పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇలా ముగుస్తాయని చాలామంది వూహించి వుండరు. ప్రధాని మోడీ నాయకత్వ సమర్థత, హోంమంత్రి అమిత్ షా చాకచక్యం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి హేమాహేమీ స్నేహితుల బేషరతు వత్తాసు, కొత్తగా చేతులు కలిపేందుకు పిల్లిమొగ్గలేస్తున్న శరద్ పవర్ పరివారం ఇప్పటికే కలిసి పోయిన దీదీ మమత మాజీ శిష్యగణం.. ఒకటేమిటి అన్నీ మంచి శకునములే అన్నట్టు మొదలెట్టారు. నియోజకవర్గాల పెంపుతో సహా కీలకమైన రాజ్యాంగ బిల్లులను చాపచుట్టేయాలనుకున్నారు. కానీ తీరా చూస్తే జరిగిందేంటి? బ్లాక్ బస్టర్ హైప్‌తో మొదలై సూపర్ ప్లాప్‌గా ముగిసిన బొమ్మలా తయారైంది పరిస్థితి. ఇందుకు చివరి రోజున సభా వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విడుదల చేసిన గణాంకాలే సాక్ష్యం. రాజ్యసభ 39 శాతం, లోక్‌సభ 19 శాతం పనిచేశాయట. ఈ సభ నిరుత్సాహకంగా ముగిసిందని నిట్టూరుస్తుంది అధికార కూటమి, దాన్ని బలపర్చే మీడియా. కానీ వాస్తవానికి ఈ సమావేశాలు వందశాతం అత్యంత ప్రయోజనకరంగా ప్రభావశీలంగా జరిగాయని చెప్పవలసి వుంటుంది. జవాబుదారీ తనం లేకుండా బుల్డోజర్ తరహాలో సభలో అనుకున్న అజెండాతో నడిపించాలనుకున్న పేరాశలే ఇక్కడ కుప్పకూలాయి. సభ బయటా, లోపలా కూడా ప్రతిఘటన నిలదీత బిజెపిని ఉక్కిరి బిక్కిరి చేశాయి. 80వ స్వాతంత్ర దినోత్సవాన దేశానికి ఇది శుభ సూచనే తప్ప విచారించవలసిందేమీ లేదు. పైగా ఇది బొద్దింకల యుద్ధభేరీగా సాగడం, ఏదీ పట్టించుకోదనే యువత ముందు పీఠిన నిలవడం, ఉద్యమాలే లేవని వుసూరనే వాళ్లు కూడా ఉత్సాహపడక తప్పని సన్నివేశాలు గోచరించడం భారత మాతకు స్వాతంత్ర దినోత్సవ కానుక అనుకోవాలి. బడా మీడియా ఫోకస్ ఇవ్వకపోయినా ఆగస్టు 10 దేశవ్యాపితంగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పదిలక్షల మంది జైల్ భరో నిర్వహించడం కూడా స్వాతంత్రోద్యమ పోరాటాల స్ఫూర్తిని గుర్తు చేసింది. దేశం గురించి దేశభక్తి గురించి అదేపనిగా వూదరగొట్టే బిజెపి, ఆర్.ఎస్.ఎస్ లు ఆఖరుకు వందేమాతరం చరణాలన్నీ పాడుకుని సభలను ముగించుకుని సంతృప్తి పడాల్సి వచ్చింది. అదే సమయంలో తమిళనాడు వంటి రాష్ట్రాలు తాము ముందు తమిళతల్లికి వందనం మాత్రమే పాడతామని కుండబద్దలు కొట్టి మరీ అధికారికంగా తీర్మానం చేయడం గమనించదగింది. పట్టువిడుపుల పేరుతో సాఫ్ట్ హిందూత్వ సన్నాయినొక్కులు పాడుతున్న కాంగ్రెస్ యుడిఎఫ్ సర్కారు కేరళలో వందేమాతరం పూర్తిగా పాడాలని సర్క్యులర్ జారీ చేయించి తర్వాత నాలుక కరుచుకోక తప్పలేదు.
