బెర్లిన్ రాజకీయాల్లో కీలక స్థానానికి చేరుకున్న ఎలిఫ్ ఎరాల్ప్ గురించి ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది. పేదరికం, అసమానతలు తగ్గించడం, గృహ సమస్యలపై పోరాడడం వంటి అనేక అంశాలపై స్పష్టమైన అవగాహనతో ఆమె ముందుకెళ్లారు. అయితే ఈ రాజకీయ ప్రయాణానికి చాలా కాలం ముందే.. పదేళ్ల వయసు నుంచే ప్రజాక్షేత్రంలో పనిచేయడం ఆమెకు తెలుసు. సాధారణంగా ఆ వయసులో పిల్లలు ఆటలు, చదువుతో గడుపుతారు. కానీ ఎరాల్ప్ మాత్రం తన తల్లిదండ్రులు అద్దెకు ఉంటున్న ఇంటి గ్యారేజీలో ఇద్దరు స్నేహితులతో కలిసి ఒక చిన్న ‘పర్యావరణ క్లబ్’ పెట్టారు. చేతితో పోస్టర్లు తయారు చేసి ప్రకృతిని కాపాడాలంటూ ప్రచారం చేశారు. అదే ఆమె ప్రజా చైతన్యానికి తొలి అడుగు.
వామపక్ష రాజకీయాలు, కార్మిక సంఘాల్లో చురుగ్గా పనిచేసిన తల్లిదండ్రుల స్ఫూర్తి, ఆ చిన్న ప్రయత్నం తర్వాత ఆమెను పోరాట మార్గంలో చాలా దూరం ముందుకు తీసుకెళ్లింది. యుక్తవయసులో హాంబర్గ్, గోర్లెబెన్‌లో జరిగిన అణుశక్తి వ్యతిరేక ఉద్యమాల్లో కూడా ఆమె పాల్గొన్నారు. పర్యావరణం నుంచి మొదలైన చైతన్యం క్రమంగా జాత్యహంకారం, సామాజిక అసమానతలు, వలసదారుల హక్కులు, అద్దెదారుల సమస్యలపై పోరాటంగా విస్తరించింది.
వలస కుటుంబంలో పుట్టి...
1981లో జన్మించిన ఎరాల్ప్ తల్లిదండ్రులకు టర్కీలో వామపక్ష, సామాజిక ఉద్యమాలతో అనుబంధం ఉంది. 1980 టర్కీ సైనిక తిరుగుబాటు తర్వాత వారు జర్మనీకి వలస వెళ్లారు. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులతో కలిసి ప్రదర్శనల్లో పాల్గొనడం ఎరాల్ప్‌కు అలవడింది. క్రిమినాలజీపై ప్రత్యేక దృష్టి ఉన్న ఆమె హాంబర్గ్‌లో న్యాయ విద్యను అభ్యసించారు. హాంబర్గ్ నుంచి బెర్లిన్‌కు వచ్చాక ఆమె రాజకీయ చైతన్యంలో కీలక అడుగులు పడ్డాయి. బెర్లిన్‌లోని క్రాయిట్స్‌బర్గ్ ప్రాంతం ఎరాల్ప్ రాజకీయ జీవితానికి ముఖ్యమైన కేంద్రంగా మారింది. అక్కడ జాత్యహంకారానికి వ్యతిరేకంగా, అద్దెల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల తరఫున, చిన్న దుకాణాలు, క్లబ్బులు, సంఘాలు చేసే అనేక పోరాటాల్లో ఆమె పాల్గొన్నారు.
అందుబాటు ధరల్లో ఇళ్లు ఉండాలి
ఇల్లు అనేది కేవలం ఒక భవనం కాదు. ఒక నగరంలో ఎవరు నివసించగలరు? నగర అభివృద్ధి వల్ల ఎవరికి ప్రయోజనం? అద్దెలు పెరిగితే సాధారణ కుటుంబాల పరిస్థితి ఏమవుతుంది? వంటి ప్రశ్నలే ఎజెండాగా ఇళ్ల సమస్యలపై ఆమె సుదీర్ఘకాలంగా పోరాడుతున్నారు. 2017లో డై లింకె పార్టీలో చేరిన ఎరాల్ప్ ఆ తరువాతి కాలంలో బెర్లిన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ఎన్నికయ్యారు. 2021 నుంచి అక్కడ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. 2025లో బెర్లిన్ డై లింకె డిప్యూటీ చైర్‌గా బాధ్యతలు చేపట్టారు. న్యాయశాస్త్రం చదివిన ఎరాల్ప్ పదేళ్లకు పైగా డై లింకె పార్టీకి న్యాయ సలహాదారుగా పనిచేశారు. శరణార్థుల కోసం పనిచేసే ఐక్యరాజ్యసమితి సంస్థలో ఇంటర్న్‌షిప్ కూడా చేశారు. డై లింకెలో వలసదారుల హక్కుల కోసం పనిచేసే నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడంలో భాగస్వామిగా ఉన్నారు.
ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి...
