సర్వ కళల సమాహారం, జనజాగృతికి సాధనం నాటకం. ఆబాలగోపాలాన్ని, పండితపామరుల్ని మెప్పించేది నాటకం. తరతరాలుగా జనజీవన వికాసానికి వెలుగు దివ్వెగా నిలుస్తూ వస్తోంది నాటకం. తెలుగు నాటక రంగంలో అతి కొద్దిమంది అత్యంత ప్రముఖులైన దర్శకుల్లో, నటుల్లో, ప్రయోక్తల్లో, సమాజ నిర్వాహకుల్లో ముందుపీఠిన ఉంటారు (అరవిందా ఆర్ట్స్, తాడేపల్లి) గంగోత్రి సాయి. నాటకం ఆయన శ్వాస, ధ్యాస, మేధస్సు, కృషి - సర్వం నాటకమే. తెలుగు నాటకానికి కొత్త వన్నెలు తెచ్చిపెట్టిన అతి కొద్దిమంది కళాకారుల్లో గంగోత్రి సాయి ప్రముఖులు. నిత్యం వినూత్న ప్రయోగాలతో, ఉన్నత విలువలతో రంగస్థలానికి తనదైన బాణీలో సొగసులు చేకూరుస్తున్న ఉన్నతస్థాయి కళాకారుడు ఆయన.
నటుడు, దర్శకుడు గంగోత్రి సాయి చలవమ్మ, రామారావు దంపతులకు రేపల్లె తాలూకా కొలగానివారిపాలెంలో 1964 జూలై 30న జన్మించారు. అసలు పేరు దాసరి చలపతిరావు. ఎం.ఏ. (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్), అనంతరం వ్యాయామ విద్య, యోగాలలో డిప్లొమా చేసి వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. 1990 సంవత్సరంలో నాటకరంగ ప్రవేశం చేసి నిర్విరామంగా కృషి చేస్తూ 2004లో "అరవిందా ఆర్ట్స్, తాడేపల్లి" పేరుతో నాటక సమాజాన్ని ప్రారంభించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నటుడిగా, దర్శకుడిగా, నాటక సంస్థ నిర్వాహకుడిగా పేరుపొందారు. నంది నాటక పోటీల్లో, వివిధ పరిషత్తుల్లో అసంఖ్యాకంగా బహుమతులు గెలుచుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టిన నాటక రంగం రుణం తీర్చుకోవడానికి నిత్యం శ్రమించే సాయి బహుముఖ ప్రజ్ఞాశాలి, నిగర్వి. అణకువ ఆయన ఆభరణం.
పాత తరం వైభవాన్ని కొత్త తరానికి అందించాలని తపన పడుతుంటారు సాయి. 2015, 2016, 2017 సంవత్సరాల్లో పరిషత్తుల సందర్భంగా తొలి తరం నాటక రచయిత కోరాడ రామచంద్ర శాస్త్రి నుంచి ఆధునిక తరం వరకూ దాదాపు 300 మంది ప్రముఖ నాటక రచయితల ఛాయాచిత్రాల ప్రదర్శన ఏర్పాటుచేశారు. పరిషత్తుకు వచ్చిన కళాకారులందరూ, బయటివారు కూడా ఈ ప్రయత్నాన్ని ఎంతగానో స్వాగతించారు. 2016లో "నాటకరంగ ప్రముఖులు" పేరిట ప్రముఖ నాటక రచయితలు, కళాకారుల సంక్షిప్త పరిచయంతో పుస్తకంగా ప్రచురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ఆవిష్కరింపజేశారు. 1880–2020 వరకూ వచ్చిన వేలాది తెలుగు నాటకాల్లో బహుళ ప్రజాదరణ పొందిన వంద నాటకాలను ఎంపిక చేసి ఆరు సంకలనాలుగా ప్రచురించడం చాలా గొప్ప టాస్క్.
తెలుగు నాటక రంగ చరిత్రలో తొలిసారిగా...
