బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మళ్లీ మోడీ మా సెంటిమెంట్‌

38 నిమిషాల క్రితం

modi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 04:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

సెంటిమెంట్లు వుండాల్సిందే గానీ వాటిని పదే పదే రాజకీయ ప్రచారం కోసం వాడుకోవడం అలవాటు చేసుకుంటే బెడిసికొట్టవచ్చు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అవమానించారంటూ ఆరోపించే బిజెపి నేతల అలవాటు ఇప్పుడు అలాగే తయారైంది. నెమ్మదిగా ఆయననేగాక ఆయన తల్లిగారిని కూడా అవమానించారనడం దీనికి పొడగింపుగా మారింది. ఏ పాచికైనా పదే పదే వాడితే చెల్లుతుందా? అందులోనూ ఆ తల్లిగారిని అనవసరంగా తీసుకొస్తే ఎలా? ప్రతిపక్ష నేత రాహుల్‌‌ గాంధీ ఈ మధ్యన ఇండోర్‌‌లో మోడీ తల్లిగారిని అవమానించారని వరుసగా ప్రకటనలు చేశారు. 'ఛాత్రో కీ గూంజ్' అంటూ విద్యార్థులను కలుస్తున్న రాహుల్‌‌ గాంధీ ఆ రోజున పుల్కిత్‌ ‌మణి అనే స్టాండప్‌ ‌కమెడియన్‌‌తో కలసి కాస్సేపు సందడి చేశారు. ఆ సందర్భంలో మోడీ జెన్‌‌ జీ తో సమావేశమైనప్పటి వీడియో ఒకటి చూపించారు. ఆ సమావేశంలోకి ఒక పెద్దావిడ వచ్చి సీటు లేక నిలబడితే ఒక యువకుడు లేచి సీటివ్వడం, ఆమె మెచ్చుకోవడం, చూస్తాం. ఇంతవరకూ బాగానే వుంది గానీ వేదిక పైనున్న మోడీజీ మైకులో ఆ కుర్రాడిని మరీ మరీ మెచ్చుకోవడం కొసమెరుపైంది. దీన్ని డిస్‌‌ప్లే చేసిన తర్వాత ఇదంతా పబ్లిసిటీ వ్యవహారమన్నట్టు రాహుల్‌-పుల్కిత్‌‌లు పరస్పరం ఆలింగనం చేసుకుని కాస్త కామెడీ చేస్తారు. అయితే ఇలా చేయడం మోడీ తల్లిని అవమానించడమని బిజెపి అధికార ప్రతినిధి కేశవన్‌, కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు... ఇలా వరుసగా దాడి మొదలెట్టారు. ఇంతా చేసి మోడీ తల్లిగారు కొన్ని సంవత్సరాల కిందటే మరణించారు కదా. ఆమెను అవమానించడమనే మాటెలా వస్తుంది? అంటే పబ్లిసిటీ వ్యూహాన్ని కామెడీగా వెక్కిరిస్తే దాన్ని కూడా మళ్లీ పబ్లిసిటీకి వాడుకోవడం డబుల్‌ ‌ధమాకా అన్నమాట. హన్నన్నా...ఎంత తెలివో!​

ఇది కాశ్మీర్‌ ‌నెయ్యి గొడవ​

కల్తీలందు నెయ్యి కల్తీలు వేరయా అని... ఇటీవలి కాలంలో జనం కొత్త పల్లవి నేర్చుకున్నారు. తిరుమల తిరుపతి లడ్డు కేసులో తాజాగా ఇ.డి అరెస్టుకు సంబంధించిన నోట్‌ ‌కూడా వివాదానికే దారితీసింది మరి. సుకృత్‌ ‌ఫుడ్స్‌ ‌కు చెందిన ఆ నిందితులు టిటిడి నెయ్యిలో కల్తీ చేసిన పదార్థాల జాబితా దాంట్లో ఇచ్చారు. దేశానికే చర్చగా మారిన జంతుకొవ్వు కలిపినట్టు అందులో పేర్కొనలేదు. ఇతరత్రా కలిపిన చాలా జాబితా ఇచ్చారు. అది నిస్పందేహంగా తప్పేగానీ కాశ్మీర్‌ ‌నుంచి కన్యాకుమారి దాకా మార్మోగిపోయిన జంతు కొవ్వు లేదు మరి. చూశారా అనవసరంగా ద్రుష్పచారం చేశారని వైసిపి మీడియా వెంటనే ప్రచారమందుకుంది. కల్తీ కథలతో టిడిపి అనుకూల మీడియా మరోసారి రెచ్చిపోయింది. ఆ కథ తిరుమలేశునికే వదిలేసి మనం కాశ్మీర్‌ ‌పోదాం. ఎందుకంటే అక్కడ భారీ ఎత్తున కల్తీ నెయ్యి పట్టుబడింది. నాలుగు బ్రాండ్లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాజస్థాన్‌‌లో తయారైన రఘు మిల్కబైట్‌ దేశీ ఘీ, పంజాబ్‌‌లో తయారైన పెహల్వాన్‌ ‌ఘీ, హర్యానాలో తయారైన దేశీ ఘీ, ఘనమైన గుజరాత్‌‌లో తయారై వచ్చిన సంగత్‌ ‌ఘీ... అన్నీ కల్తీ అని తేల్చారు. కాకుంటే ఇన్ని కంపెనీల కల్తీలోనూ జంతు కొవ్వు కలిపినట్టు ఎక్కడా లేదు. మరి జంతు కొవ్వు కలిపితే లాభాలు కురిసేట్టయితే ఈ మోసకారి కంపెనీలు ఏవీ దాన్ని మిక్సింగు చేసిన దాఖలాలు లేవే? దీని భావమేమి తిరుమలేశ? ​

