ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

సరస్వతి ప్రయాణం.. మహిళల గౌరవం కోసం..

1 గంట క్రితం

sarswahthi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 04:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

​పురుషాధిక్య సమాజంలో మహిళలపై అనాదిగా జరుగుతున్న హింస, అన్యాయం, దాడులను ప్రతిఘటించిన మహిళల గురించి చరిత్రలో ఎన్నో కథలు ఉన్నాయి. జార్ఖండ్ బొకారో కస్మర్ ప్రాంతానికి చెందిన 76 ఏళ్ల సరస్వతి సింఘ్ ఆ మహిళల్లో ఒకరు. దశాబ్దాల తరబడి ఆమె మహిళలకు న్యాయం చేయడం కోసం, సమాజంలో మార్పు తేవడం కోసం అలుపెరగకుండా పోరాడుతున్నారు. 14 ఏళ్లకే సమాజం గురించి ఆలోచించడం ప్రారంభించిన సరస్వతి బామ్మ సైకిల్ పై ఊరూరు తిరుగుతూ చేసే ఈ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ఆచరణదాయకం.

​మహిళల గౌరవం, హక్కులు, న్యాయం, దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సరస్వతి బామ్మను 'ఐరన్ లేడీ`గా ఆ ప్రాంతంలో పిలుచుకుంటారు. అన్యాయానికి గురవుతున్న మహిళల తరపున గళమెత్తుతున్న సరస్వతి పోరాటం 60 ఏళ్ల కిందట ఇంటి నుండే మొదలైంది. తన ఆడపడుచుపై ఆమె భర్త హింసకు పాల్పడుతున్నప్పుడు ధైర్యంగా అతన్ని ఎదిరించింది. నిండా 14 ఏళ్లు కూడా లేని చిన్నపిల్ల తనకు వ్యతిరేకంగా మాట్లడడం ఇష్టంలేని ఆడపడుచు భర్త ఆమెను కొట్టడానికి ప్రయత్నించినప్పుడు దీటుగా ఎదుర్కొంది. గొంతు నొక్కి మరీ తన అహంకారం ప్రదర్శించిన అతడు చివరికి సరస్వతి చేసిన పోరాటానికి తలవంచకతప్పలేదు.

​మొదటి విజయం..

ఆడపడుచు భర్త అకృత్యాలను చూస్తూ ఊరుకోని సరస్వతి పెద్దల సమక్షంలో ఆ మహిళకు న్యాయం జరగాలని పోరాడింది. పెద్దలతో మాట్లాడింది. వాదించింది. చిన్నపిల్ల ఇంత పోరాటం చేస్తుందని ఎవరూ ఊహించలేదు. చివరికి పెద్దమనుషుల సమక్షంలో ఆ వ్యక్తితో 'తన వల్ల ఎటువంటి హాని ఉండద`ని ఒప్పందం పత్రం రాయించేంత వరకు సరస్వతి వదిలిపెట్టలేదు. ఆ ప్రాంతంలో మహిళపై జరిగిన అన్యాయం ఇది కొత్తది కాదు. కానీ.. సరస్వతి చేసిన పోరాటం, సాధించిన విజయం మాత్రం మొదటిది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన 1947 ఆగష్టు 15న జన్మించిన సరస్వతికి బాల్యం నుండీ అబ్బిన స్వతంత్ర భావాలు తన జీవితకాలం మహిళల గౌరవం కోసం పోరాడే లక్ష్యం వైపు తీసుకెళ్లాయి.

​రైతు మహిళా సంఘ ఏర్పాటులో..

సమాజంలో మహిళలు గౌరవంగా జీవించాలని నిరంతరం తపించే సరస్వతి రైతు మహిళల కోసం చేసిన పోరాటం ఎన్నో విజయాలను అందుకునేలా చేసింది. ఆ ప్రాంతంలోని ఖిజ్రా గ్రామంలో తొలి మహిళా రైతు సంఘం సరస్వతి చొరవతోనే ఏర్పాటైంది. ఆ తరువాత ఇతర ప్రాంతాల్లో మహిళా రైతు సంఘాలు ఏర్పడేలా ఆమె కృషి చేశారు. స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు. 1400 సంఘాలకు నాయకత్వం వహించిన ఆమె 1995లో జరిగిన 'నేషనల్ యూత్ ప్రాజెక్ట్`లో కూడా భాగమై చురుకైన పాత్ర పోషించారు.

​దేశవ్యాప్తంగా సేవలు..

