యాంకరింగ్ అంటే సుమ కనకాల గుర్తుకు వస్తారు. చలాకీ మాటలు, సమయస్ఫూర్తి, నవ్వులతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఆమెకు టెలివిజన్ రంగంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ‘స్టార్ మహిళ’ వంటి కార్యక్రమాలతో ప్రతి ఇంటా పరిచయమైన సుమ, తనకున్న ప్రజాదరణను సామాజిక సేవకు ఉపయోగిస్తున్నారు. విద్యార్థుల చదువుకు ఆర్థిక సహాయం అందించడం, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం, వృద్ధులకు అండగా నిలవడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందుకోసం 2021 అక్టోబర్‌లో ‘ఫెస్టివల్స్ ఫర్ జాయ్’ సంస్థను ప్రారంభించారు. పండుగల సందర్భంగా అవసరంలో ఉన్నవారికి సాయం చేయాలనే ఆలోచనతో మొదలైన ఈ కార్యక్రమం ద్వారా విద్య, ఆరోగ్యం, పోషకాహారం, మహిళల ఆర్థిక స్వావలంబన వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నారు.
కేరళకు చెందిన సుమ చిన్నతనంలోనే హైదరాబాద్‌కు వచ్చారు. తండ్రి రైల్వే ఉద్యోగం కారణంగా ఇక్కడే పెరిగారు. తల్లి ప్రోత్సాహంతో తెలుగు నేర్చుకున్న ఆమె, ఈ భాషలో అనర్గళంగా మాట్లాడగలిగే స్థాయికి చేరుకున్నారు. టెలివిజన్, సినీ కార్యక్రమాల ద్వారా సంపాదించుకున్న గుర్తింపుతో పాటు, తనకు పరిచయమున్నవారి సహకారాన్ని కూడా సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలనుకున్నారు. తన వంతుగా సాయం చేయడంతోపాటు, ఇతర దాతల నుంచి నిధులు సేకరించి అవసరమైనవారికి అందించే ప్రయత్నం ప్రారంభించారు. ఇలా వ్యక్తిగత సహకారాన్ని సామూహిక కార్యక్రమంగా మార్చడం ‘ఫెస్టివల్స్ ఫర్ జాయ్’లో ముఖ్యమైన అంశం.
వృద్ధులకు సొంత భవనం
ప్రియదర్శిని సేవా మండలి నిర్వహించే ‘నెస్ట్ హోమ్’ వృద్ధాశ్రమానికి సాయం చేయడం ఈ సంస్థ చేపట్టిన కార్యక్రమాల్లో ఒకటి. గతంలో అద్దె భవనంలో నిర్వహిస్తున్న ఈ ఆశ్రమానికి సొంత భవనం అవసరమని నిర్వాహకులు సుమను సంప్రదించారు. దీంతో వృద్ధాశ్రమానికి అవసరమైన నిధుల సమీకరణలో ఆమె భాగస్వాములయ్యారు. 200 మంది వృద్ధులకు ఆశ్రయం కల్పించే కేంద్రానికి సొంత భవనం ఏర్పాటు కావడంతో వారి సేవ మరింత పరిపూర్ణంగా సాగుతుందని సుమ తన సహకారం అందించారు.
మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవసరమైన సహాయం అందించడంపైనా సుమ దృష్టి సారిస్తున్నారు. తెలంగాణలోని జల్‌పల్లికి చెందిన ముసఫ్ఫా అనే మహిళకు కిరాణా దుకాణం ఏర్పాటు చేయడంలో సాయం చేశారు. ఆమె పిల్లల చదువు, ఆహార అవసరాలకూ సహకరించారు. మరో ట్రాన్స్‌జెండర్‌కు చెరుకు రసం యంత్రం కొనిచ్చారు. మహిళలకు వృత్తిపరమైన నైపుణ్యాలు నేర్పించి ఉపాధి మార్గాలు చూపాలనే ఉద్దేశంతో తెలంగాణలో వంట శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టాలని సంస్థ యోచిస్తోంది. 45 నుంచి 60 రోజులపాటు శిక్షణ ఇచ్చి, వంటను ఉపాధిగా మలచుకునేలా మహిళలను సిద్ధం చేయాలనుకుంటున్నారు. వివాహాలు, శుభకార్యాలు, ఇతర వేడుకలకు వంట సేవలు అందించడం ద్వారా ఆదాయం సంపాదించవచ్చు. ఇందుకు వంట నైపుణ్యంతోపాటు పరిశుభ్రత, పదార్థాల పరిమాణాల అంచనా, సమయపాలన, ఖర్చుల నిర్వహణ వంటి అంశాల్లోనూ శిక్షణ అవసరం. ఇటువంటి నైపుణ్యాలు మహిళలకు సొంతంగా ఉపాధి పొందేందుకు ఉపయోగపడతాయి.
