బుధవారం, 11 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనెతన్యాహుకు చెంపపెట్టు

1 గంట క్రితం

ఇజ్రాయిల్‌ ఎన్నికల్లో నెతన్యాహుకు ఎదురుగాలి- ఎవరకీ దక్కని మెజారిటీ- పుంజుకున్న ప్రతిపక్షాలు- కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026, 05:55 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

ప్రపంచంలోనే అత్యంత నరహంతక పాలన సాగించిన బెంజమిన్‌ నెతన్యాహూకు ఇజ్రాయిల్‌ ‌ఫలితాలు, అనంతర పరిణామాలు చెంపపెట్టు లాంటివి. క్నెసెట్‌ (పార్లమెంట్‌‌)లో 120 స్థానాలకు గాను 53 స్థానాలకే ఆయన నేతృత్వంలోని కూటమి చతికిలబడటం విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్య వాదులకు కొత్త ఆశలు చిగురింపజేసింది. ఎంతటి నియంతలైనా మట్టి కరవాల్సిందేనని ఆ దేశ ప్రజలు ఓటు ద్వారా తీర్పు ఇచ్చారు. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష నాయకుడు గాడి ఐసెన్‌కోట్‌ను ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ఆహ్వానించడం ఆ తీర్పును గౌరవించడమే. నెతన్యాహు విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రచారం చేసిన మాజీ సైనిక అధిపతి ఐసెన్‌ ‌కోట్‌ నేతృత్వంలోని యషర్‌ ‌పార్టీ 21 ఎంకెలతో రెండో స్థానంలో నిలిచినా, ఆయన నేతృత్వంలోని కూటమి 120 మంది సభ్యులున్న పార్లమెంట్‌‌లో 48 స్థానాలను పొందగలిగింది. రికార్డు స్థాయిలో 19 స్థానాలు సాధించిన అరబ్‌ ‌పార్టీలు మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 67 మంది సభ్యుల సంఖ్యాబలం లభించింది. నెతన్యాహూ నేతృత్వంలోని లికుడ్‌ ‌పార్టీ 27 స్థానాలతో పెద్ద పార్టీగా, ఆయన నాయకత్వంలోని కూటమి 53 స్థానాలు సాధించినా... ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం లభించే అవకాశం లేదు. తన కూటమిలో ఏడు స్థానాలు పొందిన యునైటెడ్‌ ‌తోరా జూడాయిజం పార్టీ మద్దతు తెలిపేందుకు చివరి నిమిషంలో నిరాకరించడం, మొత్తంగా 46 మందే మద్దతు ప్రకటించడం.. సొంత ఇంటిలోనే రాజుకున్న కుంపటికి నిదర్శనం. అరబ్‌ ‌పార్టీలను తీవ్రవాద పార్టీలుగా దూషిస్తూ, యూదు పార్టీలన్నీ ఏకం కావాలంటూ తన ఏలుబడిని కొనసాగించేందుకు వేస్తున్న ఎత్తుగడలు, ఆయన వెనుక ఉన్న ట్రంపునూ తక్కువ అంచనా వేయలేం.

1948లో ఇజ్రాయిల్ ఏర్పడిన తర్వాత జరిగిన యుద్ధం అనంతరం అక్కడే ఉండిపోయిన పాలస్తీనియన్లు, వారి వారసులతో కలిసి నేడు దేశ జనాభాలో 20 శాతం కంటే ఎక్కువ మంది ఉన్నారు. వారికి ఓటు హక్కుతో సహా ఇజ్రాయెల్ పౌరసత్వం ఉంది. గాజా, వెస్ట్ బ్యాంక్‌లోని పాలస్తీనియన్ల పట్ల వారికి సహజంగానే ఉన్న సంఘీభావాన్ని బూచిగా చూపుతూ ఉగ్రవాదులుగా, దేశ వ్యతిరేకులుగా నెతన్యాహూ నేతృత్వంలోని కూటమి ప్రచారం చేసింది. యూదులు, అరబ్బులు కలిసి సహజీవనం చేయాలన్న ప్రాధమిక సూత్రాన్ని విస్మరించి, పచ్చి మితవాదాన్ని రెచ్చగొట్టి సమాజాన్ని రెండుగా చీల్చేసింది. 19 ఏళ్లపాటు ఏలుబడి సాగించిన నెతన్యాహూ గాజాలోని చిన్నారులు, మహిళలు సహా 75 వేల మందికిపైగా పాలస్తీనియన్లను ఊచకోత కోయించి, లక్షలమందిని క్షతగాత్రులుగా, అన్నార్తులుగా మార్చేసిన నరహంతకుడిగా, యుద్ధ నేరస్తుడిగా ప్రపంచ ప్రజల చీత్కారానికి గురయ్యాడు. అత్యంత అవినీతిపరుడిగా, సుప్రీంకోర్టు అధికారాల్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నించిన నాయకుడిగా దేశంలో వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. ఇజ్రాయిల్‌‌ను అంధకారంలోకి, అగాధంలోకి నెతన్యాహు నెట్టేశాడన్న విశ్లేషణ అక్షరసత్యం. గాజా, ఇరాన్‌ ‌యుద్ధాలకు, ఘోరాలకు సహకారం అందించి, అంతులేని సామ్రాజ్యవాద దురహంకారంతో ప్రపంచానికే కంటకప్రాయంగా నిలిచిన ట్రంప్‌‌నకు గోడ దెబ్బ.. చెంప దెబ్బలాగ... ఇజ్రాయిల్‌ ఫలితాలతోపాటు అమెరికా మధ్యంతర ఎన్నికల రిజల్ట్స్‌ ఉండటం గమనార్హం.

