బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionప్రతి ఇల్లూ ఓ గ్రంథాలయం..!

1 రోజు క్రితం

ప్రతి ఇల్లూ ఓ గ్రంథాలయం! image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026, 06:22 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

​ఒకప్పుడు ఆ గ్రామంలో పేదరికం తాండవించేది. బతుకుదెరువు కోసం అడవిపై ఆధారపడే కుటుంబాలు పిల్లలను బడికి పంపడానికీ ఇబ్బందిపడేవి. కానీ ఇప్పుడు అక్కడి దృశ్యం మారింది. ప్రతి ఇంట్లో పుస్తకాల అరలు, వరండాల్లో పుస్తకాల పెట్టెలు కనిపిస్తున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు పుస్తకాలు చదువుతున్నారు. భిన్న భాషలు, సంస్కృతులకు చెందిన ప్రజలు అక్షరాల చుట్టూ ఒక్కటవుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బుక్సా అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న పానిజోరా గ్రామం ఇప్పుడు 'పుస్తకాల గ్రామం'గా గుర్తింపు పొందుతోంది. పుస్తకాలను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకొచ్చి, పఠనాన్ని సామూహిక సంస్కృతిగా మార్చుతున్న యువత ప్రయత్నం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

​అలీపుర్‌దువార్‌ జిల్లాలోని కాల్చిని ప్రాంతంలో ఉన్న ఈ గ్రామంలో 70 కుటుంబాలకు చెందిన 320 మంది నివసిస్తున్నారు. వివిధ ఆదివాసీ సమూహాలకు చెందిన ప్రజలు ఇక్కడ ఉన్నారు. విద్యావంతులైన యువత చొరవతో గ్రామంలో పఠన సంస్కృతి మొదలైంది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 40 మంది పిల్లలు చదువుతున్నారు. చదువు మధ్యలో మానేసే విద్యార్థులు లేకపోవడం ఈ గ్రామం సాధించిన ముఖ్యమైన మార్పు.

​ఇళ్లకు పుస్తకాల పేర్లు!

గ్రామంలోని 25 కుటుంబాలు తమ ఇళ్లను చిన్న గ్రంథాలయాలుగా మార్చుకున్నాయి. ప్రత్యేకంగా పుస్తకాల అరలను ఏర్పాటు చేసి, వరండాల్లో పుస్తకాల పెట్టెలను అందుబాటులో ఉంచాయి. ప్రతి ఇంటి వద్ద ఈ పెట్టెలను చక్కగా రూపొందించారు. వాటిలో పుస్తకాలతోపాటు, ఇళ్ల గోడలపై పుస్తకాలు, వైజ్ఞానిక అంశాలకు సంబంధించిన చిత్రాలు, సమాచారంతో అలంకరణలు చేశారు. ఒక్కో అంశానికి సంబంధించిన 25 నుంచి 30 పుస్తకాలు వీటిలో ఉంటాయి. కథలు, నవలలు, సాహిత్యం, విజ్ఞానశాస్త్రం, చరిత్ర వంటి విభిన్న అంశాల పుస్తకాలను సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యులే కాకుండా గ్రామంలో ఎవరైనా వీటిని చదువుకోవచ్చు. ఒక పుస్తకాన్ని తీసుకెళ్లి చదివిన తర్వాత తిరిగి ఇచ్చి మరొకటి తీసుకోవచ్చు. కొన్ని ఇళ్లకు పుస్తకాల పేర్లనే పెట్టుకున్నారు. 'ప్రథమ్‌ ఆలో', 'సంచయిత', 'మేఘమల్లార్‌' వంటి పేర్లతో అవి పాఠకులను ఆహ్వానిస్తున్నాయి. పాఠశాల సమీపంలో ఒక కేంద్ర గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. పుస్తకాల అరలను, పాత పుస్తకాలను కొందరు దాతలు విరాళంగా అందించారు. దీంతో పుస్తకాలు కొనలేని పేద కుటుంబాల పిల్లలకూ చదివే అవకాశం కలుగుతోంది.

​అక్షరాలతో ఐక్యత

ఓరావ్‌, ముండా, ఖరియా, రాభా, గారో, నేపాలీ, మెచ్‌, దుక్పా, బెంగాలీ, బిహారీ సమూహాలకు చెందిన ప్రజలు ఈ గ్రామంలో నివసిస్తున్నారు. భాషలు, సంప్రదాయాలు వేరైనా ఇప్పుడు చాలామంది బెంగాలీ భాషను కూడా నేర్చుకున్నారు. గ్రామస్తుల్లో దాదాపు 95 శాతం మంది క్రైస్తవులు. అయినప్పటికీ వారి జాతి, సాంస్కృతిక ఆచారాలు భిన్నంగా ఉంటాయి. ఈ మార్పుకు తొలినాళ్లలో బాటలు వేసింది పార్ధ సాహా అనే ఉపాధ్యాయుడు. గ్రామ సమీపంలోని దామన్‌పూర్‌ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న సమయంలో పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా సహకరించారు. పిల్లలను బడికి పంపేందుకు నిరాకరించిన తల్లిదండ్రులకు విద్య ప్రాధాన్యతను వివరించి వారిని ఒప్పించారు. అయితే ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లింది స్థానిక యువతేనని ఆయన చెబుతున్నారు.

