గురువారం, 29 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionశిథిలాల మధ్య జీవన చిత్రాలు

5 గంటల క్రితం

శిథిలాల మధ్య జీవన చిత్రాలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026, 06:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

మూడేళ్లపాటు ఇజ్రాయిల్‌ సాగించిన మారణహోమంలో గాజా సర్వస్వం కోల్పోయింది. నగరమంతా శిథిలమైంది. 74 వేల మంది పౌరులు బాంబుదాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. తల్లుల కళ్లెదుటే యుద్ధం వారి బిడ్డల ప్రాణాలను బలిగొంది. ఆడుతూపాడుతూ తిరగాల్సిన చిన్నారుల బాల్యాన్ని వైకల్యం కబళించింది. బాంబుదాడులే కాదు.. ఆకలి మంటలూ వేలాది కుటుంబాలను అలమటింపజేశాయి. ఇప్పుడు యుద్ధం లేకపోయినా దాని ఘోర పరిణామాలు గాజాలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విషాదాన్ని, దాని మధ్య మనుగడ కోసం సాగుతున్న పోరాటాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు గాజా మహిళలు కెమెరాలను చేతబట్టారు. సెంట్రల్ గాజాలోని అల్‌-బురీజ్‌లో ఉన్న నఖీల్‌ హాల్‌లో 'మహిళలు సృష్టిస్తున్న మరణం నుంచి జీవనం' అనే నినాదంతో రెండో గాజా అంతర్జాతీయ మహిళల ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నారు. గాజా సినిమా అకాడమీ ఆధ్వర్యంలో అక్టోబరు 26 నుంచి 31 వరకు జరుగుతున్న ఈ వేడుకలో 24 దేశాలకు చెందిన 73 ఫీచర్‌ ఫిల్మ్‌లను ప్రదర్శిస్తున్నారు. అవి కల్పిత కథలు కావు. యుద్ధంలో స్వయంగా అనుభవించిన బాధలు, కళ్లముందు జరిగిన విధ్వంసం, కోల్పోయిన ఆత్మీయుల జ్ఞాపకాల నుంచి పుట్టుకొచ్చిన జీవన సాక్ష్యాలు.

మోనా అబు ఖాస్‌ రూపొందించిన 11 నిమిషాల డాక్యుమెంటరీ 'ఎ సాక్‌ ఆఫ్‌ ఫ్లోర్‌' గాజాలో ఆకలి సృష్టించిన విధ్వంసాన్ని కళ్లకు కడుతుంది. ప్రపంచానికి కనిపించిన బాంబుదాడులు, శిథిలాలకు మించిన మరో విషాదాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ఆహార పంపిణీ కేంద్రాల వద్ద పాలస్తీనీయులు ఎదుర్కొన్న ప్రమాదాలు, పిండి కోసం పడిన కష్టాలు, ఆహారం సంపాదించే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన వారి దుర్భర పరిస్థితులను హృద్యంగా చిత్రీకరించింది. ఈ బాధలు మోనాకు కూడా స్వీయ అనుభవాలే. యుద్ధ సమయంలో గాజాలోకి వస్తువుల ప్రవేశంపై ఇజ్రాయిల్‌ విధించిన ఆంక్షలు, ఆహార సాయంలో కోతలు ప్రజల జీవితాలను మరింత దుర్భరం చేశాయి. ఒకవైపు బాంబుల మోత, మరోవైపు ఆకలి భయం వారిని వెంటాడాయి. ఆహార పంపిణీ సాధారణ స్థితికి వచ్చినా, ఆ రోజుల్లో ఎదుర్కొన్న భయానక అనుభవాలు గాజా కుటుంబాలను ఇప్పటికీ వెంటాడుతున్నాయి. ఈ మానసిక వేదనను డాక్యుమెంటరీ ప్రతిబింబిస్తుంది. 'ఈ చిత్రం నా సొంత అనుభవం. ఫెస్టివల్‌లో ప్రదర్శించిన ప్రతి డాక్యుమెంటరీ గాజా ప్రజల రోజువారీ జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. బాంబుదాడులు, విధ్వంసం, ముట్టడి, ఆకలి, నష్టాలతో మేం తీవ్రంగా కుంగిపోయాం' అని మోనా తెలిపారు.

