ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition ఈ ‘డాక్టరు బాబు’ సేవలకు సంకెళ్లా, బహుమతి..!

4 రోజుల క్రితం

ఈ ‘డాక్టరు బాబు’ సేవలు వైద్యానికి మించి... image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 28, 2026, 06:12 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

ఒరిస్సాలోని కలహండి, రాయగడ జిల్లాలు బాక్సైట్ సమృద్ధిగా ఉన్న కొండ ప్రాంతాలు. ఆ కొండల చుట్టూ ప్రకృతిని, ముఖ్యంగా అడవులను, కొండలను ఆరాధించే ఆదివాసీ తెగలు నివసిస్తున్నాయి. చట్టాలు ఎన్ని ఉన్నా అక్రమ మైనింగ్‌తో ఆ ప్రజలు ఏళ్ల తరబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దం క్రితం ఆ గ్రామాలకు ఒక యువ వైద్యుడు మోటారు బైక్‌పై కొండల మీదుగా, బండరాళ్ల మధ్య నుంచి అతికష్టం మీద చేరుకున్నాడు. అతను ఆ గిరిజనులకు వైద్యసేవలు అందించేందుకు వచ్చిన కమ్యూనిటీ హెల్త్ ఆర్గనైజర్. కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేసే అవకాశాలను కాదని వచ్చిన ఆ డాక్టర్ పేరు రాండాల్ సెక్వైరా. రోగం వస్తే 60 కిలోమీటర్లు అతికష్టం మీద ప్రయాణిస్తే గానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకోలేని ఆ గిరిజనులకు ఇంటింటికీ వెళ్లి వైద్యం చేశాడు రాండాల్. ఆ యువ వైద్యుడిని గ్రామస్తులందరూ ‘డాక్టర్ బాబు’ అని పిలుచుకున్నారు. అయితే ఇప్పుడు ఆ పేదల డాక్టర్ జైల్లో ఖైదీగా ఉన్నాడు. ఎందుకు? అతను చేసిన నేరం ఏమిటి? ప్రజాసంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు అతని అరెస్టును తీవ్రంగా వ్యతిరేకించడానికి కారణం ఏమిటి?

ఈ ‘డాక్టరు బాబు’ సేవలు వైద్యానికి మించి... image 2

ఈ నెల అక్టోబరు 8న ఒరిస్సా రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్, ఫార్వర్డ్ బ్లాక్, కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్), సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్ నాయకులు అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా ఆదివాసీలు చేస్తున్న పోరాటంలో పాల్గొన్నారు. ఆ నిరసనల్లో రాండాల్ కూడా ఉన్నారు. అక్టోబరు 16న ఒరిస్సా పోలీసులు రాండాల్‌ను అరెస్టు చేశారు. ముంబయిలో పుట్టి పెరిగిన ఆయన బెంగళూరులోని సెయింట్ జాన్స్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. తండ్రి అలెక్స్ సెక్వైరా ఒక ప్రైవేట్ సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. తల్లి నాన్సీ సెక్వెరా నాబార్డ్ సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. రాండాల్ తల్లిదండ్రులిద్దరూ సామాజిక కార్యకర్తలు. రాండాల్ కూడా ఆ భావాలను ఒంటబట్టించుకున్నారు. అందుకే పట్టణ ప్రాంతాల్లో ఖరీదైన వైద్యం చేయడానికి ఆయన మనసు అంగీకరించలేదు. వైద్య సదుపాయాలు అందుబాటులో లేని గిరిజన పల్లెల వైపు ప్రయాణించారు. అత్యంత సాధారణంగా మోటారు బైక్‌పై, ఒక మెడికల్ కిట్‌ను వెంట తీసుకుని ఒరిస్సా ఆదివాసీ పల్లెలకు చేరుకున్న రాండాల్ ఆ గిరిజనులకు వైద్యం చేసి ఊరుకోలేదు. మైనింగ్‌కు వ్యతిరేకంగా దీర్ఘకాలంగా పోరాడుతున్న ఆదివాసీలకు అండగా నిలబడ్డారు.

మా కోసం ఇంటింటికీ వచ్చారు

రాండాల్ వైద్యసేవలను గుర్తుచేసుకుంటూ లక్ష్మణ్ మాఝీ అనే గిరిజనుడు ఇలా చెప్పాడు. “డాక్టర్ బాబు మా గ్రామంలో ఇంటింటికీ తిరిగి వైద్యం చేసేవారు. మలేరియా, డయేరియా, చర్మవ్యాధులు, ఇతర కాలానుగుణ వ్యాధులకు చికిత్స అందించేవారు. 60 కిలోమీటర్లు ప్రయాణిస్తే గానీ మేము ఆరోగ్య కేంద్రానికి చేరుకోలేం. అలాంటి మా కోసం డాక్టర్ బాబు మోటారు బైక్‌పై మొబైల్ డాక్టర్‌లా వైద్యం చేశారు. మా కోసమే ఆయన కెర్పాయ్‌లో ఓ పెంకుటింట్లో ఉండేవారు” అని లక్ష్మణ్ చెప్పాడు. పేదలకు వైద్యం అందించేందుకు అన్ని సౌకర్యాలను కాదనుకున్న రాండాల్ గ్రామస్తులకు ఉచితంగా వైద్యం చేసి, మందులు అందించేవారు. పరిశుభ్రత లేకపోవడం, పోషకాహార లోపం, తాగునీటి కొరత కారణంగా కలిగే వివిధ అనారోగ్యాల గురించి ఆదివాసీలకు అవగాహన కల్పించేవారు. కెర్పాయ్ గ్రామం కలహండి జిల్లాలోని థాముల్ రాంపూర్ బ్లాక్‌లో ఉంది.

