సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పితృస్వామ్యాన్ని ఎదురించి...

12 సెప్టెంబర్, 2026

aidwa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 05:00 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

హర్యానా అనగానే - ఖాప్‌ పంచాయతీలు, పరువు హత్యలు, మహిళలపై కఠిన ఆంక్షలు గుర్తుకొస్తాయి. మహిళలను కనీస మానవులుగా కూడా గుర్తించని పితృస్వామ్య భావజాలం అక్కడ ఇప్పటికీ బలంగా ఉంది. అయితే అదే హర్యానా నుంచి సాక్షి మాలిక్‌, వినేష్‌ ఫోగట్‌ వంటి మహిళా క్రీడాకారిణులు ప్రపంచ వేదికలపై సత్తా చాటడమే కాకుండా తమపై జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడుతున్నారు. ఈ మార్పు ఒక్కరోజులో వచ్చింది కాదు. మహిళల స్వేచ్ఛ, సమానత్వం కోసం దశాబ్దాలుగా సాగుతున్న ఉద్యమాల ఫలితమే ఇది. అలాంటి పోరాట యోధుల్లో ఆల్‌ ఇండియా డెమోక్రటిక్‌ ఉమెన్స్‌ అసోసియేషన్‌ (ఐద్వా) జాతీయ నాయకురాలు డాక్టర్‌ జగ్మతి సాంగ్వాన్‌ ఒకరు. అంతర్జాతీయ స్థాయి వాలీబాల్‌ క్రీడాకారిణిగా, మహిళా ఉద్యమ నాయకురాలిగా ఆమెకు సుదీర్ఘ అనుభవం ఉంది. విజయవాడలో జరిగిన ఐద్వా జాతీయ కమిటీ సమావేశాలకు హాజరైన ఆమె హర్యానా సమాజంలో మహిళల జీవితాల్లో వచ్చిన మార్పు, ఖాప్‌ పంచాయతీలకు వ్యతిరేకంగా సాగించిన పోరాటం, మహిళా క్రీడాకారిణుల సమస్యలు, ప్రస్తుత మహిళా ఉద్యమం ఎదుర్కొంటున్న సవాళ్లపై ‘ప్రజాశక్తి’తో ముచ్చటించారు. ఆ విషయాలు ఆమె మాటల్లోనే...

‘‘చదువుకునే రోజుల్లోనే స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ)లో చేరాను. విద్యార్థి దశలో వాలీబాల్‌ ఆడుతూ నాలుగుసార్లు జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించాను. హర్యానా ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక భీమ్‌ అవార్డును అందుకున్న తొలి మహిళా క్రీడాకారిణిని. ఎస్‌ఎఫ్‌ఐలో పనిచేస్తున్న సమయంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విద్యాసంస్థల్లో 10 శాతం సీట్లు కేటాయించాలన్న డిమాండ్‌తో మా పోరాటం ప్రారంభమైంది. అదే సమయంలో లింగ సమానత్వ సమస్యలపై కూడా దృష్టిపెట్టాం. 1985లో చదువు పూర్తయిన తర్వాత హర్యానాలో ఐద్వా యూనిట్‌ను ఏర్పాటు చేశాం.

