శుక్రవారం, 21 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పొమ్మన్న చోటే నిలబడి... గెలిచారు!

1 గంట క్రితం

film city
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 21, 2026, 08:38 అపరాహ్నం | 4 నిమిషాల చదవడం

‘పాండవులు పాండవులు తుమ్మెద.. పంచ పాండవులు తుమ్మెద..’ అంటూ చలాకీ పాత్రలు చేసింది. ‘ఓహో ఓహో పావురమా..’ అంటూ అంధురాలైన ఇల్లాలి పాత్రలో మెప్పించింది. ‘నిజం చెప్పవే పిల్లా.. ఎలా ఉంది ఈ వేళ..’ అంటూ సరదా పాత్రలు చేసింది. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసిన నటి ఆమె. ప్రోత్సాహం లేకపోయినా, అవకాశాలు రాకపోయినా సినిమా ఇండస్ట్రీలో 75 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం చేసిన ఆత్మవిశ్వాసం ఆమె సొంతం. అగ్ర కథానాయికలు ఇండస్ట్రీని ఏలుతున్న రోజుల్లో సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఏమీ లేని ఓ ఐదడుగుల అమ్మాయి, వాళ్లతో పోటీపడి రాణించడం అంటే ఆషామాషీ కాదు. కానీ ‘షావుకారు’ జానకి వల్ల అది సాధ్యమైంది. తొలి సినిమానే తన ఇంటిపేరుగా మార్చుకున్న ఆమె తెలుగు, తమిళం, కన్నడ చిత్రసీమ ప్రముఖ నిర్మాతలు, దర్శకులతో కలిసి పనిచేశారు. అగ్ర హీరోలతో నటించారు. విజయవారి ‘షావుకారు’ సినిమాతో 1950లో సినీరంగ ప్రవేశం చేసిన జానకి వివిధ భాషల్లో దాదాపు 380 చిత్రాలలో నటించారు. ఆమె నటించిన చివరి చిత్రం 2023లో వచ్చిన ‘అన్నీ మంచి శకునములే’.

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన జానకి 1931 డిసెంబర్ 12న జన్మించారు. శచీదేవి, టేకుమళ్ల వెంకోజీరావు దంపతుల ఆరుగురు సంతానంలో జానకి ఒకరు. తండ్రి రాజమండ్రిలో గవర్నమెంట్ పేపర్ ఎక్స్‌పర్ట్ అండ్ కెమికల్ ఇంజనీర్‌గా పనిచేసేవారు. ఉద్యోగరీత్యా ఆ కుటుంబం 1944లోనే మద్రాసు చేరింది. జానకి తండ్రి అప్పట్లోనే ఇంగ్లండ్ వెళ్లి పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. విదేశాలకు వెళ్లినందుకు ‘ప్రాయశ్చిత్యం’ చేసుకోమని నాటి సమాజం ఆ కుటుంబానికి హుకుం జారీ చేసింది. ‘అయినా మా నాన్న భయపడలేదు. చాలా ధైర్యంగా దాన్ని ఎదుర్కొన్నారు. మా ఇంట్లో సాంప్రదాయ సంస్కృతి, పాశ్చాత్య సంస్కృతి రెండూ కనిపించేవి’ అని ఆమె ఒకసారి చెప్పారు. ఈ వాతావరణమే మద్రాసు ఆల్ ఇండియా రేడియోలో ‘బాలానందం’ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని జానకికి కల్పించింది. ఆ రకంగా సినిమా రంగంతో జానకి కుటుంబానికి పరిచయాలు ఏర్పడ్డాయి. అయితే ‘ఎక్కడ సినిమాల్లోకి వెళ్లిపోతుందో’ అన్న భయంతో ఇంట్లో వాళ్లు 14 ఏళ్లకే ఆమెకు పెళ్లి చేశారు. 1947 నవంబర్ 5న శంకరమంచి శ్రీనివాసరావుతో ఆమెకు వివాహం జరిగింది. అయితే వివాహబంధం ఆమెకు బాధ్యతలతో పాటు బాధలు తెచ్చిపెట్టింది. కుటుంబాన్ని సాకాలంటే ఏదైనా పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడే తనకు ‘షావుకారు’ సినిమాలో అవకాశం వచ్చింది. అప్పటికే ఆమెకు ఒక బిడ్డ పుట్టింది. పెళ్లి, పిల్లలు తరువాత ఇండస్ట్రీలోకి వచ్చిన కథానాయికలు చాలా అరుదు. కానీ జానకి పరిస్థితి వేరు.

