ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionప్రేమను నిరాకరిస్తే ప్రాణం తీయాలా?

13 గంటల క్రితం

Firm Boundaries, Broken Heart.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 06:35 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

ప్రేమించడం తప్పు కాదు. కానీ అవతలి వ్యక్తికి ఇష్టం లేకపోతే ఆ నిర్ణయాన్ని గౌరవించడం కూడా ప్రేమలో భాగమేనని గుర్తించకపోవడం తప్పు. ఈ కనీస విషయాన్ని అర్థం చేసుకోలేని కొందరు యువకులు తమ ప్రేమను నిరాకరించారనే కారణంతో అమ్మాయిల జీవితాలను ఛిద్రం చేస్తున్నారు. వెంటపడటం, వేధించడం, బెదిరించడం మొదలుకొని కత్తులతో దాడులు చేయడం, యాసిడ్ పోయడం, ప్రాణాలు తీయడం వరకు వెళ్తున్నారు. ప్రేమకు, ఈ హింసకు సంబంధం ఏమిటి? తిరస్కరణను భరించలేక హత్యలకు తెగబడేంతగా కొందరి ఆలోచనలు ఎందుకు దిగజారుతున్నాయి?

అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో అక్టోబరు 31 శనివారం పదో తరగతి బాలికపై ఓ వ్యక్తి విద్యుత్ రంపంతో దాడి చేశాడు. ఆమెకు ముఖం, మెడ సహా పలు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని కూడా గాయపడింది. అదే రోజు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో రామకృష్ణ అనే యువకుడు ఓ యువతిపై కత్తితో దాడి చేయగా, చికిత్స పొందుతూ ఆమె మరణించింది. అతడు కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని బాధితురాలు మరణానికి ముందు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది.

గత రెండేళ్లలో రాష్ట్రంలో ఇలాంటి దారుణాలు మరికొన్ని జరిగాయి. 2024 మేలో ఏలూరులో జక్కుల రత్నగ్రేస్‌ను యేసురత్నం అనే యువకుడు కత్తితో పొడిచి చంపాడు. పెళ్లి ప్రతిపాదనను ఆమె తిరస్కరించడమే దాడికి కారణమని వార్తా కథనాలు పేర్కొన్నాయి. అదే ఏడాది డిసెంబరులో కడప జిల్లా వేముల మండలంలో 18 ఏళ్ల యువతిపై కుల్లాయప్ప అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. 2025 ఫిబ్రవరిలో అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం పెరంపల్లిలో గౌతమిపై గణేష్ అనే యువకుడు కత్తితో దాడి చేసి యాసిడ్ పోశాడు. 2026 ఏప్రిల్‌లో కడప జిల్లా ఖాజీపేటలో కీర్తన (17) అనే ఇంటర్మీడియట్ విద్యార్థినిని వెంకటేష్ (19) కొడవలితో దాడి చేసి హత్య చేశాడు. ఈ దుర్మార్గాలు అన్నింటి వెనుకా ప్రేమ, పెళ్లి పేరుతో హింసోన్మాదమే ఉంది. నిరాకరణను భరించలేని ఆధిపత్య అహంకారం ఉంది. తనను ఇష్టపడకపోవడం, తన ప్రతిపాదనను తిరస్కరించడం కొందరు పురుషులకు వ్యక్తిగత అవమానంగా మారుతోంది. ఆ తిరస్కారానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనతో హింసకు దిగుతున్నారు.

ప్రేమా? ఆధిపత్యమా?

ఇలాంటి ఘటనలను ప్రేమ విఫలమైనప్పుడు కలిగే ఆవేశంగా చూడలేం. వీటి వెనుక మహిళలపై ఆధిపత్యం చెలాయించాలనే భావన ఉంది. కొందరు పురుషులు మహిళలను స్వతంత్ర వ్యక్తులుగా కాకుండా తమ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా నడుచుకోవాల్సినవారిగా చూస్తారు. ఆమె ఎవరితో మాట్లాడాలి? ఎవరిని ఇష్టపడాలి? ఎవరిని పెళ్లి చేసుకోవాలి? అనే విషయాల్లోనూ తమకే నిర్ణయాధికారం ఉందని భావిస్తారు. ఆమె తన స్వేచ్ఛను వినియోగించుకున్నప్పుడు దాన్ని అవమానంగా తీసుకుంటారు. తిరస్కరణను అంగీకరించలేకపోవడం, కోపం, అసూయ, ప్రతీకార భావన ఈ ధోరణికి తోడవుతాయి. తమ కోరిక నెరవేరనప్పుడు ఎదుటివారిని శిక్షించాలనే ఆలోచనకు వస్తారు. 'ఆమె నాది కాకపోతే మరొకరిది కాకూడదు' అనే భావన ప్రేమ కాదు; ఆధిపత్య దురహంకారం. సినిమాలు, సామాజిక మాధ్యమాల్లో అమ్మాయి నిరాకరించినా వెంటపడటం, ఒత్తిడి చేయడం, చివరకు ఆమె అంగీకరించేలా చేయడం వంటి చిత్రణలు కనిపిస్తుంటాయి. ఇలాంటివి ప్రేమ పేరుతో వేధింపులను సాధారణంగా భావించే తప్పుడు అభిప్రాయాలకు బలం చేకూర్చుతాయి. అమ్మాయి 'కాదు' అంటే అది 'కాదు' అనే అర్థం. ఔనంటే కాదని, కాదంటే అవునని పనికిమాలిన అర్థాలు ప్రచారం చేయటం ప్రమాదకరం.

