ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

గంట సమయం...

1 గంట క్రితం

time
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 04:45 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

కాలానిది కరుణా, కర్కశం లేని నిరామయ నడక. సమయ సందర్భాలతో, స్థితిగతులతో, అనుభూతులతో లేశమాత్రం కూడా దానికి పట్టింపు ఉండదు. ఏ చీకూ చింతా దాని దరి చేరవు. తన మానాన తాను లయించుకుపోతూ ఉంటుంది. కాలాన్ని ఆసరాగా చేసుకుని మసలే మనుషులకే మనిషికొక లెక్కన కాలం గడుస్తూ ఉంటుంది. అధికారంలో ఉన్నవాళ్లకి, అంతా సజావుగా సాగిపోతూ ఉన్నవాళ్లకీ నడిచే కాలమంతా మహా రంజుగా ఉంటుంది. పూట గడవటమే కష్టమైన వాళ్లకీ, వాన కోసం ఎదురుచూసేవాళ్లకీ, ఉద్యోగం, ఉపాధి కోసం నిరీక్షించేవాళ్లకీ, ఫలితాల కోసం పడిగాపులు కాచేవాళ్లకీ మరొకలా అనిపిస్తుంది. చాలామంది జీవితంలో ఐస్‌క్రీములా కరిగిపోయే కాలాలూ ఉంటాయి. నిమిష నిమిషమూ పరమ కఠినంగా కదిలే సందర్భాలూ ఉంటాయి. “నిరతము నిన్నే తలచుచున్నది/ క్షణమొక యుగముగా గడుపుచున్నది” అని అశోకవనంలోని సీత స్థితి గురించి హనుమంతుడు వర్ణించిన వైనం మనకు సుందరకాండలో తారసపడుతుంది. “చెంత నిష్టులు లేకున్న నింతి తాను క్షణము యుగముగా నెంచి వీక్షణము జేయు; చేరి ప్రియమైన వారలు చెంతనుండ యుగము లామెకు క్షణములే యగును” అన్న కవి పలుకుల్లో ఓ అభిసారిక అంతరంగం ఆవిష్కృతం అవుతుంది.

సినిమా పాటల్లో ఇలాంటి భావాలు కోకొల్లలు. “క్షణమొక యుగముగా గడిపిన బ్రతుకిది తెలుసుకో ప్రియతమా” అని వేటూరి కలం ఎప్పుడో నివేదించింది. “ఒక నిముషం ఎంత విలువైనదో / రైలు మిస్సయిన ప్రయాణికుడినడుగు / ఒక సెకను ఎంత విలువైనదో / యాక్సిడెంట్‌లో ప్రాణాలు దక్కిన వాణ్ణడుగు” అన్న కవితా ఉటంకింపు కాలం విలువను కచ్చితంగా నొక్కి వక్కాణిస్తోంది. 1984లో మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ నవల ‘గంట గడిస్తే చాలు’లో మెడికో ప్రణీత్‌కి, అతడి ప్రేయసి సంధ్యకి క్షణక్షణమూ భయంగానే ఉంటుంది. ఒక్క గంట సమయం ఎంత విలువైందో, అది గడవడం ఎంత ఉత్కంఠభరితమైందో ఇలాంటప్పుడే తెలిసొస్తుంది. చేయాల్సిన పనిని చేయాల్సిన సమయంలో చేయకపోవడం వల్ల చాలా చిక్కులు వచ్చిపడతాయి. పట్టించుకోవాల్సిన సమయంలో కొందరు హాయైన కాలం ఊయలలో ఆదమరిచి సాగిపోతారు. ఆనక కాని కాలం పొటమరిస్తే హడావుడి పడిపోతారు. ఈ స్థితినే ‘చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం’ అని గ్రామీణులు ఎకసెక్కం చేస్తారు. ఇలాంటి స్థితి సామాన్యులకే కాదు.. ఒక్కోసారి సాక్షాత్తూ ఏలుబడిలో ఉన్న విశ్వగురువులం అనుకున్న వారికి కూడా దాపురిస్తుంది.

