బాల్య వివాహం జరిపించిన వారిపై, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ప్రజాశక్తి-బైరెడ్డిపల్లె (చిత్తూరు) : బైరెడ్డిపల్లె మండలం చెప్పిడిపల్లె పంచాయతీ పరిధిలోని జంగాల అగ్రహారం గ్రామంలో మైనర్ బాలిక అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన తీవ్ర విషాదానికి దారితీసింది. సోమవారం కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు .... తమిళనాడులోని గుడియత్తం తాలూకా కస్ప గ్రామానికి చెందిన పత్తి అనే మైనర్ బాలికను జంగాల అగ్రహారం గ్రామానికి చెందిన దేవరాజులు కుమారుడు రాఘవ ప్రేమ పేరుతో మూడు నెలల క్రితం తన గ్రామానికి తీసుకువచ్చినట్లు సమాచారం.
ఈ విషయం బయటకు రాకుండా కొందరు గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని, బాలిక మైనర్ అయినప్పటికీ వారిద్దరికీ వివాహం జరిపించినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే వివాహం జరిగిన మూడు నెలలు కూడా గడవకముందే బాలిక అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బాలిక మృతికి భర్త రాఘవ, అతని తండ్రి దేవరాజులు, కుటుంబ సభ్యులే కారణమని ఆరోపిస్తున్నారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న బైరెడ్డిపల్లె పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఘటన నేపథ్యంలో మైనర్ బాలికను ప్రేమ పేరుతో తీసుకువచ్చి వివాహం జరిపించినవారిపై, బాల్య వివాహానికి సహకరించిన వ్యక్తులపై, అలాగే చట్టాన్ని ఉల్లంఘించిన బాధ్యులపై సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బాల్య వివాహాలు నిరోధించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాలను కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యుల ఆరోపణల ఆధారంగా ఈ వివరాలు వెలువడ్డాయి. పోలీసుల దర్యాప్తు, అధికారిక విచారణ అనంతరం వాస్తవాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది.







కామెంట్‌లు (0)