ముందే గుర్తించాలి

తీవ్రమైన దాడులకు ముందు చాలా సందర్భాల్లో వెంటపడటం, ఫోన్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో వేధించడం, బెదిరించడం వంటి పరిణామాలు ఉంటాయి. ముఖ్యంగా చంపుతానని బెదిరించడం, ఇతరులతో మాట్లాడితే దాడి చేస్తాననడం ప్రమాదకర సంకేతాలు. బాధితులు ఇలాంటి వేధింపులను మౌనంగా భరించకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులకు తెలియజేయాలి. బెదిరింపు సందేశాలు, ఫోన్ కాల్స్ వంటి ఆధారాలను భద్రపరచాలి. అవసరమైతే పోలీసులను ఆశ్రయించాలి. తక్షణ ప్రమాదం ఉంటే 112కు ఫోన్ చేయాలి. బాలల రక్షణ కోసం 1098ను సంప్రదించవచ్చు.

పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర కీలకం. అబ్బాయిలకు చిన్నప్పటి నుంచే స్త్రీల పట్ల గౌరవం, సమానత్వం, వ్యక్తిగత స్వేచ్ఛ, పరస్పర అంగీకారం వంటి విలువలను నేర్పాలి. అమ్మాయిలు తమకు నచ్చిన సంబంధాన్ని ఎంచుకునే హక్కుతోపాటు, నచ్చని సంబంధాన్ని తిరస్కరించే హక్కు కూడా కలిగి ఉన్నారని వివరించాలి. వేధింపుల గురించి అమ్మాయిలు చెబితే వారినే తప్పుబట్టకుండా సమస్యను తీవ్రంగా పరిగణించాలి. పాఠశాలల్లో లింగ సమానత్వం, వ్యక్తిగత హద్దులు, ఆరోగ్యకరమైన సంబంధాలపై అవగాహన కల్పించాలి. వేధింపులకు పాల్పడే విద్యార్థుల ప్రవర్తనను చిన్న వయసులోనే సరిదిద్దాలి.

ఆలోచనా దృక్పథం మారాలి!

మహిళలపై హింసను అరికట్టడం కేవలం చట్టాలు, పోలీసుల బాధ్యత మాత్రమే కాదు. కుటుంబం, విద్యాసంస్థలు, ప్రభుత్వం, మీడియా, ప్రతి పౌరుడి బాధ్యత కూడా. ప్రేమ పేరుతో వెంటపడటాన్ని సరదాగా తీసుకోవడం, అమ్మాయి తిరస్కరిస్తే ఆమెదే తప్పన్నట్లు మాట్లాడటం వంటి ధోరణులు మారాలి. నేరం జరిగిన తర్వాత శిక్షించడం ఎంత ముఖ్యమో, అంతకుముందే వేధింపులను గుర్తించి అడ్డుకోవడం కూడా అంతే ముఖ్యం. ఫిర్యాదులపై పోలీసులు తక్షణమే స్పందించి బాధితులకు రక్షణ కల్పించాలి.

ప్రేమ అనేది ఇద్దరి అంగీకారంతో ఏర్పడే అనుబంధం. ఒక అమ్మాయి 'నో' చెప్పినప్పుడు ఆ నిర్ణయాన్ని గౌరవించలేని వ్యక్తి ప్రేమను అర్థం చేసుకున్నట్లు కాదు. నిరాకరించిన వారిని శిక్షించాలనుకోవడం ప్రేమ కాదు, హింస. మహిళల స్వేచ్ఛను అంగీకరించలేని సమాజం వారి భద్రతకు హామీ ఇవ్వలేదు. అందుకే నేరస్థులకు శిక్ష పడటంతోపాటు, ఇలాంటి నేరాలకు కారణమయ్యే ఆధిపత్య భావజాలాన్ని కూడా ప్రశ్నించాలి. ప్రేమను నిరాకరించే హక్కును గౌరవించడం నేర్చుకున్నప్పుడే మహిళలకు నిజమైన భద్రత సాధ్యమవుతుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్