సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమహిళల కోసం.. మహిళలే డ్రైవర్లు..

1 రోజు క్రితం

మహిళల కోసం.. మహిళలే డ్రైవర్లు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 11, 2026, 06:13 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

మహిళలు ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టినప్పటి నుంచి తిరిగి ఇంటికి చేరుకునే వరకూ భద్రతపై ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఐటీ, బీపీవో, కార్పొరేట్‌ సంస్థల్లో పనిచేసే మహిళలు రాత్రి వేళల్లో విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేటప్పుడు ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించాలన్న ఆలోచనతో ఇద్దరు స్నేహితులు ప్రత్యేక రవాణా సేవను ప్రారంభించారు. మహిళల కోసం మహిళలే బైక్‌లు, క్యాబ్‌లు నడిపే ఈ సేవ ఇప్పుడు వేలాది మంది మహిళలకు భరోసాగా నిలుస్తోంది.

​గురుగ్రామ్‌.. ఒకప్పుడు ఢిల్లీ శివార్లలోని సాధారణ పట్టణం. ఇప్పుడు దేశంలోని అతిపెద్ద కార్పొరేట్‌ హబ్‌లలో ఒకటి. బహుళజాతి సంస్థలు, స్టార్టప్‌లు, ఐటీ, బీపీవో కంపెనీలతో వేలాది ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఈ అవకాశాలను మహిళలూ అందిపుచ్చుకుంటున్నారు. అయితే పని ముగించుకుని అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున ఇంటికి చేరుకోవడం వారికి సవాల్‌గా మారింది. మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తూ అజయ్‌ కుమార్‌, వింధ్య మెహ్రోత్రా అనే ఇద్దరు స్నేహితులు దీనికి పరిష్కారం చూపాలని భావించారు.

​ఓ చేదు అనుభవం నుంచి..

మహిళలే డ్రైవ్‌ చేసే ఆలోచన తన స్నేహితురాలికి ఎదురైన చేదు అనుభవం నుంచి పుట్టుకొచ్చిందని అజయ్‌ కుమార్‌ చెబుతున్నారు. ‘నేను చండీగఢ్‌లో ఇంజనీరింగ్‌ చదువుతున్నప్పుడు నా స్నేహితురాలికి ఓ రాత్రి బైక్‌ రైడ్‌లో చేదు అనుభవం ఎదురైంది. డ్రైవర్‌ ఆమెను అనుచితంగా తాకుతూ.. పదేపదే బ్రేకులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. భయపడిపోయిన ఆమె దారి మధ్యలోనే బైక్‌ ఆపి, చీకట్లో నడుచుకుంటూ ఇంటికి వెళ్లింది. ఈ ఘటన గురించి మరుసటి రోజు నాకు చెప్పింది.

​పురుషులు డ్రైవ్‌ చేసే సమయంలో మహిళలకు ఇలాంటి అనుభవాలు ఎదురైతే.. మహిళా డ్రైవర్లు ఉంటే పరిస్థితి మారుతుందేమో అనిపించింది. 2021లో ఎంబీఏ చేస్తున్నప్పుడు నా బ్యాచ్‌మేట్‌ వింధ్య మెహ్రోత్రాతో ఈ ఆలోచన గురించి చర్చించాను. మహిళలు ఎదుర్కొంటున్న ప్రయాణ సమస్యలకు పరిష్కారం చూపాలని నిర్ణయించుకున్నాం. ఆరు నెలల పాటు వివిధ కాలేజీల్లో సుమారు ఆరు వేల మంది విద్యార్థినులను, మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద వందలాది మంది మహిళలను కలిసి వారి అభిప్రాయాలు తెలుసుకున్నాం. మహిళా డ్రైవర్లతో ప్రయాణ సేవ ఉంటే బాగుంటుందని ఎక్కువ మంది చెప్పడంతో 2023లో ‘ఫెరీ రైడ్స్‌’ను ప్రారంభించాం’ అని అజయ్‌ కుమార్‌ వివరించారు.

​భద్రతే లక్ష్యంగా..

‘ఫెరీ రైడ్స్‌’లో మహిళలే ఎలక్ట్రిక్‌ బైక్‌లు, ట్యాక్సీలు, క్యాబ్‌లు నడుపుతారు. వినియోగదారులు యాప్‌ ద్వారా రైడ్‌ బుక్‌ చేసుకోవచ్చు. అవసరమైతే కొంతకాలం పాటు వాహనాలను అద్దెకు కూడా తీసుకోవచ్చు. ప్రస్తుతం గురుగ్రామ్‌ మెట్రో స్టేషన్‌ చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో పనిచేసే మహిళలను ‘సిస్టర్‌ పార్ట్‌నర్స్‌’గా పిలుస్తారు.

​మహిళలకు పని, కుటుంబ బాధ్యతలు రెండూ ముఖ్యమే. అందుకే పిల్లలను స్కూల్‌ నుంచి తీసుకురావడం, ఇంట్లో పెద్దలను ఆసుపత్రికి తీసుకెళ్లడం వంటి అవసరాలకు అనుగుణంగా తమ డ్రైవింగ్‌ సమయాలను మార్చుకునే వెసులుబాటును సంస్థ కల్పిస్తోంది. మహిళలకు జీతంతో పాటు పనితీరును బట్టి ప్రోత్సాహకాలు, వైద్య బీమా కూడా అందిస్తోంది. 2023లో ప్రారంభమైనప్పటి నుంచి గురుగ్రామ్‌లో ‘ఫెరీ రైడ్స్‌’ 80 వేలకు పైగా రైడ్‌లను పూర్తి చేసింది. భవిష్యత్తులో ఢిల్లీ, నోయిడాలకు కూడా సేవలను విస్తరించేందుకు అజయ్‌ కుమార్‌, వింధ్య మెహ్రోత్రా ప్రయత్నిస్తున్నారు.

​ఇతర నగరాల్లోనూ..

మహిళల కోసం మహిళలే వాహనాలు నడిపే సేవలు ఇతర నగరాల్లోనూ విస్తరిస్తున్నాయి. బెంగళూరు, ముంబై, చెన్నై, పుణె, హైదరాబాద్‌, ఢిల్లీ, కోల్‌కతా వంటి నగరాల్లో మహిళల కోసం పింక్‌ ర్యాపిడో, క్యాబ్‌లు, ఆటోలు అందుబాటులో ఉన్నాయి. ఈ సేవల ద్వారా మహిళలు రాత్రి వేళల్లోనూ మరింత భరోసాతో ప్రయాణించే అవకాశం పొందుతున్నారు. బెంగళూరులో 2024లో, హైదరాబాద్‌లో ఇటీవలే ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్