ప్రపంచంలో ఎక్కడైనా అమ్మాయిలు, అబ్బాయిలకు సమాన హక్కులు ఉంటాయి. అలా ఉండడం నాగరిక సమాజ లక్షణం. కోరినది తినడం దగ్గర నుండి, నచ్చినది ధరించడం వరకు అన్నీ సమానమే.. కానీ సమాజంలో ఎన్నో ఉదాహరణలు 'అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు ఆ స్వేచ్ఛ లేదు' అని చెబుతున్నాయి. ముఖ్యంగా అబ్బాయిలతో సమానంగా అమ్మాయి బైక్ నడిపే విషయం ఇప్పటికీ చాలామందికి విడ్డూరం. రోడ్డు మీదకు బైక్ తీసుకుని అమ్మాయి వచ్చిందంటే చాలు.. ఆమె చుట్టూ ఆకతాయిలు కాపుకాసి ఉంటారు. అసభ్య పదజాలంతో వేధిస్తారు. ఆమె బైక్‌ను దాటుకుంటూ వేగంగా వెళ్లడం, కొంత దూరం వెళ్లి వెనక్కు వస్తూ ఫోన్లలో వీడియోలు తీయడం, అసభ్య సంజ్ఞలు చేయడం చాలామంది అమ్మాయిలకు అనుభవమే. తాజాగా ఢిల్లీ గురుగ్రామ్‌లో శివానీ చౌహాన్ అనే మహిళా బైక్ రైడర్‌ను కారులో వస్తున్న కొంతమంది ఉద్దేశపూర్వకంగా అడ్డగించారు. కారుతో బైక్‌ను ఢీకొడుతూ ఆమెను వెంబడించారు. ఆ ఘటనలో శివానీ రోడ్డుపై అడ్డంగా పడిపోయారు. దెబ్బలు తగిలాయి. ఈ మొత్తం ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తరువాత జరిగిన పరిణామాలకు తీవ్రంగా కలత చెందిన శివానీ 'రోడ్డు మీదకు రావడానికి మహిళలు ఇప్పటికీ భయపడాల్సిందేనా?' అని ప్రశ్నిస్తున్నారు.
దక్షిణ ఢిల్లీ కలకాజీలో 27 ఏళ్ల శివానీ నివసిస్తోంది. బైక్ నడపడం తనకు చిన్నప్పటి నుండి ఇష్టం. ‘సియా' పేరుతో తన గుర్తింపును బయటపడకుండా ముఖానికి మాస్క్ ధరించి బైక్ రైడింగ్ వీడియోలను తన ఇన్‌స్టాలో పోస్టు చేస్తుంటుంది. తాజా ఘటన తరువాతే ఆ ఇన్‌స్టా పేజీ శివానీది అని అందరికీ తెలిసింది. ఇలా జరగడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదు. 'ప్రమాదం తరువాత జరిగిన పరిస్థితులే తనను బయటకు వచ్చేలా చేశాయ'ని శివానీ చెబుతోంది.
'నా గుర్తింపు నా వ్యక్తిగత నిర్ణయం.. కానీ ఇప్పుడు అది నా చేతుల్లో లేకుండా పోయింది' అని శివానీ ఎంతో ఆవేదనగా మీడియా ముందు మాట్లాడింది. తనను కారుతో ఢీకొట్టిన కళ్యాణ్ బైన్ల్సా 'ఉద్దేశపూర్వకంగా చేయలేదని, భయపడి పారిపోయాన'ని సమర్ధించుకుంటూ ఓ మీడియా ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కళ్యాణ్ అనుచరులు అనేకమంది శివానీని విపరీతంగా ట్రోల్ చేస్తూ ఆ వీడియో కింద పోస్టులు పెట్టారు. ‘అసలు నువ్వెవరు? నీ గుర్తింపు ఏంటి? బయటకు కనిపించడానికి ఇంతలా భయపడే దానివి బైక్ తీసుకుని రోడ్డు మీదకు ఎందుకు వచ్చావు?' అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. వాటన్నింటికీ సమాధానంగానే శివానీ మాట్లాడింది. ఆమె మాట్లాడిన ప్రతి మాట శివానీకి మాత్రమే పరిమితమైనది కాదు.. రోడ్డు మీద ఒంటరిగా ప్రయాణించే ప్రతి మహిళది. ‘నన్ను ఇంతలా వేధిస్తున్న ఈ మనుషులు ఏ సమాజం నుండి వచ్చారు? బైక్ తీసుకుని ఒక మహిళ రోడ్డు మీదకు వచ్చిందంటే తనకు ఎంతో శక్తి ఉందని నమ్మండి. ఇలాంటి ప్రేలాపనలకు నేనే కాదు.. ఏ మహిళా రైడర్ భయపడరు. ఎన్ని అవహేళనలు పడుతున్నా.. మా అభిరుచులను నెరవేర్చుకోవడంలో మేము వెనక్కు తగ్గం..' అని శివానీ అన్నారు.
