మంగళవారం, 27 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅమ్మ కష్టం తగ్గించాలని.. అట్టముక్కలతో రోబో!

8 గంటల క్రితం

అమ్మ కష్టం తగ్గించాలని...
 అట్టముక్కలతో రోబో! image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026, 06:25 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

అమ్మకు వంట పనుల్లో, ఇంటి పనుల్లో సాయం చేసే పిల్లలు చాలామంది ఉంటారు. స్కూలుకు వెళ్లేంతవరకు తమకు వీలైనన్ని పనులు చేసి అమ్మ కష్టాన్ని కొంతైనా తగ్గించాలన్నది ఆ పిల్లల ఆరాటం. కేరళకు చెందిన 12 ఏళ్ల లెవిన్‌ ‌పౌలోస్‌ కూడా అలాంటి పిల్లాడే.. అయితే అందరిలా స్వయంగా పనులు చేస్తూనే, తను స్కూలుకు వెళ్లినప్పుడు కూడా అమ్మకు సాయం చేయాలనుకున్నాడు. అంట్లు తోమడం, ఇల్లు తుడవడం, ఊడ్వడం, వంట చేయడం, ఫ్యాను స్విచ్‌ ‌వేయడం, కర్టెన్‌ ‌తీయడం వంటి పనులన్నింటిలో అమ్మకు ఉపయోగపడే చిన్న చిన్న యంత్రాలను తయారుచేసేశాడు. ఇంట్లోనే ఓ మూల ఏర్పాటు చేసుకున్న ప్రయోగశాలలో అట్టముక్కలు, పాత వైర్లు, చిన్న మోటార్లు, బ్యాటరీలు తదితర వస్తువులతో ఎంచక్కా ‌బుల్లి బుల్లి మిషన్లు, రోబోలు ఆవిష్కరించాడు. లెవిన్‌ ‌చేసిన ఈ ప్రయోగాలు సోషల్‌ ‌మీడియాలో బాగా వైరల్‌ అయ్యాయి. కేరళ ముఖ్యమంత్రి తనను పిలిచి అభినందించేంత వరకు అవి చేరాయి.

​లెవిన్‌ రూపొందించిన పరికరాల్లో వంట చేసేటప్పుడు ఆహార పదార్థాలను వాటంతట అవే కలిపే ఆటోమేటిక్‌ స్టిరర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వంట చేసేటప్పుడు పాత్రలోని పదార్థాలను నిరంతరం కలపడం కనిపించని శ్రమ. వంట చేసేవారికి మాత్రమే అది తెలుసు. అమ్మ పడుతున్న ఈ కష్టాన్ని చూసే లెవిన్‌ ఈ పరికరాన్ని కనిపెట్టాడు. మోటారు ఆధారంగా దీన్ని రూపొందించాడు. అలాగే ఇంట్లో నేలను శుభ్రం చేసేందుకు ఉపయోగపడే చిన్న వాక్యూమ్‌ క్లీనర్‌ను కూడా తయారు చేశాడు. కర్టెన్లను చేతితో లాగాల్సిన అవసరం లేకుండా రిమోట్‌ సాయంతో తెరవడానికి, మూయడానికి వీలుగా మరో పరికరాన్ని ఆవిష్కరించాడు. నీటిని ఒకచోటు నుంచి మరోచోటుకు తీసుకువచ్చే యంత్రం, బ్యాటరీతో పనిచేసే రోటీ తయారీ పరికరం, ఫ్యాన్‌ను దూరం నుంచి ఆన్‌ చేయడానికి ఉపయోగపడే రిమోట్‌ వంటి ప్రయోగాలు ఎన్నింటినో లెవిన్‌ ‌చేశాడు.

​ఎర్నాకుళం జిల్లాలోని పిరవం ప్రాంతానికి చెందిన లెవిన్‌ సాధారణ కుటుంబ నుంచి వచ్చాడు. మేకల పెంపకం, వ్యవసాయం లెవిన్‌ ‌కుటుంబ ప్రధాన ఆదాయ వనరులు. లెవిన్‌ ఇంట్లో ఉన్న ప్రయోగశాల ‌నిండా కార్డ్‌బోర్డు, వైర్లు, బ్యాటరీలు, నట్స్‌, బోల్టులు, చిన్న ఎలక్ట్రిక్‌ మోటార్లు కనిపిస్తాయి. అవసరానికి తగినట్లు ఒకదానికొకటి అమర్చి కొత్త పరికరాలను తయారు చేయడం, ఒకే మోటారును వేర్వేరు ప్రయోగాల్లో ఉపయోగిస్తున్న లెవిన్‌‌లో గొప్ప ఆవిష్కరణవేత్త మాత్రమే కాదు. ఆర్థికవేత్త కూడా కనిపిస్తాడు. తల్లి పనిని తగ్గించాలనే ఆలోచనతో మొదలైన లెవిన్‌ ప్రయోగాలు రోబోటిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌పై ‌తనకున్న ఆసక్తిని తెలియజేస్తున్నాయి. లెవిన్‌ ‌తయారు చేసిన ఈ పరికరాలు మార్కెట్లో అమ్ముడయ్యే ఉత్పత్తులు కావు. కానీ వాటి వెనుక.. అమ్మ కష్టం తీర్చాలన్న కొడుకు తపన ఉంది. చిన్న వయసులోనే మేధావుల మాదిరి ఆలోచించే లెవిన్‌ సృజనాత్మకతను ‌సోషల్‌ ‌మీడియా వేదికగా అందరూ ప్రశంసిస్తున్నారు. లెవిన్‌ ‌ప్రతిభకు దక్కుతున్న ఈ ప్రశంసలు మనకు ఎన్నో పాఠాలు చెబుతున్నాయి. పిల్లల్లో ప్రతిభను గుర్తించడం అంటే వారి విజయాలను ప్రశంసించడంతోనే ఆగిపోకూడదు. ప్రయోగాలు చేసేందుకు వారికి మరిన్ని అవకాశాలు కల్పించాలి. తప్పుల నుంచి నేర్చుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. వారి ఆలోచనలను ప్రోత్సహించాలి. లెవిన్‌ ప్రయోగాలు చెబుతున్నది అదే. ఆవిష్కరణకు మొదటి అడుగు ఖరీదైన యంత్రం కాదు.. ఒక సమస్యను పరిష్కరించాలనే ఆలోచన.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్