వైకల్య బాధితులు యుద్ధంలో ఎదుర్కొన్న కష్టాలను జర్నలిస్టు, తొలిసారి చిత్ర నిర్మాణం చేపట్టిన రఘదా అల్‌ బుహైసీ రూపొందించిన 'బియాండ్‌ సైలెన్స్‌' ఆవిష్కరిస్తుంది. చదవడం, రాయడం తెలియని, సంజ్ఞల భాషను కూడా నేర్చుకోని ఓ చెవిటి కళాకారుడి జీవితమే ఈ డాక్యుమెంటరీ ఇతివృత్తం. దక్షిణ గాజాలోని రఫాలో అతని స్టూడియో ఇజ్రాయిల్‌ బాంబుదాడిలో ధ్వంసమవుతుంది. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులనూ కోల్పోయిన అతను అక్కడి నుంచి సెంట్రల్‌ గాజాకు వలస వెళతాడు. అక్కడ ఓ కుటుంబం అతనికి ఆశ్రయం కల్పించడంతోపాటు కొత్త స్టూడియో ఏర్పాటు చేసుకోవడానికి సహాయం చేస్తుంది. తనను చుట్టుముట్టిన విషాదం నుంచి బయటపడేందుకు అతను మళ్లీ చిత్రలేఖనాన్ని ఆశ్రయిస్తాడు. అతను గీసే ప్రతి చిత్రం వ్యక్తిగత వేదనకు మాత్రమే కాదు.. యుద్ధంలో గాజా అనుభవిస్తున్న క్షోభకు కూడా ప్రతీకగా నిలుస్తుంది. 'వైకల్య బాధితులను యుద్ధం ఎంతగా కుంగదీసిందో చెప్పాలనుకున్నాను. ఆ బాధ నుంచి బయటపడేందుకు కళ ఎలా తోడ్పడుతుందో చూపించాలనుకున్నాను' అని రఘదా వివరించారు.

'సోసో.. ది లైఫ్‌లైన్‌' ఇతివృత్తం ఓ అనాథ బాలుడు, అతనికి తోడుగా ఉండే గాడిద చుట్టూ సాగుతుంది. కుటుంబాన్ని, ఇంటిని కోల్పోయిన ఓ చిత్ర నిర్మాత అనుభవాలను 'రెమ్నెంట్స్‌ ఆఫ్‌ లైట్‌' ఆవిష్కరిస్తుంది. తన ఎనిమిది మంది పిల్లలను కోల్పోయిన ఓ తల్లి దుఃఖాన్ని, ఆ బాధను తట్టుకునేందుకు ఆమె సాంస్కృతిక రంగం వైపు మళ్లిన తీరును 'దండానా' చిత్రీకరిస్తుంది. ఈ కథల్లో నష్టం, ఒంటరితనం, దుఃఖం ఉన్నప్పటికీ, వాటి మధ్య బతకడానికి మనిషి చేసే ప్రయత్నం కూడా కనిపిస్తుంది. కళ ఇక్కడ కేవలం భావాలను వ్యక్తం చేసే సాధనం కాదు. భరించలేని బాధను ఎదుర్కోవడానికి, కోల్పోయిన జీవితాన్ని తిరిగి నిర్మించుకోవడానికి ఒక ఆధారంగా మారింది.

ఫెస్టివల్‌ డైరెక్టర్‌ ఎజెడిన్‌ షల్లా మాట్లాడుతూ, యుద్ధ సమయంలో మహిళలు, బాలికలు ఎదుర్కొన్న అనుభవాలకు ఈ చిత్రాలు సాక్ష్యాలని తెలిపారు. గాజా మహిళలు తమ కథలను తమ గొంతులతోనే ప్రపంచానికి వినిపించారని చెప్పారు. అయితే ఈ చిత్రాల నిర్మాణం అంత సులభంగా సాగలేదు. విద్యుత్‌, ఇంటర్నెట్‌ వంటి కనీస సదుపాయాల కొరత, ఆర్థిక ఇబ్బందులు, యుద్ధం కారణంగా పదేపదే నివాసాలు మారాల్సిన పరిస్థితులు చిత్ర నిర్మాణానికి అడ్డంకులుగా నిలిచాయి. ఆంక్షల మధ్య వనరులను సమకూర్చుకోవడం, ముఖ్యంగా మహిళలకు చిత్ర నిర్మాణంలో శిక్షణ, అవకాశాలు కల్పించడం పెద్ద సవాలుగా మారింది. అయినప్పటికీ గాజా అనుభవించిన హింసను, ప్రజల మానసిక వేదనను చరిత్రలో నిలిపేందుకు మహిళలు తమ ప్రయత్నాన్ని కొనసాగించారు. వారి చిత్రాలు వ్యక్తిగత విషాదాలను ప్రపంచం ముందుంచడమే కాకుండా, యుద్ధం మనుషుల జీవితాలపై చూపిన ప్రభావాన్ని నమోదు చేస్తున్నాయి. శిథిలాల మధ్య నుంచి వినిపిస్తున్న ఈ మహిళల గొంతులు గాజా ప్రజల బాధకు, వారి జీవన పోరాటానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్