బడ్జెట్ సమావేశాలతో తేడా
ఇదే ఏడాది జనవరి, ఏప్రిల్ మధ్య జరిగిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలతో వీటిని పోల్చిచూస్తే తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అప్పుడు మొత్తం ఏకపక్షంగా నడిచింది. హఠాత్తుగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత దేశంతో స్వేచ్చావాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టిఎ) కుదిరిందని తన సొంత వేదిక ట్రూత్ నుంచి ప్రకటించారు. వెంటనే ప్రధానమంత్రి 140 కోట్ల భారతీయుల తరఫున తన ప్రియమైన గొప్ప స్నేహితుడు ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపి పరవశించిపోయారు.! మోడీ తనను సంతోషపెట్టడానికి చాలా చేశారు గానీ ఇంకా చేయాలని ట్రంప్ మాట్లాడ్డం, ఆయన తమ అధ్యక్షుడుకి ఒక్క ఫోన్ చేస్తే అంతా అయిపోతుందని అమెరికా అధికారులు షరతు పెట్టడం భారతదేశ ఆత్మగౌరవానికే భంగకరంగా పరిణమించింది. దేశ అత్యున్నత శాసనవ్యవస్థ పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా దానికి తెలియకుండా అమెరికా అధ్యక్షుడి ప్రకటనద్వారా వాణిజ్య ఒప్పందం గురించి అదీ అసంపూర్ణంగా తెలుసుకోవడం కంటే దాన్ని కించపర్చడం ఏముంటుంది? ఆ తర్వాత కూడా మోడీ ఎన్‌డిఎ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడితే. సభలో వాణిజ్య శాఖామంత్రి పీయుష్ గోయల్ అరకొర ప్రకటనతో మమ అనిపించారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ చైనాతో డోక్లామ్, గల్వాన్ ఘర్షణలపై మాజీ ప్రధాన సైన్యాధికారి జనరల్ నరవాణే రాసిన జ్ఞాపకాలను చదవివినిపించడం మహాపరాధమని కేంద్రమంత్రులు గగ్గోలు పెట్టారు. ప్రతిపక్ష మహిళా ఎంపిలు లోక్‌సభలో ప్రధాని స్థానం ముందు నిల్చుని నిరసన తెలిపారనేది మరో వివాదంగా పాలక పక్షం సమయం వృథా చేసింది. ఆ రచ్చలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై ప్రధాన ప్రసంగం రద్దు చేశామన్నారు. ఇవన్నీ ఒక పథకం ప్రకారం జరిగినవే. ప్రధానికి నిరసనతెల్పాలనుకుంటున్నట్టు తనకు తెలిసింది గనకనే సభను వాయిదా వేశానని స్పీకర్ విచిత్రమైన వివరణ ఇచ్చారు. రాజ్యసభలోనూ ఇదే తంతు నడిచింది.. రాహుల్ అబోధ బాలక్ అంటూ ఆయనను నమ్ముకుని ప్రతిపక్షం గొడవ చేస్తున్నదని జెపి నడ్డా దాడికి దిగారు. ప్రతిపక్షం ఉనికినే సహించలేని ఈ ధోరణిని నిరసిస్తూ ప్రతిపక్షాలన్నీ వాకౌట్ చేశాక రాజ్యాంగ పరంగా ఇబ్బందిరాకుండా మోడీ రాష్ట్రపతి ప్రసంగంపై మాట్లాడారు. తమ గుజరాతీ అయిన గాంధీ ఇంటిపేరు దొంగిలించారనే అర్థరహిత ఆరోపణ నుంచి డిఎంకె, సిపిఎం నడిపే మన రాష్ట్ర ప్రభుత్వాల వరకూ అనేక విధాల దాడి చేశారు.
ఫిబ్రవరిలో రానున్న శాసనసభ ఎన్నికలకోసం ఆ వేదికను వాడుకున్నారు. అస్సాం, బెంగాల్‌లో గెలిచి ఫిరాయింపులను ఉసిగొల్పారు. ఆ విధంగా చాలా బలపడిపోయామని అనుకున్న బిల్లులు నల్లేరుమీద బండిలా నడిపించేస్తామని గొప్పలు పోయారు. కానీ తీరా చూస్తే కథ అడ్డం తిరిగినట్టు పరిస్థితి తయారవడం యాధృచ్చికమేమీ కాదు.
