ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

బహుళత్వమే భారతదేశ గొప్పతనం​

1 గంట క్రితం

diversity
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 04:45 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

​తాను సర్దార్ పటేల్ విద్యాలయ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రసంగించాల్సి ఉంది, అయితే ఆ అవకాశం లభించలేదు. ఈ ప్రతిష్టాత్మక పాఠశాల ప్రగతిశీల విద్యా వ్యవస్థకు చేసిన కృషి పట్ల తనకు ఎంతో గౌరవం ఉంది, ఆహ్వానం అందుకోవడం గొప్ప గౌరవంగా భావించాను. అయితే అక్కడ ప్రసంగించలేకపోవడమే బహుళత్వం ఇప్పటికీ ఎందుకు కీలకమో మరింత స్పష్టం చేస్తోంది.

"బహుళత్వం ఎందుకు ముఖ్యం?"

భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యభరితమైన, సమగ్రంగా బహుళత్వం కలిగిన సమాజం. అనేక మతాలు, భాషలు, కులాలు, తెగలు, సంఘాలు, ఆచారాలు, జీవన విధానాలకు నిలయం, ఈ వైవిధ్యం మన నిత్య జీవనంలో అల్లుకుపోయింది. చాలా భారతీయ కుటుంబాలు రెండు, మూడు భాషలను అలవోకగా మాట్లాడతాయి, పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, బంగ ప్రాంతాలను ఒకే చరణంలో స్మరించే జాతీయ గీతమే ఈ బహుళత్వానికి నిదర్శనం.

ఇంత విభిన్నత ఉన్నప్పటికీ భారతదేశం ఏకమైన దేశంగా ఎలా నిలబడిందనే ప్రశ్నకు సమాధానం స్వాతంత్ర్యానంతరం గణతంత్రాన్ని రూపొందించిన ఆలోచనలోనే ఉంది. ప్రజల బహుళత్వ దృక్పథం, మతం, కులం, భాషతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడిని సమానంగా చూసే ప్రజాస్వామిక రాజ్యం అనే రెండు సూత్రాలపై ఇది ఆధారపడి ఉంది, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం పట్ల నిబద్ధత ద్వారా ఇవి రాజ్యాంగంలో సంస్థాగత రూపం పొందాయి. బహుళత్వం కేవలం వివిధ సమాజాల సహజీవనం మాత్రమే కాదు, అది ఒక రాజకీయ, నైతిక నిబద్ధత. ప్రతి పౌరుడికి హక్కులు, సమాన గౌరవం, సమాన అవకాశాలు లభించేలా చూడటం, ఏ ఒక్క గుర్తింపుకూ ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వకపోవడమే ఈ నిబద్ధత సారాంశం.

స్వాతంత్ర్య పోరాటం నుంచి పుట్టిన సూత్రాలు

ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద సామూహిక ఉద్యమాల్లో ఒకటైన భారత స్వాతంత్ర్య పోరాటం, ప్రాంతాలు, మతాలు, కులాలు, వర్గాలకు అతీతంగా ప్రజలను ఏకం చేసింది. స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామిక పౌరసత్వంపై ఆధారపడిన భారత దృక్పథాన్ని ఆ ఉద్యమం రూపొందించింది, చివరకు రాజ్యాంగ ప్రవేశికలో పరిపూర్ణ రూపం పొందాయి.

1947 దేశ విభజన భూభాగాన్ని విభజించినా వైవిధ్యాన్ని తొలగించలేకపోయింది, మతపరమైన బహుళత్వం భారత సామాజిక సంక్లిష్టతలో ఒక కోణం మాత్రమే, భాష, కులం, జాతి, ప్రాంతం వంటి వ్యత్యాసాలు కొనసాగాయి. సాంస్కృతిక, సామాజిక ఏకరూపతను వెతకడం కంటే, అందరికీ సమానంగా చెందిన ప్రజాస్వామిక గణతంత్రాన్ని నిర్మించే సవాలును రాజ్యాంగ నిర్మాతలు స్వీకరించారు. అప్పటి ఐరోపా భావనలకు భిన్నంగా, సారూప్యత లేకుండా కేవలం సమాన పౌరసత్వం ద్వారానే ఒక రాజకీయ సమాజంగా నిలబడవచ్చని భారత్ నిరూపించింది.

