బుధవారం, 11 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపల్లె ప్రజ్ఞకు ప్రపంచ వెలుగు

1 గంట క్రితం

పల్లె ప్రజ్ఞకు ప్రపంచ వెలుగు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026, 06:10 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

ఒక మనిషి తన జీవితంలో ఏం సాధించాడన్నదాని కంటే, తన వల్ల ఎంతమంది జీవితాలు మారాయన్నదే అతడి గొప్పతనానికి నిదర్శనం. అలాంటి అరుదైన వ్యక్తి సంజిత్ 'బంకర్' రాయ్. గ్రామీణ పేదల సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసి, ముఖ్యంగా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడగలరని ఆచరణలో నిరూపించిన సామాజిక కార్యకర్త ఆయన. రాజస్థాన్‌లోని తిలోనియాలో ఆయన స్థాపించిన 'బేర్‌ఫుట్ కాలేజీ' ద్వారా దేశ, విదేశాల్లోని వేలాది మంది గ్రామీణ మహిళలను సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దారు. ఐదు దశాబ్దాలకు పైగా గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత కోసం పనిచేసిన సంజిత్ మంగళవారం రాజస్థాన్‌లోని తిలోనియాలో 81 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

పశ్చిమ బెంగాల్‌లోని బర్న్‌పూర్‌లో 1945 జూన్ 30న సంపన్న బెంగాలీ కుటుంబంలో సంజిత్ జన్మించారు. డూన్ స్కూల్‌లో చదువుకున్న ఆయన ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. స్క్వాష్‌లో మూడుసార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలిచారు. ఉన్నత చదువులు, క్రీడా ప్రతిభ, మంచి కుటుంబ నేపథ్యం.. ఆయనకు ఉజ్వల భవిష్యత్తును అందుబాటులో ఉంచాయి. అయితే సంజిత్ లక్ష్యం వేరుగా ఉంది.

1966లో బీహార్‌లో కరువు విరుచుకుపడింది. బాధితుల సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సంజిత్ అక్కడి గ్రామాలకు వెళ్లారు. ఆకలి, పేదరికం, కనీస సౌకర్యాల లేమితో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దగ్గరగా చూశారు. తాను చదువుకున్న విద్య, సంపాదించిన డిగ్రీలు గ్రామీణుల సమస్యలను అర్థం చేసుకోవడానికి సరిపోవడం లేదని గుర్తించారు. ఒక ఇంటర్వ్యూలో ఆ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ.. 'నేను తప్పుడు పాఠశాలకు వెళ్లాను, తప్పుడు కళాశాలలో చదివాను. అక్కడి నుంచి ఎంతో అహంకారంతో బయటకు వచ్చాను' అన్నారు. 'ఉన్నత విద్యతో ఏ సమస్యనైనా పరిష్కరించగలనని అనుకున్నాను. కానీ బీహార్‌లోని ఒక చిన్న గ్రామంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పనిచేయలేకపోయాను. ఆ అనుభవమే నా జీవితాన్ని మార్చింది' అని చెప్పారు. ఆ తర్వాత దాదాపు ఏడాదిన్నర పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం చేశారు. అలా ఆయన జీవన ప్రయాణం రాజస్థాన్‌లో కొత్త మలుపు తీసుకుంది.

తిలోనియా ప్రయోగం

రాజస్థాన్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో నీటి కొరత, కరువు, వ్యవసాయ సమస్యలను గమనించిన సంజిత్ అజ్మీర్ ప్రాంతంలో బావుల తవ్వకం, సాగునీటి సౌకర్యాల కల్పన వంటి కార్యక్రమాల్లో పనిచేశారు. ఈ క్రమంలో పుస్తకాల్లో కనిపించని ఎంతో జ్ఞానం గ్రామీణుల దగ్గర ఉందని గుర్తించారు. తిలోనియాకు చెందిన స్థానిక రైతు, బావుల తవ్వకంలో నిపుణుడైన మేఘరాజ్‌తో పరిచయం ఆయన ఆలోచనలను మరింత ప్రభావితం చేసింది. గ్రామీణుల జీవిత నైపుణ్యాలకు సాంకేతికతను జోడిస్తే అద్భుతాలు సాధించవచ్చని గ్రహించారు. 1972లో తిలోనియాలో ‘సోషల్ వర్క్ అండ్ రీసెర్చ్ సెంటర్‌’ను ప్రారంభించారు. అదే తరువాత ‘బేర్‌ఫుట్ కాలేజీ’గా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. సంప్రదాయ విద్యాసంస్థలకు భిన్నంగా ఇక్కడ డిగ్రీలు, సర్టిఫికెట్ల కంటే ఆచరణాత్మక నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇచ్చారు. నీటి సంరక్షణ, ఆరోగ్యం, విద్య, ఉపాధి, పర్యావరణ పరిరక్షణ, సౌర విద్యుత్తు వంటి రంగాల్లో స్థానికులకు శిక్షణ ఇచ్చారు.

