శుక్రవారం, 24 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition‘సగం జీతం’ లేఖ వెనుక... అతడిది ఒక పెద్ద కథ!

1 గంట క్రితం

UP IAS officer Rinku Singh Rahi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 24, 2026, 06:15 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

"ప్రజలకు సేవ చేసే పోస్టులో నన్ను నియమించండి. అది సాధ్యం కాకపోతే సగం జీతమే చెల్లించండి. అదీ కుదరకపోతే మరో రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై పంపండి." ఇదీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఒక ఐఏఎస్ అధికారి చేసిన విజ్ఞప్తి. ఉద్యోగులు సాధారణంగా పదోన్నతి, మెరుగైన పోస్టు, ఎక్కువ వేతనం లేదా అనుకూల బదిలీ కోరతారు. కానీ పని చేయకుండా పూర్తి జీతం తీసుకోవడం నైతికంగా సరైంది కాదంటూ సగం జీతమే ఇవ్వాలని కోరడం చాలా అరుదైన విషయం. అందుకే రాసిన ఆరు పేజీల లేఖ జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది. అయితే, ఆ లేఖ పనికి, జీతానికే పరిమితమైంది కాదు. దాని వెనుక చాలా పెద్ద కథ ఉంది.


రింకూ సింగ్ రాహీ 1982 మే 20న ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ నగరంలో ఒక సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి శివనందన్ సింగ్ చిన్న పిండి మిల్లు నిర్వహించేవారు. చదువే జీవితాన్ని మార్చగలదనే నమ్మకంతో కుమారుడిని ప్రోత్సహించారు. చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరిచిన రింకూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), జంషెడ్‌పూర్‌లో మెటలర్జికల్ ఇంజినీరింగ్‌లో చేరి 2002లో బీటెక్ పూర్తి చేశారు. అదే ఏడాది నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)లో ఆల్ ఇండియా 17వ ర్యాంకు సాధించారు. ఐఐటీల్లో ఉన్నత విద్యకు అవకాశం వచ్చినప్పటికీ, ప్రభుత్వ సేవనే లక్ష్యంగా ఎంచుకున్నారు. అనంతరం ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 2004లో ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో విజయం సాధించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు.

కుంభకోణం వెలికితీత!

ముజఫర్‌నగర్‌లో జిల్లా సామాజిక సంక్షేమ అధికారిగా విధులు నిర్వహిస్తుండగా... విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, వృద్ధాప్య పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాల నిధుల పంపిణీలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని రాహీ గుర్తించారు. నెలల తరబడి రికార్డులు పరిశీలించి, క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి సుమారు రూ.83 కోట్ల విలువైన కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అవినీతిని బయటపెట్టిన కొద్ది రోజులకే, 2009 మార్చి 26న కొంతమంది దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. ఏడు బుల్లెట్లు ఆయన శరీరంలోకి దూసుకుపోయాయి. ముఖం, దవడ తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక కంటి చూపును పాక్షికంగా కోల్పోయారు. ఈ దాడికి ఆయన వెలికితీసిన అవినీతి వ్యవహారమే కారణమని దర్యాప్తులో తేలింది. రాహీ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అవినీతిపై తన పోరాటం కొనసాగించారు. సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించి అన్ని వివరాలూ సేకరించారు. కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందని గ్రహించి, విచారణ వేగవంతం చేయాలని, అవినీతి ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిరాహార దీక్షలు కూడా చేశారు. ఒక దశలో ఆయనను పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి, అనంతరం మానసిక వైద్యశాలకు తరలించడం వివాదాస్పదమైంది. అయినా, ఆయన పట్టు విడవలేదు. ప్రభుత్వ వ్యవస్థలోనే ప్రజలకు మరింతగా సేవ చేయాలనే సంకల్పంతో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమయ్యారు. 2022లో విజయం సాధించి, 2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఉత్తరప్రదేశ్ కేడర్‌కు ఎంపికయ్యారు.

​సరిదిద్దే ప్రయత్నంలో...

