మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అనవసర మందులతో ఆరోగ్యానికి ముప్పు!

4 గంటల క్రితం

అనవసర మందులతో ఆరోగ్యానికి ముప్పు! image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 04:30 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే ఒక మాత్ర వేసుకోవడం చాలామందికి అలవాటు. తలనొప్పి వస్తే ఒకటి, నీరసంగా ఉంటే మరొకటి, విటమిన్ల లోపం ఉందని తెలిస్తే ఇంకొన్ని మాత్రలు.. ఇలా రోజువారీ జీవితంలో మందుల వినియోగం పెరిగిపోతోంది. వైద్యుల సలహాతో తీసుకునే మందులతోపాటు సొంతంగా కొనుగోలు చేసే మాత్రలు, నొప్పి నివారణ మందులు, విటమిన్ సప్లిమెంట్లు, జీర్ణ సమస్యలకు వాడే మందులు కూడా ఈ జాబితాలో చేరుతున్నాయి. ఒకే వ్యక్తి వివిధ ఆరోగ్య సమస్యల కోసం వేర్వేరు వైద్యులను సంప్రదించడం వల్ల మందుల సంఖ్య మరింత పెరుగుతోంది. అయితే మనం తీసుకుంటున్న మందులన్నీ నిజంగా అవసరమేనా? వాటిలో కొన్ని అనవసరమైనవైతే ఆరోగ్యానికి మేలు కంటే కీడే ఎక్కువ చేసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఐదు లేదా అంతకంటే ఎక్కువ మందులు ఒకేసారి తీసుకునే పరిస్థితిని వైద్య పరిభాషలో 'పాలీఫార్మసీ' అంటారు. ఢిల్లీకి చెందిన డాక్టర్ చంద్రకాంత్ లహరియా తన వైద్య అనుభవంలో రోజుకు పది కంటే ఎక్కువ మాత్రలు తీసుకునే రోగులను కూడా చూశానని చెబుతున్నారు. వివిధ వైద్యులు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్లను పరిశీలించినప్పుడు రెండు నుంచి పది వరకు మందులు అనవసరమైనవిగా గుర్తించినట్లు ఆయన చెప్పారు. రోగులు తీసుకుంటున్న మందులన్నింటినీ సమీక్షించి, వాటిలో నిజంగా అవసరమైనవి ఏవో గుర్తించడం కీలకమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మందులు పెరిగితే సమస్యలూ పెరుగుతాయి

ఒకేసారి ఎక్కువ మందులు తీసుకోవడం వల్ల వికారం, వాంతులు, తలతిరగడం, నీరసం, మలబద్ధకం వంటి దుష్ప్రభావాలు రావొచ్చు. కొన్ని మందులు ఒకదానితో మరొకటి ప్రతికూలంగా స్పందించవచ్చు. ఒక మందు ప్రభావాన్ని మరో మందు తగ్గించవచ్చు లేదా పెంచవచ్చు. దీంతో మందుల మోతాదులో మార్పులు చేయాల్సి రావొచ్చు. కొన్నిసార్లు కొత్తగా వచ్చిన ఆరోగ్య సమస్యకు కారణం వ్యాధి కాకుండా, తీసుకుంటున్న మందుల దుష్ప్రభావం కూడా కావొచ్చు. వయసు పెరిగే కొద్దీ కాలేయం, మూత్రపిండాల పనితీరులో మార్పులు రావొచ్చు. దీంతో మందులు శరీరంలో ఎక్కువసేపు ఉండటం లేదా వాటి ప్రభావం అధికంగా కనిపించడం జరగవచ్చు. కొన్ని మందుల వల్ల అయోమయం, జ్ఞాపకశక్తి సమస్యలు, నిద్రమత్తు, సమతుల్యత కోల్పోవడం, అకస్మాత్తుగా పడిపోవడం వంటి ప్రమాదాలు పెరగొచ్చు. ముఖ్యంగా ఒకేసారి అనేక మందులు తీసుకునే వృద్ధులు మందుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన మందుల వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలతోపాటు ఆర్థిక భారం కూడా పెరుగుతుంది.

విటమిన్ మాత్రలు అవసరమేనా?