రాజ్యాంగం - సమానత్వ చార్టర్

రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పిస్తూ, పౌరసత్వాన్ని మతపరంగా కాక పౌరపరంగా నిర్వచించింది. అనేకసార్లు సవరణలకు గురైనా రాజ్యాంగం మౌలిక నిర్మాణం చెక్కుచెదరలేదు. 1975-77 ఎమర్జెన్సీ సమయంలో కూడా రాజ్యాంగం నిలదొక్కుకుంది.

లౌకికవాదం ఈ రాజ్యాంగ దృక్పథంలో అంతర్భాగం, భారత లౌకికవాదం మతం-రాజ్యం మధ్య పూర్తి విభజనను కాక, అన్ని మతాలకూ సమాన గౌరవం, రక్షణ కల్పించే విధానాన్ని సూచిస్తుంది. అయితే ఈ ఆదర్శం పరిపూర్ణంగా ఎన్నడూ సాకారం కాలేదు, లోతైన సామాజిక, ఆర్థిక అసమానతలు రాజ్యాంగం ఆశించిన సమ్మిళిత సమాజ నిర్మాణాన్ని ఇప్పటికీ సవాలు చేస్తున్నాయి.

ఆల్ ఇండియా సర్వీసులు, సైన్యం - జాతీయ సమైక్యతకు వారధులు

అఖిల భారత సర్వీసులు జాతీయ సమైక్యతను బలోపేతం చేసేలా రూపొందించారు, రాజస్థాన్ నుంచి వచ్చిన అధికారి తమిళనాడు, గుజరాత్, పశ్చిమ బెంగాల్ లేదా అస్సాంలో సేవలందించే అవకాశం ఉంది. సమర్థంగా సేవలందించాలంటే స్థానిక భాషలు నేర్చుకుని, స్థానిక సంస్కృతిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వేర్వేరు చారిత్రక, జాతిపరమైన గుర్తింపులున్న సైనిక రెజిమెంట్లు దేశమంతటా సేవలందించడం ద్వారా జాతీయ సేవ ప్రాంతీయ, సాంస్కృతిక హద్దులకు అతీతమైనదని రుజువు చేస్తాయి.

ప్రపంచంలోనే అరుదైన ప్రజాస్వామిక ప్రయోగం

పేదరికం, తీవ్ర అసమానతలు, అపారమైన మత, భాషా, కుల, జాతి వైవిధ్యంతో భారతదేశం ప్రజాస్వామ్యాన్ని కొనసాగించే అవకాశం మరీ తక్కువగా కనిపించింది. అయినప్పటికీ దాదాపు ఎనిమిది దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఎన్నికవుతూ, తిరిగి ఎన్నికవుతూ, ఓడిపోతూ వస్తున్నాయి, న్యాయస్థానాలు పనిచేస్తూనే ఉన్నాయి, రాజకీయ పార్టీలు పోటీపడుతూనే ఉన్నాయి, లక్షలాది మంది పౌరులు ఎన్నికల్లో పాల్గొంటూనే ఉన్నారు.

భారత సమాఖ్య నిర్మాణం దేశ ప్రాంతీయ, భాషా, సాంస్కృతిక వైవిధ్యానికి గుర్తింపు, గొంతు ఇచ్చింది. జాతీయ ఐక్యతను ప్రాంతీయ, రాష్ట్ర స్వయంప్రతిపత్తితో సమతుల్యం చేయాలని రాజ్యాంగ నిర్మాతలు భావించారు, సమాఖ్యవాదం కేవలం పరిపాలనా ఏర్పాటు మాత్రమే కాదు, అది భారత వైవిధ్యానికి రాజకీయ గుర్తింపు. సమాఖ్యవాదం, బహుళత్వం చేతికి చేయి కలిపి నడుస్తాయి, ఏకరూపతను డిమాండ్ చేయకుండానే భారత్ ఐక్యంగా ఉండటానికి ఇవి తోడ్పడ్డాయి.

