శుక్రవారం, 07 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅబ్బాయి వేషంతో చదువుకొని...

58 నిమిషాల క్రితం

జహ్రా
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 07, 2026, 06:30 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

స్కూలుకు వెళ్లడానికి జహ్రా జోయ తన పేరు ‘మహ్మద్’గా మార్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే తాలిబన్ల పాలనలో అమ్మాయిలకు విద్య నిషేధం. అబ్బాయి వేషమే ఆమెకు చదువుకు దారి చూపింది. అవకాశాలు లేనిచోట, అణచివేత ఉన్నచోట జీవించడం చాలా కష్టమని చాలామంది భావిస్తారు. కానీ కొంతమందే ఆ పరిస్థితులను ఎదుర్కొని ముందుకు వెళ్తారు. జహ్రా అలాంటి వారిలో ఒకరు. 1996లో ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నప్పుడు పాఠశాలల్లో బాలికల ప్రవేశాన్ని నిషేధించారు. అయితే అందరి ఆడపిల్లల్లా ఆమె పాఠశాలకు దూరం కాలేదు. అబ్బాయి వేషం వేసుకుని మరీ స్కూలుకు వెళ్లింది. ఆ రోజుల్లో తాను, తన కుటుంబం పడిన మానసిక వేదన అంతా ఇంతా కాదు. కానీ 'చదువే జీవితాన్ని మారుస్తుంది' అని జహ్రా బలంగా నమ్మింది. ప్రస్తుతం బ్రిటన్‌లో స్థిరపడిన జహ్రా, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని హ్యూజెస్ హాల్‌లో బై-ఫెలోగా పనిచేస్తోంది. 2021 నుంచి లండన్‌లో ఉంటూ సొంతంగా ఒక వార్తాసంస్థను నిర్వహిస్తోంది. ఆ సంస్థ ద్వారా తన దేశంలోని మహిళలు కోల్పోతున్న జీవితాల గురించి ప్రపంచానికి తెలియజేస్తోంది.

​మహ్మద్‌గా పేరు మార్చుకుని జహ్రా స్కూలుకు వెళ్లడంలో ఆమె తల్లి పాత్ర ఎంతో ఉంది. చదువుపై కూతురికి ఉన్న ఆసక్తిని ఆ తల్లి ఎన్నడూ నిరుత్సాహపరచలేదు. ఉపాధి కోసం తండ్రి కుటుంబానికి దూరంగా వెళ్లిపోయినా, తల్లిగా తన బిడ్డను నిరంతరం ప్రోత్సహించింది. 33 ఏళ్ల జహ్రా, 'అబ్బాయిగా స్కూలుకు వెళ్లడం నా జీవితాన్ని మార్చిన అనుభవం' అంటుంది. పర్వత ప్రాంతంలోని ఓ మారుమూల గ్రామంలో జహ్రా కుటుంబం నివసించేది. అక్కడి నుంచి రెండు గంటల ప్రయాణం చేసి స్కూలుకు వెళ్లేది. తలకు కట్టుకున్న స్కార్ఫ్ తీసేసి, చొక్కా ధరించి, దానిపై నూలు కోటు వేసుకుని ప్రయాణించేది. ఇంటి నుంచి స్కూలు చాలా దూరంలో ఉండడంతో అందరూ తనను అబ్బాయేనని అనుకునేవారు. పొడవాటి జుట్టంటే ఎంతో ఇష్టమున్నా, దాన్ని పొట్టిగా కత్తిరించుకుని మరీ స్కూలుకు వెళ్లేది. ఆ అనుభవాలను ఆమె ఇలా వివరిస్తుంది. 'నా ఉనికిని దాచుకోవడం నాకు అసలు ఇష్టం ఉండేది కాదు. కానీ నాకు వేరే మార్గం లేదు. నా వయసున్న ఆడపిల్లలందరూ బొమ్మలతో ఆడుకునేవారు. కానీ నేను ఎప్పుడూ బొమ్మలతో ఆడుకోలేదు. ఫుట్‌బాల్, వాలీబాల్ వంటి ఆటలే ఆడేదాన్ని. ఇవి అబ్బాయిలు మాత్రమే ఆడే ఆటలు, అమ్మాయిలు ఆడకూడదని సమాజం బలంగా నమ్మేది.'