మహిళలకు కనీస స్వేచ్ఛ లేని పరిస్థితుల్లో ఖాప్‌ పంచాయతీలు, కుల ఆధారిత పితృస్వామ్య సంస్థల నుంచి మా పోరాటానికి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. హర్యానాలో మహిళల వివాహ ఎంపిక కేవలం కుటుంబ గౌరవానికి సంబంధించిన అంశం కాదు. దాని వెనుక ఆస్తి, అధికారం కూడా ఉన్నాయి. భూమి ఉన్న వర్గానికి చెందిన అమ్మాయి, భూమిలేని పేద కుటుంబానికి చెందిన అబ్బాయిని వివాహం చేసుకుంటే ఆస్తి హక్కులు మారే అవకాశం ఉంటుంది. దాంతో అధికార సమీకరణాలు కూడా మారతాయి. అందుకే అక్కడ మహిళలు తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకోవడాన్ని పితృస్వామ్య శక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తాయి. మహిళల స్వేచ్ఛ కోసం సాగిన పోరాటంలో నాకు ఇప్పటికీ గుర్తుండిపోయే సంఘటన మనోజ్‌–బబ్లీ పరువు హత్య కేసు. ఒకే గ్రామానికి చెందిన మనోజ్‌, బబ్లీ వివాహం చేసుకున్నారు. ఈ వివాహం సామాజిక నిబంధనలకు విరుద్ధమంటూ బబ్లీ కుటుంబ సభ్యులు మనోజ్‌ను హత్య చేశారు. ఆ హత్యకు పాల్పడిన వారందరినీ శిక్షించాలని మేము డిమాండ్‌ చేశాం. మరో కేసులో పెళ్లయి మూడేళ్లు గడిచి, ఏడాది వయసున్న బిడ్డ ఉన్న దంపతులను భార్యాభర్తలుగా కాకుండా ఒకరికొకరు రాఖీ కట్టుకుని అన్నాచెల్లెళ్లుగా ఉండాలని ఖాప్‌ పంచాయతీ తీర్పునిచ్చింది. అలాంటి ఎన్నో ఖాప్‌ తీర్పులకు వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడాం.

ఖాప్‌కు ఎదురుగా పౌర పంచాయతీలు

మహిళల రక్షణ కోసం పౌర పంచాయతీలను నిర్వహించాం. ఒకవైపు కుల పంచాయతీలు ఉంటే, మరోవైపు పౌర పంచాయతీలు నిలిచాయి. సామాజిక నిబంధనల కంటే రాజ్యాంగం, పౌర హక్కులకే ప్రాధాన్యత ఇవ్వాలని మేము డిమాండ్‌ చేశాం. దీర్ఘకాలిక పోరాటం తర్వాత ప్రతి జిల్లాలో దంపతుల రక్షణ గృహాలను ఏర్పాటు చేయించడంలో కూడా విజయం సాధించాం. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడిచినా ఎలాంటి నేరం చేయని యువత కేవలం తమకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకున్నందుకు హత్యకు గురవుతున్నారు. వారి రాజ్యాంగ హక్కులను, ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. పరువు హత్యలు, పరువు నేరాలకు వ్యతిరేకంగా ప్రత్యేక చట్టం కోసం మా పోరాటం కొనసాగుతోంది. ఐద్వా రూపొందించిన చట్ట ముసాయిదా ఆధారంగా యుపిఎ-2 హయాంలో ప్రణబ్‌ ముఖర్జీ నేతృత్వంలో మంత్రుల బృందం ఏర్పాటు చేసినప్పటికీ, 2014లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ అంశంపై ఎలాంటి ముందడుగు పడలేదు.

క్రీడల్లో రాణించినా.. స్వేచ్ఛలో వెనుకంజ

హర్యానాలో మహిళల చుట్టూ ఇంతటి పితృస్వామ్య వాతావరణం ఉన్నప్పటికీ, దేశానికి అత్యధికంగా మహిళా అథ్లెట్లను అందిస్తున్న రాష్ట్రాల్లో హర్యానా ఒకటి. తీవ్రమైన ఆర్థిక సంక్షోభమే దీనికి ఒక కారణం. వ్యవసాయ భూములు తగ్గిపోతున్న పరిస్థితుల్లో కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి తల్లిదండ్రులు తమ కుమార్తెలను క్రీడల్లోకి పంపుతున్నారు. కానీ అమ్మాయిలను క్రీడలకు పంపినా, తమకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే స్వేచ్ఛను మాత్రం ఇవ్వరు. ఈ వైరుధ్యం హర్యానా సమాజంలో ఇప్పటికీ ఉంది. మహిళలు క్రీడల్లో మరింత ముందుకు రావాలంటే సురక్షితమైన వాతావరణం అవసరం. క్రీడా సంస్థల్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు, ఆంతరంగిక ఫిర్యాదుల కమిటీలు సమర్థంగా పనిచేయాలి. శిక్షణ, పోటీలకు వెళ్లే ప్రతి ప్రాంతంలో భద్రత, పరిశుభ్రత ఉండాలి. మహిళా క్రీడాకారిణుల కోసం ప్రత్యేక క్రీడా విధానం అవసరం.

