బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionప్రజాస్వామ్య స్వరం!

18 గంటల క్రితం

ప్రకాశ్_ రాజ్
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 06:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

తెరపై విలన్‌, హీరో, తండ్రి, రాజకీయ నాయకుడు... ఇలా ఎన్నో పాత్రల్లో మెప్పించిన ప్రకాశ్ రాజ్, నిజ జీవితంలో మాత్రం ప్రశ్నించే పౌరుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. మహత్తర విద్యార్థి ఉద్యమానికి సంఘీభావం ప్రకటించడమే కాకుండా, ఈ నెల 19, 20 తేదీల్లో జంతర్‌మంతర్‌లోని విద్యార్థి శిబిరంలోనే అందరితో కలిసి గడిపారు. 'చలో సంసద్' కార్యక్రమంలోనూ ప్రత్యక్షంగా పాల్గొని, కళాకారుడి సామాజిక బాధ్యతను తన ఆచరణతో మరోసారి నిరూపించారు.

ప్రకాశ్ రాజ్‌ను ప్రత్యేకంగా నిలబెట్టేది ఆయన చెప్పే మాటలు కాదు; వాటికి తగ్గట్టుగా ఉండే ఆచరణ. దేశంలో ఎక్కడ ప్రజాస్వామ్య విలువలకు ముప్పు వాటిల్లిందని భావించినా, ఎక్కడ భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి జరిగినా, ఎక్కడ రైతులు, విద్యార్థులు, కార్మికులు, రచయితలు తమ హక్కుల కోసం పోరాడినా అక్కడ ఆయన కనిపిస్తారు. సభలకు పిలిస్తే వెళ్తారు. ప్రజల మధ్య కూర్చుని మాట్లాడి సంఘీభావం ప్రకటిస్తారు. ఇది గిట్టని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అనుకూలవాదులు పనిగట్టుకొని మరీ సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేశారు. వ్యక్తిగత దూషణలు ఎదురయ్యాయి. సినిమాలను బహిష్కరించాలన్న పిలుపులు వినిపించాయి. అవకాశాలు తగ్గిపోతాయని హెచ్చరికలు వచ్చాయి. కానీ ప్రకాశ్ రాజ్ లాభనష్టాలు బేరీజు వేసుకొని అవకాశవాదంగా వ్యవహరించలేదు. నచ్చినప్పుడు మాత్రమే మాట్లాడి, ఇబ్బందులు ఎదురవుతాయని భావించినప్పుడు మౌనంగా ఉండలేదు. సినిమా రంగంలో పేరుప్రతిష్ఠలు సంపాదించిన తర్వాత చాలామంది తమ చుట్టూ ఒక రక్షణ వలయాన్ని నిర్మించుకుంటారు. ప్రకాశ్ రాజ్ ఆ వలయం దాటి ప్రజల మధ్యకు వెళ్లారు. ప్రతి కళాకారుడికి సమాజం పట్ల బాధ్యత ఉంటుందని ఆయన విశ్వాసం. అందుకే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, భావ ప్రకటనా స్వేచ్ఛ, సామాజిక న్యాయం వంటి అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేయటానికి ఎప్పుడూ వెనకంజ వేయలేదు. అధికారం ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, అరాచకాలు, అణచివేతలు తగవని ప్రకాశ్ రాజ్ బలంగా చెబుతారు.

గౌరీ లంకేశ్ హత్య తర్వాత...

