ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దుర్గను దిద్దే చేతులు.. సామరస్య ప్రతీకలు...

1 రోజు క్రితం

దుర్గను దిద్దే చేతులు.. సామరస్య ప్రతీకలు... image 3
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 05:30 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

​స్త్రీ శక్తిని వివిధ రూపాల్లో పూజించే దసరా పండుగకు పశ్చిమ బెంగాల్ లోని కలకత్తా నగరం ప్రసిద్ధి. నవరాత్రుల కోసం ఇక్కడ ఏర్పాటు చేసే విభిన్న రకాల 'పండళ్ల'కు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంటుంది. పండల్ కు, అందులో నిలబెట్టిన ఒక్కో 'దుర్గా' ప్రతిమకు ఒక్కో కథ ఉండడమే వీటి ప్రత్యేకత. ఈ ప్రతిమల రూపకల్పనలో వందలాది మహిళా హస్తకళాకారుల కృషి ఉంది. వారిలో పురుషులు అధికంగా ఉన్న రంగంలో ప్రవేశించినవారు, మూఢనమ్మకాలను ఎదిరించి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నవారు, ఏడు పదుల వయస్సులోనూ చిత్రాలు గీస్తున్నవారు ఉన్నారు. ప్రతిమలకు కావాల్సిన జుట్టు, జపమాలను సిద్ధం చేసే ముస్లిం మహిళలూ ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో కళ.. ఒక్కో కథ..

కలకత్తాకు 150 కిలోమీటర్ల దూరంలో బంకురా జిల్లాలోని బోన్బిర్‌సింఘా గ్రామంలో చేనేత కుటుంబాలు నివసిస్తున్నాయి. పవర్‌లూమ్ ప్రభంజనాన్ని తట్టుకుని ఇప్పటికీ చేనేతను వృత్తిగా కొనసాగిస్తున్న ఈ గ్రామంలో కర్మకారీ వర్గానికి (కమ్మరి) చెందిన కృపామాయి కుటుంబం కళాకారుల కుటుంబంగా మారిపోయింది. 49 ఏళ్ల కృపామాయి 30 ఏళ్ల క్రితం పెళ్లి తరువాత ఈ గ్రామానికి వచ్చింది. ఆమె మామగారు దుర్గా పటాలను రూపొందించడంలో ప్రముఖులు. కాన్వాస్ మీద తయారుచేసే ఈ పటాలను ‘ఠాకురాని పట్ లేదా పాటిర్ దుర్గా’ అని పిలుస్తారు. మామగారి నుంచి ఈ కళను నేర్చుకున్న కృపామాయి 2002 నుంచి ఈ పటాలను తయారుచేస్తున్నారు. 2011 నుంచి సొంతంగా రూపొందిస్తున్నారు. ఆమె తయారుచేసే 'మహమ్మారి పట్' ప్రత్యేకమైనది. 'మశూచి' దేవతగా కొలిచే 'శీతల్' రూపాన్ని నవమి రోజు పూజిస్తారు. ఈ పటాన్ని రూపొందించిన కళాకారుడు కొంతకాలానికే అకారణంగా మరణిస్తాడనే మూఢనమ్మకం ఆ ప్రాంతంలో ఉంది. ఈ నమ్మకాన్ని కృపామాయి సవాలు చేశారు. ‘జీవితంలో ఎప్పుడూ 'శీతల్' పట్ ను రూపొందించవద్దని మామగారు చెప్పారు. కానీ నేను తయారుచేశాను. అనాదిగా ఉన్న మూఢనమ్మకాన్ని పారద్రోలాను. ఇప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంది’ అని ఆమె చెప్పారు. ఈ పటాన్ని రూపొందించినందుకు ఆమెకు ఎలాంటి హానీ జరగలేదు. పైగా ఆమె కళాకృతులను చూసేందుకు కళాభిమానులు గ్రామానికి వచ్చారు. 2013లో కృపామాయి రూపొందించిన 'ఠాకురాణి' పట్ లను ప్రదర్శించడానికి ఇందిరా గాంధీ జాతీయ కేంద్రం ఫర్ ది ఆర్ట్స్ నుంచి ఆహ్వానం అందింది. ఆ తరువాత వివిధ జాతీయ మ్యూజియాల నుంచి, ప్రదర్శనల కోసం కూడా ఆమెకు ఆర్డర్లు వచ్చాయి.

​

పురుషులు రాణించిన రంగంలో..