చదువు పెరిగినా.. స్వేచ్ఛ ఎందుకు పెరగదు?

అమ్మాయిలు చదువుకుంటున్నప్పటికీ, అదే స్థాయిలో వారి స్వేచ్ఛ పెరగడం లేదు. సమాజంలో కొనసాగుతున్న పితృస్వామ్య భావజాలమే దీనికి కారణం. ప్రస్తుత పాలకులు మనుస్మృతి, వర్ణ వ్యవస్థ వంటి భావజాలాలను ప్రోత్సహిస్తున్నారు. వాటి ప్రభావంతో మహిళలను స్వతంత్ర వ్యక్తులుగా కాకుండా లొంగి ఉండాల్సిన వారిగా, వస్తువులుగా చూస్తున్నారు. మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతున్నా సమాన హక్కులకు ప్రభుత్వ మద్దతు లేకపోతే వ్యక్తిగతంగానూ, సంస్థాగతంగానూ వారు ఎదుర్కొనే సవాళ్లు ఎక్కువగా ఉంటాయి. మహిళలపై హింస జరిగినప్పుడు బాధితులనే నిందించే ధోరణి కూడా ప్రమాదకరం.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో జరిగిన స్థాయిలో సామాజిక సంస్కరణ ఉద్యమాలు హర్యానాలో జరగలేదు. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ, హక్కులు, ఎంపికల గురించి ప్రశ్నిస్తున్న హర్యానా మొదటి తరం మేమే. ఇప్పుడు బిజెపి అధికారంలో ఉన్న సమయంలో మరింత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. పితృస్వామ్య, తిరోగామి శక్తులకు ప్రభుత్వ మద్దతు లభిస్తోంది. మహిళల భద్రత కోసం ఉన్న చట్టాలను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మహిళా ఉద్యమం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు కార్పొరేట్‌–మతతత్వ కూటమి అధికారంలో ఉండటం. మహిళల ఉద్యోగాలు తగ్గుతున్నాయి. ఆస్తి హక్కులు, స్వతంత్ర హోదాకు వ్యతిరేకమైన భావజాలం బలపడుతోంది.

యువతులు సంఘటితం కావాలి

ప్రస్తుత పరిస్థితుల్లో యువతులు తమ హక్కుల కోసం సంఘటితం కావాలి. తమ ప్రజాస్వామ్య, ప్రాథమిక హక్కులను ఉపయోగించుకోవాలి. విద్యా హక్కు కోసం, సురక్షితమైన పని ప్రదేశాల కోసం, విధానపరమైన మార్పుల కోసం పోరాడాలి. లేకపోతే పితృస్వామ్య శక్తులు మహిళల హక్కులను, గుర్తింపును వెనక్కి లాగే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు కూడా కుమార్తెలను విద్య, క్రీడలు, ఉద్యోగాల్లోకి ప్రోత్సహించాలి. క్రీడలు మహిళల్లోని అనవసరమైన భయాన్ని తొలగించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అమ్మాయిలకు సురక్షితమైన వాతావరణం కల్పించి తల్లిదండ్రులు, సమాజం వారికి అండగా నిలవాలి. అప్పుడే వారు జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలునూ ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు.’’


సంభాషణ : జ్యోతిర్మయి


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్