పరిస్థితులకు తగ్గట్టు ఆడే పరిపక్వత పెరిగింది.. ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి పెట్టాలి : వీవీఎస్ లక్ష్మణ్
విజయవాడ : భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ప్రతిభను బిసిసిఐ తొలిసారిగా గుర్తించింది విజయవాడలో జరిగిన టోర్నీలోనేనని మాజీ భారత క్రికెటర్, జింబాబ్వే పర్యటనకు తాత్కాలిక ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన వీవీఎస్ లక్ష్మణ్ వెల్లడించారు. బీహార్‌కు చెందిన ఈ యువ ఆటగాడు ఇటీవల జింబాబ్వేతో జరిగిన టి 20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును అందుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
దూకుడుతో పాటు పరిణతి కూడా కనిపించింది ...
వైభవ్ సహజంగా దూకుడుగా ఆడే బ్యాటర్ అయినప్పటికీ, ఈ సిరీస్‌లో పరిస్థితులను అర్థం చేసుకుని తన ఆటతీరును మార్చుకున్నాడని లక్ష్మణ్ అన్నారు. ప్రతి మ్యాచ్‌తో అనుభవం పెరుగుతుండటంతో ఆటను విశ్లేషించే సామర్థ్యం కూడా మెరుగుపడుతోందని పేర్కొన్నారు. మూడో టి 20 జరిగిన పిచ్ బ్యాటింగ్‌కు అంతగా అనుకూలంగా లేకపోయినా, జింబాబ్వే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా వైభవ్ ఏమాత్రం ఆతురపడకుండా ఓర్పుతో ఇన్నింగ్స్‌ను నిర్మించాడని కొనియాడారు. ప్రతి ప్రాక్టీస్ సెషన్ అనంతరం తన ఆటను సమీక్షించుకోవడం అతడి అభివృద్ధికి దోహదపడుతోందని చెప్పారు.
విజయవాడలోనే తొలి గుర్తింపు
వైభవ్‌ను రెండున్నరేళ్ల క్రితమే తాము గమనించామని లక్ష్మణ్ గుర్తు చేశారు. 2024 అండర్-19 ప్రపంచకప్‌కు ముందు విజయవాడలో నిర్వహించిన క్వాడ్రపుల్ సిరీస్‌లో ఇండియా-బి జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వైభవ్ నిలిచాడని తెలిపారు. అప్పట్లో ఎలా నిర్భయంగా బ్యాటింగ్ చేశాడో, ఇప్పటికీ అదే దూకుడు కొనసాగిస్తున్నాడని, అయితే ఇప్పుడు మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా తన ఆటను మలుచుకునే పరిపక్వతను కూడా అలవర్చుకున్నాడని ప్రశంసించారు.
ఫిట్‌నెస్‌పై మరింత శ్రద్ధ అవసరం
వైభవ్ ఆటతీరులో పెద్దగా మార్పులు అవసరం లేదని, అయితే ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. చిన్న వయసులోనే అతడు ఎంతో ప్రతిభ కనబరుస్తున్నాడని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవడం కీలకమని సూచించారు. మూడో టి 20లో క్యాచ్ అందుకునే ప్రయత్నంలో గాయపడినప్పటికీ, మైదానం వీడేందుకు ఆసక్తి చూపలేదని, ఫిజియో సూచించినా జట్టుతోనే ఉండాలని పట్టుదల ప్రదర్శించాడని తెలిపారు. ఆటపై అతడికి ఉన్న అంకితభావం ప్రశంసనీయమైనదేనని, అయితే దీర్ఘకాలిక కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని లక్ష్మణ్ సూచించారు.







కామెంట్‌లు (0)