దీర్ఘకాల పోరాటం

2014లో గ్రామస్తుల వ్యతిరేకతతో మైనింగ్ కార్యకలాపాల నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గినా, వేదాంత లిమిటెడ్ గ్రూపు అక్రమ మార్గంలో ముందుకు వెళుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికంగా ఉన్న సిజిమాలి కొండపై ప్రారంభించిన వేదాంత ప్రాజెక్టును ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీర్ఘకాలంగా పోరాడుతున్నారు. 2026 ఏప్రిల్‌లో అక్కడ పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. గిరిజనులపై పోలీసులు దాడులకు దిగడంతో స్థానికులకు, పోలీసులకు మధ్య హింస చెలరేగింది. ఈ ఘర్షణల్లో పోలీసులతో సహా వందమందికి పైగా గాయపడ్డారు. ఈ హింసాకాండ తరువాత నమోదైన మూడు ఎఫ్‌ఐఆర్‌లలో ఒకదానిలో రాండాల్‌ను పోలీసులు నిందితుడిగా పేర్కొన్నారు. అక్టోబరు 16న రాండాల్‌తో పాటు ‘మా మతి మాలి సురక్షా మంచ్’కు చెందిన దళిత నాయకుడు లక్ష్మణ్ నాయక్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రజలకు వైద్యం అందించే ఒక సాధారణ వైద్యుడు సామాజిక సమస్యలపై వారిని చైతన్యపరచడం అక్రమ మైనింగ్‌కు మద్దతు ఇచ్చేవారికి మింగుడుపడలేదు. అందుకే ఆయనపై అక్రమ కేసులు మోపి జైల్లో పెట్టారు. ఘర్షణలు జరిగినప్పుడు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు లేకపోయినా, ఆ తరువాత‘హత్యాయత్నం కేసు’ (సెక్షన్ 307), దోపిడీ, ఆయుధాల చట్టం ఉల్లంఘన వంటి అభియోగాలు మోపారు. రాండాల్ అరెస్టును వైద్యులు, వామపక్ష నాయకులు, సామాజిక కార్యకర్తలు, ఆదివాసీలు వ్యతిరేకిస్తున్నారు.

మా స్నేహితుడు మాకు గర్వకారణం

2023 నుంచి ‘మా మతి మాలి సురక్షా మంచ్’ వంటి స్థానిక క్షేత్రస్థాయి సంస్థలతో కలిసి రాండాల్ సంఘీభావ కార్యకర్తగా, ఆరోగ్య సంరక్షకుడిగా ఆదివాసీల నిరసనల్లో పాల్గొంటున్నారు. పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తరువాత 2017లో కలహండి ప్రాంతానికి వచ్చారు. ‘స్వస్థ్య స్వరాజ్య’ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున థాముల్ బ్లాక్‌లో వైద్యసేవలు ప్రారంభించారు. ఆ తరువాత పలు సంస్థల భాగస్వామ్యంతో ఆయన సేవలను విస్తరించారు. రాండాల్ గురించి ఆయన స్నేహితుడు ఇలా చెప్పారు: “రాండాల్ ఒక ఫెలోషిప్ కోసం ఈ ప్రాంతానికి వచ్చాడు. కానీ తరువాత ఇక్కడ అంతకంటే లోతైన సమస్య ఉందని గ్రహించాడు. ఇక్కడ సామూహిక ఆరోగ్య సంరక్షణ లోపమే కాదు, సామాజిక సంరక్షణ లోపం కూడా ఉంది. కేవలం చికిత్స ద్వారా దాన్ని అధిగమించలేం. రాండాల్ మాటల్లో చెప్పాలంటే, ‘తెరిచి ఉంచిన కుళాయి కింద నేలను తుడవడం సాధ్యం కాదు’ అని గట్టిగా నమ్ముతాడు. అందుకే నా స్నేహితుడు ఈ ప్రజలను చైతన్యపరిచాడు.” అని అన్నారు.

మెడికో ఫ్రెండ్స్ సర్కిల్‌లోని రాండాల్ స్నేహితులు తమ అనుభవాన్ని ఇలా పంచుకున్నారు: “2022లో క్రోమైట్ తవ్వకాల దుష్ప్రభావాల కారణంగా క్షయవ్యాధితో బాధపడుతున్న రోగులకు చికిత్స చేసేందుకు రాండాల్ భవానీ పట్నం నుంచి 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒరిస్సాలోని సుకిందాకు వెళ్లాడు. ఆ తరువాత అతను ఎంచుకున్న లక్ష్యాన్ని చూసి మేము చాలా గర్వపడుతున్నాం. మానవసేవకు తన జీవితాన్ని అంకితం చేశాడు” అని పేర్కొన్నారు.

39 ఏళ్ల ఈ యువ వైద్యుడు సామాజిక చైతన్యం కోసం చేస్తున్న ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్న అక్రమ మైనింగ్‌పై, ప్రజల ఆరోగ్య సంరక్షణపై రాండాల్ ‘ద వైర్’ వంటి జాతీయ మీడియా సంస్థల్లో వ్యాసాలు రాశారు. ఇంటర్వ్యూలు ఇచ్చారు. అలాంటి సామాజిక? స్పృహ ఉన్న వైద్యుడిని అక్రమకేసులో ఇరికించటం పాలకులు ఎవరి కోసం పనిచేస్తున్నారో స్పష్టం చేస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్