​గ్రామ యువత స్వచ్ఛంద బృందంగా ఏర్పడి వృద్ధులకు చదవడం, రాయడం నేర్పుతోంది. బాలికల కోసం జానపద గీతాలు, నృత్యాల బృందాన్ని, యువత కోసం ఫుట్‌బాల్‌ అకాడమీని ఏర్పాటు చేసింది. మత్తుపదార్థాలకు దూరంగా ఉండటం, ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించడం వంటి నియమాలనూ రూపొందించుకుంది. ఈ కృషి ఫలితంగా గ్రామంలో పిల్లల చదువుపై ఆసక్తి పెరిగింది. గత కొన్నేళ్లుగా మాధ్యమిక, ఉన్నత మాధ్యమిక పరీక్షల్లో ఉత్తీర్ణులవుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని ఉపాధ్యాయుడు అభిషేక్‌ బందోపాధ్యాయ్‌ తెలిపారు. ప్రాథమిక విద్య గ్రామంలోనే అందుబాటులో ఉండగా, ఆరు కిలోమీటర్ల దూరంలోని దామన్‌పూర్‌ ఉన్నత మాధ్యమిక పాఠశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది.

​మరిన్ని పుస్తకాలు కావాలి

ప్రతి ఇంటి గ్రంథాలయానికీ ఒక ప్రత్యేకత ఉంది. ప్రమీల టొప్పో ఇంట్లో బెంగాలీ, హిందీ, ఆంగ్ల భాషల పుస్తకాలున్నాయి. కృతా కెర్కెట్టా ఇంట్లో కథల పుస్తకాలు ఎక్కువగా ఉంటే, దీపికా ఓరాన్‌ సేకరణలో బెంగాలీ కల్పిత సాహిత్యానికి ప్రాధాన్యత ఉంది. అయితే గ్రామానికి ఇంకా అనేక పుస్తకాలు అవసరమవుతున్నాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు ఉపయోగపడే పుస్తకాలు కావాలని గ్రామస్థులు కోరుతున్నారు. చిన్నారుల కోసం కథల పుస్తకాలు, తాజా ముద్రణలు కూడా అవసరమవుతున్నాయి. ప్రమీల టొప్పో మాట్లాడుతూ.. వివిధ అంశాలకు సంబంధించిన గ్రంథాలయాలను ఏర్పాటు చేశామని, అప్పుడప్పుడు స్పోకెన్‌ ఇంగ్లీష్‌, జనరల్‌ నాలెడ్జ్‌ తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందుకు పలువురు ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారని తెలిపారు. పుస్తక పఠనం సమాజంగా కలిసి జీవించడంలోని ఆనందాన్ని నేర్పిందని, ఇప్పుడు మరిన్ని పుస్తకాలు అవసరమని పేర్కొన్నారు.

​పానిజోరా ప్రభావం ఇతర గ్రామాలకూ విస్తరిస్తోంది. కల్కుట్‌, గరంబస్తి, మఝేర్దాబ్రి, తమర్చిలతో సహా చుట్టుపక్కల పది గ్రామాల ప్రజలు కూడా ఇలాంటి గ్రంథాలయాల ఏర్పాటుకు పుస్తకాల సేకరణ ప్రారంభించారు. మరోవైపు పానిజోరా ప్రజలు జీవనోపాధి సమస్యలతోనూ పోరాడుతున్నారు. అడవిపై ఆధారపడే అవకాశాలు తగ్గడం, ఏనుగుల వల్ల పంటలు దెబ్బతినడంతో ప్రత్యామ్నాయ ఉపాధి కోసం ప్రయత్నిస్తున్నారు. ఒక స్వచ్ఛంద సంస్థ సహకారంతో పుట్టగొడుగులు, నల్ల మిరియాలు, నారింజ సాగు చేపట్టారు. ఈ ప్రయత్నాల మధ్య కూడా పుస్తకాల సేకరణ, పఠన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో దుర్గాపూజ సందర్భంగా వామపక్ష సంస్థలు ఏర్పాటు చేసిన పుస్తక విక్రయ కేంద్రాలపై దాడులు, ధ్వంసం ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పానిజోరా గ్రామం గొప్ప సందేశాన్ని ఇస్తోంది. అక్కడి ప్రజలు పుస్తకాలను తమ విలువైన ఆస్తిగా భావిస్తున్నారు. అక్షరాల వెలుగుతో కొత్త ప్రపంచాన్ని నిర్మించుకోవచ్చని ఈ పుస్తకాల గ్రామం చాటిచెబుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్