బుధవారం, 22 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionచేస్తామని చెప్పడం కాదు.. వెంటనే చెయ్యండి..

1 గంట క్రితం

యుపి బాలుడు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 22, 2026, 06:30 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

చాలామంది పిల్లలకు ఉన్న కనీస సౌకర్యాలు ఆ బాలుడికి లేవు. కడుపునిండా తిండి తినడమే కష్టమైన పరిస్థితి! అయినా తన చదువుకు అడ్డుగా మారిన అన్యాయంపై న్యాయం కోరేందుకు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాడు. అధికారుల ఎదుట ఏమాత్రం భయపడకుండా ప్రశ్నించాడు. "చేస్తామని చెప్పడం కాదు.. వెంటనే చేయండి" అన్న తన మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.


అమితాబ్‌ (13) 8వ తరగతి చదువుతున్నాడు. తన సోదరి 11వ తరగతి చదువుతోంది. పని నుంచి వచ్చాక వాళ్ల అమ్మ న్యూస్‌పేపర్లతో కవర్లు తయారుచేస్తుంది. పిల్లలిద్దరూ ఆమెకు సాయం చేస్తారు. కొన్ని రోజుల నుంచి అమితాబ్‌ అమ్మను గమనిస్తున్నాడు. తను మునుపటిలా లేదు. చాలా రోజుల నుంచి ఎంతో ఒత్తిడితో ఉంది. వాళ్ల ఇంట్లో అద్దెకు ఇచ్చే ఒక గదికి బంధువులు తాళం వేసినప్పటి నుంచీ అమ్మ అలా ఉంటోందని అమితాబ్‌ గ్రహించాడు. తాళం తీయించమని కొన్ని నెలలుగా అధికారుల చుట్టూ అమ్మ తిరగడం కూడా చూశాడు. అమ్మ కష్టం కొంతైనా తగ్గిద్దామని అమితాబ్‌ చేసిన ప్రయత్నమే ఈ రోజు తనను సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యేలా చేసింది.

కొన్ని రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్‌ ‌లోని లఖింపూర్‌లో 'సంపూర్ణ సమాధాన దివస్‌' సందర్భంగా పబ్లిక్‌ గ్రీవెన్స్‌ నిర్వహించారు. అక్కడ తన అభ్యర్థన దరఖాస్తు సమర్పించేందుకు అమితాబ్‌ ఒంటరిగా వెళ్లాడు. తన వంతు వచ్చినప్పుడు దరఖాస్తు కాగితం తీసుకుని జిల్లా మెజిస్ట్రేట్‌ దగ్గరకు వెళ్లాడు. బాలుడిని చూడగానే అధికారి, 'ఒక్కడివే వచ్చావా?' అని అడిగారు. 'అవును' అని సమాధానం చెప్పాడు. తన చేతిలో ఉన్న కాగితాన్ని అధికారికి ఇస్తూ, 'కుటుంబ తగాదాల్లో భాగంగా మా ఇంటిలో ఒక గదికి బంధువులు తాళాలు వేశారు. వాటిని తెరిపించండి' అన్నాడు.

'నీతో పెద్దవాళ్లు ఎవరైనా వస్తే వాళ్లను రమ్మని చెప్పు' అని అధికారి అడిగినప్పుడు ఏమాత్రం సంకోచించకుండా, 'మానసిక ఆరోగ్యం దెబ్బతిని నాన్న ఇంటికే పరిమితమయ్యాడు. అమ్మ ఇళ్లల్లో పని చేసి మమ్మల్ని పోషిస్తోంది. తాళం వేసిన గదిని అద్దెకు ఇచ్చి, వచ్చిన డబ్బుతో అక్క, నేను చదువుకుంటున్నాం. ఇప్పుడు ఆ గదికి తాళం వేస్తే మేం ఎలా చదువుకోవాలి?' అని ప్రశ్నించాడు.

చుట్టూ ఉన్న వాళ్లు బాధతో ఆ మాటలు విన్నారు. ఆ తర్వాత 'ఈ విషయంపై ఎన్నో సార్లు అధికారులకు చెప్పాం. న్యాయం చేయమని బతిమాలాం. అయినా ఎవరూ పట్టించుకోలేదు' అని ఈసారి గట్టిగా అమితాబ్‌ అన్నప్పుడు అధికారులు అప్రమత్తమై, ఆరోపణలు చేయవద్దని తనను వారించారు. అయినా తను ప్రశ్నించడం ఆపలేదు. పదే పదే అధికారుల ఉదాసీనతను నిలదీశాడు. అప్పుడు అక్కడే ఉన్న ఓ పోలీసు అధికారి, 'నేను వచ్చి తాళం తీయిస్తాను. నువ్వు ఇంటికి వెళ్లు' అన్నారు. అప్పుడు అమితాబ్‌ కోపం నిండిన కళ్లతో..

'చేస్తామని చెప్పకండి.. వెంటనే చేయండి' అని గట్టిగా అన్నాడు. చిన్నపిల్లవాడు అధికారిని అలా నిలదీసేసరికి క్షణంపాటు నివ్వెరపోయినా, వెంటనే తేరుకుని అధికారులంతా పగలబడి నవ్వారు. 'ముందు నువ్వు చదువుకో. ఆ తర్వాత ఇవన్నీ అడుగుదువుగానీ' అని తనకు నచ్చచెప్పబోయారు. అప్పుడు అమితాబ్‌ వాళ్ల వైపు తీక్షణంగా చూస్తూ, 'ఎలా చదువుకోమంటారు? డబ్బులు లేకపోతే మాకు పుస్తకాలు, పెన్నులు ఎవరిస్తారు? అమ్మ సంపాదించే రూ.3 వేలతో ఇల్లు గడవడమే కష్టం. అద్దె డబ్బులతోనే మేం చదువుకునేవాళ్లం. ఇప్పుడు దానికి తాళం వేశారు. మా చదువు ఏం కావాలి?' అన్నప్పుడు, 'సమస్యను తక్షణం పరిష్కరించమని' పోలీసు అధికారిని మెజిస్ట్రేట్‌ ఆదేశించారు. ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లి విచారించమని కూడా చెప్పారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎవరో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

పేదరికం ఆ బాలుడిని అధికారుల ఎదుట నిలబెట్టలేదు. చదువుకునే హక్కును కాపాడుకోవాలన్న తపనే అక్కడికి తీసుకొచ్చింది. అందుకే 'చేస్తామని చెప్పకండి.. వెంటనే చేయండి' అన్న తన మాటలు లక్షలాది మందిని ఆలోచింపజేస్తున్నాయి. సమస్యలు ఎంత పెద్దవైనా, ప్రశ్నించే ధైర్యం ఉంటే మార్పు మొదలవుతుందనే సందేశాన్ని 13 ఏళ్ల అమితాబ్‌ తన చేతల్లో చూపించాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్