గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పౌర హక్కులకు పట్టం

1 గంట క్రితం

suprem
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 05:45 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

అరెస్టు అంటే కేవలం ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం కాదు. రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛపై రాజ్యం విధించే అత్యంత తీవ్రమైన పరిమితి. అందుకే, అరెస్టుకు గల కారణాలను సంబంధిత వ్యక్తికి తప్పనిసరిగా తెలియచేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగందే! దానికి భిన్నంగా వ్యవహరించడం రాజ్యాంగ ఉల్లంఘనే! అయినప్పటికీ దీనిని పదేపదే ఉల్లంఘించడం, న్యాయస్థానాల చేత మొట్టికాయలు తినడం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది. తాజాగా, అరెస్టుకు గల కారణాలను వెంటనే, లిఖితపూర్వకంగా, అరెస్టయిన వ్యక్తికి అర్థమయ్యే భాషలో తెలియజేయడం తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు మరోసారి చెప్పాల్సిరావడం కూడా విచ్చలవిడిగా కొనసాగుతున్న ఈ ఉల్లంఘనల ఫలితమే! తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయన్న కారణంతో ఈ రాజ్యాంగ రక్షణలను పక్కన పెట్టలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 22(1)ను ఉల్లంఘించి చేసిన అరెస్టు చట్టబద్ధమైనది కాదని, అలాంటి నిర్బంధం నుంచి విడుదలను బెయిల్‌గా పరిగణించరాదని కూడా తేల్చిచెప్పింది. అక్రమ అరెస్టుకు బాధ్యులైన అధికారులపై శాఖాపరమైన చర్యలు, ఆ వ్యక్తినే తిరిగి అరెస్టు చేయాలంటే ఉన్నతాధికారి అనుమతి, మేజిస్ట్రేట్‌ స్వతంత్ర పరిశీలన వంటి చర్యలను తప్పనిసరిగా పాటించాలని నిర్దేశించింది. ఈ తరహా తీర్పు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. అరెస్టు సమయంలో కారణాలు తెలియజేయడం, వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడడం, అక్రమ అరెస్టును రద్దు చేయడం వంటి అంశాలపై గత మూడు దశాబ్దాలుగా సుప్రీంకోర్టు అనేక సార్లు ఇదే విషయాన్ని చెప్పింది. పదేపదే మార్గదర్శకాలు ఇచ్చింది. 1994లో జోగిందర్‌ ‌కుమార్‌ ‌వర్సెస్‌ ‌స్టేట్‌ ఆఫ్‌ ‌యు.పి లో ప్రతి సందర్భంలోనూ అరెస్టు చేయడం అవసరం కాదని, అరెస్టుకు చట్టపరమైన ఆధారంతో పాటు దాని అవసరాన్ని కూడా పోలీసులు పరిగణించాల్సి ఉంటుందని చెప్పింది.

వ్యక్తిగత స్వేచ్ఛపై పోలీసు అధికారాన్ని నియంత్రించే కీలక తీర్పుగా దీనిని భావిస్తారు. 2024లో ప్రబీర్‌ ‌పుర్కాయస్థ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ‌ఢిల్లీ కేసులో ఉపా వంటి ప్రత్యేక నిబంధనలు ఉన్న చట్టం అమలులోనూ రాజ్యాంగ రక్షణను విస్మరించలేమని పేర్కొంది. 2025 నవంబర్‌‌లో మిహిర్‌ ‌రాజేష్‌ ‌షా వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో గతంలో ఇచ్చిన తీర్పులను మరింత విస్తరించి, అరెస్టు కారణాలను వ్యక్తికి అర్థమయ్యే భాషలో లిఖితపూర్వకంగా అందచేయాలని పేర్కొంది. పౌరహక్కులు, వ్యక్తి స్వేచ్ఛ విషయంలో గత తీర్పుల కొనసాగింపుగానే తాజా తీర్పు వెలువడటంతో పాటు, మరో అడుగు ముందుకేసి ఆర్టికల్ 22(1) ఉల్లంఘన కారణంగా విడుదలైన వ్యక్తిని మళ్లీ అరెస్టు చేయాలంటే ఉన్నతాధికారుల పరిశీలనతో పాటు మేజిస్ట్రేట్ అనుమతి పొందాలని నిర్దేశించడం దేశంలో కొంత కాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో స్వాగతించాల్సిన విషయం!

చట్టాల్ని చుట్టాలుగా చేసుకుని, దర్యాప్తు సంస్థలను ఇష్టం వచ్చినట్లుగా దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వాలకు తాజా తీర్పు ఒక చెంప పెట్టు లాంటిది. ఈ తీర్పు ప్రకారం నిర్దేశించిన విధానాన్ని ఉల్లంఘించిన అధికారి తప్పనిసరిగా శాఖాపరమైన విచారణను ఎదుర్కోవాలి. ఆ కేసు దర్యాప్తును మరో అధికారికి అప్పగించాలి. రాజ్యాంగ విరుద్ధమైన అరెస్టు కారణంగా విడుదలైన వ్యక్తి విడుదలను బెయిల్‌గా పరిగణించరాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎందుకంటే ఆ వ్యక్తిని నిర్బంధించడమే చట్టవిరుద్ధమైన చర్య! ఈ తేడా ఎంతో ప్రధానమైనది. ఆర్టికల్ 22ను ఉల్లంఘించిన సందర్భాల్లో “తగిన తప్పనిసరి పరిహారం” అందించాలనంటూ హైకోర్టులకు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఒక చర్య చట్టవిరుద్ధమని నిర్ధారించడంతోనే బాధితుడికి న్యాయం జరగదు. తనకు జరిగిన అన్యాయానికి పరిహారం పొందే హక్కు కూడా అతనికి ఉంది!

నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రశ్నించే గొంతులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు, అరెస్ట్‌‌లు పెరుగుతున్న సంగతి తెలిసిందే. మన రాష్ట్రంలోనూ ప్రజా ఉద్యమాలపై, వామపక్ష పార్టీల నేతలపై పెద్ద ఎత్తున నిర్బంధ కాండ అమలవుతోంది. ముందస్తు అరెస్ట్‌‌లు, గృహ నిర్బంధాలు, ఆందోళనల్లో పాల్గొననీయకుండా అడ్డుకోవడం వంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని, అక్రమ కేసులు బనాయించడం సర్వసాధారణ విషయంగా మారింది. పోలీసు యంత్రాంగం బరితెగిస్తున్న తీరుకు విజయవాడలో జరిగిన గాదె సాయికృష్ణ కేసు ఉదంతం ఒక పెద్ద ఉదాహరణ. దేశంలో ఏటా లక్షలాది అరెస్టులు జరుగుతున్నప్పటికీ, అరెస్టు చేసిన వ్యక్తుల్లో ఎంతమందికి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 22(1) ప్రకారం కారణాలు సక్రమంగా తెలియచేస్తున్నారన్న దానిపై అధికారిక గణాంకాలు లేవు. మానవ హక్కుల సంఘాల నివేదికలు, పౌరహక్కుల సంస్థల అధ్యయనాలు ఈ తరహా సంఘటనలను వెలుగులోకి తెస్తున్నాయి. తాజా తీర్పు తరువాతైనా ప్రభుత్వ యంత్రాంగపు తీరు మారుతుందని ఆశిద్దాం! ​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్