వర్షాలు రాబోతున్నాయి. ఈ వర్షాకాలంలో డెంగ్యూ జ్వరానికి కారణమైన ఎడిస్ ఈజిప్టై దోమలు విపరీతంగా పెరగబోతున్నాయి. దీంతో డెంగ్యూ జ్వరాలు కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంది. ఈ డెంగ్యూ జ్వరాన్ని వ్యాపింపజేసే దోమ ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.
చాలా మంచి దోమ : మన నిద్రకు ఇబ్బంది లేకుండా పగలే కుడుతుంది. రాత్రిపూట పెద్దగా కుట్టదు. ఉదయం 5 నుంచి 8 గంటల మధ్య, అలాగే సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్య కుట్టడం దీనికి చాలా ఇష్టం.
శుభ్రమైన దోమ : ఇది బాగా శుభ్రమైన నీటిలోనే గుడ్లు పెడుతుంది. మురికి నీళ్ల జోలికి అస్సలు పోదు. ఇళ్లలోని పూల కుండీలు, కూలర్లు, పాత టైర్లు, నిల్వ ఉన్న నీటి పాత్రలే దీనికి అడ్డా.
మొద్దు దోమ : ఇది ఎక్కువ ఎత్తు ఎగరదు. గరిష్ఠంగా 3 నుంచి 4 అడుగుల ఎత్తు వరకు మాత్రమే ఎగురుతుంది. అందుకే మోకాళ్ల కిందే ఎక్కువగా కుడుతుంది. ఇది ఊరంతా తిరగదు. మనం వాహనాల్లో లేదా బట్టల్లో తీసుకెళ్తే తప్ప మరో ఊరికి వెళ్లదు.
బతక నేర్చిన దోమ : సాధారణంగా వారం నుంచి పది రోజుల్లో గుడ్డు నుంచి పిల్ల దోమ బయటకు వస్తుంది. కానీ ఒకవేళ నీరు లేక ఎండిపోతే ఆ గుడ్డు సంవత్సరం పాటు సజీవంగా చావకుండా ఉండగలదు. మళ్లీ కాస్త నీటి తడి తగలగానే బయటకు వచ్చి డెంగ్యూను వ్యాపింపజేస్తుంది.
తెలివైన దోమ : మనం ఎక్కడ బట్టలు సరిగా వేసుకోమో చూసి, ముఖ్యంగా కాళ్లు, పాదాలు, మోకాళ్ల కింద, మోచేతుల కిందే ఎక్కువగా కుడుతుంది.
మనుషులంటే ప్రేమ : దీనికి మనిషి రక్తం అంటేనే చాలా ఇష్టం. జంతువులను, పశువులను ఇది పెద్దగా కుట్టదు.
టైగర్ దోమ : ఇది చూడటానికి నల్లగా ఉండి, ఒంటిమీద పులి చారల్లా నలుపు-తెలుపు పట్టీలు ఉంటాయి. అందుకే దీనిని "టైగర్ మస్కిటో" అంటారు.
ఆడ దోమే కుడుతుంది : ఆడ దోమ మాత్రమే మనుషులను కుడుతుంది. గుడ్లు పెట్టడానికి రక్తం అవసరం కావడమే దీనికి కారణం. అయితే కుట్టేటప్పుడు మాత్రం మగ, ఆడ, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరినీ సమానంగా కుడుతుంది. మగ దోమలు మాత్రం మొక్కల రసాలను మాత్రమే పీలుస్తాయి.
సైలెంట్ దోమ : ఇతర దోమల్లాగా ఇది చెవి దగ్గర "యూన్" అని శబ్దం చేయదు. చాలా నిశ్శబ్దంగా వచ్చి కుడుతుంది. అంతేకాకుండా, ఒకేసారి కడుపు నింపుకోకుండా కొద్దికొద్దిగా ఒకే సమయంలో నలుగురు, ఐదుగురిని కుట్టే స్వభావం దీనికి ఉంది.
ఈ పాడు దోమ చేత కుట్టించుకోకుండా జాగ్రత్త పడదాం. డెంగ్యూ వ్యాధి బారిన పడకుండా మనల్ని మనం, మన కుటుంబాన్ని కాపాడుకుందాం.
- డాక్టర్ ఎం. వి. రమణయ్య
రాష్ట్ర అధ్యక్షుడు, ప్రజారోగ్య వేదిక
రామచంద్రారెడ్డి ఆసుపత్రి, నెల్లూరు.







కామెంట్‌లు (0)