వాషింగ్టన్ : అమెరికాలో కొత్త హెచ్-1బీ వీసాల జారీని మూడేళ్లపాటు నిలిపివేయాలని కోరుతూ మొంటానా రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్ సెనెటర్ టిమ్ షిహీ సెనెట్‌లో "ఎండ్ హెచ్-1బీ అబ్యూస్ యాక్ట్" పేరుతో బిల్లును ప్రవేశపెట్టారు. అమెరికా కార్మికుల ఉద్యోగ అవకాశాలను కాపాడటం, హెచ్-1బీ వీసా వ్యవస్థలో జరుగుతున్న దుర్వినియోగాన్ని అరికట్టడం ఈ బిల్లు ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. హెచ్-1బీ కార్యక్రమాన్ని చౌకైన విదేశీ కార్మికులతో అమెరికన్ల ఉద్యోగాలను భర్తీ చేయడానికి రూపొందించలేదని టిమ్ షిహీ పేర్కొన్నారు. ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన, దేశంలో తగినంత మంది కార్మికులు లేని రంగాల్లో మాత్రమే ఈ వీసా ఉపయోగించాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ బిల్లు ద్వారా నిబంధనల ఉల్లంఘనలను అరికట్టి, రక్షణ చర్యలను బలోపేతం చేసి, అమెరికన్ కార్మికులకు ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు. అలాగే, ట్రంప్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ప్రతి హెచ్-1బీ పిటిషన్‌పై $100,000 రుసుమును చట్టబద్ధం చేయాలని కూడా బిల్లు ప్రతిపాదిస్తోంది. ఈ రుసుమును కాంగ్రెస్ ఆమోదించని చట్టవిరుద్ధమైన పన్నుగా పేర్కొంటూ ఒక అమెరికా జిల్లా న్యాయమూర్తి జూన్ 8న రద్దు చేశారు. ఆ తీర్పుపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ఫస్ట్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఇటీవల తిరస్కరించింది. ప్రస్తుత లాటరీ విధానాన్ని రద్దు చేసి, వేతనాల ఆధారంగా హెచ్-1బీ వీసాల ఎంపిక చేపట్టాలని బిల్లు సూచిస్తోంది. ఒకేసారి రెండు చోట్ల ఉద్యోగాలు చేయడం, థర్డ్-పార్టీ సిబ్బంది నియామక విధానాలను నిషేధించాలని ప్రతిపాదిస్తోంది. అలాగే హెచ్-1బీ వీసాదారులకు ప్రస్తుతం ఉన్న "డ్యూయల్ ఇంటెంట్" (తాత్కాలిక వీసాతో పాటు శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసే అవకాశం) నిబంధనను కూడా రద్దు చేయాలని కోరుతోంది. హెచ్-1బీ వీసాదారులు తమపై ఆధారపడిన కుటుంబ సభ్యులను అమెరికాకు తీసుకురాకుండా చేయడం, ఫెడరల్ ప్రభుత్వ సంస్థలు నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాదారులను నియమించకుండా నిరోధించడం, విదేశీ విద్యార్థులు మరియు కొంతమంది ఎక్స్ఛేంజ్ విజిటర్లకు ప్రస్తుతం ఉన్న వర్క్ ఆథరైజేషన్ కార్యక్రమాలను ముగించడం వంటి ప్రతిపాదనలు కూడా ఈ బిల్లులో ఉన్నాయి. ఇమ్మిగ్రేషన్ అకౌంటబిలిటీ ప్రాజెక్ట్, ఫెడరేషన్ ఫర్ అమెరికన్ ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్ సంస్థల మద్దతుతో రూపొందించిన ఈ బిల్లు, హెచ్-1బీ వ్యవస్థపై పర్యవేక్షణను మరింత కఠినతరం చేయడం, దేశీయ ఉద్యోగాలకు ప్రాధాన్యం కల్పించడం లక్ష్యమని పేర్కొన్నారు.
కొత్త హెచ్-1బీ వీసాలను మూడేళ్లు నిలిపివేయాలని అమెరికా సెనెట్‌లో బిల్లు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 26, 2026, 12:06 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)