ప్రస్తుతం చాలామంది వైద్యుల సలహా లేకుండానే విటమిన్ డి, విటమిన్ బి12, మెగ్నీషియం వంటి సప్లిమెంట్లను తీసుకుంటున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్లు అవసరమనే భావనతో వాటిని రోజూ వాడుతున్నారు. సోషల్ మీడియా ప్రచారాలు, ప్రకటనలు కూడా ఈ అలవాటును పెంచుతున్నాయి. అయితే ప్రతి ఒక్కరికీ అన్ని విటమిన్ల అవసరం ఉండదు. పోషకాహార లోపం ఉందా? దాని వల్ల ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? అనే విషయాలను వైద్యులు పరిశీలించిన తరువాతే నిర్ధారణకు రావాలి. విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అవసరమే అయినప్పటికీ వాటిని అధిక మోతాదులో తీసుకోవడం ప్రమాదకరమే. కొన్ని విటమిన్లు శరీరంలో నిల్వ ఉండి అధిక మోతాదులో తీసుకున్నప్పుడు విషపూరిత ప్రభావాలకు కారణమవుతాయి. అందువల్ల విటమిన్ మాత్రలు కూడా మందులుగానే పరిగణించి, వైద్యుల సూచన మేరకు వాడాలి.

సొంత వైద్యం.. మరో ప్రమాదం

తలనొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు, జీర్ణ సమస్యలు వచ్చినప్పుడు చాలామంది గతంలో వాడిన మందులనే మళ్లీ కొనుగోలు చేస్తుంటారు. కొందరు కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు సూచించిన మందులను తీసుకుంటారు. మరికొందరు ఇంట్లో మిగిలిపోయిన పాత మందులను వాడుతుంటారు. మందుల దుకాణాల్లో వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే కొన్ని మందులు కొనుగోలు చేయడం కూడా సాధారణంగా మారింది. అయితే ఒకసారి ఉపయోగించిన మందు మరోసారి అదే సమస్యకు సరిపోతుందని భావించడం సరికాదు.

మందులు తగ్గించుకోవడం ఎలా?

మందుల సంఖ్య తగ్గించుకోవాలంటే ముందుగా వైద్యుడిని సంప్రదించాలి. ప్రస్తుతం వాడుతున్న ప్రిస్క్రిప్షన్ మందులు, సొంతంగా కొనుగోలు చేస్తున్న మాత్రలు, విటమిన్ సప్లిమెంట్లు, ఆయుర్వేద లేదా ఇతర ప్రత్యామ్నాయ మందులు.. అన్నింటి వివరాలను ఒకచోట రాసుకోవాలి. వీలైతే మందుల ప్యాకెట్లు లేదా వాటి ఫొటోలను వైద్యుడికి చూపించాలి. ఏ మందు ఎందుకు వాడుతున్నాం? ఎంతకాలం వాడాలి? ఇంకా అవసరమా? అనే విషయాలను అడిగి తెలుసుకోవాలి.

దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఒకే వైద్యుడి పర్యవేక్షణలో చికిత్స పొందడం మంచిది. ఒకరి కంటే ఎక్కువ మంది వైద్యులను సంప్రదిస్తున్నప్పుడు, ప్రతి వైద్యుడికి తాము వాడుతున్న ఇతర మందుల వివరాలను తప్పనిసరిగా తెలియజేయాలి. కొత్త మందు ప్రారంభించే ముందు దాని అవసరం, ప్రయోజనం, దుష్ప్రభావాలు, ఎంతకాలం వాడాలి అనే విషయాలను తెలుసుకోవాలి. అవసరమైతే ఫార్మసిస్ట్ సహాయంతో కూడా మందుల జాబితాను సమీక్షించుకోవచ్చు.

మందులు మానేయడం పరిష్కారం కాదు!

ఎక్కువ మాత్రలు వాడుతున్నామని భావించి సొంతంగా మందులు ఆపేయడం మంచిది కాదు. ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులకు వాడే మందులను వైద్యుల సూచన లేకుండా ఆపకూడదు. కొన్ని మందులను ఒక్కసారిగా ఆపకుండా క్రమంగా తగ్గించుకోవాలి. అలా చేయకపోతే వ్యాధి మళ్లీ తీవ్రం కావడం, మందులు ఆపిన ప్రభావాలు కనిపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అనవసరమైన మందులను తగ్గించడం కూడా ఒక వైద్య ప్రక్రియే. దీనిని వైద్య పరిభాషలో 'డిప్రిస్క్రైబింగ్' అంటారు. అంటే రోగికి ప్రస్తుతం అవసరం లేని, ప్రయోజనం కంటే ప్రమాదం ఎక్కువగా ఉన్న మందులను వైద్యుడి పర్యవేక్షణలో క్రమంగా తగ్గించడం లేదా నిలిపివేయడం. దీనివల్ల మందుల దుష్ప్రభావాలు తగ్గే అవకాశం ఉంటుంది.

ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, తగినంత నిద్ర, ఒత్తిడి నియంత్రణ వంటి జీవనశైలి మార్పులు ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని ఆరోగ్య సమస్యల్లో ఈ మార్పులు మందుల అవసరాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చు. అయితే మందులకు ప్రత్యామ్నాయంగా వీటిని భావించకూడదు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్