టీనేజ్ వయసులో పిల్లల ప్రవర్తనలో అనేక మార్పులు కనిపిస్తుంటాయి. మూడీగా ఉండటం, చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం వంటివి చేస్తుంటారు. హార్మోన్ల ప్రభావం, చదువుల ఒత్తిడి, స్నేహాలు, ఆకర్షణలు, ఇతరులతో పోల్చుకోవడం ఇందుకు కారణాలు కావొచ్చు. ఈ దశలో భావోద్వేగాలను నియంత్రించుకోవడం, తొందరపాటు నిర్ణయాలను నివారించడం కొంత కష్టంగా ఉంటుంది. అయితే ప్రతి మార్పునూ వయసు ప్రభావంగా కొట్టిపారేయకూడదు. పిల్లల ప్రవర్తనలో తేడా కనిపించినప్పుడు కోపం ప్రదర్శించకుండా, వారి మనసులో ఏముందో తెలుసుకునేందుకు ప్రయత్నించాలి.
పిల్లలు నిద్ర సరిగా లేకపోవడం, ఆహారపు అలవాట్లు మారడం, చదువుపై ఆసక్తి తగ్గడం, తరచూ ఆందోళన చెందడం వంటి లక్షణాలను తల్లిదండ్రులు గమనించాలి. పరీక్షల ఒత్తిడి, స్నేహితులతో విభేదాలు, ఆన్‌లైన్ వేధింపులు కూడా వారిని మానసికంగా ఇబ్బంది పెట్టవచ్చు. అందుకే సమస్యల వెనుక కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నించాలి.
మనసు విప్పి మాట్లాడాలి
తల్లిదండ్రులు రోజూ కొంతసేపు పిల్లలతో ప్రశాంతంగా మాట్లాడాలి. చదువులు, మార్కుల గురించే కాకుండా స్నేహితులు, పాఠశాలలో జరిగిన విషయాలు, వారికి ఎదురవుతున్న ఇబ్బందుల గురించి అడగాలి. వారు చెప్పేది మధ్యలో ఆపకుండా వినాలి. వెంటనే సలహాలు ఇవ్వడం, తప్పుబట్టడం, ఇతరులతో పోల్చడం మానుకోవాలి. మాట్లాడటానికి ఇష్టపడకపోతే బలవంతం చేయకుండా, ఎప్పుడైనా తమతో నిర్భయంగా మాట్లాడవచ్చనే భరోసా కల్పించాలి.
పిల్లలు తప్పులు చేసినప్పుడు హేళన చేయకుండా, వాటిని ఎలా సరిదిద్దుకోవాలో వివరించాలి. ప్రతి సమస్యకూ తల్లిదండ్రులే పరిష్కారం చూపడం కంటే, ఆలోచించి నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించాలి. వారు కోపంగా మాట్లాడినప్పుడు పెద్దలు కూడా అదే స్థాయిలో స్పందించకూడదు. ప్రశాంతంగా ఉన్నప్పుడు సమస్య గురించి చర్చించాలి. కోపం రావడం సహజమే అయినా, ఇతరులను బాధపెట్టడం లేదా వస్తువులను పగలగొట్టడం సరైన ప్రవర్తన కాదని తెలియజేయాలి.
ఆరోగ్యంపై శ్రద్ధ
టీనేజ్ పిల్లలకు తగినంత నిద్ర, పోషకాహారం, వ్యాయామం అవసరం. చదువుల కోసం నిద్రను తగ్గించకూడదు. రాత్రిపూట మొబైల్ వాడకం నిద్రకు ఆటంకం కలిగిస్తుంటే, కుటుంబ సభ్యులంతా కలిసి నిద్రకు ముందు ఫోన్ల వినియోగాన్ని తగ్గించాలి. ఆటలు, ఇష్టమైన వ్యాపకాలకూ సమయం కేటాయించాలి. చదువులో వెనుకబడితే ఇతరులతో పోల్చకుండా, ఏ అంశంలో ఇబ్బంది పడుతున్నారో గుర్తించి సహాయం చేయాలి. తలనొప్పి, కడుపునొప్పి వంటి సమస్యలు తరచూ వస్తే వైద్యులను సంప్రదించాలి.
పిల్లల స్నేహాలను అనుమానంతో చూడకుండా, వారి స్నేహితులు, ఆన్‌లైన్ పరిచయాల గురించి అవగాహన పెంచుకోవాలి. వ్యక్తిగత విషయాలను అందరి ముందు ప్రస్తావించకూడదు. మొబైల్ వినియోగం, చదువు, బయటకు వెళ్లడం వంటి అంశాల్లో స్పష్టమైన నియమాలు ఉండాలి. వాటిని నిర్ణయించేటప్పుడు పిల్లల అభిప్రాయాలకూ ప్రాధాన్యమివ్వాలి.
ఆడపిల్లలు రుతుక్రమ సమయంలో తీవ్రమైన కడుపునొప్పి, అలసటతో బాధపడితే వారి ఇబ్బందులను చిన్నచూపు చూడకూడదు. అవసరమైన విశ్రాంతి కల్పించాలి. నొప్పి తీవ్రంగా ఉన్నా, రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తున్నా వైద్యులను సంప్రదించాలి.
పిల్లల్లో నిరంతర విచారం, తీవ్రమైన ఆందోళన, నిద్ర లేదా ఆహారపు అలవాట్లలో గణనీయమైన మార్పులు కనిపిస్తే వాటిని టీనేజ్ ప్రభావంగా మాత్రమే భావించకూడదు. ఈ లక్షణాలు కొనసాగితే మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవాలి. తమను తాము గాయపరుచుకోవడం గురించి మాట్లాడినా, బతకాలని లేదని చెప్పినా వెంటనే స్పందించి తగిన సహాయం అందించాలి.
టీనేజ్ పిల్లలకు కావాల్సింది పర్యవేక్షణ మాత్రమే కాదు.. తమను అర్థం చేసుకునే పెద్దలు, తప్పులు చేసినా అండగా నిలిచే కుటుంబం, మనసులోని విషయాలను భయం లేకుండా చెప్పుకోగలిగే వాతావరణం. పిల్లలను తిట్టి భయపెట్టడం కంటే, వారి మాట విని సమస్యలను అర్థం చేసుకుని తోడుగా నిలవడం ముఖ్యం. ఈ భరోసా వారిలో ఆత్మవిశ్వాసాన్ని, బాధ్యతగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది.







కామెంట్‌లు (0)