నేటి అతిపెద్ద సవాలు - మెజారిటీవాద రాజకీయాలు

నేడు మెజారిటీవాద రాజకీయాల పెరుగుదల నుంచి అత్యంత తీవ్రమైన పరీక్షను ఎదుర్కొంటోంది. భారతదేశాన్ని ఒక వైవిధ్యభరిత గణతంత్రంగా కాక, ఒకే మతపరమైన గుర్తింపుతో నిర్వచించే దేశంగా ఇప్పుడు తిరిగి ఊహిస్తున్నారు, వైవిధ్యం, బహుళత్వం జాతీయ ఐక్యతకు పునాదిగా కాక అడ్డంకిగా చిత్రీకరించబడుతున్నాయి. ఇది భారతదేశపు రాజ్యాంగ దృక్పథం నుంచి తీవ్రమైన వైదొలగడమే.

మెజారిటీవాదం vs సమాన పౌరసత్వం

బహుళత్వం ప్రతి పౌరుడికి సమాన గౌరవం, రాజకీయ సమాజంలో సమాన సభ్యత్వం కల్పించే సూత్రంపై ఆధారపడి ఉంటుంది. మెజారిటీవాదం మాత్రం మెజారిటీ గుర్తింపుకు ప్రాధాన్యత ఇచ్చి, క్రమంగా దానినే జాతిగా నిర్వచించే లక్షణంగా మారుస్తుంది. రాజ్యాంగ హక్కులు అధికారికంగా చెక్కుచెదరకుండా ఉన్నా, కొందరు పౌరులు ఇతరుల కంటే సహజంగా ఎక్కువ చెందినవారని భావించడం మొదలైతే, సమాన పౌరసత్వ భావన క్రమంగా బలహీనపడుతుంది.

నేటి రాజకీయ చర్చ జాతీయ ఐక్యతను సాంస్కృతిక ఏకరూపతతో సమానం చేస్తోంది, భిన్నాభిప్రాయాన్ని, వ్యత్యాసాన్ని అనుమానంతో చూస్తోంది. జాతీయవాదం ఒకే మతం, ఒకే భాష లేదా ఒకే సంస్కృతితో సమానార్థకమైనప్పుడు అది సులభంగా మెజారిటీవాదంలోకి జారిపోతుంది. కొన్ని వర్గాలను దేశ యజమానులుగా, మరికొందరిని తమ విధేయతను నిరూపించుకోవాల్సిన వారిగా చూసే ధోరణి ఏర్పడుతుంది.

ప్రజాస్వామ్య భవిష్యత్తుపైనా ప్రశ్నలు

కేవలం క్రమం తప్పకుండా ఎన్నికలు జరగడం ప్రజాస్వామ్యానికి సరిపోదు. నిజమైన రాజకీయ పోటీ, ప్రజా చర్చ ద్వారా ప్రభుత్వాలను శాంతియుతంగా మార్చగల అవకాశం ఉండాలి. సంఖ్యాపరమైన మతపరమైన మెజారిటీని శాశ్వత రాజకీయ మెజారిటీగా మార్చే ప్రయత్నమే మెజారిటీవాద రాజకీయాల సమస్య అని, దీనివల్ల ఎన్నికల విజయం ప్రభుత్వ పనితీరుపై కాక గుర్తింపుపై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది. అధికార మార్పిడి అవకాశం సన్నగిల్లితే, ఎన్నికలు జరుగుతున్నా వాటి ప్రజాస్వామిక అర్థం క్రమంగా క్షీణిస్తుంది.

కేంద్రీకరణతో సమాఖ్యవాదంపై ఒత్తిడి

రాజకీయ, పరిపాలనా అధికారం కేంద్రం వద్ద మరింతగా కేంద్రీకృతమవుతున్న కొద్దీ, భారతదేశం చారిత్రకంగా తన వైవిధ్యాన్ని కలుపుకుపోయిన ప్రధాన యంత్రాంగాల్లో ఒకటైన సమాఖ్యవాదం బలహీనపడుతోంది.

స్వాతంత్ర్య పోరాటం నుంచి నేటివరకు రాజకీయ నిరసన భారత ప్రజాస్వామ్యంలో అంతర్భాగంగా ఉంది, ప్రజా ఉద్యమాలు హక్కులను విస్తరించాయి, పౌరసత్వాన్ని బలోపేతం చేసాయి, ప్రభుత్వాలను జవాబుదారీగా ఉంచాయి. శాంతియుత నిరసన ప్రజాస్వామ్యంలో బలహీనతకు సంకేతం కాదు, అది ప్రజాస్వామ్యం తనను తాను పునరుజ్జీవింపజేసుకునే మార్గాల్లో ఒకటి. ఓటు హక్కుతో పాటు ప్రశ్నించే, విమర్శించే, చర్చించే, శాంతియుతంగా అసమ్మతి తెలిపే హక్కును కూడా రాజ్యాంగం కాపాడుతుంది.

