రోడ్డు ప్రమాదాలు, క్రీడల్లో గాయాలు, నీటిలో దూకే సమయంలో జరిగే ప్రమాదాలు... ఇలాంటి అనేక కారణాల వల్ల వెన్నుపాము దెబ్బతిని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పక్షవాతంతో జీవిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రతి ఏడాది 2.5 లక్షల నుంచి 5 లక్షల మంది కొత్తగా వెన్నుపాము గాయాలకు గురవుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు కోటిన్నర మంది ఈ సమస్యతో జీవిస్తున్నారు. వీరిలో చాలామందికి నడవడం కంటే ముందుగా చేతులు పనిచేయడం, స్పర్శ తిరిగి రావడమే అత్యంత ముఖ్యమైన అవసరంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే చేతులు పనిచేస్తే తినడం, బట్టలు ధరించడం, ముఖం కడుక్కోవడం, ఫోన్ వాడటం వంటి రోజువారీ పనులు స్వయంగా చేసుకునే అవకాశం లభిస్తుంది.
ఈ నేపథ్యంలో అమెరికా శాస్త్రవేత్తలు సాధించిన విజయం వైద్యరంగంలో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. మెదడు–కంప్యూటర్ అనుసంధాన సాంకేతికతను విద్యుత్ ప్రేరణతో కలిపి రూపొందించిన ప్రత్యేక వ్యవస్థ ద్వారా పక్షవాతానికి గురైన వ్యక్తిలో చేతుల బలం, కదలికలను పెంచడమే కాకుండా, నాలుగేళ్ల తర్వాత స్పర్శను కూడా తిరిగి తీసుకురావడంలో వారు విజయం సాధించారు. ఈ పరిశోధన ఫలితాలు ప్రపంచ ప్రఖ్యాత 'నేచర్ మెడిసిన్' పత్రికలో 2026 జూలైలో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనానికి అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో ఉన్న నార్త్‌వెల్ హెల్త్‌కు చెందిన ఫెయిన్‌స్టీన్ ఇన్‌స్టిట్యూట్స్ ఫర్ మెడికల్ రీసెర్చ్‌లో బయోఎలక్ట్రానిక్ మెడిసిన్ పరిశోధకుడు డాక్టర్ చాడ్ బౌటన్ నాయకత్వం వహించారు. మెదడు, నరాల వ్యవస్థల మధ్య తెగిపోయిన సమాచార మార్గాలను సాంకేతికతతో పునరుద్ధరించడంపై ఆయన దాదాపు రెండు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు. మెదడు–కంప్యూటర్ అనుసంధాన వ్యవస్థల అభివృద్ధిలో ఆయన ప్రపంచ ప్రముఖ శాస్త్రవేత్తల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.
మెదడు నుంచి చేతికి ...
ఈ పరిశోధనలో పాల్గొన్న వ్యక్తి కీత్ థామస్. అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రానికి చెందిన ఆయన వయసు 42 సంవత్సరాలు. 2020లో నీటిలోకి దూకినప్పుడు జరిగిన ప్రమాదంలో మెడ కింది భాగం పూర్తిగా పక్షవాతానికి గురైంది. వెన్నుపాము తీవ్రంగా దెబ్బతినడంతో మెదడు నుంచి చేతులు, కాళ్లకు వెళ్లాల్సిన నరాల సంకేతాలు నిలిచిపోయాయి. ప్రమాదం తర్వాత ఆయన చేతులను ముఖం వరకు ఎత్తలేకపోయారు. మణికట్టు, వేళ్లలో స్పర్శ పూర్తిగా కోల్పోయారు. ముక్కు గోకడం, కళ్లను తుడుచుకోవడం, చెంచాతో తినడం వంటి చిన్నచిన్న పనులు కూడా ఇతరుల సహాయం లేకుండా చేయలేని పరిస్థితి ఏర్పడింది.
