సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గెలుపు బాటలో కూతుళ్లు...

2 రోజుల క్రితం

గెలుపు బాటలో కూతుళ్లు... image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 04:30 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

‘కూతురు.. అమ్మానాన్నల గారాలపట్టిగానే కాదు.. ప్రపంచం మెచ్చే క్రీడాకారిణిగా కూడా రాణించగలదు..’ అని నిరూపిస్తున్నారు మన అమ్మాయిలు. ఆసియా గేమ్స్‌ 2026లో క్రీడాకారిణులు సాధిస్తున్న విజయాలు కేవలం పతకాలకే పరిమితం కాదు. ఎంతోమంది అమ్మాయిల ఆశయాలకు, ఆకాంక్షలకు ప్రతిబింబాలు. పేదరిక కుటుంబాల్లో పుట్టి, అవకాశాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసి, ఆట కోసం కుటుంబాల ఆదరువును అమ్మేసి మరీ వారు ఈ క్రీడల్లో పాల్గొన్నారు. జపాన్‌లోని నాగోయాలో జరుగుతున్న ఈ క్రీడల్లో సత్తా చాటుతున్న క్రీడాకారిణుల్లో కొందరు ఇప్పటికే అంతర్జాతీయ వేదికపై గుర్తింపు తెచ్చుకున్నారు. మరికొందరు తొలిసారి బరిలోకి దిగి పతకాలతో వెలుగులోకి వచ్చారు. వీరిలో ఒకరు పంట పొలాల నుంచి షూటింగ్‌ రేంజ్‌కు వచ్చారు. ఇంకొకరు చిన్ననాటి వేధింపుల తర్వాత ఆత్మరక్షణ కోసం నేర్చుకున్న విద్యతో ప్రపంచం మెచ్చే క్రీడాకారిణిగా ఎదిగారు. మరొకరు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆసియా పతకాన్ని అందుకున్నారు. నేడు కుమార్తెల దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం...

​పొలాల నుంచి పోడియం వరకు..

​హర్యానాలోని ఝజ్జర్‌కు చెందిన సురుచి సింగ్‌ (19) ఈ పోటీల్లో 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో కమల్‌జీత్‌తో కలిసి స్వర్ణం సాధించింది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన సురుచి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటున్న సమయంలోనూ వ్యవసాయ పనుల్లో తండ్రికి సాయం చేసేది. ఆమె కోచ్‌ సురేష్‌ సింగ్‌ చెప్పిన ప్రకారం.. ‘షూటింగ్‌ రేంజ్‌లో లేకపోతే సురుచి పొలంలో గోధుమల కోతలో ఉండేది’. 2024లో జాతీయ ఛాంపియన్‌షిప్‌లో ఏకంగా ఏడు స్వర్ణాలు సాధించిన ఆమె, ఆ తర్వాత వరల్డ్‌కప్‌ వేదికపైనా బంగారు పతకాలు సాధించింది.

​ఎలవెనిల్‌ వలరివన్‌కు ఆసియా క్రీడల్లో పతకం రావడానికి ఎనిమిదేళ్లు పట్టింది. 2018 జకార్తా, 2023 హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో పాల్గొన్నా పోడియం దక్కలేదు. ఈసారి మాత్రం ఆ నిరీక్షణకు తెరపడింది. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో రజతం సాధించిన ఎలవెనిల్‌, అదే రోజు సోనం మాస్కర్‌, విదర్సా వినోద్‌తో కలిసి టీమ్‌ ఈవెంట్‌లోనూ రజతం సాధించింది. ఒకప్పుడు పతకం కోసం ఎదురు చూసిన అమ్మాయి ఇప్పుడు రెండు రజతాలతో ఆసియా వేదికపై నిలిచింది.

ప్రపంచ స్థాయిలో ఇప్పటికే ఎన్నో పతకాలు సాధించిన మీరాబాయి చానుకు ఆసియా క్రీడల పతకం మాత్రం ఇప్పటివరకు లేదు. మహిళల 49 కిలోల వెయిట్‌లిఫ్టింగ్‌లో రజతం సాధించడంతో ఆ లోటు తీరింది. భారత్‌కు ఈ క్రీడలో ఆసియా క్రీడల పతకం వచ్చి 28 ఏళ్లు కావడంతో మీరాబాయి విజయం మరో ప్రత్యేకతను సంతరించుకుంది.

​పోరాటమే పతకంగా...

​మణిపూర్‌లోని బిష్ణుపూర్‌ జిల్లాకు చెందిన నౌరెమ్‌ రోషిబినా దేవి కథలో పోరాటం చిన్నప్పటి నుంచే మొదలైంది. వుషులో సాండా 60 కిలోల విభాగంలో 2018 జకార్తా ఆసియా క్రీడల్లో కాంస్యం, 2023 హాంగ్‌జౌలో రజతం సాధించిన ఆమె.. ఇప్పుడు నాగోయాలోనూ రజతం గెలిచింది. ఒకే క్రీడాకారిణి మూడు వరుస ఆసియా క్రీడల్లో పతకం సాధించడం భారత వుషు చరిత్రలో ప్రత్యేక ఘనత. 2023లో ఆమెకు అర్జున అవార్డు కూడా లభించింది.

