కళ ద్వారా సమాజాన్ని మేల్కొల్పడం, చైతన్యం కలిగించడం సాధ్యమని ఎంతోమంది నిరూపించారు. అలాంటి కళాకారుల్లో సృష్టి ఒకరు. పేదలు, ఆదివాసీలు, కార్మికులు, శ్రామికులు.. ఎవరైనా సరే.. వారి పక్షాన నిలబడడం, వారు అన్యాయానికి, అక్రమానికి గురవుతుంటే తన కళ ద్వారా సంఘీభావం తెలియజేయడం ఆమెకు అలవాటు. అలా ఢిల్లీ, నోయిడా నిరసనల్లో పాల్గొన్న కార్మికులకు ఆమె సంఘీభావం తెలిపారు. 2026 ఏప్రిల్ 11న నోయిడాలో కార్మికుల నిరసన సందర్భంగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై మొత్తం 11 అక్రమ కేసులు బనాయించారు. వాటిలో తొమ్మిది కేసుల్లో బెయిల్ లభించినప్పటికీ, రెండు కేసుల్లో ఇంకా బెయిల్ మంజూరు కాలేదు. దీంతో ఆమె ఐదు నెలలుగా జైలులోనే ఉన్నారు.
ఆకృతి చౌదరి నిర్బంధానికి సంబంధించిన కేసులో సెప్టెంబరు 2న అలహాబాద్ హైకోర్టు ఎన్‌ఎస్‌ఏ కింద జారీ చేసిన నిర్బంధ ఉత్తర్వులను రద్దు చేసి, ఆమెను విడుదల చేయాలని ఆదేశించింది. అయితే ఆ తీర్పు సృష్టికి నేరుగా వర్తించదు. సృష్టి నిర్బంధానికి నిరసనగా సెప్టెంబరు 6న ఉత్తర ఢిల్లీలోని కార్మికులు, తక్కువ ఆదాయ వర్గాల ప్రజలు అధికంగా నివసించే షాబాద్ డైరీ ప్రాంతంలో 'అక్రమంగా నిర్బంధించబడిన కళాకారిణి' పేరుతో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అక్కడ ఆమె వేసిన కళాఖండాలతో పాటు, ఆమె మమేకమైన సేవా కార్యక్రమాలకు సంబంధించిన చిత్రాలను ప్రదర్శించారు. వాటిలో ఒకదాన్ని చూపిస్తూ ఆమె స్నేహితురాలు పింకి కుమారి 'ఇదిగో ఈమే నా సోదరి సృష్టి' అంటున్నప్పుడు ఆమె కళ్లల్లో స్పష్టమైన మెరుపు కనిపించింది.
షాబాద్‌తో బంధం
షాబాద్ డైరీతో సృష్టికి విడదీయలేని అనుబంధం ఉంది. 28 ఏళ్ల సృష్టి ఆ ప్రాంతంలో మహిళల కోసం ప్రాథమిక అక్షరాస్యత తరగతులు నిర్వహించేవారని పింకి గుర్తు చేసుకున్నారు. ఎగ్జిబిషన్‌లో పిల్లల కోసం సృష్టి రాసిన సందేశాలను చార్ట్ రూపంలో ప్రదర్శించారు. వాటి కింద హిందీలో 'మిస్ యు దీదీ' అంటూ పిల్లలు రాసిన సందేశాలు ఉన్నాయి. మహిళలకు మాత్రమే కాదు, పిల్లలకు కూడా పాఠాలు చెప్పడం, బొమ్మలు గీయడం వంటివి సృష్టి నేర్పించేవారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ అవధ్‌లో పుట్టి పెరిగిన ఆమె, 2016లో పాఠశాల విద్య పూర్తిచేసి, ఢిల్లీ యూనివర్శిటీ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్‌లో ఫైన్ ఆర్ట్స్ నేర్చుకునేందుకు ఢిల్లీ చేరారు. తనతో పాటు చదివిన కాలేజీ ఫ్రెండ్ వినోద్ కర్కి ఆమెను గుర్తుచేసుకుంటూ.. 