‘మహాప్రభూ.. మాకు కొంత సమయం ఇవ్వండి.. మా గురించి ఆలోచించండి’ అని జంతర్‌ మంతర్‌ సాక్షిగా ఈ దేశపు యువత, విద్యార్థులు అడిగినప్పుడు మన ప్రధాని మోడీ ఉలుకూ పలుకూ లేకుండా ఊరకుండిపోయారు. ఇప్పుడేమో ఎర్రకోట సాక్షిగా ‘నాకో గంట సమయం ఇవ్వండి’ అని వినమ్రంగా విన్నవించుకున్నారు. నిజానికి ఈ దేశపు యువత ఒక్క గంటేం ఖర్మ.. లక్షల గంటల సమయాన్ని మోడీ మహాశయుడికి ధారపోశారు. 2014 మే 26 నుంచి 2026 ఆగస్టు 15 వరకు అక్షరాలా లక్షా ఏడు వేల గంటలకు పైగానే సమయం ఇచ్చారు. ఈ సమయంలో ఆయన ఏం చేశారన్నదే ప్రశ్న. ఇచ్చిన సమయాన్ని సరిగ్గా ఉపయోగించకపోవడం వల్లే కదా రైతులు, కార్మికులు, విద్యార్థులు రోడ్ల మీదికి వచ్చి గంటల తరబడి ఆందోళనలు చేయాల్సి వచ్చింది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, నల్లధనం పెళ్లగించి పౌరుల అకౌంట్లలో తలో రూ.15 లక్షలు జమ చేస్తామని ఆశలు కల్పించి ఎన్ని గంటలు గడిచిపోయాయి! మూడు వ్యవసాయ చట్టాలూ మాకొద్దని రైతులు 358 రోజులు అంటే 8,592 గంటలు ఢిల్లీ సరిహద్దుల్లో తీవ్ర నిర్బంధం మధ్య పోరాడితే తప్ప ప్రభువుల వారికి చెవికి సోకలేదు. మణిపూర్‌ మహిళల పట్ల దారుణమైన అన్యాయం జరిగితే ప్రధాని నోరు మెదపటానికి దాదాపు 99 రోజులు అంటే 2,376 గంటల సమయం కావాల్సి వచ్చింది. అది కూడా ప్రతిపక్షాల పట్టు మీద మాట్లాడుతూ, సమర్థనకు సుదీర్ఘ ప్రసంగం చేసి, 90 నిమిషాల తరువాత గానీ మణిపూర్‌ అనే మాట పలకలేకపోయారు. ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించటానికి జూన్ 6 నుంచి జూలై 25 వరకు 49 రోజులు అంటే 1,176 గంటల సమయం కావాల్సి వచ్చింది. అంతంత సమయాన్ని సరిగ్గా ఉపయోగించలేని పాలక పెద్దలు ఇప్పుడు కేవలం గంట సమయం ఇస్తే ఉద్ధరించేది ఏముంటుందని యువతరం ప్రశ్నిస్తోంది. ‘సమయం లేదు’ అన్న పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు – మిత్రోం అన్నా, మై డియర్ ఫ్రెండ్స్‌ అన్నా ఒరిగేది సున్నా.

‘నడిచినంతసేపూ నా కాలం.. సాగనిదేమో మన భాగం’ అని లౌక్య ప్రదర్శనలు చేయటం కొందరికి అలవాటు. గంటలు గంటలు ఉన్నప్పుడు గర్వంతో ప్రకోపించి, కాలం చేతుల్లోంచి జారిపోతుంది అనుకున్నప్పుడు నీరసంగా ప్రాధేయపడ్డం వల్ల ప్రయోజనం ఉండదు. ఎత్తులు పైఎత్తులతోనే ఎల్లకాలం నడవదు. “తన చరిత్ర తనె పఠించి ఫక్కున నవ్వింది ధరణి / తన గాథను తనే స్మరించి, భోరున ఏడ్చింది ధరణి” అన్నాడు వజ్రాయుధ కవి ఆవంత్స సోమసుందర్‌. గర్వపడే సందర్భాలను సృష్టించుకున్నప్పుడే ఎవరైనా కాలగతిలో నిలబడతారు. లేకుంటే ఫక్కున నవ్వే కాలపు వ్యంగ్యజడిలో కొట్టుకుపోతారు. కాలం తన మానాన తాను పోవటం నిజమే కానీ, ఆ కాలానికి పగ్గం వేసి, వర్తమానపు మగ్గం మీద సుందర భవిష్యత్తును నేసే ముందుయుగం దూతలు కూడా ప్రతి కాలంలోనూ ఉంటారు. మార్పు కేతనాలను ఎగురవేస్తారు. ‘వృద్ధ జగతి సమాధిపై సమధర్మం ప్రభవించును; నిద్దుర చీకటి వెలుపల వేకువ మెలకువ పుట్టును’ అన్న కవి వాక్యానికి జేజే ధ్వానాలను జత చేస్తారు. ఎవరి సమయం వాళ్లదేనని చరిత్ర సాక్షిగా నినదిస్తారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్