రాష్ట్రంలోని మన్య ప్రాంతాలైన అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో ఆదివాసీలు ‘పరిషత్’ ఎన్నికల్లో కూటమికి గట్టి ఝలక్ ఇచ్చారు. ఈ జిల్లాల్లో టిడిపి, జనసేన, బిజెపి పాలన పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అదే సమయంలో తమకు గత ప్రభుత్వ హయాంలో అన్యాయం తలపెట్టిన వైసిపిని కూడా పూర్తిగా ఆదరించలేదు. ఆదివాసీ చట్టాల పరిరక్షణ, గిరిజనుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరుబాటు సలిపిన ఎర్రజెండాను ఆదరించారు. సిపిఎం అభ్యర్థిగా అల్లూరి జిల్లా ముంచంగిపట్టు జెడ్‌పిటిసిగా పోటీ చేసిన కొర్రా త్రినాథ్‌కు అపూర్వ విజయం అందించారు. ఇదే జిల్లాలోని జికె.వీధి మండలం నుంచి జెడ్‌పిటిసి అభ్యర్థిగా పోటీ చేసిన ఎ.బుజ్జిబాబు, పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలం నుంచి పోటీ చేసిన లోతా రామారావు ద్వితీయ స్థానంలో నిలిచి సత్తా చాటారు. విఆర్.పురం, చింతూరు, అరకులోయ, డుంబ్రిగుడ మండలాల నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. వారికి మంచి ఓటింగ్ లభించింది. ఈ జిల్లాలో సిపిఎం ఏడు ఎంపిటిసి స్థానాల్లో గెలిచింది. పలుచోట్ల ద్వితీయ స్థానంలో నిలిచింది. ఆ పార్టీ అభ్యర్థులు టిడిపి కూటమికి, వైసిపికి ముచ్చెమటలు పట్టించారు. ప్రలోభాలు, మాయమాటలు చెప్పి ఆదివాసీలను మోసగిద్దామనుకున్న కూటమి కుయు క్తులను, వైసిపి అవకాశవాదాన్ని ఆదివాసీలు చైతన్యంతో తిప్పికొట్టారు. ఏజెన్సీలో సిపిఎం చేసిన పోరాటాలను, ఆ పార్టీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులు చేసిన అభివృద్ధిని చూసి యువత ఆలోచన చేసి తాజా పరిషత్ ఎన్నికల్లో ఓట్లు వేశారని పలువురు చెప్పుకుంటున్నారు. ముంచంగిపుట్టులో త్రినాథ్ గెలవగానే ఏజెన్సీలో యువత సందడి చేసింది. నిజమైన పోరాట యోధునికి దక్కిన విజయం అంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అభినందనలు తెలిపారు. ఇలాంటి వారు అన్నిచోట్లా ఎన్నిక కావాలని అభిలాషించారు.
సిపిఎం అభ్యర్థులకు ఓట్లు ఇలా...
సిపిఎం తరఫున గెలుపొందిన ముంచంగిపుట్టు జెడ్‌పిటిసి అభ్యర్థి త్రినాథ్‌కు 10,161 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి, వైసిపి అభ్యర్థి, తాజా మాజీ ఉమ్మడి విశాఖ జిల్లా జెడ్‌పి చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్రకు 6,735 ఓట్లు పోలయ్యాయి. త్రినాథ్ 3,426 ఓట్ల మెజార్టీతో గెలిచారు. సుభద్రపై గెలుపొందడం చర్చనీయాంశంగా మారింది. కూటమి సర్దుబాట్లలో భాగంగా ఈ స్థానం నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థి రెయ్యల శ్రావణ్ కుమార్‌కు 3,806 ఓట్లు మాత్రమే దక్కాయి. జికె.వీధి నుంచి సిపిఎం తరఫున జెడ్‌పిటిసిగా పోటీ చేసిన ఎ.బుజ్జిబాబుకు 5,093 ఓట్లు వచ్చాయి. ఆయన రెండో స్థానంలో నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈ స్థానంలో గెలిచిన వైసిపి అభ్యర్థి కె.గిరిప్రసాద్‌కు 10,471 ఓట్లు వచ్చాయి.
