సుందరమను అడవి యుండె
అందు చాల పక్షులుండె
వాటి లోన చిట్టి యనెడి
రామ చిలుక ఒకటి ఉండె
ఒకనాడది గుంపు తోడ
ఎగురు చుండె పైన జూడ
దానికేమో కనిపించె
పసిడి ఉంగరపు జాడ
చిట్టి నేల పైకి వచ్చె
ఉంగరమును అదియు మెచ్చె
దాన్ని చిట్టి ముక్కు తోడ
పట్టుకొనుచు పైకి తెచ్చె
తోటి చిలుకలన్ని గనెను
దాని తోడ యిట్లనియెను
‘ఓ చిట్టీ! ఉంగరంబు
పనికిరాదు అది మనకును
పేదవారి ముందు నీవు
దాన్ని నేల జార విడువు
అది దొరకిన వారి లేమి
కొంతవరకు తొలగిపోవు’
అని పలికిన చిట్టి వినెను
'మంచిద'నుచు అది పలికెను
దాన్ని చిట్టి జార విడిచె
అది పిసినారికి దొరకెను
పిసినారియు తీసుకొనెను
తన భాగ్యము తలచుకొనెను
అట్టి పైడి ఉంగరమును
రాయి పైన పెట్టు కొనెను.
చిట్టి నేల పైకి దిగెను
ఆహారం తినుచుండెను
అతడు దాన్ని పట్టుకొనీ
బుట్ట లోన వేసుకొనెను
తోటి చిలుకలన్ని చూచె
'అయ్యో! చిట్టి' యని అరచె
దానిని విడిపించుటకై
వాటికి ఒక యుక్తి తోచె
అవి అన్ని కూడి కదలె
నేల పైకి వచ్చి వాలె
లోభికాశ కలిగించుచు
అతని సమీపాన మెదలె
అతడు ఎంతొ సంతసించె
వాటి కొరకూ యోచించె
బుట్ట మూత మరచిపోయి
అత్యాశతో యత్నించె
ఇది అంతయు చిట్టి చూచె
దాని కొక్క ఊహ తోచె
బుట్ట లోంచి పైకి వచ్చి
ఉంగరముతో పైకి లేచె
దాన్ని చిలుకలన్ని చూచె
అవి కూడా పైకి లేచె
అవి చిట్టితో జతను గూడి
ఆకాశంలో పయనించె
లోభి తిరిగి వచ్చెనాయె
ఉంగరమూ దక్కదాయె
చిలుకలేమో చిక్కవాయె
బాధ తోడ ఏడ్చెనాయె
అత్యాశయు పిల్లలార!
పనికిరాదు కూనలార!
అది దుఃఖము కలిగించీ
బాధపెట్టు బాలలార!
- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య,
ధర్మపురి, 99085 54535.







కామెంట్‌లు (0)