ఐఏఎస్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా రింకూ సింగ్ రాహీ ప్రయాణం సాఫీగా సాగలేదు. తొలి ఫీల్డ్ పోస్టింగ్‌ను మథురలో అసిస్టెంట్ మేజిస్ట్రేట్‌గా నిర్వహించిన ఆయన, తర్వాత షాజహాన్‌పూర్, జలౌన్ జిల్లాల్లో వివిధ బాధ్యతలు చేపట్టారు. 2025 జూలైలో షాజహాన్‌పూర్ జిల్లా పువాయాన్ తహసీల్‌లో ఎస్‌డీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే కార్యాలయాన్ని తనిఖీ చేశారు. తహసీల్ ప్రాంగణంలో ఒక న్యాయవాది గుమాస్తా బహిరంగంగా మూత్రవిసర్జన చేయడాన్ని గమనించి, ఐదు గుంజీలు తీయించారు. దీంతో న్యాయవాదులు నిరసనకు దిగారు. "తహసీల్‌లో మరుగుదొడ్లు వాడలేని స్థితిలో ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగిని శిక్షించడం సరైంది కాదు. ముందుగా మౌలిక సదుపాయాలు కల్పించాలి" అని వారు వాదించారు. ఆ వాదనలో నిజం ఉందని గ్రహించిన రాహీ, "ఈ కార్యాలయానికి నేనే అధిపతి. లోపానికి నైతిక బాధ్యత కూడా నాదే" అంటూ న్యాయవాదుల ముందే ఐదు గుంజీలు తీశారు. ఈ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో మరుసటి రోజే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆయనను ఆ పోస్టు నుంచి తప్పించింది. రెవెన్యూ బోర్డుకు అటాచ్ చేసింది.

​రాజకీయ ఒత్తిళ్లకు లొంగలేదు!

కొంతకాలం తర్వాత రాహీని జలౌన్ జిల్లా ఎస్‌డీఎంగా నియమించారు. అక్కడ ఆక్రమణలు తొలగించడం, కోల్డ్ స్టోరేజ్‌లు, ఇతర వాణిజ్య సంస్థల్లో భద్రతా ప్రమాణాల తనిఖీలు చేపట్టారు. 2026లో లక్నోలో జరిగిన అగ్నిప్రమాదం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా జరిగిన తనిఖీల్లో భాగంగా జలౌన్‌లోని బేత్వా ఐస్ అండ్ కోల్డ్ స్టోరేజ్‌ను కూడా పరిశీలించారు. అగ్నిమాపక భద్రత, అనుమతులకు సంబంధించిన లోపాలను గుర్తించి చర్యలు ప్రారంభించారు. ఆ కోల్డ్ స్టోరేజ్ బీజేపీకి చెందిన బ్లాక్ ప్రముఖ్ రామ్‌రాజా నిరంజన్‌కు చెందినది. ఆయన రాష్ట్ర మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్‌కు బంధువు. ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోవద్దని రాజకీయ ఒత్తిళ్లు మొదలయ్యాయి. బీజేపీ ఎమ్మెల్యే గౌరీ శంకర్ వర్మ కూడా ఆయన విధులకు అడ్డుపడ్డారు. కానీ, రాహీ రాజీ పడలేదు. ఈ నేపథ్యంలోనే ఆయనకు జలౌన్ నుంచి బదిలీ చేసి ఒరైలో ఎస్‌డీఎం (జ్యుడీషియల్) పోస్టింగ్ ఇచ్చారు.

​ఒక నిజాయితీ అధికారి ప్రజల మధ్య ఉంటూ కీలకమైన పనులను పర్యవేక్షిస్తే, ఆ పనులకు, ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ, అంతగా ప్రాధాన్యం లేని పనుల్లోకి పడేస్తే..? ఇప్పుడు రాహీని అలాగే పడేశారు. ఓ విధంగా చెప్పాలంటే, అది ఏ ఒత్తిళ్లకూ లొంగని ఆయన్ని మూలనపెట్టడం లాంటిదే. అందుకే రాహీ 2026 జూలై 15న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ నియామక, సిబ్బంది శాఖకు ఈ లేఖ రాశారు. ప్రజలకు సేవ చేసే పోస్టుకు బదిలీ చేయాలని, అది సాధ్యం కాకపోతే సగం జీతమే చెల్లించాలని, ఉత్తరప్రదేశ్‌లో అవకాశం లేకుంటే మరో రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై పంపాలని ఆయన అందులో కోరారు. "పని చేయకుండా పూర్తి జీతం తీసుకోవడం కూడా ప్రజాధనాన్ని అనవసరంగా వినియోగించడమే. అది నా మనస్సాక్షి అంగీకరించదు" అని స్పష్టం చేశారు. అవినీతిని బయటపెట్టిన అధికారిగా, ప్రాణాల మీదకు వచ్చినా నీతి తప్పని సాహసిగా, ప్రజాసేవ చేయాలనే తపనతో వ్యవస్థనే ప్రశ్నించిన ఐఏఎస్ అధికారిగా రింకూ సింగ్ రాహీ ఎప్పటికీ గుర్తుంటారు. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా గుర్తు పెట్టుకోవాలనేది దాని తదుపరి స్పందనపై ఆధారపడి ఉంటుంది.​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్