దృశ్యం క్లోజ్‌... కంటిన్యూ..​.

దృశ్యం, సన్నివేశం లేదా ఇంగ్లీషులో సీన్‌ అంటే చాలా అర్థాలు వస్తాయి. క్యా సీన్‌ ‌హై అంటూ వెనకటికి దూదదర్శన్‌‌లో ఒక ప్రోగ్రామ్‌ ‌వుండేది కదా. ఆ రకరకాల ఫ్లాష్‌‌బ్యాక్‌‌లు అలా వుంచి ప్రస్తుతానికి వస్తే మళయాల సినిమా దృశ్యం జాతీయ సంచలనమైంది. అన్ని భాషల్లోనూ రీమేక్‌ అయింది. మోహన్‌‌లాల్‌, మీనాల కాంబినేషన్‌తో వచ్చిన మళయాల సినిమా మోత మోగించడంతో తెలుగులో విక్టరీ వెంకటేశ్‌ ‌తో సురేష్‌‌బాబు పునర్‌‌నిర్మించి విజయం సాధించారు. జార్జి కుట్టి కాస్తా రాంబాబయ్యారు. నిజానికి టైటిల్‌ అంతగా నచ్చలేదు గానీ మార్చలేదు. తమిళంలో పాపనాశనం అని పేరు మార్చి కమల్‌ ‌హాసన్‌‌తో తీశారు గానీ రెండో భాగం అర్థంతరంగా ఆగింది. మళయాలంలో ‌సేమ్‌ కాంబినేషన్‌లో మూడో భాగం వచ్చింది. సూపర్‌ ‌హిట్‌ ‌కొట్టింది. అయితే రెండో భాగం కూడా తీసిన సురేష్‌ ‌సోదరులు మూడో భాగం జోలికి పోలేదు. నిజానికి రెండో భాగానికే స్పందన తక్కువగా వుండటం ఒక కారణం. హిందీలో అజయ్‌ ‌దేవ్‌‌గన్‌-శ్రియలతో మూడో భాగం కూడా కొనసాగించాడు దర్శక రచయిత అభిషేక్‌ ‌ఫాఠక్‌. కానీ ఒక చిన్న తేడాతో, తెలుగులో రెండో భాగంతో ఆగిపోతే హిందీలో మూడో ‌భాగానికి దృశ్యం ద కన్‌‌క్లూజన్‌ అని తోక జోడించారు. మరో భాగం వుందనే ఊహాగానాలు రాకుండా ఈ పని చేసినట్టు క్లారిటీ ఇచ్చారు. ఓపిక లేని వాళ్లు ఆగిపోతారు గానీ ఆదరణ, ఆకర్షణ వున్నవాళ్లు ఆగుతారా? అందుకే మళయాలంలో నాలుగో భాగం కూడా వస్తుందని వెయిట్‌ ‌చేయమని ప్రకటించారు దర్శకుడు జీతూ జోసఫ్‌. గతవారం చెప్పుకున్న వైవిధ్యభరిత భారతీయత అంటే అదే మరి. ఇకపోతే ఈ మూడు భాగాలలో ‌దర్శకుడు ‌విచిత్రమైన ఎత్తుగడ అటూ ఇటూ తిప్పడం చూడొచ్చు. మొదటి భాగంలోనేమో జార్జి కుట్టి పరిస్థితుల వల్ల జరిగిన దాన్ని కప్పిపుచ్చడానికి జరగనివి జరిగినట్టు దృశ్యం సృష్టిస్తాడు. రెండో భాగంలో తనే ఒక తీయని సినిమా కథ పుస్తకంగా అచ్చు వేయించి జరగింది జరగనట్టు నమ్మించడానికి అదే ఆధారంగా కాపాడుకుంటాడు. మూడో భాగంలో కావాలని ఏదో చేసి మరేదో జరిగినట్టు భ్రమ కల్పించి కాపాడుకుంటాడు. ఇదంతా అర్థమైనా కానట్టు వుందంటారా? అందుకే మిగిలిన భాషలవారు ఆగిపోయుంటారా? దృశ్యం 4 కోసం వేచి చూడాల్సిందే.


- పీపీ

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్