దుర్గా ప్రతిమల పది చేతుల్లో అమర్చే ఆయుధాలు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. కుమారతులి ప్రాంతంలో వీటిని తయారుచేసే షాపులు ఉన్నాయి. అల్యూమినియం కాగితాలు, కార్డ్ బోర్డులు, ఇతర లోహాలకు రంగులు, పూసలు, దారాలు అద్ది ఆయుధాలను తయారుచేస్తారు. ఈ కళలో ఎక్కువగా పురుషులు రాణిస్తారు. చందన, బందన కౌర్ రాకతో ఈ సంప్రదాయం మారింది. వివాహం తరువాత గ్రామానికి వచ్చిన ఈ ఇద్దరు మహిళలు అక్కడి అస్త్రాల షాపులను చూసి తామూ ఆ కళను నేర్చుకోవాలనుకున్నారు. అప్పటివరకు గ్రామంలో ఏ మహిళా ఈ కళను నేర్చుకోలేదు. అయినా వారు ప్రయత్నం ఆపలేదు. చివరకు ఓ షాపు యజమాని వారికి ఆయుధాల తయారీలో చిన్న పని అప్పగించాడు. ఆ అవకాశం వారితో పాటు మరెంతోమంది మహిళలు ఈ రంగంలో రాణించేందుకు దోహదపడింది. తాము తయారుచేసిన ఆయుధాలు నగరంలోని దుర్గా ప్రతిమల్లో కనిపిస్తుంటే వారు ఎంతో సంతోషిస్తున్నారు.

​

79 ఏళ్ల వయసులో కూడా..

రెబా పౌల్ కు 79 ఏళ్లు. ఇప్పటికీ ఆమె దళసరి కాగితాలపై అందమైన దుర్గా రూపాలను 'చాలీస్'గా చిత్రిస్తున్నారు. బొమ్మలు వేయడం, రంగులు అద్దడం తనకు ఎంతో ఇష్టమని ఆమె చెబుతున్నారు. భర్త, మామగారి నుంచి ఈ కళను నేర్చుకున్న ఆమె ఇన్నేళ్లయినా దానిని వదల్లేదు. గతంలో సహజ రంగులు ఉపయోగించగా, ప్రస్తుతం సింథటిక్ రంగులను అద్దుతున్నారు. అయితే ఈ ఏడాది ఆమెకు అంతగా పని దొరకలేదు. ‘నా భర్త 23 ఏళ్ల క్రితం చనిపోయారు. అప్పటి నుంచి ఈ రంగంలో నేను పూర్తికాలం పనిచేశాను. కాలంతో బాటు వచ్చిన మార్పులను నేర్చుకున్నాను. కానీ కళను విడిచిపెట్టలేదు. అయితే ఈ ఏడాది నా చాలీస్ కు పెద్దగా స్పందన రావడం లేదు. అందరూ కంప్యూటర్ ప్రింట్లు అడుగుతున్నారు. ఇప్పుడు అది నాకు సాధ్యమా’ అని ఆమె ఒకింత చిన్న గొంతుతో అన్నారు.

​

ముస్లిం కుటుంబాల నుంచి జుట్టు, జపమాలలు..

దుర్గా ప్రతిమలకు అవసరమైన అలంకారాలను తయారుచేసే కార్మికులు కలకత్తా గ్రామాల్లో అనేక చోట్ల ఉన్నారు. హౌరా జిల్లాలోని డామ్జూర్ బ్లాక్ లో ప్రతిమలకు కావాల్సిన జుట్టు, జపమాలలను తయారుచేసే కుటుంబాలు ఉన్నాయి. వీరిలో ఎక్కువ మంది ముస్లింలు. ఖైరున్నీసా ఆగస్టు నుంచి జనవరి వరకు ఈ పనిలో తీరిక లేకుండా గడుపుతుంది. పొలం నుంచి జనపనారను సేకరించి, శుభ్రం చేసి, వివిధ సైజుల్లో కత్తిరించే పనిని ‘ఓస్టాగర్’ అంటారు. పురుషులు ఈ పని చేస్తారు. జనపనారను ఎండబెట్టడం, చిక్కులు లేకుండా దువ్వడం, రంగు వేయడం వంటి పనులను ‘కరీగర్’ అని పిలుస్తారు. ఈ రంగంలో వందల మంది మహిళలు పనిచేస్తున్నారు. ఖైరున్నీసాకు పని ఇచ్చే అన్సర్ ఇల్లు నెలల తరబడి జనపనారతో నిండిపోయి ఉంటుంది. అన్సర్ తో పాటు ఆ గ్రామంలో 35 కుటుంబాలు ఈ పనిలోనే ఉన్నాయి. ఈ మహిళల గురించి తెలుసుకుంటే పండుగకు అసలైన అర్థం తెలుస్తుంది. మూఢనమ్మకాన్ని జయించడం, సంప్రదాయాన్ని కొనసాగించడం, మత సామరస్యాన్ని పాటించడం.. పండుగకు ఇంతకు మించిన పరమార్థాలు మరేముంటాయి?


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్