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ఉమ్మడి ఏపీ సాంస్కృతిక శాఖ సీఈఓ డా. దీర్ఘాసి విజయ్ భాస్కర్ రచించిన "మహా పురుషుడు మండలి" మకుటంతో మాజీ మంత్రి, "దివిసీమ గాంధీ"గా పేరొందిన మండలి వెంకట కృష్ణారావు జీవిత చరిత్రను నాటకంగా తొలిసారిగా డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధ (ఏ.ఐ.) అనుసంధానంతో గంగోత్రి సాయి దర్శకత్వంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దిగ్విజయంగా ప్రదర్శిస్తున్నారు "అరవిందా ఆర్ట్స్, తాడేపల్లి" బృంద సభ్యులు. దాదాపు 50 మంది నటవర్గం, సాంకేతిక నిపుణులతో ప్రదర్శిస్తున్న తొలి నాటకంగా ఇది రికార్డు పుటల్లోకి ఎక్కనుంది. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సహకారంతో ఈ నాటకం తయారైంది.
ఫొటోగ్రఫీలో అంతర్జాతీయంగా అనేకానేక బహుమతులు గెలుచుకున్న తమ్మా శ్రీనివాసరెడ్డి ఎఫ్.ఆర్.పీ.ఎస్. ఈ ప్రక్రియలో ప్రధాన భూమిక పోషించారు. డా. కె.హెచ్.ఎస్.ఎస్. సుందర్ (డిజిటల్ క్రియేషన్స్), ఎస్. శ్రీకాంత్ (ఎడిటర్) కూడా ముఖ్య భూమిక పోషించారు. మండలి జీవిత చరిత్రలో ముఖ్య ఘట్టాలు, క్విట్ ఇండియా సహా కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు, ప్రపంచాన్నే దిగ్భ్రమకు గురిచేసిన దివిసీమ ఉప్పెన ఘటనలు, నాటి పరిస్థితుల్ని కళ్లకు కట్టిన సన్నివేశాలు నాటకాన్ని అత్యున్నత స్థాయిలో నిలబెట్టాయి.
తెలుగు నాటకానికి నవ్య సామాజిక స్పృహ అనే వ్యాక్సిన్ కావాలి. ప్రజా జీవితాలను ప్రతిబింబించే కథావస్తువు, సామాజిక రుగ్మతలకు శాస్త్రీయ పరిష్కార మార్గాలతో నాటకాలు ప్రజాదరణ పొందుతాయి. నాటకాన్ని బతికించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. నాటకరంగ వికాసానికి అందరం కలసి పయనిద్దాం.
కళాకారుడు ప్రతిపక్షంగా...
సమాజానికి ఏదో ఒకటి చేయాలనే భావనతో సమాజ హితం కోసం నేను ఎంచుకున్న నాటకాలు ప్రజలను చైతన్యవంతులను చేస్తుండటం నాకు ఎంతో సంతృప్తినిస్తుంది. నాటకాన్ని కేవలం సరదా కోసం, మెప్పు పొందడం కోసం మాత్రం కాదు; నాటకాన్ని జనజాగృతికి వాడాలనుకుంటా. కళాకారుడు ప్రతిపక్షంగా వ్యవహరించాలని నా నిశ్చితాభిప్రాయం. నా జీవితం నాటకానికే అంకితం.
– గంగోత్రి సాయి
అరవిందా ఆర్ట్స్, తాడేపల్లి

ఉభయత్రా....
కొంతమంది అవార్డులు గెలుచుకుంటారు, మరికొందరు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటారు. గంగోత్రి సాయి రెండో కోవకు చెందినవారు. సాయి దర్శకత్వం వహించిన ప్రతి నాటకం, నాటిక ఆయన అంకితభావాన్ని, సృజనాత్మకతను, తెలుగు సంస్కృతిపై ఆయన ప్రగాఢమైన ప్రేమను ప్రతిబింబిస్తుంది. ఆయన ఎన్నో అవార్డులు, గుర్తింపులు అందుకున్నప్పటికీ నిరాడంబరంగా, వినయంగా ఒదిగి ఉంటారు. ఆయన ఆలోచనలు ప్రగతిశీలంగా ఉంటాయి. చాలామంది దర్శకులు విజయవంతమైన నాటకాలను సృష్టిస్తారు. కానీ కొద్దిమంది మాత్రమే విజయవంతమైన కళాకారులను తయారుచేస్తారు. సాయి ఈ రెండింటినీ సాధించారు.
- శ్రీనివాసరెడ్డి తమ్మా
నాటకరంగ అభిమాని
– జి.వి. రంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్






కామెంట్‌లు (0)