మహిళల చేతుల్లో వెలుగు

సంజిత్ చేసిన ప్రయోగాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది గ్రామీణ మహిళలకు సౌర విద్యుత్తు సాంకేతికతలో శిక్షణ ఇవ్వడం. చదువు లేని మహిళలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోలేరనే అపోహను ఆయన సవాలు చేశారు. ఈ శిక్షణ కోసం వృద్ధ మహిళలను ఎంపిక చేసి, సౌర దీపాల తయారీ, అమరిక, నిర్వహణ, మరమ్మతుల్లో నైపుణ్యం కల్పించారు. వీరిలో చాలామందికి చదవడం, రాయడం కూడా తెలియదు. అయినప్పటికీ రంగుల గుర్తులు, బొమ్మలు, ఆచరణాత్మక పద్ధతుల ద్వారా సాంకేతిక అంశాలను నేర్పించారు.

శిక్షణ పొందిన మహిళలు తిరిగి తమ గ్రామాలకు వెళ్లి సౌర విద్యుత్తు వ్యవస్థలను ఏర్పాటు చేశారు. వీరే ప్రపంచవ్యాప్తంగా 'సోలార్ మామాస్'గా గుర్తింపు పొందారు. ఈ ప్రయోగం భారత్‌కే పరిమితం కాకుండా ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాలకూ విస్తరించింది. ఆయా దేశాలకు చెందిన గ్రామీణ మహిళలు తిలోనియాకు వచ్చి శిక్షణ పొంది తమ ప్రాంతాల్లో సౌర విద్యుత్తు నిపుణులుగా పనిచేశారు.

సంజిత్ భార్య అరుణా రాయ్ కూడా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సామాజిక కార్యకర్త. ఐఏఎస్ అధికారిగా పనిచేసిన ఆమె ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి గ్రామీణ ప్రజల హక్కుల కోసం ఉద్యమించారు. 1970లో వివాహం చేసుకున్న ఈ దంపతుల సామాజిక నిబద్ధత గ్రామీణ ఉద్యమాలకు బలాన్నిచ్చింది.

బేర్‌ఫుట్ కాలేజీ ప్రత్యేకత

సాంకేతిక పరిజ్ఞానం కొద్దిమంది నిపుణుల చేతుల్లోనే ఉండకూడదన్నది ఈ కాలేజీ ప్రధాన ఉద్దేశం. అందులో భాగంగానే భవన నిర్మాణం నుంచి విద్యుత్తు వ్యవస్థల ఏర్పాటు వరకు గ్రామీణులే కీలక పాత్ర పోషించేలా సంజిత్ ప్రోత్సహించారు. చదవడం, రాయడం రాని 12 మంది గ్రామీణులు కాలేజీ భవన నిర్మాణంలో అద్భుత పనితీరు కనబరిచారు. వారి నిర్మాణ నైపుణ్యానికి 2002లో ‘ఆగా ఖాన్’ అవార్డు కూడా లభించింది. భవనాలపై పడే వర్షపు నీటిని సేకరించి భూగర్భ ట్యాంకుల్లో నిల్వ చేయడం, కాలేజీ విద్యుత్తు అవసరాలను సౌరశక్తితో తీర్చుకునేలా వ్యవస్థను రూపొందించడం ఈ నిర్మాణంలోని ప్రత్యేకతలు. కుల వివక్షను అధిగమించేందుకు కూడా సంజిత్ కృషి చేశారు. అన్ని కులాల వారికీ శిక్షణలో అవకాశం కల్పించారు.

సంజిత్ ప్రయాణం ఎన్నో పాఠాలు నేర్పుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం, వలసలు, విద్యుత్తు కొరత, తాగునీటి సమస్యలు, మహిళల ఉపాధి వంటి సవాళ్లకు స్థానిక ప్రజల భాగస్వామ్యంతోనే స్థిరమైన పరిష్కారాలు సాధ్యమవుతాయని ఆయన నిరూపించారు. ఇందుకోసం వారి అనుభవాన్ని, నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించాలి. పేదరికం అంటే ప్రతిభ లేకపోవడం కాదు.. అవకాశాలు లేకపోవడం. ఆ అవకాశాలను కల్పిస్తే గ్రామీణులే తమ భవిష్యత్తును నిర్మించుకోగలరు. సామాన్యుల సామర్థ్యానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన సంజిత్ తిలోనియాలో వెలిగించిన దీపాలు ఆయన ఆలోచనలకు సజీవ సాక్ష్యాలు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్