పండుగలు మనుషులను కలుపుతాయి. కులం, మతం, జాతుల భేదం లేకుండా అందరూ ఒక్కటై ఆనందాలు, ఆత్మీయతలతో జరుపుకునేదే అసలైన పండుగ. భారతీయ సంస్కృతి సౌందర్యం అదే. దీపావళికి వెలిగించే మట్టిప్రమిదలు, టపాకాయల వెనుక ఇలాంటి మతసామరస్యపు కథలు ఎన్నో ఉన్నాయి. ఎక్కడో ముస్లిం కుటుంబాలు తరతరాలుగా హిందువుల కోసం మట్టిప్రమిదలు తయారుచేస్తుంటే.. మరెక్కడో హిందూ, ముస్లిం కుటుంబాలు కలిసి దీపావళి సంబరాలు చేసుకుంటున్నాయి. ఇంకోచోట ముస్లిం మహిళలు రామాలయంలో ఉర్దూలో హారతి ఇస్తున్నారు. మతాలకతీతంగా సాగుతున్న ఈ వేడుకలు భిన్నత్వంలో ఏకత్వానికి నిలువెత్తు నిదర్శనాలు. జమ్మూకాశ్మీర్ నుంచి పంజాబ్ వరకు, ఉత్తరప్రదేశ్ నుంచి అసోం, పశ్చిమబెంగాల్ వరకు దేశంలోని పలు ప్రాంతాల్లో కనిపించే ఈ మతసామరస్యపు వేడుకలు దీపావళి వెలుగులకు మరింత అర్థాన్ని ఇస్తున్నాయి.
జమ్మూకాశ్మీర్ ఉధంపూర్‌లో మహ్మద్ ఫరూక్ కుటుంబం బైష్తి గ్రామంలో నివసిస్తోంది. ఈ కుటుంబంలో తండ్రి, కొడుకులు కలిసి దీపావళి పండుగ కోసం వేలాది మట్టిప్రమిదలు తయారుచేస్తున్నారు. 50 రకాలలో వీరు తయారుచేసే ప్రమిదలకు చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి గిరాకీ ఉంటుంది. 18 ఏళ్ల వయసులో ఈ వృత్తిని చేపట్టిన ఫరూక్, 35 ఏళ్లుగా దీన్ని కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతంలోనే కాదు, జమ్మూకాశ్మీర్‌లో కథువా వంటి అనేక చోట్ల కూడా హిందూ, ముస్లింలు అందరూ ఏకమై ఈ దీపావళిని జరుపుకుంటారు. సంప్రదాయాన్ని గౌరవిస్తూ, మతసామరస్యాన్ని కాపాడుతూ ప్రతి దీపావళిని మరింత కాంతులమయం చేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ సిలిగురి సమీపంలోని ల్యూసిపాక్రి ప్రాంతంలో డజన్ల కొద్దీ ముస్లిం కుటుంబాలు కొన్నేళ్లుగా రంగురంగుల మట్టిప్రమిదలు, టపాకాయలు సిద్ధం చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ వారణాసిలో దీపావళి రోజు ముస్లిం మహిళలు రామాలయంలో ఉర్దూలో హారతి ఇచ్చి పండుగను జరుపుకుంటారు. 20 ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. వారణాసిలో ఉగ్రవాదుల దాడి జరిగిన 2006 సంవత్సరం నుండి ఈ పద్ధతిని పాటిస్తున్నట్లు నజ్మా పర్వీన్ అనే ముస్లిం మహిళ చెబుతున్నారు. ‘విశాల్ భారత్ సంస్థాన్’ అనే సంస్థ సభ్యురాలైన నజ్రీన్ ఈ ఆనవాయితీ గురించి మాట్లాడుతూ.. ‘మేము భారతదేశ మతసామరస్యాన్ని కాపాడుతున్నాం. తరతరాలుగా మా (హిందూ, ముస్లిం) పూర్వీకులు ఇదే ఆచరించి చూపారు. మేము ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాం’ అంటున్నారు. పంజాబ్ మలేర్ కొట్లా దగ్గర ఇంకో భిన్నమైన వాతావరణం ఈ దీపావళికి కనిపిస్తుంది. మాల్వా ప్రాంతంలో హిందువులు, ముస్లింలు, సిక్కుల కుటుంబాలు ఎక్కువగా నివసిస్తుంటారు. అక్కడ ప్రతి దీపావళికి మూడు మతాల వారు బహుమతులు, స్వీట్లు, టపాకాయలు ఇచ్చిపుచ్చుకుంటారు. స్థానికంగా గల 'హర్ఫ్' చారిటీ సంస్థ నిర్వాహకుడు అమ్జద్ అలీ దీని గురించి మాట్లాడుతూ.. ‘తరతరాలుగా మేమంతా కలిసి జీవిస్తున్నాం. అన్ని పండుగలు కలిసే నిర్వహించుకుంటాం’ అంటున్నారు.
అసోం రాష్ట్రంలోని నల్బరి జిల్లాలో ఉన్న సందేలి, పొకువా, పనిగావ్ గ్రామాలు దీపావళి పండుగ వేళ మతసామరస్యానికి సరికొత్త నిర్వచనం చెబుతున్నాయి. కులమతాలకు అతీతంగా ఇక్కడి హిందూ, ముస్లిం ప్రజలు కలిసికట్టుగా దీపావళి, కాళీ పూజలను కొన్నేళ్లుగా కలిసి నిర్వహించుకుంటున్నారు. ఈ మూడు గ్రామాల మధ్య ఉన్న 'మిలన్ చౌక్' కూడలి ప్రాంతం ప్రతి ఏడాది దీపావళి సంబరాలకు ప్రధాన వేదికగా మారుతుంది. సుమారు 2 లక్షల మంది ప్రజలు ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. వేడుకల నిర్వహణలో పూజా మండపాల అలంకరణ నుండి ప్రసాద వితరణ వరకు ప్రతి పనిలోనూ హిందువులు, ముస్లింలు సమాన బాధ్యత వహిస్తారు. పూర్వీకులు తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికీ మూడు గ్రామాల ప్రజలు తూచా తప్పకుండా పాటించడం అక్కడ కనిపిస్తుంది.
‘మతం వేరు.. ఆచారాలు వేరు.. అయితే.. ‘మనుషుల మధ్య అనుబంధాలకు అవి అడ్డుకావు’ అని ఈ ఉదాహరణలు చెబుతున్నాయి. ఒకరి పండుగలో మరొకరు భాగస్వాములవుతూ, ఒకరి ఆనందాన్ని మరొకరు పంచుకుంటూ తరతరాలుగా మతసామరస్య సంప్రదాయాలను కొనసాగించడం భారతీయ సమాజంలోని భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం. మతం పేరుతో మనుషుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఈ ఐక్యతా దృశ్యాలు ఎంతో స్ఫూర్తినిస్తాయి. అజ్ఞాన చీకట్లు తొలగి విజ్ఞాన కాంతులు వెల్లివిరియాలంటే మనుషుల మధ్య ప్రేమ, ఆత్మీయతలు పెరగాలి. అదే దీపావళి ఇచ్చే నిజమైన సందేశం.









కామెంట్లు (0)