బుధవారం, 22 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా!

1 గంట క్రితం

trump jinping
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 22, 2026, 05:45 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

ట్రంప్‌ ఆరోపణలు-అసలు కథ

''వీరు సోషల్‌ డెమోక్రాట్లు కాదు. కరుడు గట్టిన దేవుడు లేని కమ్యూనిస్టులు. వారు అన్ని మతాల మీదా దాడులు చేస్తారు. ప్రత్యేకించి క్రైస్తవం మీద, వారెప్పుడూ అదే చేస్తారు. అదొక పిచ్చి వంటిది. ఈ దేశంలో మీ చర్చిలన్నింటినీ మూసివేస్తారు... ఏదనుకుంటే అది చేస్తారు. వారు మతాన్ని అంతం చేయాలనుకుంటున్నారు. మీకు బలమైన మతం ఉంటే వారి సిద్ధాంతం పని చేయదు గనుక వారు మతాన్ని అంతం చేయాలనుకుంటారు. రెండు వందల యాభై సంవత్సరాల క్రితం మన దేశ స్థాపన జరిగిన తరువాత నా అభిప్రాయం ప్రకారం దేశానికి వచ్చిన ముప్పు ఇది.'' ఈ మాటలు మాట్లాడింది అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డోనాల్డ్‌ ట్రంప్‌ అనే ఒక కమ్యూనిస్టు వ్యతిరేకి. గత వారంలో దేశ ప్రజలనుద్దేశించి ఇరవై నిమిషాలపాటు టీవీలో చేసిన ప్రసంగంలో ఇలాంటి అనేక మాటలు అతని నోటి నుంచి వచ్చాయి.

ఎన్నికల్లో తనను ఓడించేందుకు చైనా కమ్యూనిస్టులు గతంలో జోక్యం చేసుకున్నారని, ఇప్పుడు మధ్యంతర ఎన్నికల్లో అదే పని చేస్తున్నారని ఆరోపించాడు. నవంబరు మూడవ తేదీన జరిగే పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో జనం ఏ తీర్పు ఇస్తారో తెలియదుగానీ, అధికార రిపబ్లికన్లకు ఎదురుదెబ్బ తగిలి ఉభయ సభల్లో మెజారిటీ కోల్పోతే దానికి కారణం చైనీయులే అని చెప్పేందుకు ముందుగానే ఒక సాకు సిద్ధం చేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

అమెరికా ఎన్నికల్లో కమ్యూనిస్టులు లేదా ఇతర పురోగామివాదులు ఒక పార్టీగా అక్కడ పాతుకుపోయిన రెండు ప్రధాన పార్టీలను దెబ్బ కొట్టగలిగిన స్థితిలో లేరన్నది ఒక వాస్తవం. రెండవది, గత కొన్ని దశాబ్దాలుగా కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టి జనాల బుర్రలను ఖరాబు చేసిన సంగతి కూడా తెలిసిందే. గతంతో పోలిస్తే కొంత మార్పు వచ్చిన్పటికీ అది చాలదు. అక్కడి డెమోక్రటిక్‌ సోషలిస్టు పార్టీలో ఉన్నవారందరూ సోషలిజానికి, కమ్యూనిజానికి అనుకూలురని చెప్పలేము. ఆ భావజాలానికి కట్టుబడి పని చేయాలని కోరుకొనే వారు కూడా గణనీయంగా ఉన్నారు. చివరి వరకు ఎంత మంది నికరంగా నిలుస్తారు, నిలవరు అనేది చరిత్ర చెప్పాల్సిందే. సోషలిస్టు భావాలు కలిగిన రెండు సంస్థలు, కొందరు వ్యక్తులు 1982లో డెమోక్రటిక్‌ సోషలిస్టు పార్టీగా ఏర్పడి డెమోక్రటిక్‌ పార్టీలోనే పని చేయటం ప్రారంభించారు. నాడు కొన్ని వందల మంది మాత్రమే సభ్యులుగా ఉండగా నేడు లక్షా పది వేల మంది వరకు ఉన్నట్లు అంచనా. సోషలిస్టులమని చెప్పుకొనేందుకే భయపడిన రోజుల నుంచి నేడు లక్షలాది మంది తామూ అదే ఇస్టులమని గర్వంగా చెప్పుకొనేంతంగా ఆ ఉద్యమం ఎదిగింది. బెర్నీ శాండర్స్‌ సెనెటర్‌గా ఎన్నికతో ప్రారంభమైన ఆ పురోగమనం 2028 ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో గవర్నర్‌ పదవుల కోసం, మరో రెండు చోట్ల గట్టి పోటీ ఇచ్చేందుకు, అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ తరఫున తమ భావజాలం ఉన్న వ్యక్తిని నిలిపేందుకు అడుగులు వేయటమే ట్రంప్‌ ఆందోళనకు అసలు కారణంగా చెప్పవచ్చు.

