'థాంక్యూ యంగ్ పీపుల్' అంటున్నారు ప్రముఖ రచయిత, అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ విజేత గీతాంజలి శ్రీ. నీట్ పేపర్ లీక్ అంశంపై ఢిల్లీ జంతర్‌మంతర్ దగ్గర జరుగుతున్న విద్యార్థుల నిరసనలను ఉద్దేశించి ఆమె పైవిధంగా స్పందించారు. ఈ సందర్భంగా గీతాంజలి చేసిన వ్యాఖ్యలు ఎంతో ముఖ్యమైనవి. ఆలోచించదగ్గవి.
'ఈ దేశంలో మంత్రులు, బ్యూరోక్రాట్లు, పోలీసులు... ఎవరూ దేవుళ్లు కారు. వారు ప్రజల సేవకులు.'
'యువత గళం విప్పుతున్నారు. వారు భారతీయులు. ఇది వారి దేశం.'
'మన ఇంట్లో పగుళ్లు, నీరు కారడం చూస్తే ఆందోళన చెందమా! ఇళ్లు కూలిపోతాయని భయపడమా! మరమ్మతులు చేయాలని, పరిష్కారాలు వెతకమా! ఇప్పుడు యువత కూడా అదే చేస్తున్నారు. వారి ఆందోళనలు తగ్గించమని, భవిష్యత్తుకు భరోసా ఇవ్వమని అధికారులను వారు అడుగుతున్నారు. తమ మాతృభూమిని కాపాడుకోవడంలో భాగమే ఇది..' అని ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
జులై 20న జంతర్‌మంతర్ దగ్గర జరిగిన బీభత్సంపై ప్రభుత్వంలో పెద్దలు, ప్రధానమంత్రి, హోంమంత్రి, కేంద్ర మంత్రులు ఎవరూ నోరు విప్పలేదు. అందరూ మౌనంగా ఉన్నారు. విద్యార్థులపై లాఠీలు విరిగాయి. పెల్లెట్లతో వారిని ఛిద్రవధ చేశారు. భాష్పవాయువులు ప్రయోగించారు. బట్టలు చింపారు. ఈ దారుణాలను ఖండిస్తూ ఏ ఒక్కరూ జవాబుదారీతనం చూపలేదు. దీనిపై కూడా గీతాంజలి స్పందించారు. 'మంత్రులు, అధికారులు దేవుళ్లు కారు' అన్నారు. యువతను ఉద్దేశించి మాట్లాడుతూ.. 'ప్రజాస్వామ్యాన్ని గుర్తు చేసిన దేశ యువతా, మీకు ధన్యవాదాలు. అభివాదాలు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. బాధ్యతాయుతంగా, వివేకంతో మీ బాధ్యతలు నెరవేర్చండి' అని ఆమె చెప్పారు.
గీతాంజలి 2022లో బుకర్ ప్రైజ్ అందుకున్నారు. హిందీ, భారతీయ సాహిత్యంలో మొట్టమొదటి బుకర్ అవార్డు గ్రహీతగా ఆమె పేరు చరిత్రలో నిలిచిపోయింది. సామాజిక, రాజకీయ అన్యాయాలపై ఆమె ఎప్పుడూ తన గళాన్ని బలంగా వినిపిస్తారు. తాను రచించిన 'రేట్ సమాధి' రచనలో హిందువుల మనోభావాలను కించపరిచారని ఆరోపిస్తూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి గతంలో ఆమెపై ఒక కేసు కూడా నమోదుచేశారు. ఆ సందర్భంగా ఆగ్రాలో ఆమెకు నిర్వహించాలనుకున్న సన్మాన సభను రద్దు చేశారు. దీనిపై అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు తాజాగా ఢిల్లీ విద్యార్థుల నిరసనలపై ఆమె మాట్లాడిన మాటలు ఎంతోమందిని ఆలోచింపజేస్తున్నాయి.







కామెంట్‌లు (0)