‘మీ ఊరు వెళ్లిపో..’ అన్నారు..

తొలిచిత్రం గొప్ప విజయమైనా ఆమెకు అవకాశాలు రాలేదు. ‘కురచగా, బక్కగా ఉన్న నీకు అవకాశాలు ఏవీ రావు. మీ రాజమండ్రికి వెళ్లిపో’ అన్న మాటలు పడ్డాయి. ‘హీరోయిన్‌గా నటించాలంటే అందం, ఎత్తు ఉండాలి. నీకు అవేమీ లేవు’ అన్న అవమానాలు ఎదురయ్యాయి. అయితే ‘నేనేమీ కళా సేవ చేయడానికి ఇక్కడికి రాలేదు. నా కుటుంబాన్ని పోషించుకోవడానికి వచ్చాను. హీరోయిన్ కాకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టు అయినా, నా ఆహార్యానికి తగ్గ పాత్ర వస్తే చాలు చేసుకుపోతాను. చంటిబిడ్డతో వచ్చాను. ఇప్పుడు ఎక్కడికి పోతాను?’ అని చాలా నిబ్బరంగా మాట్లాడినట్లు ఆమె ఒక సందర్భంలో గుర్తుచేసుకున్నారు. తన పేదరికం గురించి, నటించడం తనకు ఎంత అవసరమో ఇంత నిర్మోహమాటంగా మాట్లాడిన నటీమణుల్లో బహుశా జానకి ఒక్కరే కావచ్చు.

‘ప్రోత్సాహం లేదు, ఆదరణ అసలే లేదు. అలాంటి వాతావరణంలో ఎలా మసలుకున్నారు?’ అని అడిగినప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఆమె ఇలా చెప్పారు. ‘పిల్లలను పోషించుకోవాలి అన్న ఒకే ఒక్క కారణంతో’ అన్నారు. జానకికి అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయేవి అనడానికి ఉదాహరణగా ఆమె ఎప్పుడూ ఒక విషయం గురించి ప్రస్తావించేవారు. ‘నాగేశ్వరరావు, సావిత్రి నటించిన ‘దేవదాసు’ చిత్రంలో పార్వతి పాత్రకు మొదట నన్నే అడిగారు. ఇంటికి వచ్చి మరీ డేట్స్ తీసుకున్నారు. రిహార్శల్స్ కూడా చేశాం. కానీ ఒకరోజు ‘మీరు ఈ సినిమాలో కొనసాగడం లేదు’ అని చెప్పేశారు. ‘ఎందుకు? ఏం జరిగింది?’ అని అడిగే వీలు లేదు. ఒక నటికి అంతకంటే అవమానం మరొకటి ఉండదు. అవమానింపబడిన చోటే గౌరవించే స్థాయికి ఎదగాలి’ అనుకున్నాను, సాధించాను’ అని చెప్పిన జానకి తన లక్ష్యం సాధించారు.

శ్రీదేవిని ఇండస్ట్రీకి పరిచయం..