విద్యకు ఆర్థిక చేయూత
ఆర్థిక ఇబ్బందుల వల్ల విద్యార్థుల చదువు మధ్యలో ఆగిపోకూడదనే ఉద్దేశంతో ‘ఫెస్టివల్స్ ఫర్ జాయ్’ విద్యా సహాయం అందిస్తోంది. ఇంటర్మీడియట్ నుంచి ఉన్నత విద్య వరకు చదువుకునే విద్యార్థుల ఫీజులకు తోడ్పాటు అందిస్తున్నారు. ఇంజనీరింగ్ చదువుకున్న ప్రేమ సాయి కూడా ఈ సంస్థ నుంచి ఆర్థిక సహాయం పొందారు. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీలో చదువుకున్న ఈ యువకుడు, ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నారుల విద్యకు అవసరమైన పుస్తకాలు, కంప్యూటర్లు వంటి వనరులను అందించడంపైనా సంస్థ దృష్టి సారిస్తోంది. తల్లిదండ్రుల సంరక్షణకు దూరమైన పిల్లలకు సహాయం చేయడంతోపాటు, పాఠశాలలకు అవసరమైన విద్యా వనరుల కల్పనలోనూ భాగస్వామ్యమవుతోంది.
విద్య, ఉపాధితోపాటు ఆరోగ్య అవసరాలపైనా సంస్థ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గర్భిణులు, చిన్నారులకు పోషకాహారం అందించడం, వైద్య సహాయం అవసరమైనవారికి తోడ్పడటం ఇందులో భాగం. కంటిచూపు సమస్యలతో బాధపడుతూ చికిత్స చేయించుకోలేని పేదలకు వైద్య సహాయం అందించడంలోనూ సంస్థ భాగస్వామ్యమైంది. కంటిశుక్లం వంటి సమస్యలకు శస్త్రచికిత్స అవసరమైనవారికి వైద్య సంస్థల సహకారంతో చికిత్స అందించే కార్యక్రమాలు చేపట్టింది. అంగన్‌వాడీ కేంద్రాలకు అవసరమైన సహాయం అందించడం ద్వారా చిన్నారుల సంరక్షణకు కూడా తోడ్పడుతోంది.

పండుగ అందరిదీ కావాలి : యాంకర్ సుమ
యాంకరింగ్ వల్ల నాకు పాపులారిటీ వచ్చింది. పాపులారిటీ వల్ల కొంతమంది మనల్ని నమ్ముతారు. అలాగే సమాజం సహాయం అవసరమైన వారు మన దృష్టికి వస్తుంటారు. ఈ రెంటి సమన్వయం చేస్తే ఉపయోగం ఉంటుందని అనిపించింది. ఆ ఆలోచనతోనే 'ఫెస్టివల్ ఫర్ జాయ్` సంస్థను ఏర్పాటు చేశాం. మా టీమ్ సభ్యులంతా కలిసి పండగను పురస్కరించుకుని వివిధ సేవా కార్యక్రమాలు చేపడతాం. దాతల నుంచి నిధుల్ని సేకరించి ఆపన్నులకు అందజేస్తాం. ఎవరికి, ఏ అవసరం కోసం ఇస్తున్నాం.. ఎంత ఇస్తున్నామనేది దాతలకు తెలియజేస్తాం. గత ఐదేళ్లుగా దాతల సహాయ సహకారాల వల్లే ఇదంతా చేయగలుతున్నాం. కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు festivalsforjoy.com వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నాం. పండుగ అనేది అందరి జీవితాల్లోనూ ఉండాలనేది మా ప్రయత్నం.








కామెంట్‌లు (0)