ఎరాల్ప్ రాజకీయ ప్రయాణంలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో ఒక అంశాన్ని ఎంచుకుని దాని చుట్టూ ప్రచారం చేసిన నాయకురాలిగా కాకుండా, చిన్ననాటి నుంచే వివిధ సామాజిక ఉద్యమాల్లో పాల్గొంటూ వచ్చిన నాయకురాలిగా ఆమెను చూడొచ్చు. బెర్లిన్‌లో వలసదారులు, అద్దెదారులు ఎదుర్కొనే సమస్యలను రాజకీయ అంశాలుగా ముందుకు తీసుకురావడంలో ఆమె చురుకుగా వ్యవహరించారు. న్యాయ విద్య, సామాజిక ఉద్యమాల్లో పనిచేసిన అనుభవం ఆమెను రాజకీయాల్లోనూ చురుకైన పాత్ర పోషించేలా చేసింది. వలసదారులు, శరణార్థులు బెర్లిన్‌లో మరింత స్వేచ్ఛగా, గౌరవంగా జీవించే పరిస్థితులు ఉండాలన్నది ఆమె అభిమతం. బెర్లిన్‌ను ‘ప్రజలందరి నగరంగా’ మార్చాలన్నది ఆమె ప్రతిపాదనల్లో ఒకటి. బెర్లిన్‌లో అద్దెలను నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా అద్దె పరిమితి విధానం రావాలని కూడా ఆమె ప్రచారం చేశారు. ఎరాల్ప్ జీవితంలో ప్రత్యేకత కేవలం ఎన్నికల ఫలితం నుండే రాలేదు. పర్యావరణం కోసం గ్యారేజీలో పోస్టర్లు తయారు చేసిన బాలిక.. వలస కుటుంబ అనుభవాల మధ్య పెరిగి.. న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా పనిచేసి.. చివరకు బెర్లిన్ రాజకీయాల్లో కీలక స్థానానికి చేరుకోవడం ఆమె ప్రయాణంలోని ప్రధాన అంశం.
లండన్‌లో ఇళ్ల కొరత, అధిక అద్దెలు కుటుంబాలపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయి. తక్కువ, మధ్యతరగతి ఆదాయాల వారికి నగరంలో నివసించగలిగే ఇల్లు దొరకడం కష్టమవుతోంది. కెనడాలో పెద్ద నగరాల్లో ఇళ్ల ధరలు ఆదాయంతో పోలిస్తే చాలా వేగంగా పెరుగుతున్నాయి. వాంకోవర్, టొరంటోల్లో అద్దెకు ఇల్లు వెతకడం కూడా కుటుంబ బడ్జెట్‌పై భారీ ప్రభావం చూపుతోంది. ఆస్ట్రేలియాలో ఆదాయానికి మించిన ధరల్లో ఉన్న ఇళ్లను కొనుగోలు చేయడానికి, భారీ స్థాయిలో ఈఎంఐలు కట్టడానికి యువత సుముఖంగా లేరు.
ఇంటి సమస్య.. ఇప్పుడు ప్రపంచ సమస్య..
గతేడాది న్యూయార్క్, ఇప్పుడు బెర్లిన్ ఉదంతాలు మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మమ్దాని, ఎరాల్ప్ తమ ప్రచారంలో తీసుకున్న ఇళ్ల సమస్య కేవలం ఆ రెండు ప్రాంతాలకే పరిమితం కాదు. ప్రపంచంలోని అనేక పెద్ద నగరాల్లో ‘ఇల్లు’ ఇప్పుడు జీవన వ్యయంలో అతిపెద్ద భారంగా మారుతోంది. 2026లో ఐక్యరాజ్యసమితి హెబిటాట్ విడుదల చేసిన ‘వరల్డ్ సిటీస్ రిపోర్టు’ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గృహాల కొరత 2010లో 25 కోట్ల 1 లక్ష యూనిట్ల నుంచి 2023లో 28 కోట్ల 8 లక్షల యూనిట్లకు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా అద్దెకు ఉండే కుటుంబాల్లో 44 శాతం మంది తమ ఆదాయంలో 30 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని ఇంటి కోసం ఖర్చు చేస్తున్నారు.
మన దేశంలో...
భారత్‌లో ఇళ్ల సమస్య భిన్నమైన రూపంలో కనిపిస్తుంది. ముంబయిలో భూమి కొరత, అధిక ఆస్తి ధరలు, అద్దెలు, చిన్న ఇళ్లకు అధిక డిమాండ్ కారణంగా దిగువ మధ్యతరగతి కుటుంబాలకు నగరంలో నివసించడం భారమవుతోంది. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఐటీ, సేవా రంగాల ఉద్యోగాలు పెరగడంతో కొన్ని ప్రాంతాల్లో అద్దెలు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ కేంద్రాలకు దగ్గరగా ఉండాలంటే ఎక్కువ అద్దె చెల్లించాల్సి వస్తోంది. దూరంగా ఇల్లు తీసుకుంటే ప్రయాణ ఖర్చు, సమయం పెరుగుతోంది. అంటే ఇంటి ఖర్చును కేవలం అద్దెతో లెక్కించలేం. ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ 2026 అంచనా ప్రకారం ప్రపంచంలోని టాప్ 100 నగరాల్లో నివాసితులు సగటున తమ ఆదాయం నుంచి 20 శాతాన్ని గృహవసతికి వినియోగిస్తున్నారు.







కామెంట్‌లు (0)