రెండు దృక్పథాల మధ్య పోరు

భారత్‌ను బహుళత్వ సమాజంగా చూసే రాజ్యాంగ దృక్పథానికి, ఏకరూపత, బలమైన కేంద్రీకరణ, మెజారిటీవాద భావనలను కోరుకునే ప్రత్యామ్నాయ దృక్పథానికి మధ్య పోరాటమే నేటి భారత రాజకీయాల గుండె మీద ఉంది. వైవిధ్యాన్ని తొలగించకుండా, గుర్తించి కలుపుకుపోవడం ద్వారానే భారత్ ఐక్యంగా నిలిచింది.. సమీకరణ కంటే ప్రాతినిధ్యంపై, ఏకరూపత కంటే రాజ్యాంగ, రాజకీయ సమ్మిళితత్వంపై ఆధారపడటమే భారత్ విజయ రహస్యం..

ఇది రాజ్యాంగ గణతంత్ర రక్షణ

భారతదేశపు రాజ్యాంగ భావనను రక్షించడం అంటే ఏదో ఒక నైరూప్య ఆదర్శాన్ని లేదా ఏదో ఒక పార్టీకి చెందిన రాజకీయ సంప్రదాయాన్ని రక్షించడం కాదు, అది స్వయంగా రాజ్యాంగబద్ధ గణతంత్రాన్ని రక్షించడమే. భారత్ ప్రజాస్వామ్యంగా కొనసాగుతుందా అనేది కాదు అసలు ప్రశ్న - తన ప్రజాస్వామ్యం ఆధారపడిన రాజ్యాంగ దృక్పథానికి భారత్ నిబద్ధంగా ఉంటుందా అనేదే అసలు ప్రశ్న.

పౌరులపైనే బాధ్యత - ముఖ్యంగా యువతపై రాజ్యాంగాలు, న్యాయస్థానాలు, చట్టాలు ముఖ్యమే అయినా, చివరకు అవి వాటిని విశ్వసించి, నిత్య జీవితంలో ఆచరించే పౌరులపైనే ఆధారపడతాయి. భిన్నత్వం పట్ల గౌరవం, విభేదించే వారి మాట వినే సుముఖత, సమాన పౌరసత్వం పట్ల నిబద్ధత - వీటిని ప్రతి ప్రజాస్వామిక సమాజం అలవర్చుకోవాలి. ఎంత చక్కగా రాసిన రాజ్యాంగమైనా ఆ విలువలు బహిరంగ జీవితం నుంచి కనుమరుగైతే తనను తాను కాపాడుకోలేదు.

ఈ బాధ్యత అందరిపైనా ఉన్నా, ముఖ్యంగా యువత, విద్యార్థులపై ఎక్కువగా ఉంది, ప్రతి తరం రాజ్యాంగాన్ని వారసత్వంగా పొందుతుంది, కానీ ప్రతి తరం తన సొంత ఎంపికల ద్వారా దాన్ని పునరుద్ధరించాలి. భారత ప్రజాస్వామ్య భవిష్యత్తు కేవలం ప్రభుత్వాలపైనే కాక, పౌరుల ఊహాశక్తి, పౌర నిబద్ధత, ప్రజాస్వామిక విశ్వాసంపై కూడా ఆధారపడి ఉంటుంది.

రాజ్యాంగం కేవలం ఎనిమిది దశాబ్దాల క్రితం రాసిన ఒక పత్రం మాత్రమే కాదు, అది ప్రతి తరం నిలబెట్టుకోవాల్సిన సజీవ వాగ్దానం. ఈ వాగ్దానాన్ని సజీవంగా ఉంచడం నేటి యువతరం (ఆల్ఫా జనరేషన్) చేతుల్లోనే ఎక్కువగా ఉంది. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

- ప్రొ.జోయా హసన్

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్