'ఆమె అభ్యసించిన ప్రింట్ మేకింగ్ కోర్సుకు చాలా తక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. యంత్రాలతో కళాకారులు గంటలకొద్దీ కుస్తీ పడాలి. ఒక్కోసారి మేము తినడానికి కూడా టైం ఉండేది కాదు. అప్పుడు సృష్టి అందరం కలసి భోజనం చేద్దామని పట్టుబట్టేది. ఎవరైనా తెచ్చుకోకపోతే తనే తెప్పించేది. వారు తినేదాక వదిలిపెట్టేది కాదు' అని చెప్పారు. ఇతరుల పట్ల ఆమె చూపించే ప్రేమ, దయను స్నేహితులు కూడా గుర్తు చేసుకుంటున్నారు. 2020లో సృష్టి యూనివర్శిటీ ఫైన్ ఆర్ట్స్ డిపార్టుమెంట్ కళా భవన్‌కు చేరుకుని, శాంతినికేతన్‌లో నాలుగేళ్లు గడిపారు. ఆ సమయంలోనే వామపక్ష భావజాలం వైపు మొగ్గుచూపారని వినోద్ తెలిపారు. ‘సృష్టితో మాట్లాడుతుంటే ఒక పుస్తకంతో సంభాషించినట్లే ఉండేది. తను పాలస్తీనా గురించి ఎక్కువగా మాట్లాడేది. క్యాపిటలిజమ్ ఎలా పనిచేస్తుంది? రాజకీయ నాయకులు ఎలా ప్రవర్తిస్తారు?' అనే విషయాలపై మేము తరచూ చర్చలు జరుపుకునేవాళ్లం' అని ఆయన జ్ఞాపకం చేసుకున్నారు.
కళ నుంచి ఉద్యమం
శాంతినికేతన్ ఆమె ప్రపంచం పట్ల విశాల దృక్పథాన్ని, కళతో ఉన్న సంబంధాన్ని విస్తృతపరిచింది. అక్కడ చదువుతో పాటు కవిత్వం రాసింది, స్థానిక హస్తకళలను నేర్చుకుంది. తాజాగా షాబాద్ డైరీలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో శాంతినికేతన్‌లో సృష్టి తయారుచేసిన వస్తువులను కూడా ఉంచారు. వాటిలో చాలావరకు శాంతినికేతన్, దాని పరిసర ప్రాంతాల్లో నివసించే సంతాల్ ఆదివాసీ సమాజం నుంచి ఆమె నేర్చుకున్నవే. సంతాల్ గ్రామంలోని బోనెర్ పుకుర్ దంగాలోని ఓ స్టూడియోలో పనిచేస్తున్న 33 ఏళ్ల మక్సూద్ అలీ మోండల్ ఆమెను గుర్తుచేసుకుంటూ.. ‘ఆమె మా గ్రామానికి తరచూ వచ్చేవారు. ఆదివాసీలతో విడదీయలేని అనుబంధాన్ని పెంచుకున్నారు. ఈ రోజుకీ గ్రామస్తులు ఆమె గురించి ఆరా తీస్తున్నారు. తను క్షేమంగా ఉందా లేదా అని ఆందోళన చెందుతున్నారు' అని చెప్పారు. సమాజాన్ని చైతన్యపరుస్తూ, మనుషులతో సన్నిహిత సంబంధాలను నెరిపిన సృష్టి ప్రయాణంలో కళ కేవలం వ్యక్తిగత వ్యక్తీకరణగా కాకుండా ప్రజలతో మమేకమయ్యే సాధనంగా మారింది. ఆమె దృష్టిలో రాజకీయ భావజాలం అంటే ఎన్నికలు, గెలుపు, ఓటములు మాత్రమే కాదు.. సమాజాన్ని చైతన్యం చేయడం, అన్యాయాన్ని ప్రశ్నించడం కూడా. సృష్టి అరెస్టు, నిర్బంధం నేపథ్యంలో ఆమెతో అనుబంధం ఉన్నవారు వ్యక్తం చేస్తున్న ఆందోళన ఈ విషయాన్ని మరోసారి ముందుకు తెస్తోంది.







కామెంట్‌లు (0)