శ్రీదేవిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన క్రెడిట్ మొత్తం జానకికే దక్కాలి. ‘ఆరేళ్ల వయసులో తనను సినిమాలోకి తీసుకోమని, మంచి నటిగా ఎదుగుతుంద’ని చెప్పానని జానకి ఒకసారి గుర్తుచేసుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ‘అందాల తార’గా వెలుగొందిన కృష్ణకుమారి జానకికి స్వయాన చెల్లెలు. జానకిని ఇండస్ట్రీకి పంపించేందుకు భయపడిన కుటుంబం, ఆ తరువాత మరో కూతురును పంపడం వెనుక ఆ కుటుంబం ఆర్థికంగా కుదేలవ్వడమే కారణమని జానకి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. దాదాపు 380 సినిమాలు చేసిన అనుభవంలో కథానాయికగా 200కు పైగా సినిమాలు చేశారు. తమిళంలో ఎక్కువగా రాణించారు. ఎన్టీఆర్‌తో తొలి చిత్రం చేసిన జానకి ఆ తరువాత చాలా సినిమాల్లో ఆయనతో కలిసి నటించారు. నాగేశ్వరరావుతో గొప్ప చిత్రం చేసే అవకాశం కోల్పోయినా ఆ తరువాత ఎన్నో సినిమాల్లో ఆయనతో స్క్రీన్ పంచుకున్నారు. తమిళంలో శివాజీ గణేశన్, ఎంజీఆర్, జెమినీ గణేశన్ వంటి అగ్రహీరోలతో నటించి ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. అలనాటి అగ్రదర్శకులతో పాటు కె. బాలచందర్ చిత్రాల్లో కూడా జానకి ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. బాలచందర్ దర్శకత్వంలో ఏకంగా 13 సినిమాలు చేశారు. ఏ భాషలో సినిమా చేసినా తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకునేవారు.

జీవితం ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. మరెన్నో గుణపాఠాలు చెబుతుంది. జానకి ప్రయాణం కూడా అలాగే సాగింది. బాల్యం, వివాహం, ఇండస్ట్రీ ఎక్కడా ఆమెకు ప్రోత్సాహం లేదు. ఈ అనుభవాల గురించి మాట్లాడుతూ.. ‘జీవితంలో ఎన్నో అనుకున్నాను. ఏదీ అందుకోలేదు. అయినా జీవించాను. నిరాశ, దుఃఖం ఎప్పుడూ నా చుట్టూనే ఉండేవి. అయినా బతికాను. జీవితం అంటే ఇదే.. ఎన్ని బాధలు వచ్చినా.. జీవించాలి. కష్టాలు వచ్చాయని కుంగిపోవద్దు. మళ్లీ పైకి లేవండి. అవమానించారని ఆగిపోవద్దు. తిరిగి ప్రయత్నించండి. ఈ తరం పిల్లలకు ఇదే నా విన్నపం’ అని ఆమె ఎంతో ఆవేదనగా అన్నారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు పడినా, పడి లేచిన కెరటంలా ఎదిగిన ‘షావుకారు’ జానకి మనకు ఎప్పటికీ గుర్తుండిపోతారు.

ఎన్టీఆర్ సరసన జానకి నటించిన "వద్దంటే డబ్బు, కన్యాశుల్కం, సొంతవూరు, జయం మనదే, కాడెద్దులు ఎకరం నేల, పెంపుడు కూతురు, సవతి కొడుకు, దేశద్రోహులు" వంటి చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఏఎన్నార్‌తో జానకి నాయికగా నటించిన చిత్రాల సంఖ్య తక్కువే. అయినా ఆయనతో చేసిన చిత్రాల్లో ఎంతో వైవిధ్యమైన పాత్రలు ధరించి ఆకట్టుకున్నారు. వారిద్దరూ నటించిన చిత్రాల్లో ‘రోజులు మారాయి, మంచి మనసులు, అక్కాచెల్లెళ్ళు, మంచి కుటుంబం’ ఉన్నాయి.

అవార్డులు, రివార్డులు..

తన 90 ఏళ్ల వయసులో 2022లో జానకి ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్నారు. అంతకు ముందే తమిళనాడు ప్రభుత్వం నుంచి కళైమామణి, ఆంధ్రప్రదేశ్‌ నుంచి నంది పురస్కారాలు, ఇతర జీవిత సాఫల్య పురస్కారాలు ఆమెను వరించాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్