సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionచిన్న నిరసనగా మొదలై... పీఠాన్నే కదిలించింది!

1 గంట క్రితం

చిన్న నిరసనగా మొదలై... పీఠాన్నే కదిలించింది! image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 06:45 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

మన పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర విస్తీర్ణంతో సమానమైన చిన్న దేశం సెర్బియా. సుమారు 70 లక్షల జనాభా ఉన్న ఈ దేశంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో 14 ఏళ్లుగా అధికారంలో ఉన్న పాలకపక్షం ఓటమి పాలైంది. ఎన్నికల్లో గెలుపోటములు సహజమే అయినా.. సెర్బియా గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అంశం అక్కడి విద్యార్థులు సాగించిన పోరాటం. ఒక ప్రమాదానికి న్యాయం చేయాలంటూ మొదలైన విద్యార్థి ఉద్యమం రెండేళ్లు తిరిగేసరికి అధికార పక్షాన్ని ఓడించే స్థాయికి చేరింది. విశ్వవిద్యాలయాల్లో మొదలైన చర్చలు వీధులకు, పట్టణాలకు, పల్లెలకు విస్తరించి చివరకు దేశ రాజకీయాలనే ప్రభావితం చేశాయి.


​2024 నవంబరు 1న సెర్బియాలోని రెండో అతిపెద్ద నగరం నోవిసాద్‌ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ స్టేషన్‌ను కొన్ని రోజుల క్రితమే ఆధునీకరించారు. ఆ రోజు ఒక్కసారిగా స్టేషన్‌ కాంక్రీటు పైకప్పు కూలిపోవడంతో 14 మంది అక్కడికక్కడే మరణించారు. గాయపడిన మరో ఇద్దరు ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పిల్లలు, యువకులు కూడా ఉన్నారు. కొత్తగా పునర్నిర్మించిన స్టేషన్‌లో ఇంతటి ప్రమాదం జరగడం ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపాలున్నాయా? కాంట్రాక్టుల కేటాయింపులో అవినీతి జరిగిందా? అధికారుల పర్యవేక్షణ ఎందుకు విఫలమైంది? ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించాల్సిన వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? అనే ప్రశ్నలు ముందుకొచ్చాయి.

​నివాళితో మొదలైన నిరసన

ప్రమాదంలో మరణించినవారికి నివాళులర్పిస్తూ ప్రజలు రోడ్లపైకి వచ్చారు. తొలుత నోవిసాద్‌, బెల్‌గ్రేడ్‌ నగరాల్లో మొదలైన నిరసనల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాధితులకు న్యాయం చేయాలని, ప్రమాదానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రమాదం ఉదయం 11.52 గంటలకు జరగడంతో ఆ సమయాన్ని గుర్తుచేసుకుంటూ విద్యార్థులు ప్రతిరోజూ 11.52 గంటలకు రహదారులపైకి వచ్చేవారు. మరణించిన 16 మందికి నివాళిగా 16 నిమిషాలపాటు వాహనాలను నిలిపివేసి మౌనం పాటించేవారు. చేతుల్లో ప్లకార్డులు, బాధితుల చిత్రాలతో సాగిన ఈ మౌన నిరసన క్రమంగా ప్రత్యేక ప్రజా కార్యక్రమంగా మారింది. అధ్యాపకులు, న్యాయవాదులు, వైద్యులు, కార్మికులు, రైతులు, సామాన్య ప్రజలు కూడా ఉద్యమంలో భాగస్వాములయ్యారు.

​2024 నవంబరు 22న బెల్‌గ్రేడ్‌లోని 'ఫ్యాకల్టీ ఆఫ్‌ డ్రెమాటిక్‌ ఆర్ట్స్‌' వద్ద విద్యార్థులు నివాళి కార్యక్రమం నిర్వహిస్తుండగా అధికార పార్టీ మద్దతుదారులమని చెప్పుకునే కొందరు వారిపై దాడి చేశారు. ఈ ఘటన విద్యార్థుల ఆగ్రహాన్ని మరింత పెంచింది. దాడికి పాల్పడినవారిని గుర్తించి శిక్షించాలని, నిరసనకారులపై కేసులు పెట్టడం ఆపాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనలను విస్తరించారు. విశ్వవిద్యాలయ భవనాలను దిగ్బంధించి తరగతులను బహిష్కరించారు. బెల్‌గ్రేడ్‌తో పాటు నోవిసాద్‌, నిష్‌, క్రాగుయెవాక్‌ తదితర నగరాల విద్యార్థులూ ఉద్యమంలోకి వచ్చారు. అలా ఒక విశ్వవిద్యాలయంలో మొదలైన నిరసన దేశవ్యాప్తంగా విద్యాసంస్థలకు విస్తరించింది.

​ప్రజాస్వామ్య పద్ధతిలో...