​అబ్బాయిలా వేషం మార్చుకుని స్కూలుకు వెళ్లడం ఎంతటి సాహసమో జహ్రా అప్పుడు అంచనా వేయలేదు. కానీ పెద్దయ్యాక ఆ రోజులను గుర్తుచేసుకున్నప్పుడల్లా, 'తాను, తన కుటుంబం ఎంతటి సాహసం చేశామో ఇప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చదువు కోసం మేం చేసిన ఈ సాహసం నాకు జీవితాంతం గొప్ప అనుభవాన్ని ఇచ్చింది' అని గుర్తు చేసుకుంటుంది. అబ్బాయిలా మారడం వల్ల తాలిబన్ల పాలనలో అమ్మాయిలు ఎదుర్కొనే ఎన్నో వేధింపులు జహ్రా వరకు రాలేదు. 'చివరికి మా గ్రామంలో నా వయసున్న ఆడపిల్లలను తాలిబన్లు బలవంతంగా పెళ్లి చేసుకోవడం నుంచి కూడా నేను తప్పించుకున్నాను' అని ఆమె ఒక సందర్భంలో చెప్పింది. అమ్మాయిలకు అరుదుగా లభించే ఎన్నో అవకాశాలు అబ్బాయి వేషంలో ఉన్న జహ్రాకు చాలా సులభంగా లభించాయి. స్వేచ్ఛగా మార్కెట్‌లో తిరిగేది. వేడుకల సమయంలో డ్యాన్సులు చేసేది. 2001లో తాలిబన్ల నుంచి ఆఫ్ఘనిస్తాన్ విముక్తి పొందిన తర్వాత కూడా జహ్రా అబ్బాయి వేషాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. 'ఎందుకు?' అని ఎవరైనా అడిగితే, 'ఇదే నా ప్రపంచం' అని మొండిగా సమాధానం చెప్పేది. అయితే స్కూలు జీవితం ఆమె దృక్పథాన్ని మరింత విస్తృతం చేసింది. మానవ హక్కులు లింగం ఆధారంగా నిర్ణయించకూడదని ఆమెకు అర్థమైంది. కష్టమైన పరిస్థితులు అమ్మాయిలకు మాత్రమే అవకాశాలను దూరం చేయకూడదని పాఠశాల రోజులే ఆమెకు నేర్పించాయి. 'ఆ అనుభవం అధికారిక చదువుల కంటే నాకు ఎన్నో ఎక్కువ విషయాలు నేర్పింది' అని జహ్రా అంటుంది. ఆఫ్ఘనిస్తాన్‌లో సాంప్రదాయంగా స్త్రీల పట్ల ఉన్న తీవ్రమైన వివక్షను అర్థం చేసుకునే అవకాశం తనకు దక్కిందని చెబుతుంది. అదే అవగాహన తనను మహిళల సమానత్వం, మానవ హక్కుల కోసం గొంతెత్తే కార్యకర్తగా మార్చింది.

​తాలిబన్ పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత దాదాపు 20 సంవత్సరాల పాటు, అంటే 2021 వరకు, ఆఫ్ఘనిస్తాన్‌లో లక్షలాది మంది బాలికలు మళ్లీ స్కూళ్లకు వెళ్లారు. ఉన్నత విద్యను అభ్యసించారు. కానీ 2021లో తాలిబన్లు మళ్లీ అధికారంలోకి రావడంతో పరిస్థితి తిరిగి మొదటికి చేరుకుంది. అదే సమయంలో జహ్రా తన కుటుంబంతో కలిసి బ్రిటన్‌కు వెళ్లి అక్కడే తన కార్యకలాపాలను కొనసాగించింది. తాలిబన్ పాలన మహిళల జీవితాలను ఎలా నాశనం చేసిందో 'ది వానిషింగ్ గర్ల్ ఆఫ్ కాబుల్' పేరుతో ఆమె ఒక పుస్తకం రాసింది. ఇప్పుడు ఆమె ఆడపిల్లలు పాఠశాలకు వెళ్లడం గురించి మాత్రమే మాట్లాడడం లేదు. వారి గుర్తింపును, గౌరవాన్ని, ఉనికిని, హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం గురించి ప్రపంచానికి చెబుతోంది. తన వార్తాసంస్థ ద్వారానే తాలిబన్ పాలనలో మహిళలు ఎదుర్కొంటున్న వాస్తవాలను ప్రపంచానికి చేరవేస్తోంది. 'ఆఫ్ఘన్ మహిళలు తమ హక్కులను పొందే వరకు నేను వారి కథలను చెబుతూనే ఉంటాను. అక్కడ లక్షలాది మంది మహిళలు బహిరంగ ప్రదేశాల నుంచి, ప్రజా జీవితం నుంచి బహిష్కరించబడ్డారు. చరిత్ర మళ్లీ పునరావృతమవుతుండడం నాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు అక్కడ చాలామంది బాలికలు చదువు కోసం తమ అసలు గుర్తింపును దాచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ అది పరిష్కారం కాదు' అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

​జహ్రా కథ ఒక మహిళ ధైర్యగాథ మాత్రమే కాదు. విద్య కోసం, గుర్తింపు కోసం, స్వేచ్ఛ కోసం ఇప్పటికీ పోరాడుతున్న లక్షలాది మంది ఆఫ్ఘన్ మహిళల గొంతుక కూడా.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్