జులై 16న టీవీ ప్రసంగం తీరు చూసిన తరువాత తన పదవి కోసం ట్రంప్‌ ఎంతకైనా తెగిస్తాడని అనేక మంది భావిస్తున్నారు. నవంబరు మూడు మధ్యంతర ఎన్నికల్లో ఓటర్లను బెదిరించేందుకు మిలిటరీని దించటంతో పాటు (ఇప్పటికే చికాగో, లాస్‌ ఏంజల్స్‌, వాషింగ్టన్‌ డిసి, తదితర నగరాల్లో ఉన్నాయి), ఓట్ల పెట్టెలను అపహరించటంతో సహా ఏ అక్రమానికైనా పాల్పడవచ్చని చెబుతున్నారు. రిపబ్లికన్లు ఓడిపోతే ఫలితాలను తిరస్కరించే అవకాశం కూడా ఉంది. 2020 అధ్యక్ష ఎన్నికలలో ఓడిపోతున్నట్లు గ్రహించి బ్యాలట్‌ బాక్సులను తారుమారు చేయాలని చూస్తే అతగాడి అధికార యంత్రాంగంలోని వారే అడ్డుపడటంతో వెనక్కు తగ్గాడు. తరువాత జోబైడెన్‌ ఎన్నికను గుర్తించకుండా తన అనుచరులతో అమెరికా అధ్యక్ష కేంద్రం మీద దాడి చేయించిన సంగతి తెలిసిందే. తన ప్రసంగంలో రహస్య పత్రాలంటూ కొన్నింటిని పేర్కొంటూ రష్యా, చైనా, ఇరాన్‌, ఉత్తర కొరియా దేశాల నుంచి, కొన్ని సంస్థలు ఎన్నికల్లో జోక్యం చేసుకొనేందుకు చూస్తున్నాయని ట్రంప్‌ ఆరోపించాడు. అయితే ఎలా అన్నది మాత్రం చెప్పలేదు. తెలుగునాట ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్ల పట్ల వ్యవహరించిన తీరును చూశాము. ప్రజాస్వామ్యానికి, భావప్రకటనా స్వేచ్చకు నిలయమని ఊదరగొట్టే అమెరికాలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఎవరి ఎజెండా వారికి వుంది. తనకు వ్యతిరేకంగా ఎబిసి, ఎన్‌బిసి మీడియా సంస్థలు కుట్రలో భాగస్వాములని, తన ప్రసంగాలను ప్రత్యక్ష ప్రసారం చేయటం లేదని ట్రంప్‌ ఆరోపించాడు. వాటి లైసన్సు రద్దు చేస్తామని బెదిరించాడు. మధ్యంతర ఎన్నికల్లో గెలిచేందుకు ట్రంప్‌ ఇరాన్ను ఒక అంశంగా ఎంచుకున్నాడు.

సోవియట్‌తో జరిగిన ప్రచ్ఛన్న యుద్ధంలో అణుబూచిని చూపి ఓటర్లను ఆకట్టుకోవటం నాటి ఎజెండాలలో ఒకటి. టెహరాన్‌ విషయంలో అది తిరగబడింది. దాని బదులు అనూహ్యంగా హార్ముజ్‌ జలసంధిపై అదుపు ప్రతిష్టాత్మకంగా మార్చు కొని ఇరుక్కుపోయాడు. రెండవది పాతబడిన రోత ప్రచారం కమ్యూనిస్టు వ్యతిరేకత, సోవియట్‌ లేదు గనుక దాని స్థానంలో చైనా కుట్ర అంటూ రెచ్చగొట్టటం. చిత్రం ఏమిటంటే అమెరికాలో కమ్యూనిస్టు పార్టీ ఉన్నప్పటికీ అది అక్కడి పాలక పార్టీలను సవాలు చేసే స్థితిలో లేదు. అందుకే డెమోక్రటిక్‌ సోషలిస్టులను కమ్యూనిస్టులుగా చిత్రించి ట్రంప్‌ దాడి చేస్తున్నాడు.

అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకుంటున్నట్లు చేసిన ఆరోపణలను చైనా గట్టిగా తిరస్కరించింది. ప్రతిపక్ష డెమోక్రాట్ల చేతిలో ఓటమిని ఎదుర్కోలేక గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్లు తిప్పి కొట్టింది. ఇరవై రెండు కోట్ల మంది ఓటర్ల వివరాలను చైనా సంపాదించిందని, గతంలో అధికారానికి వచ్చినప్పటి నుంచీ అమెరికా మీడియాలో తనకు వ్యతిరేకంగా రాసేందుకు జర్నలిస్టులకు డబ్బు ఇస్తున్నదని, వాణిజ్య వేత్తలను తనకు వ్యతిరేకంగా తయారు చేస్తున్నదని ట్రంప్‌ తాజా ప్రసంగంలో ఆరోపించాడు. చైనా వాణిజ్యాన్ని సవాలు చేసిన తొలి అధ్యక్షుడిగా తాను ఉన్నందుకు గాను 2018లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కూడా చైనా జోక్యం చేసుకున్నదని అదే ఏడాది భద్రతా మండలికి ట్రంప్‌ ఫిర్యాదు చేశాడు. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న చైనా ప్రతినిధి రుజువులు చూపాలంటూ సవాలు చేశాడు, ఎలాంటి ఆధారాలను అమెరికా చూపలేకపోయింది. మే నెలలో బీజింగ్‌ పర్యటనకు వెళ్లిన ట్రంప్‌ ఆహ్వానం మేరకు సెప్టెంబరులో చైనా నేత సీ జిన్‌పింగ్‌ అమెరికా పర్యటనకు వస్తారని చెబుతున్న నేపథ్యంలో ఇలాంటి ఆరోపణలు ట్రంప్‌ నోటి నుంచి వెలువడటం అతగాడి సంస్కారాన్ని వెల్లడిస్తున్నది.

mkr

ఎం. కోటేశ్వరరావు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్