ప్రపంచవ్యాప్తంగా నేడు మెరుగైన భవిష్యత్తు కోసం యువత ఉద్యమిస్తున్న దృశ్యం కనిపిస్తోంది. 1970, 80 దశకాల నాటి యువోత్తేజం, తమకు మంచి విద్యా, ఉపాధి కావాలన్న ఆకాంక్షగా బలంగా వినిపిస్తున్నాయి. ఒక పక్క సంపద పెద్దెత్తున పోగుపడుతూ ఉంటే- మరోపక్క నిరుద్యోగం, విద్యావైద్య రంగాల్లో విపరీతంగా పెరిగిన వ్యయం.. విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరోవైపు ఇళ్ల అద్దెలు, నిత్యావసరాల ధరలు పెరగడంతో జీవనం భారంగా మారుతోంది. ఉపాధి అవకాశాలు, సమాన హక్కులు, సామాజిక భద్రతపైనా అనిశ్చితి నెలకొంది. ఈ సమస్యలపై యూరప్‌లోని పలు దేశాల్లో యువత నిరసనలకు దిగుతోంది.
పారిస్‌లో జరిగిన నిరసనల్లో పాల్గొన్న 19 ఏళ్ల థియో తన ఆవేదనను ఇలా వ్యక్తం చేశాడు. 'వారం రోజులుగా నిరసనకారులపై ప్రభుత్వ దిగ్బంధనాలు, అణిచివేత చూసి చాలా విసిగిపోయాను. అందుకే విద్యార్థులకు సంఘీభావంగా నేను కూడా వీధుల్లోకి వచ్చాను. విశ్వవిద్యాలయాల మౌలిక వసతులు మెరుగుపర్చాలని, పాఠశాలలకు మరిన్ని వనరులు కల్పించాలని పోరాడుతున్నాం. పాఠశాలల్లోనే కాదు, ఆస్పత్రుల్లో కూడా మౌలిక వసతుల కొరత చాలా తీవ్రంగా ఉంది' అని చెప్పాడు. 'మా ప్రభుత్వం యుద్ధంలో పెట్టుబడులు పెట్టడం ఆపాలి. ఇప్పటికే మేము విసిగిపోయాం. మెరుగైన దేశ భవిష్యత్తే మా లక్ష్యం' అని స్పష్టం చేశాడు. అంటే విద్యార్థుల నిరసన కేవలం విద్యా సంస్థల్లోని సమస్యలకే పరిమితం కావడం లేదు. ప్రజల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా యుద్ధాలకు భారీగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వ విధానాలనూ వారు ప్రశ్నిస్తున్నారు.
సమాన అవకాశాల కోసం
విద్యలో అసమానతలు కూడా యువతను ఉద్యమాల వైపు నడిపిస్తున్నాయి. 'మాకు సరిపడా టీచర్లు లేరు' అని ఫ్రాన్స్‌లోని 16 ఏళ్ల ఒలింపే నిరసనల్లో పాల్గొంది. 'నగరాల్లో మాదిరి మా స్కూళ్లల్లో వసతులు లేవు. విద్యార్థులందరికీ సమానమైన హక్కులు ఉండాలి' అని ఆమె కోరుతోంది. 15 ఏళ్ల రానియా సైతం తమ భవిష్యత్తు గురించి ప్రశ్నిస్తోంది. 'విద్యార్థులే దేశ భవిష్యత్తు అని భావించినప్పుడు మమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? ప్రభుత్వాలు మా పట్ల చూపిస్తున్న ఉదాసీన వైఖరి వల్లే మేము వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నాం. పరిస్థితులు మారే వరకు పోరాడుతూనే ఉంటాం' అని నినదించింది. విద్యార్థుల సమస్యలను ఉపాధ్యాయులు కూడా తమ సమస్యలుగానే భావిస్తున్నారు. నిరసనల్లో పాల్గొన్న గణిత ఉపాధ్యాయురాలు క్లెమెన్స్ మాట్లాడుతూ, 'విద్యార్థులు చేస్తున్న ఈ పోరాటానికి మేము వంద శాతం మద్దతు ఇస్తున్నాం. ఈ డిమాండ్ల కోసం మేము చాలా కాలంగా పోరాడుతున్నాం. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉష్ణోగ్రతలు పెరిగి క్లాసు రూంలో పిల్లలు కూర్చోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి విషయాల పట్ల కూడా ప్రభుత్వం ఉదాసీన వైఖరి చూపించడం ఆమోదయోగ్యం కాదు' అని పేర్కొన్నారు. ఫ్రెంచ్ సోషియాలజిస్ట్, విశ్లేషకుడు రాఫెల్ మాట్లాడుతూ, 'ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. విద్యార్థులు ఈ లోపాలనే ఎత్తి చూపుతున్నారు. క్లాసు రూమ్‌కి వెళ్లి పాఠాలు వినాల్సిన పిల్లలు వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నారు.' అని వివరించారు. అక్టోబరు 17న జరిగిన విధ్వంసానికి సంబంధించి ప్రభుత్వం విద్యార్థులపై అభియోగాలు మోపిందని, నిరసన తెలిపే హక్కును ప్రశ్నిస్తూ ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తోందని ఆయన విమర్శించారు. అయినప్పటికీ విద్యార్థులు తమ డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గడం లేదని రాఫెల్ చెప్పారు.