జార్ఖండ్లోని వివిధ జిల్లాలు, గ్రామాలు, నగరాలతో పాటు కోల్ కతా, ముంబై, గోవా, ఒరిస్సా, ఢిల్లీ, వారణాసి, మధుర, విశాఖపట్నం, అహ్మదాబాద్, హిమాచల్ ప్రదేశ్, ఉదయ్ పూర్ వంటి అనేక నగరాల్లో మహిళల తరపున అనేక పోరాటాల్లో ఆమె తన గళం వినిపించారు.

​వృద్ధాప్యంలోనూ..

యవ్వనంలో దేశమంతా కలియతిరిగిన సరస్వతి వృద్ధాప్యంలో కూడా అదే సేవను కొనసాగిస్తున్నారు. సైకిలు తీసుకుని ఇంటింటికి వెళ్లి మహిళల సమస్యలను అడిగితెలుసుకోవడం ఇప్పుడు ఆమె దినచర్యగా మారింది. సైకిల్ పై ప్రయాణించే సరస్వతిని మొదట ఆ ప్రాంతంలో అందరూ ఆశ్చర్యంగా చూసేవారు. కొందరు ఆమెను అవమానించేవారు. ఆడపిల్ల సైకిల్ తొక్కడం అక్కడ చాలా కుటుంబాలు వ్యతిరేకించేవి. అలాంటి వాతావరణంలో కూడా ఆమె తన ప్రయాణం ఆపలేదు.

​మూఢాచారాలకు వ్యతిరేకంగా..

జార్ఖండ్ ఎన్నో మూఢాచారాలకు నెలవు. వాటిల్లో 'సంఘ` వ్యవస్థ ఒకటి. ఈ ఆచారం ప్రకారం పురుషులు ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చేసుకోవచ్చు. దీంతో మొదటి భార్యలను భర్తలు చాలా సులువుగా వదిలేసేవారు. దీనివల్ల అనేక మంది మహిళల జీవితాలు నాశనమయ్యేవి. దీనిపై సరస్వతి పోరాటం చేశారు. ఈ వ్యవస్థ నాశనమయ్యేలా వీధి నాటకాలు, ప్రచారాలు చేశారు. అనేక సంవత్సరాల పోరాటం తరువాత 'సంఘ` వ్యవస్థ అంతమైంది. ఆ తరువాత ఆమె పోరాటం 'జార్ఖండ్ లో నేటికీ అమలవుతున్న మంత్రగత్తెల వేట`పై సాగింది. 1987 నుండి 'ఫ్లాక్`, 'ఐనా` అనే సంస్థల ద్వారా బహిరంగ వేదికల ద్వారా 'మంత్రగత్తెల వేట నిషేధం`పై ఆమె చేసిన కృషి ఎంతో ప్రత్యేకమైంది. నాటకాలు, పాటలు, సదస్సులు, ప్రజలతో మమేకమవుతూ ఎన్నో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రగత్తెగా ముద్రపడిన గిరిజన మహిళలకు న్యాయం జరిగేంతవరకు పోరాడారు.

ఒంటరి మహిళల పక్షాన..

సరస్వతి ప్రస్తుతం 'నేషనల్ ఏకల్ నారీ అధికార్ మంచ్` బాధ్యతల్లో భాగంగా ఒంటరి మహిళల హక్కుల కోసం పోరాడుతున్నారు. జార్ఖండ్ వ్యాప్తంగా ఒంటరి మహిళల గొంతుకగా పనిచేస్తున్న ఆమె వారు ఎదుర్కొంటున్న కష్టాలను అధిగమించేలా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఒంటరి మహిళలపై ఒక సర్వే నిర్వహించి, భూమి లేని వారికి సాగు భూమి, నివాస స్థలాలు, జీవనోపాధి కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.

​76 ఏళ్ల మహిళ ఆరు దశాబ్దాలుగా చేస్తున్న ఈ కృషిలో ఎన్నో పోరాటాలు, మరెన్నో విజయాలు ఉన్నాయి. ఈ వయసులో కూడా ఇంతలా కష్టపడడం ఎందుకు? అని ఎవరైనా అంటే.. 'మానవ సేవకు నిర్దిష్ట సమయం అంటూ ఏమీ లేదు` అని సరస్వతి చాలా నిగర్వంగా అంటున్నారు. 'ఒక్క మహిళకైనా న్యాయం లేదా గౌరవం చేకూర్చగలిగితే, నా రోజు సార్థకమైనట్లే` అంటున్న సరస్వతి పాత సైకిల్ ఇప్పటికీ గ్రామ రోడ్లపై తిరుగుతోంది. ఆ సైకిల్ కేవలం ఒక వృద్ధురాలినే కాదు, ఆరు దశాబ్దాల ధైర్యం, కరుణ, ఆశలను మోసుకెళ్తోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్