ప్రమాదం తరువాత కారు ఆపకుండా కళ్యాణ్ వెళ్లిపోయాడు. శివానీతో పాటు రైడ్ చేస్తున్న ఇతర రైడర్లు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఈ ఘటనలో శివానీ బైక్ పూర్తిగా దెబ్బతిన్నది. అది తన మొదటి బైక్. దానితో తనకు ఎంతో అనుబంధం ఉంది. ప్రమాదం జరిగిన తీరును శివానీ ఆ రోజు సాయంత్రం వీడియో రూపంలో ఇన్‌స్టాలో పోస్టు చేసింది. అప్పుడు కూడా తను మాస్క్ ధరించే ఉంది. ఎప్పుడైతే కళ్యాణ్ తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకునేలా మాట్లాడాడో అప్పుడే శివానీ తన గుర్తింపును బయటపెట్టింది. 'కళ్యాణ్ ఈ ఘటనను చాలా తేలికగా తీసుకున్నాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నా.. బెయిల్ ఇచ్చారు. కానీ ఆ ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే.. అప్పుడు నేను చనిపోయేదాన్ని' అని ఆమె పేర్కొన్నారు.
కోర్టుకు వెళ్లినప్పుడు కూడా శివానీ అంతే గట్టిగా తన వాదన వినిపించింది. ‘‘బైక్ రైడింగ్ చేయడం నా అభిరుచి. అందరిలా నేను కూడా ఆదివారం వెళ్లాను. అప్పుడు నన్ను చాలామంది అబ్బాయిలు వేధించారు. ఎప్పుడూ ఇలానే జరుగుతుంది. వాటన్నింటినీ దాటుకుని ఇక్కడికి వరకు వచ్చాను. ఇప్పుడు నన్ను చంపడానికి చూశారు. ఇది చిన్న తప్పు కాదు' అని వాదించింది. 'అన్ని రోడ్లు అమ్మాయిలకు సురక్షితంగా లేవు. అయితే ఇది కేవలం రైడింగ్‌కు సంబంధించిన విషయం కాదు.. ఎవరికైనా ఇలాంటి అనుభవం ఎదురైతే.. సోషల్ మీడియాలో పోస్టు చేయండి. సంబంధిత వ్యక్తులపై ఫిర్యాదు చేయండి. మనం మన కోసం నిలబడనంత వరకు ఎవరూ మన కోసం నిలబడరు' అని శివానీ చెబుతున్నారు. 2022 ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థిగా పోటీ చేసిన శివానీ సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటారు. అయితే ఈసారి ఆమె రాజకీయ నాయకురాలిగా కాదు, ఒక సాధారణ మహిళగా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టారు. బైక్ నడపటం, రోడ్డుపై ప్రయాణించడం ఆమె హక్కు. ముఖానికి మాస్క్ పెట్టుకోవాలా వద్దా అనేది ఆమె వ్యక్తిగత నిర్ణయం. కానీ ఆమెను రోడ్డుపై అడ్డుకోవడం, వెంబడించడం, వేధించడం ఎవరి హక్కూ కాదు.







కామెంట్‌లు (0)