ఈ సమస్యకు పరిష్కారంగా పరిశోధకులు 'డబుల్ న్యూరల్ బైపాస్' అనే వినూత్న వ్యవస్థను అభివృద్ధి చేశారు. వెన్నుపాము దెబ్బతినడంతో తెగిపోయిన సమాచార మార్గానికి ప్రత్యామ్నాయంగా మరో రెండు మార్గాలను సృష్టించడం వల్ల దీనికి ఈ పేరు పెట్టారు. దీని కోసం కీత్ మెదడులో ఐదు సూక్ష్మ ఎలక్ట్రోడ్ సముదాయాలను శస్త్రచికిత్స ద్వారా అమర్చారు. ఇవి మెదడు ఉత్పత్తి చేసే విద్యుత్ సంకేతాలను అత్యంత సూక్ష్మస్థాయిలో గుర్తిస్తాయి. మరోవైపు మెడ, చేతులపై ప్రత్యేక విద్యుత్ ప్రేరణ ప్యాచ్‌లను అమర్చారు. ఇవి చర్మం ద్వారా వెన్నుపాము, కండరాలకు విద్యుత్ సంకేతాలను పంపిస్తాయి. కీత్ తన చేతిని కదిలిస్తున్నానని లేదా ఎవరైనా తన చేతిని తాకుతున్నారని ఊహించినప్పుడు మెదడులో ఏర్పడే సంకేతాలను కంప్యూటర్ నమోదు చేసింది. కృత్రిమ మేధ ఆధారిత ప్రత్యేక కంప్యూటర్ వ్యవస్థ ఆ సంకేతాలను క్షణాల్లో విశ్లేషించి చర్మంపై ఉన్న విద్యుత్ ప్యాచ్‌లకు పంపించింది. అదే సమయంలో మెదడులో స్పర్శను గుర్తించే భాగానికీ విద్యుత్ ప్రేరణ అందించింది. ఇలా మెదడు నుంచి కండరాలకు, అలాగే చర్మం నుంచి మెదడుకు సమాచారాన్ని చేరవేసే రెండు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేశారు.
ఇందులో మరో ముఖ్యమైన అంశం 'న్యూరోప్లాస్టిసిటీ'. అంటే మన మెదడు, నరాల వ్యవస్థ కొత్త పరిస్థితులకు అనుగుణంగా కొత్త అనుసంధానాలను ఏర్పరచుకునే సహజ సామర్థ్యం. ఈ వ్యవస్థ ఆ సామర్థ్యాన్ని మరింత ఉత్తేజపరిచేలా రూపొందించారు. అందువల్ల ఇది కేవలం యంత్ర సహాయంతో పనిచేయడమే కాకుండా, శరీరంలోని నరాల వ్యవస్థ మళ్లీ నేర్చుకునే అవకాశాన్ని కూడా పెంచింది.
కీత్ ఈ వ్యవస్థను 35 వారాలపాటు ఉపయోగించారు. ఫలితాలు పరిశోధకుల అంచనాలను మించిపోయాయి. ఆయన కుడి చేతి బలం 86 శాతం, ఎడమ చేతి బలం 62 శాతం పెరిగింది. ముందుగా చేయలేని అనేక పనులు స్వయంగా చేయడం ప్రారంభించారు. ముక్కు తుడుచుకోవడం, ముఖం గోకడం, కళ్లను తుడుచుకోవడం వంటి రోజువారీ పనులు చేయగలిగారు. కోడిగుడ్డును పగలకుండా ఎత్తిపట్టేంత సున్నితమైన కదలికలను కూడా 87 శాతం విజయవంతంగా చేయగలిగారు. అంటే బలం పెరగడమే కాదు, చేతి కదలికలపై నియంత్రణ కూడా గణనీయంగా మెరుగుపడింది. ఈ పరిశోధనలో అత్యంత ఆశ్చర్యపరిచిన విషయం స్పర్శ తిరిగి రావడమే. చికిత్స ప్రారంభమైన దాదాపు ఆరు నెలల తర్వాత కీత్ తన కుడి మణికట్టులో స్పర్శను అనుభవించడం ప్రారంభించారు. ప్రమాదం జరిగిన తర్వాత నాలుగేళ్లుగా పూర్తిగా కోల్పోయిన అనుభూతి మళ్లీ రావడం పరిశోధకులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. "నా సోదరి చేతిని మళ్లీ అనుభూతి చెందగలిగాను. నా పెంపుడు కుక్క బొచ్చును తాకినప్పుడు అది ఎలా ఉంటుందో మళ్లీ తెలిసింది. ఈ సాంకేతికత నాకు కేవలం చేతుల కదలికలనే కాదు, నా జీవితాన్నే తిరిగి ఇచ్చింది" అని కీత్ భావోద్వేగంగా చెప్పారు.
ప్రస్తుతం ఈ పరిశోధన ఒకే వ్యక్తిపై నిర్వహించినప్పటికీ, దీని ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా పక్షవాతంతో జీవిస్తున్న కోటిన్నర మందికి కొత్త ఆశను కలిగిస్తున్నాయి. భవిష్యత్తులో మరింత మంది రోగులపై పరీక్షలు విజయవంతమైతే, వెన్నుపాము గాయాలతో జీవితాంతం ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి కొంతవరకు మారే అవకాశం ఉంది.







కామెంట్‌లు (0)