బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్వీట్లు కాదు.. స్మార్ట్‌ఫోన్లే గిఫ్ట్‌లు ! - ఢిల్లీ కంపెనీ అదిరిపోయే దీపావళి కానుక !

1 గంట క్రితం

i phones
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 12:20 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : పండుగ వచ్చిందంటే ఉద్యోగులకు స్వీట్లు, డ్రై ఫ్రూట్స్ వంటి బహుమతులు అందించడం సాధారణం. అయితే ఢిల్లీకి చెందిన ఓ సంస్థ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించింది. తమ ఉద్యోగులకు ఏకంగా ఖరీదైన ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్లను దీపావళి కానుకగా అందించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.


న్యూఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఉన్న ఈ సంస్థ తమ కార్యాలయంలో దీపావళి వేడుకల సందర్భంగా ఉద్యోగులకు ఐఫోన్లను బహూకరించింది. ఇందుకు సంబంధించిన 15 సెకన్ల వీడియోను కంపెనీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేయడంతో ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు రంగుల్లో ఉన్న ఐఫోన్ 16 ఫోన్లను అందంగా రిబ్బన్లతో అలంకరించి ఉద్యోగుల డెస్క్‌లపై ఉంచిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి. తమకు లభించిన ఊహించని కానుకలను చూసి మహిళా ఉద్యోగులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.


'పోటీయే లేదు.. మీకు ఏం బహుమతి వచ్చింది?' అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో ఈ వీడియోను సంస్థ షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఆ కంపెనీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కొందరు మొదట ఈ వీడియో నిజమైనదేనా? లేక కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో రూపొందించారా? అంటూ సందేహాలు వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కంపెనీ యాజమాన్యం నవ్వుతూ.. ఇది ఏఐ వీడియో కాదని, మరోసారి జాగ్రత్తగా చూడాలని స్పష్టం చేసింది.


ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. 'మీ కంపెనీలో ఉద్యోగ ఖాళీలు ఉన్నాయా?' అంటూ ఒకరు ప్రశ్నించగా, ఇలాంటి బహుమతులు చూసి అసూయ పడకుండా ఉండాలంటే దీపావళి సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌కు దూరంగా ఉండటమే మంచిదని మరొకరు చమత్కరించారు. మహిళా ఉద్యోగులకు ఐఫోన్లు ఇస్తే, పురుష ఉద్యోగులకు బంగారు నాణేలు ఇచ్చి ఉంటారేమోనని ఇంకొకరు వ్యాఖ్యానించారు. తమ కంపెనీ యాజమాన్యం కనీసం సోన్ పాప్డీ స్వీట్ బాక్స్ కూడా ఇవ్వలేదంటూ మరికొందరు తమ అసంతృప్తిని సరదాగా వ్యక్తం చేశారు.


మొత్తానికి దీపావళి సందర్భంగా ఉద్యోగులకు ఖరీదైన స్మార్ట్‌ఫోన్లను కానుకగా అందించిన ఈ సంస్థ సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్