వెల్లువెత్తుతున్న సంఘీభావం
ప్రభుత్వ నిర్బంధాలు, అరెస్టులు నిరసనలను ఆపలేకపోతున్నాయి. ఒకరిని అణచివేస్తే మరొకరు ముందుకు వస్తున్నారు. స్నేహితులకు మద్దతుగా నిరసనల్లో పాల్గొన్న మైస్సేన్ మాటల్లో ఈ ఐక్యత స్పష్టంగా కనిపిస్తోంది. 'పాలకులు మా స్నేహితులను నిర్బంధించారు. ఇప్పుడు ఈ పోరాటాన్ని మేము ముందుకు నడిపిస్తాం. అందరి కోసం ముందుగా వాళ్లు వచ్చారు. ఇప్పుడు వాళ్ల కోసం మేం వచ్చాం.. పోరాటాన్ని ఎవరూ ఒంటరిగా చేయలేరు' అని ఆమె పేర్కొంది. 17 ఏళ్ల రాఫెల్ సైతం యువతకు రాజకీయ అవగాహన లేదనే అభిప్రాయాన్ని తోసిపుచ్చాడు. 'మాకు రాజకీయ అవగాహన లేదని, దేని కోసం పోరాడుతున్నామో మాకు తెలియదని పాలకులు అనుకుంటున్నారు. కానీ మాకు అన్నీ తెలుసు. దేని కోసం పోరాడాలో బాగా తెలుసు' అని స్పష్టం చేశాడు. 16 ఏళ్ల రోజ్ కూడా పరిస్థితులు మారే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించింది. 'పరిస్థితి మారకపోతే మా పోరాటాన్ని ఎంత కాలమైనా కొనసాగిస్తాం. భవిష్యత్తులో ఈ పోరాటం మరిన్ని పోరాట శక్తులతో కలిసి ముందుకు వెళుతుంది' అని ధైర్యంగా చెబుతోంది.
దైనందిన సమస్యలపై...
ఇళ్ల సమస్యలు, జీవన వ్యయాల పెరుగుదలపై స్పెయిన్, బెల్జియం, ఇటలీ, అల్బేనియా, పోర్చుగల్లలోనూ ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. పోర్చుగల్‌కు చెందిన 19 ఏళ్ల విద్యార్థి జార్జ్ ఈ పరిస్థితిని 'సామాజిక సంక్షోభం'గా అభివర్ణించాడు. 'కుటుంబం గౌరవంగా జీవించే సామర్థ్యాన్ని సొంత ఇల్లు ఇస్తుంది. కానీ ఇక్కడ పర్యాటకానికి ఇస్తున్న ప్రోత్సాహం సొంత ప్రజల భవిష్యత్తుకు వెచ్చించడం లేదు' అని చెప్పాడు. బెల్జియం పార్లమెంటు సభ్యురాలు, వర్కర్స్ పార్టీకి చెందిన 25 ఏళ్ల అమీనా వందేన్హ్ వెల్ కూడా యువత నిరసనలకు కారణాలను వివరించారు. 'మా తరం వారు పుట్టినప్పటి నుండి మా భవిష్యత్తు కోసం డబ్బు లేదని ప్రభుత్వం చెప్పటం వింటున్నాం. కానీ పరాయి దేశాలపై యుద్ధానికి వెళ్లడానికి మాత్రం రక్షణ రంగంపై లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ డబ్బును పాఠశాలలకు, ప్రజా రవాణాకు, ఆసుపత్రులకు కేటాయించవచ్చు. కానీ అలా చేయడం లేదు' అని ఆమె విమర్శించారు. విద్యపై పొదుపు చర్యలు, ప్రజా రవాణా, వాతావరణ మార్పులపై ప్రభుత్వాల నిర్లక్ష్యం యువత ఆందోళనలను మరింత పెంచుతున్నాయని అమీనా వివరించింది. చదువుకునే ఖర్చు కారణంగా ఏ పిల్లవాడిని విశ్వవిద్యాలయానికి పంపాలనే చర్చ కుటుంబాల్లో జరుగుతోందని, దీంతో సమాన అవకాశాలు అందరికీ దక్కడం లేదని పేర్కొంది. ఈ ఉద్యమాల్లో ఉపాధ్యాయులు, కార్మిక సంఘాలు, రైతులు, తల్లిదండ్రులు కూడా భాగస్వాములవుతున్నారని తెలిపింది.
యుద్ధ వ్యతిరేకత
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం, గాజాలో ఇజ్రాయిల్ దాడులు వంటి పరిణామాలు కూడా యువత ఆందోళనల్లో ప్రస్తావనకు వస్తున్నాయి. యుద్ధాలు భవిష్యత్తును నాశనం చేస్తాయనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో విద్య, ఉపాధి, జీవన వ్యయం, స్వేచ్ఛ, గౌరవం కోసం సాగుతున్న పోరాటాలు పరస్పరం సంఘీభావాన్ని పెంచుకుంటున్నాయి. నిరసనకారుల మాటల్లో పదేపదే వినిపిస్తున్నది ఒక్కటే.. సమస్యలు పరిష్కరించాలి, ప్రభుత్వాలు జవాబుదారీగా వ్యవహరించాలి, పరిస్థితులు మారే వరకు పోరాటాన్ని కొనసాగిస్తాం అని.
భవిష్యత్తుపై బెంగ యువతను వీధుల్లోకి తీసుకొస్తుంటే, తమ గొంతును అణచివేయలేరనే సంకల్పం వారిని ముందుకు నడిపిస్తోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, కార్మికులు, రైతులు, తల్లిదండ్రులు ఒకే వేదికపైకి వస్తున్న తీరు ఈ ఉద్యమాలకు విస్తృత సామాజిక మద్దతు లభిస్తున్నదనే విషయాన్ని తెలియజేస్తోంది. నిర్బంధాలు, అరెస్టులు ఎదురైనా తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామనే యువత స్వరం ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది. మెరుగైన విద్య, ఉపాధి, సమాన అవకాశాలు, గౌరవప్రదమైన జీవితం కోసం వారు చేస్తున్న డిమాండ్లకు ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి!








కామెంట్లు (0)