జనసేన, బిజెపి అభ్యర్థులు మూడు, నాలుగు స్థానాలకే పరిమితమయ్యారు. అరకులోయ నుంచి సిపిఎం తరఫున జెడ్‌పిటిసిగా పోటీ చేసిన గెమ్మెలి చిన్నబాబుకు 5,251 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో ఆయన నిలిచారు. ఇక్కడ పోటీ చేసిన టిడిపి అభ్యర్థి పి.దాసుబాబుకు, వైసిపి అభ్యర్థి కె.అశోక్‌కు ఆయన గట్టి సవాలు విసిరారు. డుంబ్రిగుడ నుంచి సిపిఎం తరఫున జెడ్‌పిటిసిగా పోటీ చేసిన ఎస్‌బి.పోతురాజుకు 3,379 ఓట్లు వచ్చాయి. ఇక్కడ వైసిపి, జనసేన, బిజెపిలకు ఆయన గట్టిపోటీదారుగా మారారు.
పోలవరం జిల్లాలో...
పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలం నుంచి సిపిఎం తరఫున జెడ్‌పిటిసి అభ్యర్థిగా పోటీ చేసిన లోతా రామారావుకు ఆదరణ లభించింది. ఆయన తన సమీప అభ్యర్థి మఠం విజయ భాస్కర్‌ను గట్టిగా ఢీకొట్టారు. ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి భర్త అయిన విజయభాస్కర్ (టిడిపి)కు 9,011 ఓట్లు రాగా, రామారావుకు 5,254 ఓట్లు వచ్చాయి. వైసిపి అభ్యర్థి కె.మురళీకృష్ణ మూడో స్థానానికే పరిమితమయ్యారు. విఆర్.పురం సిపిఎం జెడ్‌పిటిసి అభ్యర్థి కారం సుజాతకు 4,148 ఓట్లు దక్కాయి. ఈ స్థానంలో గెలుపొందిన వైసిపి అభ్యర్థి బి.విజయలక్ష్మికి 5,573 ఓట్లు వచ్చాయి. చింతూరు నుంచి సిపిఎం అభ్యర్థిగా పోటీ చేసిన మిడియం శ్రీదేవికి 4,460 ఓట్లు రాగా, ఇక్కడ గెలుపొందిన వైసిపి అభ్యర్థి ఎస్.అమలకు 8,869 ఓట్లు వచ్చాయి.
పోరాటాలే నిలబెట్టాయి...
సిపిఎంకు ఏజెన్సీలో ఆదరణ దక్కడానికి ఆ పార్టీ చేసిన పోరాటాలే కారణం. 1/70 చట్టాన్ని ఉల్లంఘించి కార్పొరేట్ కంపెనీలకు బాక్సైట్ మైనింగ్, హైడ్రో పవర్ ప్రాజెక్టులను అప్పగించడాన్ని, అల్లూరి జిల్లా అనంతగిరి, చింతపల్లి, జికె.వీధి, హుకుంపేట తదితర మండలాల్లో ప్రతిపాదిత బాక్సైట్ తవ్వకాలు, హైడ్రో పవర్ ప్రాజెక్టుల ఏర్పాటును నిరసిస్తూ ఏజెన్సీలో ఉధృత పోరాటాలు నిర్వహించింది. జిఒ 3 పునరుద్ధరణకు ఉద్యమించింది. పోలవరం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం, పునరావాసం కల్పించాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని పోరాటాలు నిర్వహించింది.
టిడిపి కూటమి, వైసిపిలు ఈ ప్రాంత ప్రజానీకాన్ని నిలువునా గోదాట్లో ముంచేసిన వైనాన్ని తెలియజెప్పింది. ఆదివాసీ స్పెషల్ డిఎస్‌సి ప్రకటించకుండా ప్రభుత్వం ఆడుతున్న నాటకాలు, ఐదో షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనుల భూములకు రక్షణగా ఉన్న 1/70 చట్టాన్ని రద్దు చేయాలని కొందరు గిరిజనేతరులు సుప్రీంకోర్టులో కేసులు వేయగా ప్రభుత్వం మిన్నకుండటాన్ని ఆదివాసీలు నిశితంగా గమనించారు. బిజెపి ప్రగల్భాలు, జనసేన అధినేత పవన్ ప్రదర్శిస్తున్న ‘డెవలప్‌మెంట్ షో’ ఈసారి ఏజెన్సీలో పనిచేయలేదు. మార్పు మొదలైంది’ అన్న చర్చ నేడు అడవి బిడ్డల్లో సాగుతోంది.
కోడూరు అప్పలనాయుడు







కామెంట్‌లు (0)