కొన్ని కథల్లో విజయం కంటే ఆ విజయం వెనుక కారణం మరింత బలంగా ఉంటుంది. సుచికా తారియాల్‌ కథ అలాంటిదే. 12 ఏళ్ల వయసులో ఎదురైన వేధింపుల సంఘటన తర్వాత ఆత్మరక్షణ కోసం ఆమె జూడో నేర్చుకోవడం ప్రారంభించింది. ఆ తర్వాత అదే విద్య ఆమెను ఎనిమిదిసార్లు జాతీయ జూడో ఛాంపియన్‌గా నిలబెట్టింది. అయితే ఆమె కెరీర్‌ ఎప్పుడూ సాఫీగా సాగలేదు. మోకాలి గాయం, వ్యక్తిగత సమస్యలు, క్రీడా వ్యవస్థలో మార్పులు వంటి ఎన్నో కారణాలతో ఒక దశలో క్రీడలకు దూరమవ్వాలనుకుంది. ఎన్ని అవమానాలు ఎదురైనా మళ్లీ నిలబడింది. ఈ పోటీల్లో 60 కిలోల ట్రెడిషనల్‌ ఎంఎంఏ విభాగంలో కాంస్యం సాధించి, ఆసియా క్రీడల ఎంఎంఏలో భారత తొలి పతక విజేతగా చరిత్ర సృష్టించింది.

ఇంకా ఎందరో...!

​సీమ కుమారి మహిళల 10 వేల మీటర్ల పరుగులో కాంస్య పతకం సాధించింది. ఈ విభాగంలో భారత్‌కు చాలా కాలం తర్వాత పతకం దక్కింది. 10 వేల మీటర్ల పరుగు అంటే వేగం మాత్రమే కాదు.. పరుగు ఆపేంతవరకు శరీరాన్ని, మనసును అదుపులో ఉంచే ఓర్పు కూడా కావాలి. సీమ సాధించిన పతకం ఆ క్రమశిక్షణకు గుర్తుగా నిలిచింది. బరనికా ఎలంగోవన్‌ మహిళల పోల్‌వాల్ట్‌లో కాంస్యం సాధించి చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడల్లో పురుషులు, మహిళలు కలిపి పోల్‌వాల్ట్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం. ఆమెకు ముందు ఆ విభాగంలో భారతదేశానికి ఆసియా క్రీడల పోడియం లేదు. ఈ పోటీల్లో బరనికా దూకింది కేవలం ఒక ఎత్తైన బార్‌ను మాత్రమే కాదు.. భారత అథ్లెటిక్స్‌లో ఇంతవరకు చేరని ఒక శిఖరాన్ని కూడా.

బరిలో బ్యాట్‌ పట్టినా.. కూతతో సవాల్‌ విసిరినా.. భారత మహిళలు తమ సత్తా చాటారు. భారత మహిళల క్రికెట్‌ జట్టు ఈ పోటీల్లో స్వర్ణంతో మెరిసింది. కబడ్డీ జట్టు కూడా స్వర్ణం సాధించింది. బృందంలో పాల్గొన్న ప్రతి అమ్మాయికి ఒక కథ ఉంది. ఆ కథ ఎంతోమంది క్రీడాకారిణుల కలలకు మార్గం చూపుతోంది.

పతకాలకంటే పెద్ద సందేశం

​ఈ క్రీడల్లో భారత్‌ సాధిస్తున్న పతకాలలో మహిళల వాటా గణనీయంగా ఉంది. అయితే పతకాల కోసం బరిలో పోరాడుతున్న ఈ అమ్మాయిల పోరాటం అంతకు చాలా ముందే మొదలైంది. ఇంట్లో పనులు చేసుకుంటూ షూటింగ్‌ నేర్చుకున్న సురుచి నుంచి.. ఎనిమిదేళ్లు ఎదురుచూసిన ఎలవెనిల్‌ వరకు.. 12 ఏళ్ల వయసులో ఆత్మరక్షణ కోసం క్రీడలోకి వచ్చి ఆసియా పతకం సాధించిన సుచిక వరకు.. ప్రతి ఒక్కరి ప్రయాణం ఒక సందేశాన్ని ఇస్తోంది. ‘అమ్మాయికి అవకాశం ఇస్తే.. ఆమె గెలవడమే కాదు, తన తర్వాత వచ్చే అమ్మాయిలకు దారిని చూపిస్తుంది’ అని వారు నిరూపిస్తున్నారు.

​అమ్మాయిలు సాధించిన ఈ విజయాలను గుర్తుచేసుకోవడం అంటే కేవలం పతకాలను లెక్కించడంతో సరిపెట్టకూడదు. కలలు కనడానికి, బరిలోకి దిగడానికి, ఓడినా మళ్లీ లేచి నిలబడటానికి ప్రతి అమ్మాయిని ప్రోత్సహించే వరకు ఈ స్ఫూర్తి కొనసాగాలి.

​అప్పుడే కూతుళ్లు.. మళ్లీ మళ్లీ గెలుస్తూనే ఉంటారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్