సెర్బియా విద్యార్థుల ఉద్యమంలో నాయకులు, సంఘాలకు ప్రత్యేక స్థానం లేదు. విశ్వవిద్యాలయాల్లో 'ప్లీనమ్‌' పేరుతో బహిరంగ సమావేశాలు నిర్వహించి, దేశ సమస్యలపై చర్చించేవారు. ఓటింగ్‌ ద్వారా నిర్ణయాలు తీసుకునేవారు. ఎవరికీ శాశ్వత నాయకత్వ హోదా ఇవ్వకుండా, అవసరాన్ని బట్టి వేర్వేరు విద్యార్థులు ఉద్యమానికి ప్రాతినిధ్యం వహించేవారు. ఈ వికేంద్రీకృత నాయకత్వ పద్ధతి ఉద్యమాన్ని అణచివేయాలనుకునే అధికారులకు సవాలుగా మారింది. దేశవ్యాప్తంగా విద్యార్థులంతా ఒకే లక్ష్యంతో ముందుకు సాగారు. రైల్వే స్టేషన్‌ పునర్నిర్మాణానికి సంబంధించిన పత్రాలను బహిర్గతం చేయాలని, నిరసనకారులపై కేసులు ఉపసంహరించాలని, విద్యార్థులు, అధ్యాపకులు, ప్రజలపై దాడులకు పాల్పడినవారిని శిక్షించాలని, విశ్వవిద్యాలయాల బడ్జెట్‌ను 20 శాతం పెంచాలని నాలుగు ప్రధాన డిమాండ్లను ముందుంచారు. అవి నెరవేరే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని ప్రకటించారు.

​పల్లెలకూ విస్తరణ

2024 డిసెంబరు నాటికి విద్యార్థుల ఆందోళన దేశవ్యాప్త ఉద్యమంగా మారింది. డిసెంబరు 22న బెల్‌గ్రేడ్‌లోని స్లావియా స్క్వేర్‌లో లక్ష మందికి పైగా నిరసనల్లో పాల్గొన్నారు. విద్యార్థులకు మద్దతుగా ప్రజలు భారీగా తరలివచ్చారు. అయితే ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం విద్యాసంస్థలకు ముందుగానే శీతాకాల సెలవులు ప్రకటించింది. అయినా విద్యార్థులు వెనక్కి తగ్గలేదు. 2025 ఆరంభం నుంచే చిన్న పట్టణాలు, గ్రామాలకు వెళ్లడం మొదలుపెట్టారు. సైకిళ్లపై, కాలినడకన వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ ప్రజలను కలిశారు. 'ప్రతి గ్రామంలో ఒక విద్యార్థి' అనే నినాదంతో స్థానికులతో సంబంధాలు పెంచుకున్నారు. విద్యార్థులకు ప్రజలు ఆహారం, మంచినీరు, వసతి కల్పించారు. కొందరు తమ ఇళ్లలో ఆశ్రయం ఇచ్చారు. రైతులు ఆహార పదార్థాలు అందించి ప్రయాణాలకు సహకరించారు. ఇలా విశ్వవిద్యాలయాలకే పరిమితమైన ఉద్యమం ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందింది.

​ప్రజల మద్దతుతో విద్యార్థులు ప్రధాన రహదారులు, కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ టెలివిజన్‌ కార్యాలయం ఎదుట భారీ ఆందోళనలు చేపట్టారు. 2025 మార్చి 15న బెల్‌గ్రేడ్‌లో జరిగిన ప్రదర్శన ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచింది. లక్షలాది మంది రాజధాని వీధుల్లోకి వచ్చారు. సెర్బియా చరిత్రలోనే అతిపెద్ద నిరసనల్లో ఇదొకటని యూరోపియన్‌ పార్లమెంట్‌ పత్రం పేర్కొంది. ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. నిరసనకారులను విదేశీ శక్తులు ప్రోత్సహిస్తున్నాయని, దేశంలో అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించింది. మరోవైపు ఆందోళనకారులపై దాడులు, అరెస్టులు, పోలీసు చర్యలు కొనసాగాయి.

​ఎన్నికల బరిలోకి..

విద్యార్థుల ఉద్యమానికి క్రమంగా ప్రతిపక్ష పార్టీల మద్దతు పెరిగింది. కొన్ని పార్టీలు తమ అభ్యర్థులను నిలబెట్టకుండా విద్యార్థుల జాబితాకు మద్దతు ప్రకటించాయి. విద్యార్థులు మాత్రం 'స్టూడెంట్స్‌ లిస్ట్‌' పేరుతో స్వతంత్ర అభ్యర్థులను ముందుకు తీసుకొచ్చారు. వైద్యులు, అధ్యాపకులు, రైతులు, మేధావులు, సామాజిక కార్యకర్తలతో కూడిన జాబితాను రూపొందించారు. 2026 అక్టోబరు 25న జరిగిన పార్లమెంటు ఎన్నికల ప్రాథమిక ఫలితాల ప్రకారం విద్యార్థుల మద్దతున్న జాబితా విజయం సాధించింది. 250 స్థానాలున్న పార్లమెంటులో 140 స్థానాలు గెలుచుకుంది. 14 ఏళ్లుగా అధికారంలో ఉన్న అలెగ్జాండర్‌ వుచిచ్‌ నాయకత్వంలోని సెర్బియన్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ కూటమి 104 స్థానాలతో ఓటమి పాలైంది.

​సెర్బియా విద్యార్థుల ఉద్యమం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. విద్యార్థులు తమ విద్యాసంస్థల సమస్యలకే పరిమితం కాకుండా సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. ఒక విషాద ఘటనకు బాధ్యులను శిక్షించాలన్న డిమాండ్‌తో మొదలైన పోరాటాన్ని అవినీతి వ్యతిరేక ఉద్యమంగా విస్తరించారు. ప్రజలను భాగస్వాములను చేసుకున్నారు. నాయకత్వాన్ని తామే నిర్మించుకున్నారు. చివరకు ఎన్నికల ద్వారా అధికార మార్పునకు దోహదపడ్డారు. ప్రపంచంలోని ఏ దేశంలోనైనా కుల, మత, జాతి భేదాలకు అతీతంగా ప్రజలంతా ఒక్కతాటిపైకి వస్తే.. ఆ ప్రజాశక్తిని అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం కాదు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్