మనిషి తినే ఆహారం కేవలం ఆకలి తీర్చడానికే కాదు. మన పేగుల్లో నివసించే కోట్లాది సూక్ష్మజీవులకు కూడా అదే ఆహారం. మనం ఏం తింటున్నాం, ఎలాంటి జీవనశైలిని అనుసరిస్తున్నాం, మన చుట్టూ ఉన్న పర్యావరణం ఎలా ఉంది అనే అంశాలను బట్టి పేగుల్లోని ఈ సూక్ష్మజీవుల సమూహం మారుతూ ఉంటుంది. ఈ సూక్ష్మజీవుల సముదాయాన్నే గట్ మైక్రోబయోమ్ అంటారు. జీర్ణక్రియతోపాటు శరీరంలోని అనేక జీవక్రియల్లో వీటి పాత్ర ఉంటుంది. భారతదేశంలోని గిరిజన సమాజాలపై జరిగిన తాజా పరిశోధన ఈ కనిపించని ప్రపంచం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
దేశంలోని నాలుగు భౌగోళిక ప్రాంతాలకు చెందిన ఎనిమిది గిరిజన సమాజాల్లోని 76 మంది ఆరోగ్యకరమైన పెద్దల ఆహారపు అలవాట్లు, మల నమూనాలను పరిశోధకులు విశ్లేషించారు. వార్లీ, గోండ్, మాడియా, కబుయి లేదా రొంగ్మీ నాగ, బాల్టీ, బోటో, బ్రోక్ఫా, పురిగ్పా సమాజాలు ఇందులో ఉన్నాయి. వీరి ఆహారంలో ప్రాంతానికో ప్రత్యేకత కనిపించింది. కొందరి ఆహారంలో బియ్యం, అడవి పండ్లు, ఆకుకూరలు, స్థానిక కూరగాయలు ఉంటే.. ట్రాన్స్-హిమాలయ ప్రాంతంలోని సమాజాల్లో పాలు, వెన్న, పెరుగు, గోధుమ, బార్లీకి ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ఈ ఆహారపు తేడాలకు అనుగుణంగానే వారి పేగుల్లోని సూక్ష్మజీవుల నిర్మాణంలోనూ తేడాలు కనిపించాయి.
ఆహారంతో మార్పు
పరిశోధనలోని చాలా గిరిజన సమాజాల్లో బియ్యం ప్రధాన ఆహారంగా ఉంది. పసుపు, మిరపకాయలు, ఇంట్లో పండించే కూరగాయలు, అడవి పండ్లు, ఆకుకూరలు వంటి మొక్కల ఆధారిత ఆహారం కూడా ఎక్కువగా ఉంది. మాంసం లేదా చేపలను సగటున వారానికి రెండుసార్లు తీసుకునేవారు. కొన్ని సమాజాల్లో పులియబెట్టిన ఆహారాలు, స్థానికంగా తయారుచేసే పానీయాల వినియోగం కూడా ఉంది. ప్రాసెస్ చేసిన ఆహారం, అధిక చక్కెర, అధిక కొవ్వు పదార్థాల వినియోగం మాత్రం తక్కువగా కనిపించింది. ట్రాన్స్-హిమాలయ ప్రాంతంలోని బాల్టీ, బోటో, బ్రోక్ఫా, పురిగ్పా సమాజాల ఆహారం మాత్రం భిన్నంగా ఉంది. పాలు, వెన్న వంటి పాల ఉత్పత్తులతోపాటు గోధుమ, బార్లీ రోజువారీ ఆహారంలో భాగంగా ఉన్నాయి. కొన్ని సమాజాల్లో పెరుగు, మజ్జిగ వంటి పులియబెట్టిన పాల పదార్థాలకూ ప్రాధాన్యం ఉంది. ఈ సమాజాల పేగుల్లో బిఫిడోబాక్టీరియం అనే సూక్ష్మజీవి ఇతర సమాజాలతో పోలిస్తే ఎక్కువగా కనిపించింది. పాలలోని లాక్టోజ్, గెలాక్టోజ్ వంటి చక్కెరలను ఉపయోగించుకునే జీవక్రియలకు సంబంధించిన జన్యువులు ఈ సూక్ష్మజీవుల్లో ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
ధాన్యాల ప్రభావం
