఫిబ్రవరి 2న 'ఎన్ పి జె క్లీన్ ఎయిర్' జర్నల్‌లో ప్రచురితమైన భారతీయ పరిశోధనలో 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 11 లక్షలకు పైగా పిల్లలకు అందించిన అంబులెన్స్ సేవల సమాచారాన్ని విశ్లేషించారు. గాలిలో పీఎం 2.5 సూక్ష్మ ధూళి కణాల స్థాయి ప్రతి క్యూబిక్ మీటరుకు 10 మైక్రోగ్రాములు పెరిగినప్పుడు, అదే రోజు పిల్లలకు సంబంధించిన మొత్తం అంబులెన్స్ పిలుపులు 3.78 శాతం పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. అనారోగ్య కారణాలతో వచ్చిన అంబులెన్స్ పిలుపులు 3.25 శాతం పెరిగాయి. ఐదు సంవత్సరాల లోపు పిల్లల్లో కాలుష్య ప్రభావం మరింత ఎక్కువగా కనిపించింది. ఈ అధ్యయనం ఆస్తమా కేసులకే పరిమితం కాకుండా, కాలుష్యం పిల్లల ఆరోగ్యాన్ని, అత్యవసర వైద్య సేవల అవసరాన్ని ఎంతగా ప్రభావితం చేస్తోందో తెలియజేసింది.
యునిసెఫ్ 2026లో విడుదల చేసిన పర్యావరణ, పిల్లల శ్వాసకోశ ఆరోగ్య నివేదిక కూడా ఇదే ఆందోళనను వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 230 కోట్ల మంది పిల్లలు అనారోగ్యకరమైన గాలి ఉన్న ప్రాంతాల్లో జీవిస్తున్నారని నివేదిక పేర్కొంది. పిల్లల ఊపిరితిత్తులు, శ్వాసనాళాలు, రోగనిరోధక వ్యవస్థ ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలో ఉండటం వల్ల కాలుష్య కారకాల ప్రభావానికి ఎక్కువగా గురవుతారని వివరించింది. వాతావరణ మార్పులు పిల్లల్లో ఆస్తమా సమస్యను తీవ్రతరం చేసే ప్రమాదం ఉందని 2026 ఆగస్టు 31న పీడియాట్రిక్ రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురితమైన సమీక్ష వెల్లడించింది. గాలి కాలుష్యం, ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ శాతం, పుప్పొడి వంటి అలర్జీ కారకాలు, అడవుల్లో మంటలు, దుమ్ము తుఫాన్లు పిల్లల్లో ఆస్తమా లక్షణాలు తీవ్రం కావడానికి కారణమవుతున్నాయని పరిశోధకులు వివరించారు.
చికిత్సపై అపోహలు వద్దు
ఆస్తమా ఉన్న పిల్లలను ఆడుకోనివ్వకూడదని, పరుగెత్తనివ్వకూడదని కొందరు తల్లిదండ్రులు భావిస్తుంటారు. మరికొందరు ఇన్హేలర్ వాడితే అలవాటైపోతుందని భయపడుతుంటారు. ఇవి అపోహలే. వైద్యుల సూచనల మేరకు సరైన చికిత్స తీసుకుంటే ఆస్తమా ఉన్న పిల్లలు కూడా సాధారణ పిల్లల్లాగే చదువుకోవచ్చు, ఆటలు ఆడుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2026 మే 7న పిల్లలు, కౌమారదశలో ఉన్నవారిలో ఆస్తమా నిర్వహణపై తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. తీవ్రతను బట్టి తగిన మందులు, ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్స్, అవసరమైన సందర్భాల్లో ఇతర చికిత్సా విధానాలను ఉపయోగించాలని సూచించింది. తీవ్రమైన పరిస్థితుల్లో తక్షణ వైద్య చికిత్స అవసరమని స్పష్టం చేసింది.
గుర్తించాల్సిన లక్షణాలు
పిల్లల్లో ఆస్తమా లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉండవచ్చు. తరచూ రాత్రిపూట దగ్గు రావడం, పరుగెత్తినప్పుడు లేదా ఆడుకున్నప్పుడు ఆయాసం రావడం, శ్వాస తీసుకునేటప్పుడు పిల్లికూతల్లాంటి శబ్దం వినిపించడం, ఛాతీ బిగుసుకుపోయినట్లు అనిపించడం, జలుబు వచ్చిన ప్రతిసారీ దగ్గు ఎక్కువ రోజులు కొనసాగడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. అయితే ఈ లక్షణాలు కనిపించినంత మాత్రాన ఆస్తమా అని నిర్ధారించలేం. పిల్లల వైద్య నిపుణుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించాలి. పిల్లల వయసును బట్టి స్పైరోమెట్రీ వంటి ఊపిరితిత్తుల పనితీరు పరీక్షలు కూడా చేయించాలి.
ఇంట్లో పొగతాగడం పూర్తిగా మానేయాలి. పిల్లల సమీపంలో పొగతాగకూడదు. దుమ్ము, బూజు, తేమ పేరుకుపోకుండా ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. దోమల కాయిల్స్, అగరబత్తుల పొగకు పిల్లలను దూరంగా ఉంచాలి. వంటగదిలో పొగ బయటకు వెళ్లేలా సరైన గాలి ప్రసరణ ఉండాలి. పిల్లలకు ఆస్తమా ఉంటే వైద్యులు సూచించిన ఇన్హేలర్, మందులను సక్రమంగా వాడించాలి. కాలుష్యం ఎక్కువగా ఉన్న రోజుల్లో బయట ఆటలు, వ్యాయామాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
పిల్లల చుట్టూ ఉన్న గాలిని స్వచ్ఛంగా ఉంచాలి. వారు చదువుకునే పాఠశాలలు, ఆడుకునే మైదానాలు, నివసించే ఇళ్లు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలి. పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వారి ఊపిరితిత్తులకు చికిత్స అందించడంతోపాటు, వాటిని దెబ్బతీస్తున్న కాలుష్యానికి అడ్డుకట్ట వేయాలి.








కామెంట్‌లు (0)