‘ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్)’లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణం రాజీనామా చేయాలని ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర విపక్షాలు పోరుబాట పట్టాయి. ఈ పోరాటంలో సిపిఎం నేత, సీనియర్ కామ్రేడ్ బృందా కరత్ తెగువను, పోరాటపటిమను కొనియాడుతూ సోషల్ మీడియాలో ఓ యువతి అనుభవం వైరల్ అవుతోంది. మనీషా రాధాకృష్ణన్ కేరళ రాష్ట్రంలో ఎర్నాకుళం జిల్లా డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలుగా ఉన్నారు. అక్టోబర్ 2న జంతర్ మంతర్ ముట్టడిలో పాల్గొన్నప్పుడు అక్కడి అరెస్టు అనుభవాన్ని ఆమె ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. దాని తెలుగు అనువాదం ఇక్కడ ఇస్తున్నాం...
బృందా కరత్... ఒక పేరు మాత్రమే కాదు, దశాబ్దాలుగా నా జ్ఞాపకాలలో పెరుగుతూ వచ్చిన ఒక పోరాట ముఖచిత్రం. నాకు పది, పదకొండు సంవత్సరాల వయసున్నప్పుడు నాన్నతో కలిసి నెడుంబాశ్శేరి విమానాశ్రయంలో ఆమెను స్వాగతించడానికి వెళ్లాను. చేతిలో ఉన్న ఎర్ర గులాబీని ఆమెకు ఇచ్చాను. ఆమె నా తలపై చేయి వేసి “యంగెస్ట్ కామ్రేడ్” అన్నారు. ఆ మాటల అర్థం అప్పుడు తెలియకపోయినా, ఆ క్షణం నా మనసులో శాశ్వతంగా నిలిచిపోయింది.
ఏళ్ల తర్వాత ఢిల్లీలో డీవైఎఫ్ఐ నిర్వహించిన పార్లమెంట్ మార్చ్ సందర్భంగా, జంతర్ మంతర్ వైపు సాగిన పోరాట యాత్రలో ఆమెను మరోసారి దగ్గరగా చూసే అవకాశం వచ్చింది. అప్పటికే జంతర్ మంతర్ పరిసరాల్లో నిషేధాజ్ఞలు విధించి, పోలీసులు అన్ని మార్గాలను అడ్డుకున్నారు. కానీ మార్గాలను మూసివేస్తే పోరాటం ఆగిపోదు. అనేక మార్గాల ద్వారా మేము ముందుకు కదిలాం. నేను బృందా కరత్ నాయకత్వంలోని బృందంలో ఉన్నాను.
అక్కడ నేను చూసింది డెబ్బై ఐదు ఏళ్లు దాటిన ఒక మహిళను కాదు. ఒక యువ పోరాట యోధురాలి ఉత్సాహంతో, చురుకుదనంతో ముందుకు సాగుతున్న కామ్రేడ్‌ను చూశాను. పోలీసులు అడ్డుకున్నప్పుడు ఆమె వారితో గట్టిగా మాట్లాడారు. చివరకు మాతో సహా దాదాపు పన్నెండు మందిని బస్సులో ఎక్కించి ఢిల్లీకి దూరంగా హర్యానా సరిహద్దులోని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
ప్రయాణంలో మాకు దాహం వేసినప్పుడు, “నా పిల్లలకు నీళ్లు కావాలి” అంటూ ఆమె పోలీసులను నిలదీశారు. పోలీస్ స్టేషన్‌లో అపరిశుభ్రమైన గదిలో కూర్చోబెట్టినప్పుడు, “నా పిల్లలను ఈ మురికి గదిలో కూర్చోబెట్టడం నేను అంగీకరించను” అన్నారు. భోజనం విషయంలోనూ ఆమె వెనక్కి తగ్గలేదు. పోలీసుల ముందు ఏ దశలోనూ రాజీ పడని పోరాట యోధురాలిగా ఒకవైపు నిలిచిన ఆమె, తనతో ఉన్న వారి ఆకలి, దాహం, అసౌకర్యాలను తన బాధ్యతగా చూసిన ఒక అమ్మగా మరోవైపు కనిపించారు.
ఆ సమయంలో ఆమె నా తలపై ఆప్యాయంగా చేయి వేసినప్పుడు, చిన్నతనంలో “యంగెస్ట్ కామ్రేడ్” అని పిలిచిన ఆ క్షణం గుర్తుకొచ్చింది. నా ముందు దేశవ్యాప్తంగా దశాబ్దాలుగా పోరాటాలకు నాయకత్వం వహించిన ఒక పెద్ద నాయకురాలు ఉన్నారనే భావన కంటే, తోటి వారిని తన పిల్లలుగా చూసుకునే ఒక ఆప్యాయమైన కామ్రేడ్ కనిపించారు. ఈ రెండు రోజుల అనుభవం నాకు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పింది... పోరాటానికి వయస్సుతో సంబంధం లేదు. వయసు శరీరానికి సంబంధించిన సంఖ్య మాత్రమే; ప్రజల కోసం నిలబడే సంకల్పానికి వయసు ఉండదు. అన్యాయాన్ని ఎదిరించే ధైర్యానికి వయోపరిమితి ఉండదు. పోరాటం పట్ల నిబద్ధత ఉంటే వయసు అడ్డు కాదు. ఈ ప్రయాణంలో బృందా కరత్‌తో పాటు ఉన్నప్పుడు, ఆమెను నాకు చిన్నతనంలో పరిచయం చేసిన నా నాన్న కూడా గుర్తుకొచ్చారు. పోరాటాన్ని జీవితంలో ఒక భాగంగా చేసుకున్న ఆయన నుంచి మొదలైన జ్ఞాపకం, ఇన్నేళ్ల తర్వాత అదే పోరాట స్ఫూర్తిని మరో రూపంలో నా ముందుంచింది.
చివరికి పోలీసులు మమ్మల్ని విడుదల చేస్తున్నప్పుడు కామ్రేడ్ ఎం.ఏ. బేబీ, కామ్రేడ్ బృందా కరత్ ... “యంగెస్ట్ కామ్రేడ్స్ ముందుగా బయటకు వెళ్లాలి. మనలో వయసులో పెద్దవాళ్లు చివరిగా బయటకు వస్తారు” అన్నారు. అది కేవలం ఆ క్షణానికి సంబంధించిన మాట కాదు. ఒక తరం మరో తరాన్ని ముందుకు నడిపించే బాధ్యతకు ప్రతీక.
జంతర్ మంతర్ వైపు సాగిన ఆ యాత్ర నాకు నేర్పిన పాఠం ఒక్కటే!
పోరాటానికి వయస్సు లేదు.
వయసు ఒక సంఖ్య మాత్రమే.
పోరాట స్ఫూర్తికి వయోపరిమితి లేదు.
ఆమె జెన్ జెడ్ కాదు; ఆమె ఒక జెన్ ఆల్ఫా!
లాల్ సలాం కామ్రేడ్...








కామెంట్‌లు (0)