కుటిల వ్యూహాలు విఫలం
బొద్దింకల యుద్ధం తొలి విజయం ప్రస్తుత రాజకీయాలలో కొత్త అధ్యాయం రచించింది. 2024 ఎదురుదెబ్బను తిరగేసినట్టు గొప్పలు పోతున్న బిజెపి, ఆర్.ఎస్.ఎస్ లను ఒక్కసారిగా హడలగొట్టింది. ధర్మేంద్ర ప్రధాన్ దిగిపోవలసి వచ్చింది. ప్రధానమంత్రి నిద్ర మానుకుని వీడియోలు విడుదల చేస్తూ యువత పట్ల తన అభిమానాన్ని చెప్పుకోవలసి వచ్చింది. ఆఖరుకు ఆర్.ఎస్.ఎస్ బాస్‌దాకా అప్పటి నుంచి వరసగా యువతతోనే సమావేశాలు సందేశాలు. ఈ వారం విశాఖపట్నంలో విస్తృత సమావేశం పెట్టుకుంటున్నారట. కంటితుడుపుగా ఏదో లీకేజిలకు శిక్షలు జరిమానాలు పెంచుతూ ఆగమేఘాల మీద బిల్లు తేవలసి వచ్చింది. నిరుద్యోగ యువతను బొద్దింకలని పిలిచి నొప్పించిన ప్రధాన న్యాయమూర్తిగారే తన మాటలను వక్రీకరించారని ఒకటికి రెండు సార్లు సంజాయిషీ ఇచ్చుకోవలసి వచ్చింది. అయినా వీటినిబట్టి అంతా మారిపోయిందనుకుంటే పొరబాటు. ఇదే న్యాయమూర్తి తన మాటలను వక్రీకరించిన వారిపై చర్య తీసుకోవాలో వద్దో అని విచారణ మొదలెట్టారు. హైదరాబాద్ సమీపంలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయానికి ఆయనను ముఖ్యఅతిధిగా పిలవడాన్ని విద్యార్థులు వ్యతిరేకిస్తే వారిపై బార్ కౌన్సిల్ ద్వారా కక్ష సాధింపు చర్యల బెదిరింపు నడిచింది.
యువత జెన్ జి అంటూనే జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సీటీలో ఆదివాసీలకు సంబంధించిన పుస్తకంపై చర్చకు ఆటంకం కల్పించారు. టిస్‌లో సభ జరిపిన విద్యార్థులకు శిక్షలు వేశారు. జంతర్‌మంతర్ నిరసనకారులపై నిందారోపణలు కేసులు కొనసాగిస్తూనే వున్నారు. రాష్ట్రాల వారీగా ప్రత్యర్థి ప్రభుత్వాలున్న చోట్ల దీన్ని హైజాక్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. జార్ఖండ్, ఎపి, తెలంగాణ వంటి చోట్ల వివిధ రూపాల్లో ఇలాటివి చూస్తున్నాం. తప్పులు ఎక్కడ జరిగినా తప్పే గానీ కలగాపులగం చేసే ఎత్తుగడలు మాత్రం తగవు.సోషల్‌మీడియాపై వరస దాడులు, అంతర్జాతీయ ప్లాట్‌ఫాంలకు హెచ్చరికలు ఇవన్నీ భావస్వేచ్చను ఉద్యమాలకు వూపును నివారించే ప్రయాసలే. విద్యాసంస్థలు పరీక్షల వ్యవస్థ ప్రైవేటీకరణ ఇక్కడ అసలు సమస్యగా పోరాడవలసి వుంటుంది. వీటిని తప్పు దోవ పట్టించే ఎత్తులను కూడా అడ్డుకోవలసి వుంటుంది. ఆ విధమైన దిశానిర్దేశం అందకుండా చేసేందుకే కేంద్రం తో తంటాలు పడుతున్నాయి.
అయిదు బిల్లులు వెనక్కు..
