దేశ భద్రత, సర్వతోముఖాభివృద్ధికి ఎంతో కీలకమైన అంతరిక్ష రంగాన్నీ ప్రైవేటు శక్తులకు అప్పగించేందుకు సాగుతున్న యత్నాలు ఆందోళనకరం. స్కైరూట్ ఏరోస్పేస్ నిర్మించిన విక్రమ్-1 రాకెట్ ను ఇటీవల శ్రీహరికోట నుండి ప్రయోగించడం భారత అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ రంగం చేతుల్లో పెట్టే తొలి ప్రయత్నమే. ఈ ప్రయోగాన్ని కీర్తిస్తూ గోడీ మీడియా కథనాలు రాసిన సమయంలోనే 120 మందికిపైగా ఇస్రో శాస్ర్తవేత్తలు రాజీనామా లేదా ఉద్యోగ విరమణ చేయడం గగన్‌యాన్, చంద్రయాన్ - 4 సహా అనేక కీలక ప్రాజెక్టులకు ఎదురుదెబ్బ.
దాదాపు ఆరు దశాబ్దాలుగా, భారతదేశంలో అంతరిక్ష ప్రయోగ కార్యకలాపాలపై ప్రభుత్వరంగంలోని ఇస్రో కీలక భూమిక పోషించింది. ఆ సంస్థ చేసిన కృషి శాస్త్ర, సాంకేతికరంగంలో తిరుగులేని విజయాలను అందించడంతోపాటు సామాజిక రంగంలోనూ తనదైన ముద్ర వేసింది. ప్రైవేట్ సంస్థలు కేవలం సరఫరాదారులుగా ఉన్నాయి. రక్షణ సహా సమస్త రంగాలనూ ప్రైవేటు శక్తుల గుప్పెట్లో పెడుతున్న మోడీ సర్కారు కన్ను ఇస్రోపైనా పడింది. 2020 నాటి సంస్కరణలు, 2023 అంతరిక్ష విధానం వాణిజ్య సంస్థలకు తలుపులు బార్లా తెరిచాయి. ప్రయోగ వాహనాలలో 49% వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డిఐ) ఆటోమేటిక్ రూట్ ద్వారా 2024లో అనుమతించడం ఇందులో భాగమే. ఉపగ్రహ తయారీ, కమ్యూనికేషన్లు, నావిగేషన్, భూ పరిశీలనతో పాటు, 2033 నాటికి జాతీయ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను సుమారు 8 బిలియన్ డాలర్ల నుండి 44 బిలియన్ డాలర్లకు పెంచాలన్న లక్ష్యంలో భాగంగానే ప్రైవేటు శక్తులను ప్రోత్సహిస్తున్నట్లు కేంద్రం చెబుతోంది. దశాబ్దాలపాటు ఎంతో అంకిత భావంతో కృషి చేసి ఇస్రోను ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ప్రపంచంలో నిలిపిన ఘనత శాస్త్రవేత్తలదే. ఇస్రోను మరింతగా ప్రోత్సహించి, తగినన్ని నిధులు కేటాయించి అభివృద్ధి చేయడానికి బదులుగా... కార్పొరేట్, ప్రైవేటు శక్తుల చేతుల్లో పెట్టేలా నిబంధనలను ఒక్కొక్కటిగా సడలించడం ప్రభుత్వరంగంలోని సంస్థను నాశనం చేయడమే కాదు దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించడమే.
ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష రంగంలో ప్రైవేటు శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెడుతున్న సంస్థల్లో ఇస్రో ఉంది. ఇప్పుడు స్కైరూట్ ఇంజనీరింగ్‌లో ప్రైవేటు సంస్థకు భాగస్వామ్యం కల్పించిన మూడో దేశం. ఇప్పటికే స్పేస్ ఎక్స్, రాకెట్ ల్యాబ్ వంటి సంస్థలు ఈ రంగంలో ఉన్నాయి. ఈ ఏడాది జూన్‌లో స్పేస్ ఎక్స్ షేర్లను స్టాక్ మార్కెట్లో పెట్టిన ఎలన్ మస్క్ ప్రపంచంలోనే తొలి ట్రిలియన్ డాలర్ల (రూ.65 లక్షల కోట్ల) సంపద కలిగిన వ్యక్తి అయ్యాడు. దేశ భద్రత, అభివృద్ధి, సామాజిక ప్రయోజనాల కోసం ఇలాంటి సంస్థలు పనిచేయవన్నది జగద్విదితమే. అంతేకాదు ఇలాంటి సంస్థలు పోటీగా రావడంతోపాటు అత్యధిక జీతాలను ప్రకటించి ఇస్రోలాంటి సంస్థల్లో శాస్త్రవేత్తలను ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే ఇస్రో నుంచి 120 మందికిపైగా రాజీనామా చేశారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యమే ఈ నిష్క్రమణలకు కారణం. దీని ప్రభావం ఆ సంస్థపై తీవ్రంగా పడుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో ‘స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్’ వంటి కీలక సాంకేతిక ప్రయోగాలు ఆలస్యమయ్యాయి. ‘గగన్‌యాన్ జి-1’, ‘ఎస్‌ఎస్‌ఎల్‌వి-ఎల్1’ వంటి ప్రాజెక్టుల షెడ్యూల్ ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది. చంద్రయాన్ - 3, ఆదిత్య ఎల్ 1 వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను విజయవంతం చేసిన ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ సోమనాధ్ ఇటీవల చెన్నైకు చెందిన అగ్నికుల్ కాస్మోస్ స్టార్టప్‌లో చేరారు. ఇదే ఒరవడి కొనసాగితే ఇస్రో నిర్వీర్యమయ్యే పరిస్థితి. ఇస్రో విజయాలను తన విజయాలుగా ప్రచారం చేసుకునే మోడీ సర్కారుకు ఆ సంస్థకు ఆర్థికపరమైన భరోసా ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది. ప్రైవేటుకు పోటీగా వేతనాలను పెంచడం, వాటిని సక్రమంగా అందించడానికి ఇస్రో ప్రణాళికలను రూపొందించుకునేలా ఆర్థికపరమైన కేటాయింపులు చేయాలి. వాస్తవం ఇలావుండగా ప్రైవేటురంగం ద్వారా అంతరిక్ష కార్యకలాపాలను పెంచాలన్న రీతిలో కేంద్ర ప్రభుత్వం, గోడీ మీడియా యత్నించడం దారుణం. ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు హైదరాబాద్ కేంద్రంగా రూపొందించిన విక్రమ్-1 ప్రయోగం ఇంజనీరింగ్ విజయం. దీన్ని వాణిజ్యానికి ముడిపెట్టి ప్రభుత్వ రంగంలోని ఇస్రోకు ముప్పు తీసుకురావడం దేశ భవిష్యత్‌కు గొడ్డలిపెట్టు.







కామెంట్‌లు (0)