భారత రాజ్యాంగం సమానత్వం, గౌరవప్రదమైన జీవనం, సామాజిక న్యాయాన్ని హామీ ఇచ్చింది. అంటరానితనాన్ని నిషేధించింది. అయినప్పటికీ దశాబ్దాలు గడిచినా మన రాష్ట్రంలోని దళితవాడల్లో భూమి, ఇళ్ల స్థలాలు, శ్మశాన వాటికలు, తాగునీరు, రోడ్లు, విద్య, వైద్యం, ఉపాధి వంటి కనీస అవసరాలు అందని పరిస్థితి కొనసాగుతోంది. కుల వివక్ష, అంటరానితనం, సామాజిక బహిష్కరణ వంటి సమస్యలు కొనసాగుతున్నాయి.
ఈ నెల 24 నుండి చేపట్టిన “సామాజిక శంఖారావం–కుల వివక్ష లేని సమాజం కోసం” కార్యక్రమం ఈ సమస్యలను మరింతగా వెలుగులోకి తెచ్చింది. 26 జిల్లాలు, 380 మండలాలు, 1,243 గ్రామాలు, 63 పట్టణాలు, 236 వార్డుల్లోని దళిత వాడల్లో పర్యటించాము. 960 శ్మశాన వాటిక సమస్యలు, 405 ఇళ్ల స్థలాల సమస్యలు, 302 భూ సమస్యలు మా బృందాల దృష్టికి వచ్చాయి. ఇవి కేవలం గణాంకాలు కావు. ప్రతి సంఖ్య వెనుక అనేక కుటుంబాలు, వారి జీవితాలు, రాజ్యాంగ హక్కు ఉల్లంఘన ఉంది.
ప్రతి దళితవాడకు శ్మశాన వాటిక
అత్యధికంగా వెలుగులోకి వచ్చిన సమస్య శ్మశాన వాటికలది. అనేక దళితవాడల్లో ప్రత్యేక శ్మశాన స్థలాలు లేవు. ఉన్న భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. కొన్ని చోట్ల శ్మశాన వాటికలకు రహదారులు కూడా లేవు. జీఓ 1235ను సమర్థవంతంగా అమలు చేసి ప్రతి దళితవాడకు ప్రత్యేక శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలి. అంతిమ కార్యక్రమానికి కూడా ఆందోళనలు చేయాల్సిన స్థితి అనేక జిల్లాల్లో ఉంది.
దళితుల భూములకు రక్షణ
దళిత కుటుంబాల ఆర్థిక స్వావలంబనకు భూమి ప్రధాన ఆధారం. అయితే అసైన్డ్ భూముల ఆక్రమణ, పట్టాలు లేకపోవడం, రికార్డుల్లో భూములు నమోదు కాకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. దళితుల భూములపై సమగ్ర సర్వే నిర్వహించి అర్హులకు పట్టాలు ఇవ్వాలి. ఆక్రమిత భూములను తిరిగి స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించాలి. భూమిలేని దళిత కుటుంబాలకు భూమి పంపిణీ చేయాలి. కోనేరు రంగారావు కమిషన్ సిఫారసులను అమలు చేయాలి. అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి ఇళ్ల స్థలం, ఇంటి పట్టా ఇవ్వడంతో పాటు గృహ నిర్మాణానికి తగిన ఆర్థిక సహాయం అందించాలి.
సబ్‌ప్లాన్ నిధులు పూర్తిగా ఖర్చు చేయాలి
ఎస్.సి జనాభా నిష్పత్తికి అనుగుణంగా సబ్‌ప్లాన్ నిధుల కేటాయింపులు చెయ్యాలి. పుస్తకాల్లో కేటాయింపులు వున్నా ఆచరణలో ఆ నిధులు దారి మళ్ళుతున్నాయి. సకాలంలో విడుదల చేసి పూర్తిగా ఖర్చు చేయాలి.