మళ్లీ పార్లమెంటు సమావేశాలకు వస్తే అప్రజాస్వామికమైన అయిదు బిల్లులను ఆలోచనలను అడ్డుకోవడం చెప్పుకోదగింది. మహిళా రిజర్వేషన్ల పేరుతో నియోజకవర్గాల పునర్విభజన, ఒకేదేశం ఒకే ఎన్నిక, ఎఫ్.సి.ఆర్.ఎ పేరిట మైనార్టీ సంస్థలపైదాడి, వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ పేరిట విద్యారంగం గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం, 30 రోజులు నిర్బంధంలో వుంటే కీలక పదవులకు అనర్హత అంటూ నేతల మెడపై కత్తివేలాడదీసేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లు సభముందుకు రావడం గానీ చర్చకు పెట్టడం గానీ జరగలేదు. గనుల సవరణ, సహకార సంస్థల కేంద్రీకరణ, వందేమాతరం విస్తరణతో సహా మరో పన్నెండు చర్చ లేకుండా ఆమోదం పొందాయి. లీకుల నిరోధం, కఠిన శిక్షల బిల్లుపై షరతులతో చర్చ జరిగింది. మొత్తంమీద చూస్తే రాజకీయంగానూ రాజ్యాంగ పరంగానూ బిజెపి, ఆర్.ఎస్.ఎస్ ల భారీ పథకాలకు కొంతవరకూ బ్రేకు పడింది.
మోడీ అమిత్ షాలు సభలో వుండి కూడా చర్చకు రాకుండా మొహం చాటేశారు. జంతర్ మంతర్‌లో నిర్బంధ చర్యలకు ఉత్తర్వులిచ్చిన విషయమై ప్రకటన క్షమాపణలకు అమిత్‌షా సిద్ధం కాకపోవడం, అయోధ్య రామమందిరం నిధుల గల్లంతు చర్చకు ఒప్పుకోకపోవడం పాలకపక్షం బలహీనతనే వెల్లడించింది. చివరి రెండు రోజుల్లో సిపిఎం సభ్యుడు జాన్ బ్రిట్టాస్‌నుద్ధేశించి బిజెపి ఎంపి సుశ్మితా దేవి...లుంగీవాలాలని చులకనగా మాట్లాడడం అసహనానికి పరాకాష్ట. దానిపై సభ్యులు సామూహిక నిరసన తెలపడమే గాక ఛైర్మన్ కూడా మందలించాల్సి వచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ జరిగిన రామ్‌లీలా మైదానాన్ని శ్రీరామ్ సేన శుద్దీకరణ చేయడం సనాతన రాజనీతి నిజస్వరూపం వెల్లడించింది. మంత్రి జెపి నడ్డా విచారం వెలిబుచ్చాల్సి వచ్చింది. ఈ రెండు సందర్భాలు మోడీ సర్కారు అసలు రంగేంటో తెలిసేలా చేశాయి.
భవిష్యత్ చిత్రం?
ఆఖరుకు స్పీకర్ ఓం బిర్లా సభ తీరుతెన్నులపై ప్రకటన చేయకుండానే ముగిసింది. ఆయన ఇచ్చే వీడ్కోలు వింనీదుకు హాజరయ్యేందుకు కూడా ప్రతిపక్షాలు సిద్ధపడలేదు. ఇది బడ్జెట్ సమావేశాల నాటి పరిస్థితికి పూర్తి విరుద్ధం. ఇక తెలుగునాట ప్రాంతీయ పార్టీలు పరోక్షంగా భిన్న స్వరాలే వినిపించాయి. ఎపిలో ఎన్‌డిఎ కూటమి లో ప్రత్యేకించి పవన్ కల్యాణ్ మోడీని పొగిడి జెన్‌జీపై దాడి చేసి విమర్శలు మూటకట్టుకున్నారు. బిఆర్‌ఎస్, వైసిపి మీడియాలు కూడా సభ వాయిదాలు ఉత్పాదకత లేకపోవడం వంటి వాటిపై విమర్శలు చేశాయి.
ఈ క్రమంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుపై కొన్ని జాతీయంగానే భిన్న వ్యాఖ్యలు వచ్చాయి. మోడీ విదేశీనేతలతో ఆలింగనాలపై సభ చివరి రోజున రాహుల్ గాంధీ ఈ సమయంలోనే ఒక సమావేశంలో చేసిన వ్యాఖ్యలను పెద్దవి చేసేందుకు ఇప్పుడు బిజెపి పథకరచన చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇలాంటి చిట్కాలు ఎన్ని ప్రయోగించినా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు పాలకకూటమికి భంగపాటునే మిగిల్చాయి. వీటిపై మరింత సమీక్ష, భవిష్యత్ కార్యాచరణ యోచన అవసరం.
- తెలకపల్లి రవి







కామెంట్‌లు (0)