నెతన్యాహు మితవాద - మత కూటమిని అధికారంలోకి రాకుండా నిరోధించడానికి, ఐసెన్‌కోట్‌కు అరబ్ పార్టీలు సూత్రప్రాయంగా మద్దతు ప్రకటించాయి. వారు ప్రభుత్వంలో భాగమవుతారా లేక ఐసెన్‌కోట్‌ను మైనారిటీ ప్రభుత్వాన్ని నడపడానికి అనుమతించడం ద్వారా బయటి నుండి మద్దతు ఇస్తారా అనేది స్పష్టం కావాలి.

నెతన్యాహు అదుపులేని సైనికవాదం ఇజ్రాయిల్‌ను అంతర్జాతీయంగా మరింత ఏకాకిని చేసింది. శత్రువులను అధికం చేసింది. అమెరికా ఫలితాలు బొప్పికట్టడంతో ట్రంప్‌ ‌సైతం ఈ మారణహోమానికి మద్దతు ఇవ్వడం కష్టమే. తన పొరుగు ప్రాంతాలలో ఎదుర్కొంటున్న భద్రతా సవాళ్లను తీవ్రతరం చేసింది. మరింత హింసను ప్రేరేపించడం ద్వారానే ఈ సమస్యలకు పరిష్కారం అంటున్న నెతన్యాహు వైఖరిని ఇజ్రాయిల్‌ ‌వాసులే ఈసడించుకుంటున్నారు.

ఐసెన్‌కోట్ ఇజ్రాయిల్‌‌ను మళ్లీ గాడిలో పెట్టాలి. తన కూటమిలోనే ఉన్న వామపక్షాలు (ది డెమొక్రాట్స్‌) నేత యాయిర్‌ ‌గోలన్‌ పిలుపునిచ్చినట్లు అరబ్‌ - యూదు ఐక్య ప్రభుత్వం ఏర్పాటు చేసి, సమాజంలోని అంతరాలను తగ్గించేందుకు, అంతర్గత గాయాలను మాన్పేందుకు దృష్టి సారించాలి. కొత్త ప్రభుత్వం అంతర్జాతీయ మధ్యవర్తిత్వంతో పాలస్తీనియన్లతో చర్చలు ప్రారంభించి, శాంతి మార్గాన్ని అనుసరించాలి. గాజా నుండి వైదొలగాలి. ఇజ్రాయిల్‌, పాలస్తీనా స్వతంత్ర దేశాలుగా ఉండాలన్న ప్రపంచ వైఖరి పట్ల, ఐరాస తీర్మానాల పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించాలి. ఇజ్రాయిల్‌‌లో శాంతి ఆ దేశ పతనాన్ని నిలువరించడంతోపాటు అంతర్జాతీయ సామరస్యానికి పునాది. నరహంతక నెతన్యాహు ఆలింగనంతో మన ప్రధాని మురిసిపోయారు. మితవాదం, విభజనవాదాలు ప్రజల సమస్యలను పరిష్కరించలేవని, అలాంటి పాలకులకు సరైన సమయంలో ప్రజలు సమాధానం చెబుతారని మన దేశ పాలకులు గుర్తించాలి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్