2017 సెప్టెంబర్‌ 5. బెంగళూరులో సీనియర్‌ జర్నలిస్టు, రచయిత్రి గౌరీ లంకేశ్‌ను ఆమె ఇంటి ముందు మతోన్మాదులు కాల్చిచంపారు. ఆ ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రకాశ్ రాజ్‌కు అది మూడు దశాబ్దాలుగా తనతో కలిసి నడిచిన స్నేహితురాలిని కోల్పోయిన వేదన. భిన్నాభిప్రాయాన్ని తుపాకీతో మౌనంలోకి నెట్టే ప్రయత్నంపై కలిగిన ఆవేదన. గౌరీ అంత్యక్రియల సందర్భంగా ఆయన, "గౌరీని పాతిపెట్టడం లేదు... ఒక విత్తనాన్ని నాటుతున్నాం," అన్నారు. ఆ మాట దేశవ్యాప్తంగా మార్మోగింది. అది కేవలం నివాళి కాదు. తన తర్వాతి ప్రయాణానికి తానే నిర్దేశించుకున్న దిశ. ఆ ఘటన తర్వాత ప్రకాశ్ రాజ్ వైఖరిలో మరింత స్పష్టత కనిపించింది. అన్యాయం జరిగిన ప్రతిసారీ స్పందించడం, అధికారాన్ని ప్రశ్నించడం, ప్రజాస్వామ్య విలువలను గుర్తు చేయడం తన బాధ్యతగా భావించారు. "జస్ట్ ఆస్కింగ్" పేరిట "ప్రశ్నించడం దేశద్రోహం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి హక్కు" అనే సందేశాన్ని నిరంతరం వినిపిస్తున్నారు.

ఎక్కడ గొంతెత్తితే అక్కడికి...

2018లో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ చేసిన విమర్శలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. తన వ్యాఖ్యలు వ్యక్తిగత ద్వేషం వల్ల కావని, అధికారాన్ని ప్రశ్నించడం ప్రజాస్వామ్య బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. 2020–21 రైతుల ఉద్యమం సమయంలో రైతులకు బహిరంగంగా మద్దతు తెలిపారు. రైతులతో ప్రభుత్వం సంభాషించాలని, నిరసన తెలిపే హక్కును గౌరవించాలని కోరారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికీ సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు దేశ సంపద అని, ప్రజల అభిప్రాయాన్ని పక్కనపెట్టి తీసుకునే నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి మంచివి కావని అన్నారు. తాజాగా దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమం వెల్లువెత్తినప్పుడు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌కు వెళ్లి విద్యార్థులతో కలిసి కూర్చొన్నారు. వారి డిమాండ్లను వినాలని, యువత గొంతును అణచివేయడం ప్రజాస్వామ్యానికి శుభసూచకం కాదని హెచ్చరించారు. కళాకారులు కూడా ఇలాంటి సందర్భాల్లో మౌనంగా ఉండకూడదని పిలుపునిచ్చారు.

ప్రశ్నను వదల్లేదు!

గత ఎనిమిదేళ్లలో ప్రకాశ్ రాజ్ ప్రయాణాన్ని పరిశీలిస్తే ఒక స్పష్టమైన ధోరణి కనిపిస్తోంది. రైతుల ఉద్యమం కావొచ్చు, విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం కావొచ్చు, భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం జరిగిన సభలు కావొచ్చు, విద్యార్థుల ఆందోళనలు కావొచ్చు... ప్రతి సందర్భంలోనూ ఆయన ప్రజల మధ్య నిలబడ్డారు. కేవలం ట్వీట్ చేసి తన బాధ్యత ముగిసిందనుకోలేదు. సాధ్యమైనప్పుడల్లా ఉద్యమ ప్రదేశానికే వెళ్లారు. ప్రజలతో మాట్లాడారు. పోరాటంలో వారు ఒంటరివారు కాదనే భరోసా ఇచ్చారు. ప్రజా ఉద్యమాలకు అవసరమైనప్పుడు సంఘీభావం తెలపడం, భిన్నాభిప్రాయాన్ని ప్రజాస్వామ్య సహజ స్వరంగా చూడడం ఆయన వైఖరి. మౌనం చాలామందికి రక్షణ కవచంగా మారిన ఈ కాలంలో ఆయన - ప్రశ్నించే హక్కును ప్రజాస్వామ్యానికి ప్రాణంగా భావిస్తూ తన ప్రయాణం సాగిస్తున్నారు. అందుకే ప్రకాశ్ రాజ్‌ను కేవలం ఒక నటుడిగా కాకుండా, ప్రజాపక్షవాదిగా, ప్రశ్నించే గొంతుగా చాలామంది గుర్తిస్తారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్