ట్రాన్స్-హిమాలయ సమాజాల్లో బార్లీ, గోధుమ వంటి ధాన్యాలు రోజువారీ ఆహారంలో భాగం. వీటిలో ఉండే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి కొన్ని ప్రత్యేక ఎంజైమ్‌లు అవసరం. పరిశోధకులు ఇలాంటి ఎంజైమ్‌లను కూడా పరిశీలించారు. మొక్కల నుంచి వచ్చే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను విచ్ఛిన్నం చేసే కొన్ని ఎంజైమ్ కుటుంబాలు ట్రాన్స్-హిమాలయ సమాజాల పేగుల్లో మిగిలిన సమాజాలతో పోలిస్తే దాదాపు వెయ్యి రెట్లు అధికంగా కనిపించాయి. బిఫిడోబాక్టీరియం అడొలెసెంటిస్‌తో సంబంధం ఉన్న మరో ఎంజైమ్ కుటుంబం దాదాపు పది రెట్లు అధికంగా ఉంది. అంటే.. మనం తరచుగా తినే ఆహారం పేగుల్లోని సూక్ష్మజీవులకు ఒక రకమైన పని అప్పగిస్తున్నట్లుగా కనిపిస్తోంది. బార్లీ, గోధుమ వంటి ధాన్యాల్లోని సంక్లిష్ట పిండి పదార్థాలు, పీచును ఉపయోగించుకోగల సూక్ష్మజీవులకు ఆహారం అందుబాటులో ఉండటంతో.. వాటికి అనుగుణంగా పనిచేసే సూక్ష్మజీవులు పేగుల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతాల్లో పాలు, పెరుగు, వెన్న వంటి పదార్థాలు ఆహారంలో భాగం కావడంతోపాటు మనుషులు, పశువుల మధ్య సన్నిహిత సంబంధం ఉంది. పరిశోధనలో కనిపించిన కొన్ని సూక్ష్మజీవులు పశువులు, వాటి జీర్ణవ్యవస్థ, పాల ఉత్పత్తులతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. కాబట్టి ఆహారంతోపాటు జీవన విధానం కూడా పేగు సూక్ష్మజీవులపై ప్రభావం చూపి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
మారుతున్న ఆహారం
తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయ ఆహార విధానాలు మారితే.. వాటితో ముడిపడిన పేగు సూక్ష్మజీవుల ప్రపంచం కూడా మారుతుందా? అన్నది ఇప్పుడు కీలకమైన ప్రశ్న. గిరిజన సమాజాలు కూడా క్రమంగా మార్కెట్ ఆహారం, ప్యాకెట్ పదార్థాలు, ప్రాసెస్ చేసిన ఆహారం, పట్టణ జీవనశైలికి చేరువవుతున్నాయి. ఆహారపు అలవాట్లు మారుతున్న కొద్దీ పేగుల్లోని సూక్ష్మజీవుల నిర్మాణంలోనూ మార్పులు రావచ్చని పరిశోధన సూచిస్తోంది. పరిశోధకులు గిరిజన సమాజాల సూక్ష్మజీవులను పారిశ్రామిక జీవనశైలిని అనుసరించే జనాభాతోనూ పోల్చారు. అమెరికాలోని కాలిఫోర్నియా జనాభాతో పోల్చినప్పుడు గణనీయమైన తేడాలు కనిపించాయి. అయితే ఈ తేడాలకు ఆహారం ఒక్కటే కారణమని చెప్పలేం. జీవనశైలి, పర్యావరణం, భౌగోళిక పరిస్థితులు వంటి అనేక అంశాలు కారణం కావొచ్చు.
ఈ పరిశోధన ఒక విలువైన విషయాన్ని స్పష్టం చేస్తోంది. భారతదేశంలోని ఆహార వైవిధ్యం మన సంస్కృతిలో మాత్రమే కాదు.. మన శరీరంలో నివసించే సూక్ష్మజీవుల ప్రపంచంలోనూ కనిపిస్తోంది. ఈ అధ్యయనంలో మేటాజెనోమిక్ విశ్లేషణ ద్వారా 14 కొత్త బ్యాక్టీరియా జాతులు, సుమారు 200 స్థానిక జాతి స్థాయి సూక్ష్మజీవుల జన్యు నమూనాలు గుర్తించారు. అంటే ఇప్పటికీ శాస్త్రానికి పూర్తిగా తెలియని సూక్ష్మజీవుల ప్రపంచం మన దేశంలోని తక్కువగా అధ్యయనం చేసిన సమాజాల్లో పెద్దగా ఉండవచ్చని అర్థమవుతోంది. మన తీసుకునే ఆహారం మారితే మన పేగుల్లోని సూక్ష్మజీవుల ప్రపంచం మీదా ఆ ప్రభావం ఉంటుంది. అందుకే గిరిజన సమాజాల సంప్రదాయ ఆహారాలను కేవలం సాంస్కృతిక వారసత్వంగా కాకుండా.. భవిష్యత్తు ఆరోగ్య పరిశోధనలకు ఉపయోగపడే జీవ వైవిధ్య సంపదగా కూడా చూడాల్సిన అవసరం ఉంది.







కామెంట్‌లు (0)