కులవివక్షకు అడ్డుకట్ట వేద్దాం
అధ్యయనంలో దేవాలయ ప్రవేశానికి నిరాకరణ, క్షవరం చేయకపోవడం, టీ దుకాణాలు - హోటళ్లలో వివక్ష, సామాజిక ప్రదేశాల్లో సమానంగా కూర్చోనివ్వకపోవడం, ఫంక్షన్లలో వేరుగా భోజనం పెట్టడం వంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అంటరానితనం రాజ్యాంగ విరుద్ధమైనప్పటికీ ఇటువంటి ఘటనలు కొనసాగడం ఆందోళనకరం. కులవివక్ష, అంటరానితనం, సామాజిక బహిష్కరణ, దళితులపై దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాధితులకు రక్షణ, పరిహారం, న్యాయ సహాయం, న్యాయం అందించాలి. జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులను అమలు చేయాలి.
విద్య, వైద్యం, ఉపాధి హక్కులు
అన్ని దళితవాడల్లో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు లేవు. అవసరమైన చోట వాటిని ఏర్పాటు చేయాలి. ఎస్.సి హాస్టళ్లను బలోపేతం చేసి శిథిల భవనాలను మరమ్మతు చేయాలి. ఖాళీ పోస్టులు, బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలి. దళిత యువతకు నైపుణ్య శిక్షణ, ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలి.
ఉపాధి హామీ పనుల్లో దళిత కుటుంబాలకు వివక్ష లేకుండా పని కల్పించి పెండింగ్ కూలీ బిల్లులు చెల్లించాలి. దళిత, గిరిజన కౌలు రైతులను గుర్తించి రైతు సంక్షేమ పథకాలు, పంట రుణాలు, పెట్టుబడి సహాయం అందించాలి.
కార్మికుల సమస్యలూ పరిష్కరించాలి
రాష్ట్రంలో దళిత, గిరిజన, బలహీన వర్గాలకు చెందిన కార్మికులు తక్కువ వేతనాలతో ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు తక్కువ వేతనాలు, జీతాల చెల్లింపులో జాప్యం వంటి సమస్యలు ఉన్నాయి. కనీస వేతనాలు అమలు చేసి, సకాలంలో జీతాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
అర్జీలు పరిష్కారాలుగా మారాలి
ఈ నెల 24న రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన “సామాజిక శంఖారావం–చలో కలెక్టరేట్” కార్యక్రమంలో వేలాది మంది దళితులు అర్జీలతో కలెక్టరేట్లకు తరలివచ్చారు. శ్మశాన వాటికలు, భూములు, ఇళ్ల స్థలాలు, తాగునీరు, రోడ్లు, విద్యుత్, విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, కుల వివక్ష తదితర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అర్జీలు స్వీకరించడం మాత్రమే పరిష్కారం కాదు. ప్రతి అర్జీపై చర్య తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించి, ప్రతి సమస్యకు బాధ్యత వహించే శాఖ, అధికారి, నిధుల కేటాయింపు, పనుల ప్రారంభం, కాల పరిమితి నిర్ణయించాలి. అర్జీలు ఫైళ్లలో పడి మరుగున పడకుండా పరిష్కారాలుగా మారాలి.
కులవివక్ష లేని సమాజం ఒక్క దళితుల కోరిక మాత్రమే కాదు. అది భారత రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యం. దళితులకు శ్మశాన వాటిక నుంచి భూమి వరకు, ఇళ్ల స్థలం నుంచి విద్య వరకు, వైద్యం నుంచి ఉపాధి వరకు, సామాజిక గౌరవం నుంచి సమాన అవకాశాల వరకు అన్ని హక్కులూ అమలు కావాలి. అంతవరకు సామాజిక శంఖారావం కొనసాగుతుంది.

-వ్యాసకర్త : కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి,
సెల్: 9490300366 /







కామెంట్‌లు (0)